TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
అమ్మ పిలుపు
ఎపిసోడ్ - 3
- వసుంధర
కనకయ్య బట్టలుతికితే, వాడి పెళ్ళాం అందరిళ్ళకూ బట్టలు తీసుకుని వెళ్ళి యిచ్చి వస్తుంది. ఇప్పుడు కనకయ్య కొడుకులు కూడా కాస్త అంది వచ్చారు. కనకయ్య పక్కనే కూర్చుని వాడితో కలిసి భోం చేయగలిగినవాళ్ళకు వెయ్యి రూపాయిలు బహుమతిగా యిస్తానని ఆ ఊరి ప్రెసిడెంటు శేషగిరి ప్రకటన కూడా చేశాడు.
చేయడానికి సాహస కార్యాలెన్నో వుండగా ఎందుకూ పనికిరాని ఆ సొరంగంలోకి ఎందుకు వెళ్ళడం అని వాళ్ళ వాదన. ఒకవేళ సొరంగంలోకి వెళ్ళడం యింకా గొప్ప సాహసకార్యం అనుకుంటే-ముందీ సాహసకార్యాలు చేసి అప్పుడు దానికి ప్రయత్నించాలి. ఇవే చేయలేనివాడు అవీ చేయలేడు కదా!
"ఎప్పుడో ఒకరోజున అవన్నీ చేస్తాను కానీ ముందు సొరంగంలోకి వెళ్ళనిచ్చి మీకు అక్కడి విశేషాలన్నీ చెప్పకపోతే నా పేరు గోపీ కాదు" అన్నాడు గోపీ.
గోపీ మామయ్య తిరిగి ఊరికి వెళ్ళిపోతూ "ఒరేయ్ గోపీ! నువ్వేం సాహసకార్యం చేశావో నాకు ఉత్తరం రాయాలి సుమా!" అన్నాడు గోపీతో.
"అలాగే మామయ్యా!" అంటూ గోపీ తలూపాడు కానీ వాడి మను వూగిసలాడుతోంది. సొరంగంలోకి వెళ్ళాలని వాడికి కోరికగా వుంది. కానీ మళ్ళీ తిరిగి వస్తానో రానో అని వాడికి భయంగానూ వుంది. అందుకే ఏ నిర్ణయానికీ రాలేకపోతున్నాడు. ఈలోగా తండ్రికి వీరయ్యిచ్చిన గడువు దగ్గర పడుతోంది. తను త్వరగా ఏదో కటి చేసి తండ్రికి సాయపడాలని గోపీకి అనిపిస్తోంది.
ఆ రోజు రాత్రి గోపీ మంచి నిద్రలో వుండగా "గోపీ"! అని ఎవరో తట్టి లేపినట్టయింది. గోపీ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. గదిలో దీపం లేదు. చీకటిగా వుంది.
"ఎవరూ?" అన్నాడు గోపీ.
"నేను రా! గోపాల్రావుని మీ నాన్నకు ముత్తాతను. నేను కుబేరుడి కొలను దగ్గర వున్నాను. కొన్ని కారణాల వల్ల నేనిక్కణ్ణించి కదిలిరాలేను. నువ్వక్కడికి వస్తే నీకు బంగారం చేసే రహస్యం నేర్పుతాను" అన్న మాటలు గోపీకి వినిపించాయి.
గోపీకి భయం వేసింది. అయినా ధైర్యం చిక్కబట్టుకుని "నువ్వు నాతో ఎలా మాట్లాడుతున్నావు?" అన్నాడు.
"మాటల్ని తీగల్లేకుండా గాలిలోకి పంపి వైర్లెస్ పద్ధతి ద్వారా మీరు రేడియోలో ఎక్కడెక్కడి మాటలూ వింటున్నారు కదా! అలాగే నేను నా ఆలోచనల్ని తరంగాల రూపంలో నీ దగ్గరకు పంపాను. నువ్వు వింటున్నవి నా ఆలోచనా తరంగాలు. నేను కూడా యిక్కడ నీ ఆలోచనల్ని వింటున్నాను" అన్న మాటలు మళ్ళీ గోపీకి వినిపించాయి.
అప్పుడు గోపీకి చాలా సంతోషం కలిగింది. అంటే తాతయ్య కుబేరుడి కొలను వద్ద వుండడమే కాక బోలెడు సైన్సూ అదీ నేర్చుకున్నాడన్నమాట. తను వెడితే తాతయ్య చాలా నేర్పవచ్చు.
"సరే పెద్ద తాతయ్యా! నేనక్కడికి ఎప్పుడు రాను?" అన్నాడు గోపీ.
"రేపు నీకు స్కూలు సెలవు కదా! మధ్యాహ్నం బయల్దేరిరా. సాయంత్రానికల్లా వెనక్కు వెళ్ళిపోవచ్చు" అన్నాడు గోపీ పెద్ద తాతయ్య.
"కానీ రేపు నాకు సెలవు లేదే?" అన్నాడు గోపీ.
"ఓహో! నీకు భవిష్యత్తులోకి చూడ్డం రాదు కదూ! రేపు నీకు సెలవేలే! మీ లెక్కల మేష్టారు రామనాథంగారు ఇంకాసేపట్లో చచ్చిపోతాడుగా. ఇంక నేనేమీ మాట్లాడను. అన్న ప్రకారం మధ్యాహ్నానికల్లా బయల్దేరిరా" అన్నాడు గోపీ పెద్ద తాతయ్య.
గోపీకి ఒక్క క్షణం మాట రాలేదు.
"ఒక్కమాట గుర్తుంచుకో! నువ్వు నా దగ్గరకు వస్తున్నట్లు ఎవ్వరికీ తెలియకూడదు. నా గురించి ఎవరికైనా చెప్పావా ఈ జీవితానికి నువ్వు నన్ను మళ్ళీ కలుసుకోలేవు" అన్నాడు గోపీ తాతయ్య.
"పెద్ద తాతయ్యా! రామనాథం గారీ రోజు మాకు పాఠం కూడా చెప్పారు. ఆయనెంతో మంచివారు. మొన్ననే ఆయనకో బాబు కూడా పుట్టాడు. ఆయన ఎంతో ఆరోగ్యంగా వున్నారు. ఆయన ఎందుకు చచ్చిపోతారు? ఆయన చావకుండా ఆపడం కుదరదా?" అంటూ గోపీ కేకలు పెట్టాడు. కానీ బదులుగా యింకేమీ వినిపించలేదు.
ఈలోగా గదిలో దీపం వెలిగింది.
"ఏమిట్రా గోపీ చాలా గట్టిగా పలవరిస్తున్నావు" అన్నాడు రఘురామయ్య.
"ఒక్కోణ్ణీ పడుకోవద్దంటే వినడు. చదువుకుని చదువుకుని స్టడీరూంలోనే పడుకుంటాడు. వాణి, వేణిలతో పాటు వాళ్ళ గదిలోనే పడుకోవచ్చుగా. నిద్రలో ఏకలొచ్చిందో ఏమో-జడుసుకున్నట్లున్నాడు. వణుకుతున్నాడు కూడా" అంది సీతాదేవి కొడుకుని సమీపిస్తూ.
తను వణుకుతున్నట్లుగా అప్పుడే గోపీక్కూడా తెలిసింది.
"అసలేం జరిగిందిరా?" అన్నాడు రఘురామయ్య.
"మా లెక్కలుమేష్టారు రామనాథం గారు చచ్చిపోతారట" అన్నాడు గోపె ఏడుస్తూ.
"ఎవరూ-రామనాథమా! ఆయనకేంరా-నిక్షేపంలాగున్నాడు. సాయంత్రం వాళ్ళింటిమీంచే వచ్చాను కూడా. నీకు కలేమైనా వచ్చిందా?" అన్నాడు రఘురామయ్య.
"కలకాదు. పెద్ద తాతయ్య చెప్పాడు" అన్నాడు గోపీ.
"పెద్ద తాతయ్యెవరూ?" అన్నాడు రఘురామయ్య అర్ధంకాక.
ఏదో చెప్పాలనుకుని ఆగిపోయాడు గోపీ. తన గురించి ఎవరికీ చెప్పొద్దని గోపాల్రావు తాతయ్య తన్ను హెచ్చరించడం గుర్తొచ్చింది.
"ఏమోలే-కలేఏమో" అన్నాడు గోపీ కళ్ళు తుడుచుకుంటూ.
సీతాదేవి గోపీకి దగ్గరగా వచ్చి తన చీరచెంగుతో వాడి కళ్ళుతుడిచి "నా దగ్గర పడుకుంటావా?" అనడిగింది లాలనగా.
"ఊ" అన్నాడు గోపీ వెంటనే. పన్నెండేళ్ళొచ్చినప్పటికీ ఇప్పటికీ గోపీకి అమ్మ దగ్గర పడుకోవాలనే వుంటుంది. అందరూ నవ్వుతారని భయపడతాడు. అమ్మనడగటానికేమో మొహమాటం.
"దా" అంది సీతాదేవి. గోపీ మంచం దిగి తల్లిననుసరించాడు. సరిగ్గా అప్పుడే ఎవరో వీధి తలుపు బాదారు.
"అబ్బా! యింత అర్ధరాత్ర్పూట ఎవరో?" అంది సీతాదేవి విసుగ్గా.
"అర్దరాత్రిపూట నువ్వు లేచి తిరగడం లేదూ యిల్లంతా- అలాగే మనమంటే యిష్టమున్న వాళ్ళెవ్వరో చూడ్డానికి వచ్చి వుంటారు" అంటూ రఘురామయ్య వీథి తలుపు తీయడానికి వెళ్ళాడు.
సీతాదేవికి పిల్లలంటే ప్రాణం. తన ఆరోగ్యం ఎలా వున్నప్పటికీ రోజూ అర్దరాత్రి వేళ లేచి పిల్లలెలా వున్నారో చూసుకుని వస్తుంది. ఈ వేళ కూడా అలా లేచినప్పుడే గోపీ గదిలోంచి మాటలు వినపడ్డాయి.
గోపీ తల్లికి దగ్గరగా జరిగి నడుస్తున్నాడు. తల్లి నడుం గట్టిగా పట్టుకున్నాడు. వాడి బుర్రలో రకరకాల ఆలోచనలు పరుగెడుతున్నాయి. గోపాల్రావు తాతయ్య నిజంగా తనతో మాట్లాడేడా లేక తను కలగన్నాడా అన్న విషయం వాడికి తేలడం లేదు.
ఈలోగా తలుపు తీయడానికి వెళ్ళిన రఘురామయ్య కంగారుగా "నేను అర్జంటుగా బయటకు వెళ్ళాలి. సెకండ్ షో సినిమా చూసి వస్తుండగా లారీ గుద్ది రామనాథం మేస్టారికి యాక్సిడెంటయిందట. పరిస్థితి చాలా ప్రమాదకరంగా వుందిట" అన్నాడు.
ఇది వింటూనే గోపీ తెల్లబోయాడు. అంటే గోపాల్రావు తాతయ్య చెప్పినట్లే జరిగిపోతుందా?
"రామనాథం మేస్టారికేమీ అవకూడదు. ఆయన బ్రతకాలి" అని ఆ రాత్రంతా గోపీ దేవుణ్ణి ప్రార్ధించుకుంటూనే వున్నాడు.
తెల్లవారిలోగానే రామనాథం మేష్టారు చచ్చిపోయాడు. ఆ రోజు గోపీ స్కూలుకి సెలవిచ్చారు. వాడి మనసు నిండా చెప్పలేనంత పుట్టెడు దిగులు.
రామనాథం మేస్టారు ఇలా అనుకోకుండా అర్ధంతరంగా చచ్చిపోతాడని ఎవ్వరూ అనుకోలేదు. కానీ గోపాల్రావు తాతయ్యకు తెలిసింది. ఎలా?
అసలు గోపాల్రావు తాతయ్య వున్నాడా? తనతో నిజంగా మాట్లాడాడా? లేకతను భ్రమపడ్డాడా?
తనకు వచ్చింది కల అనుకుందామా అంటే అంతా తాతయ్య చెప్పినట్లే జరిగింది. అంటే ఆయన నిజంగానే తనతో మాట్లాడాడు. ఆయన చెప్పిన ప్రకారం మధ్యాహ్నం తను కుబేరుడి ఆలయంలోని సొరంగంలోకి ప్రవేశించాలి.
గోపాల్రావు తాతయ్యకు చాలా విశేషాలు తెలుసు. ముందేమవుతుందో తెలుసు. బంగారమెలా చేయాలో తెలుసు. సైన్సు తెలుసు. ఇన్ని తెలిసిన తాతయ్య దగ్గర్నుంచి తను చాలా తెలుసుకోవడం మంచిది కదా!
ఇలా అనుకున్నప్పటికీ గోపీకి మళ్ళీ ధైర్యం చాలడం లేదు. సొరంగంలొ ఓ పెద్ద కొండచిలువుందనీ, అది తన్ను మింగేస్తుందనీ వాడికి భయంగా వుంది..
గోపీ పదకొండింటికల్లా భోంచేశాడు. కాసేపు చదువుకోవాలని ప్రయత్నించాడు. పుస్తకం తీస్తే చాలు గోపాల్రావు తాతయ్య, రామనాథం మాస్టారు కనపడుతున్నారు. గోపాల్రావు తాతయ్యను చూస్తుంటే వాడికి ఉత్సాహం పుడుతోంది. రామనాథం మేస్టార్ని చూస్తుంటే ఏడుపు వస్తోంది.
టైము సరిగ్గా పన్నెండుయ్యేసరికి వాడికి ఎవరో "గోపీ!" అని పిలిచినట్టయింది.
గోపీ ఉలిక్కిపడి-"ఎవరూ?" అన్నాడు.
"నేను గోపాల్రావు తాతయ్యను. టైము పన్నెండయింది. వెంటనే బయల్దేరు. ఇంట్లో అసలు విషయం చెప్పకు. నా దగ్గరకు వస్తున్నట్లు నీ స్నేహితులక్కూడా చెప్పకు. ఒక్కడివీ బయల్దేరిరా. వెంటనే-ఊ లేచిరా-" అన్న మాటలు గోపీకి వినబడ్డాయి.
పెద్ద తాతయ్య తను పిలుస్తున్నాడు. తనిప్పుడేం చేయాలి? గోపీ ఆలోచిస్తున్నాడు......
"నీకేం భయం లేదు. అక్కడే కొండ చిలువలూ లేవు. నీకే ప్రమాదమూ రాకుండా నేను నిన్ను కాపాడుకుంటాను. నువ్వు సొరంగంలో అడుగుపెట్టావంటే చాలు- నా దగ్గరకు వచ్చినట్లే! ఊ త్వరగా..." అన్నమాటలు మళ్ళీ వినిపించాయి.
గోపీ యింక ఆలస్యం చేయలేదు. పుస్తకం మూసి లేచి నిలబడి తల్లి దగ్గరకు వెళ్లి "అమ్మా! అలా బైటకు వెళ్ళివస్తానే!" అన్నాడు.
సీతాదేవి అప్పుడు రామనాథం మేస్టారింటికి వెళ్ళి ఆయన భార్యనోదార్చే ఉద్దేశ్యంలో వుంది. అందుకని ఎక్కడికని కూడా అడక్కుండా "సరే-వెళ్ళు కానీ-జాగ్రత్త! బయట కార్లూ అవీ సరిగ్గా చూసుకుంటూండు. అసలే రోజులు బాగాలేవు" అంది.
గోపీ యింట్లోంచి బయటపడ్డాడు. నడుచుకుంటూ కొండ చేరుకున్నాడు. మిట్ట మధ్యాహ్నం కావడం వల్ల కొండ మెట్ల మీద వాడికెవ్వరూ కనబడలేదు. చకచకా మెట్లెక్కాడు. నెమ్మదిగా కుబేరుడి ఆలయాన్ని సమీపించాడు. లోపల ప్రవేశించాడు.
ఆలయం చాలా చిన్నది. కొండగుహను దొలిచి మలిచినట్లుంటుంది. ఆలయంలో కుబేరుడి విగ్రహం మినహా యించి మరేమీ లేదు. ఈ ఆలయానికి ద్వారం వుండదు. ఎవరెప్పుడు కావాలన్నా వెళ్ళవచ్చు.
ఆలయంలో కనుచీకటిగా వుంది. అయినా కుబేరుడి విగ్రహం వెనుకనున్న గోడకు కాస్తపైగా వున్న సొరంగమార్గం స్పష్టంగా కనబడుతోంది.
గోపీకి వళ్ళు జలదరించింది. తనిప్పుడందులో ప్రవేశించాలా? లోపల కొండ చిలువుండదా?
"ఊ ఆలస్యం చేయకు" అన్న మాటలు గోపీకి మళ్ళీ వినిపించాయి. అప్పుడు వాడికి బాగా ధైర్యం వచ్చింది. విగ్రహం వెనక్కువెళ్ళాడు. సొరంగంలో ప్రవేశించడానిక్కాబోలు అక్కడ గోడకు మెట్లున్నాయి.
గోపీ ఆ మెట్లెక్కాడు. ఇప్పుడు సొరంగం చేతికి అందుతోంది. లోనికి వెళ్ళాలంటే పట్టుదొరుకుతోంది. గోపీ క్షణం మాత్రం తటపటాయించాడు. ఏమైతే అయిందని నిర్భయంగా సొరంగంలోకి దూరాడు.
అప్పుడు వాడొకసారి లోనికీ బైటకూ చూశాడు.
బైట ఆలయం. కనుచీకటిలోన సొరంగం. కన్ను పొడుచుకున్నా కానరాని చిమ్మ చీకటి!
(సశేషం)