Facebook Twitter
అమ్మ పిలుపు

అమ్మ పిలుపు

ఎపిసోడ్ - 2

- వసుంధర

ఆయన ఆ సొరంగంలోకి వెళ్ళడం చూసినవాళ్ళు మాత్రం ఒక్కరు కూడా లేరు. కానీ ఆ తర్వాత గోపాల్రావు నెవ్వరూ చూడలేదు.

    సొరంగంలోకి వెళ్ళాడేమోనని ఆయన భార్య అనుమానించింది. అయితే సొరంగంలోకి వెళ్ళి వెతకడానికెవ్వరూ సాహసించలేదు. ఆ సొరంగంలో పాములే వున్నాయో, కొండచిలువలే వుంటున్నాయో ఎవరికెరుక? ఒకవేళ సొరంగ మార్గంలో ఏ ప్రమాదమూ లేదనుకుందామంటే వెళ్ళినవాడు క్షేమంగా తిరిగిరావాలికదా!
   గోపాల్రావుకు కోపం జాస్తి. భార్య తన పద్ధతిని నిరసించిందని కోసం వచ్చి ఆయన ఇల్లు వదిలిపోయాడని అంతా అనుకున్నారు. ఆ విధంగా గోపాల్రావు భార్య ముత్తయిదువుగానే చనిపోయింది. గోపాల్రావు జాడ మాత్రం అప్పటికీ ఇప్పటికీ తెలియలేదు.
    "బ్రతికి వుంటే ఆయనకి వందో, నూటయిదో ఏళ్ళుంటాయి. గాంధీగారికంటే పదేళ్ళుకాబోలు చిన్నవాడని చెప్పుకునేవారు" అంది లక్ష్మీదేవమ్మ.
    ఈ కథ విన్నాక గోపీకి చాలా సందేహాలు కలిగాయి. అన్నీ కుబేరుడి కొలను గురించే! ఆ సొరంగ మార్గంలో వెడితే నిజంగా కుబేరుడి కొలను వస్తుందా? అక్కడ ద్వాపర యుగంనాటి యోగి వుంటాడా? ఆ యోగికి బంగారం తయారు చేయడం తెలుస్తుందా? వెళ్ళిన వాళ్ళకాయన విద్య నేర్పుతాడా?
    లక్ష్మీదేవమ్మ ఈ సందేహాలన్నీ విని "ఏమోరా! నేను మాత్రం ఆ సొరంగంలో దూరి చూశానా ఏమిటి? అందరూ చెప్పుకునేవే నేనూ నీకు చెప్పాను, అంతే!" అంది.
    గోపీ ఆలోచనలో పడిపోయాడు. కుబేరుడి ఆలయంలోని సొరంగంలోకి తను వెడితే ఏమవుతుందీ అన్న ఆలోచన వాడి చిన్న బుర్రలో మెదిలింది. కానీ అంతలోనే భయంతో వాడి వళ్ళు జలదరించిపోయింది.  అక్కడ ఏ కొండచిలువైనా తనను మింగేస్తే ఇంకేమైనా వుందా?
    తనతండ్రి ముత్తాత ఏమయ్యాడు? ఆయన ఆ గుహలోకి వెళ్ళి చచ్చిపోయాడా? లేకపోతే భయపడి గుహలోకి వెళ్ళలేదా?
    ఇలా ఆలోచిస్తుండగా గోపీకి వీరయ్య తండ్రిని నానామాటలూ అనడం గుర్తుకువచ్చింది.
    డబ్బులేకపోవడం వల్లనే తండ్రి వీరయ్యకు చులకనైపోయాడు. వీరయ్య తండ్రికి నెలరోజులు గడువిచ్చాడు. నెలరోజుల్లో బాకీతీర్చకపోతే వీరయ్య ఈ యిల్లు స్వాధీనం చేసేసుకుంటాడు. అప్పుడు తామందర యిరుకింట్లోకి మారిపోవాలి. ఇరుకింట్లో అయితే తాతయ్య వుండలేడు.
    అయినా ఈ యిల్లెందుకు వీరయ్య కివ్వాలి? పెద్దక్కయ్య పెళ్ళి గురించే కదా! ఇప్పుడు మళ్ళీ చిన్నక్క పెళ్ళి చేస్తే చిన్నిల్లు కూడా అమ్మేయాలి. ఆ తర్వాత ఆఖరక్క పెళ్ళి. అప్పుడు పొలం అమ్మేయాలి. 
    ముగ్గురక్కల పెళ్ళిళ్ళూ అయ్యేసరికి తమకు ఇల్లుండదు. భూమి వుండదు. అప్పులు కూడా పెరిగిపోతాయి.
    అంటే అన్నీకష్టాలే! ఈ కష్టాలన్నింట్నించీ బయట పడాలంటే డబ్బు కావాలి. డబ్బెలా వస్తుంది?
    ఇప్పుడెందరో బాగా చదువుకునేవాళ్ళకే ఉద్యోగాలు దొరకడంలేదు. ప్యూను ఉద్యోగానికి ఎమ్మే చదువుకునేవాళ్ళు పోటీ పడుతున్నారట. తను పెద్దై ఏం సంపాదిస్తాడు?
    గోపీ మనసంతా కుబేరుడి ఆలయం వైపు లాగుతోంది. అయితే అక్కడ కొండచిలువ వుంటుందేమోనని భయపడుతున్నాడు వాడు.
    ఏది ఏమైనా కుబేరుడి ఆలయంలోకి ప్రవేశించి సొరంగ మార్గాన వెళ్ళి కొలను వద్ద యోగిని కలుసుకుని బంగారం తయారుచేయడం నేర్చుకోవాలన్న కోరిక గోపీలో ఆరోజునే పుట్టింది

          మర్నాడు గోపీ స్కూలుకు వెళ్ళినప్పుడు తన స్నేహితులను కుబేరుడి ఆలయంలోని సొరంగం గురించి అడిగాడు. వాళ్ళలో చాలా మందికి ఆ సొరంగం గురించి తెలుసు. ఒకడైతే "నాకా సొరంగంమంటే ఏమీ భయం లేదు. ఒక్కసారి కొండ మీద నేనూ ఫ్రెండ్స్ ఆట ఆడుకున్నాం. అప్పుడు నేను ఆ సొరంగంలో కాసేపు దాక్కున్నాను కూడా!" అన్నాడు.

    "మరి నీకు కొండ చిలువ కనపడలేదా?" అన్నాడు గోపీ.

    "లేదు, అక్కడ మన ఇంటికంటే శుభ్రంగా వుంది" అన్నాడువాడు.

    "అయితే మనమిద్దరం ఆ గుహలోకి వెళదాం వస్తావా?" అనడిగాడు గోపీ.

    వాడు వెంటనే భయంగా "నాకైతే భయంలేదు కానీ మా తాతయ్యకా సొరంగం మంటే భయం. నాకేదైనా అయిన ఆయన బెంగపెట్టుకుంటాడు" అన్నాడు.

    గోపీ చాలామందిని అడిగి చూశాడు. అటువంటి ప్రమాదకరమైన పని చేయడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. అంతమంది వెనకదీసేసరికి గోపీక్కూడా భయం వేసింది. వాడింక సొరంగం విషయం ఎవరితోటీ మాట్లాడలేదు.

    ఆరోజు గోపీ యింటికి తిరగి వెళ్ళేసరికి వాడి మామయ్య వచ్చి వున్నాడు. ఆయన వాణ్ణి చూస్తూనే "నీ కోసమే చూస్తున్నారా గోపీ! ఏదీ ఓసారి నీ చెయ్యి చూపించు" అన్నాడు.

    గోపీ మామయ్య కొత్తగా హస్తసాముద్రికం నేర్చుకున్నాట్ట. కనపడ్డవాళ్ళందరికీ బలవంతంగా చెయ్యి చూసి జోస్యం చెప్పేస్తున్నాట్ట. అందరికీ చెప్పడం అయిపోతే చుట్టాలిళ్ళక్కూడా వెళ్ళి జోస్యం చెప్పేస్తున్నాట్ట. ఇప్పడిక్కడికీ అందుకే వచ్చాట్ట.

    "ఇంట్లో అందరికీ చెప్పడం అయిపోయింది. ఇంక నువ్వూ మీ నాన్న మిగిలారంతే!" అంటూ గోపీ మామయ్య వాడి చేయిపట్టుకుని బాగా పరీక్షించి "ఒరేయ్! నీ ముఖం చూస్తే వెర్రివెధవలాగున్నావు. కానీ త్వరలోనే నువ్వో గొప్ప సాహసకార్యం చేస్తావురోయ్!" అన్నాడు.

    మామయ్యలా చెప్పగానే గోపీ ముఖం వెలిగిపోయింది. "ఇంకా చెప్పు మామయ్యా"! అన్నాడు.

    ఆయన వాడి చేయి పరీక్షించి వందేళ్ళు బ్రతుకుతాడనీ, పెద్ద ఉద్యోగం చేస్తాడనీ, కారు కొంటాడనీ చెప్పాడు.

    "అంటే నాకు బోలెడు బంగారం కావాలన్నమాట" అన్నాడు గోపీ.

    "బంగారమైనా సరే, డబ్బైనా సరే" అన్నాడు గోపీ మామయ్య.

    గోపి మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు. తను వందేళ్ళు బ్రతుకుతాడుట. త్వరలో సాహసకార్యం చేస్తాట్ట అంటే అర్ధమేమిటి?

    తను సొరంగంలోకి వెళ్ళినా ప్రమాదమేమీ జరుగదు.

    గోపీ మామయ్య వక అనుమానంగా చూస్తూ "మామయ్యా! నువ్వు నాకు వందేళ్ళుయుష్షన్నావు. సాహసకార్యం పేరు చెప్పి ఏ కొండమీంచైనా దూకేశాననుకో అప్పుడు నాకేమవుతుంది?" అన్నాడు.

    "ఏమవుతుంది? ఏ చెట్టు కొమ్మకో తగుల్కుని బ్రతుకుతావు. ఆయువు వున్నవాడిని మృత్యువేమీ చేయలేదు. అలాగని వెళ్ళి నూతిలో దూకకు. ప్రాణాకుదక్కినా జలుబుపట్టుకుని అవస్థ పడాలి" అన్నాడు గోపీ మామయ్య.

    "మామయ్యా! ఈ జాతకాలూ అనీ నిజమేనంటావా?" అన్నాడు గోపీ మళ్ళీ.

    "ఎందుకు నిజం కావు? పామిస్ట్రీ అంటే హస్తసాముద్రికం పుస్తకాలు రాసింది తెల్లదొరలు. కారణం లేనిదే వాళ్ళు దేన్నీ నమ్మరు తెలిసిందా?" అన్నాడు గోపీ మామయ్య నమ్మకంగా.

    "హస్త సాముద్రికం నమ్మడానికి కారణమేముంటుంది?" అన్నాడు గోపీ.

    గోపీ మామయ్య అంతా వివరంగా చెప్పాడు.

    హస్తసాముద్రికమంటే అదీ సైన్సు లాంటిదే! కొన్ని వందల ఏళ్ళ నుంచి ఎందరి అరచేతుల్లో రేఖలో గమనించి ఏ రేఖల కారణంగా ఏయే గుణాలు మనుషుల్లో వుంటున్నాయో కనిపెట్టారు.

    "అంటే ఏ రోగానికే మందు పని చేస్తుందో కనిపెట్టారూ- అలాగన్నమాట!" అన్నాడు గోపీ సాలోచనగా.

    "కరెక్ట్! బాగా అర్ధ మ్చేసుకున్నావు. సైన్సు రోగాలకు మందులు కనిపెట్టిన ట్లే చేతుల్లో రేఖల్లోంచి భవిష్యత్తునూ కనిపెట్టింది. ఒకోసారి సరైన మందు వేసినా కొందరికి పని చేయదు. అలాగే ఎప్పుడైనా హస్త సాముద్రికమూ తప్పవచ్చు. అలాగని జ్యోతిష్యం అర్ధం లేనిదనడం తప్పు తెలిసిందా?" అన్నాడు గోపీ మామయ్య.

    "అయితే నేను నిజంగా సాహసకార్యం చేస్తానంటావా?" అన్నాడు గోపీ.

    "అందుకు సందేహం లేదు."

    "నేను నూరేళ్ళూ బ్రతుకుతానా?"

    "ఆహా!"

    "థాంక్స్ మామయ్యా!" అన్నాడు గోపీ.

    హస్తసాముద్రికం తెలిసిన గోపీ మామయ్య కూడా గోపీ తనకు థాంక్స్ ఎందుకు చెప్పాడూ అని ప్రత్యేకంగా ఆలోచించలేదు. తన జోస్యం గోపీ నెటువంటి ప్రమాదానికి పురిగొల్పుతుందో కూడా ఆయన ఆలోచించలేదు.
          ఆ మర్నాడు కూడా గోపీ స్కూల్లో తన స్నేహితులతో కుబేరుడు కొలను గురించి మాట్లాడి "నిజంగా అక్కడికి వెళ్ళడం గొప్ప అనుభవం. నేనెలాగూ అక్కడికి వెడుతున్నాను. మీలో ఎవరైనా నా అంత ధైర్యవంతులుంటే నాతో రండి. నేను సాహసకార్యం చేస్తానని మా మామయ్య చేయి చూసి చెప్పాడు కూడా!" అన్నాడు.
    ఇది వింటూనే గోపీ స్నేహితుడు రామేశం పెద్దగా నవ్వి "నాయనా! నువ్వు నిజంగా సాహసకార్యాలు చేయగలవాడివే. అయితే క్లాసులో చలపతి పక్కన కూర్చోకూడదూ" అన్నాడు.
    గోపీక్లాసులో చలపతి అని ఓ కుర్రాడు వున్నాడు. వాడు కండలు తిరిగి వస్తాదులా వుంటాడు. మనిషికి కోపం ఎక్కువ. కోపం వస్తే వాడి నోటికి అడ్డూ, అదుపూ వుండవు. మేస్టర్లనైనా సరే ఎదిరించి మాట్లాడతాడు. వాడినోరు మంచిది కాదని మేస్టర్లు కూడా వాడినేమీ అనరు.
    గోపీ క్లాసులో మొత్తం విద్యార్ధులు యాభై మంది. బెంచీలు మొత్తం పదహారున్నాయి. బెంచీకి ముగ్గురు కూర్చోవచ్చు. అయితే చలపతి తనకంటూ ఓ బెంచీ ప్రత్యేకించుకున్నాడు. ఆ బెంచీ మధ్యలో వాడు కూర్చుంటాడు. ఒక్క ప్రక్క టిఫిన్ క్యారియర్ పెడతాడు. మరో ప్రక్క పుస్తకాల బ్యాగు పెడతాడు. ఆ బెంచీలో మరెవ్వరూ కూర్చుందుకు లేదు. వాడు రాకపోయినా సరే ఆ బెంచీ అలా కాళీగా వదిలేయాల్సిందే! ఎవరైనా కూర్చున్నట్లు వాడికి తెలిసిందో చలపతి ఊరుకోడు. అందుకని మిగతా కుర్రాళ్ళంతా అవసరమైతే నలుగురో, అయిదుగురో సర్దుకునైనా ఓ బెంచీ మీద కూర్చుంటారు కానీ ఎవ్వరూ చలపతి బెంచీ జోలికి వెళ్ళరు.
   
     ఇప్పుడు రామేశం ఆ చలపతి గురించే చెప్పాడు.
   
గోపీ యిది విని "సాహసకార్యమంటే పేచీకోరువాళ్ళతో తగువుపెట్టుకోవడం కాదు" అన్నాడు.

    "సాహసకార్యమంటే ఏమిటో పోనీ నువ్వే చెప్పు, వింటాం!" అన్నాడు రామేశం వెటకారంగా.

    "మీరునన్నేమీ వెటకారం చేయక్కర్లేదు. మనిషి ధైర్యంగా హిమాలయపర్వతాలెక్కుతున్నాడు. మంచు ఖండాలకు వెళుతున్నాడు. మనవేమో వూళ్ళో వున్న సొరంగంలోకి వెళ్ళలేకపోతున్నాం" అన్నాడు గోపీ.

    "అందువల్ల ప్రయోజనం?" అన్నాడు రామేశం.

    "స్వానుభవంతో మూడనమ్మకాలను తొలగించవచ్చు కదా!" అన్నాడు గోపీ.

    "ఏమో అది మూడనమ్మకం కాదేమో! ఎవరు చెప్పగలరు?" అన్నాడు వీర్రాజనే మరో    స్నేహితుడు.

    "అందుకే ఆ విషయం సొరంగంలోకి వెళ్ళి తెలుసుకుందాం" అన్నాడు గోపీ ఆశగా.

    అయితే ఎవ్వరూ గోపీని ప్రోత్సహించలేదు.

    సాహసకార్యమంటే ఆ సొరంగంలోకే వెళ్ళనవసరం లేదని వాళ్ళవాదన.

    ఆ ఊళ్ళో ఓ పాలవాడున్నాడు. వాడు సైకిలుకి నాలుగు ఇత్తడి బిందెలు తగిలించుకుని సైకిలు మీద రయ్ మని దూసుకుపోతుంటాడు. చాలాసార్లు వాడు విద్యార్ధులను సవాలు చేశాడు. కానీ ఇంతవరకూ ఒక్కరూ కూడా సైకిలు తొక్కడంలో వాడిని మించలేకపోయారు.
    ఆ ఊళ్ళో గంగమ్మ చేరువని పెద్ద చెరువుంది. ఆ చెరువులో అట్నించి యిటూ, యిట్నించి అటూ నాలుగు పక్కలా ఆగకుండా గంటసేపు ఈతకొడతాడు అప్పారావు. తనకంటే ఎక్కువసేపు ఈతకొట్టగలిగిన వాడికి వెయ్యి రూపాయిలు బహుమతి కూడా యిస్తానంటాడు. అప్పారావుకి కిళ్ళీ కొట్టుంది. డాని మీద రోజుకు రెండు మూడొందలు సంపాదిస్తాడని అంతా చెప్పుకుంటారు. అతడి కిళ్ళీకొట్టు ఎప్పుడూ రద్దీగానే వుంటుంది. అయినా సరే ఎలాగో తీరిక తీసుకుని రోజూ రెండు మూడు గంటలైనా చెరువులో గడుపుతాడు అప్పారావు.
    అప్పారావుకు పూర్తిగా వ్యతిరేకం కనకయ్య. కనకయ్య ఆ ఊరి చాకలి. బట్టలు మల్లెపువుల్లా ఉతుకుతాడని పేరు. కనకయ్య ఎప్పుడూ నీళ్ళ దగ్గరే వుంటాడు. బట్టలు వుతకాలి కాబట్టి! కాని నెలకొక్కసారి కూసా స్నానం చేయడు. కాళీ దొరికినప్పుడల్లా సారా తాగి నేలమీద పడిదొర్లుతుంటాడు. వాడు నోరు విప్పితే సారా కంపు. వాడి పక్కన ఎవ్వరూ కూడా వుండలేరు.


                       

(సశేషం)