TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
కండక్టర్ సుందరం
- శారదఅశోకవర్ధన్
ఇంతవరకూ నేను ఆర్.టి.సి. బస్సులో ప్రయాణం చేసింది కాలేజీలో చదివిన మూడు సంవత్సరాలు మాత్రమే. సికింద్రాబాదు బోట్ క్లబ్ దగ్గరి నుంచి సెక్రటేరియట్ వరకే. అక్కడ దిగి హోంసైన్స్ కాలేజీకి నడిచి వెళ్ళేదాన్ని. దూరపుప్రయాణాలు బస్సులో చేస్తే నాకు పడదు. గనుక ఆ ప్రసక్తేలేదు. ఒక్కసారిగా మోసు గౌలిగూడా బస్సుస్టాండు నుంచి మచిలీపట్నం వరకు ప్రయాణం చేశాను. తోవపొడుగునా ఎన్నిసార్లు వాంతులు చేసుకున్నానో నాకే తెలీదు. అది మొదలు నేను బస్సులో ప్రయాణం చేస్తానంటే భయపడిపోయి ఇంట్లోవాళ్ళే వొద్దని కాన్సిల్ చేస్తారు ప్రపోజల్స్ ని. అలాగే మరోసారి రేడియోస్టేషన్ లో పని చేసేటప్పుడు ఉద్యోగరీత్యా సిమ్లాకి ట్రైనింగ్ కి పంపించారు. వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ కూడా ఢిల్లీ నుంచి చండీఘర్ కీం అక్కడి నుంచి సిమ్లాకి బస్సు ప్రయాణాలే! నేను ఎన్ని వాంతులు చేసుకున్నానో నాకే తెలీదు. బస్సులో వున్న వాళ్ళందరికి కంగారే. అప్పటినుంచి మళ్ళీ నేను బస్సులో ఏ ప్రాంతానికీ ప్రయాణం చెయ్యలేదు. పెళ్ళయ్యాక శ్రీవారికి వాహనం వుండడంవల్ల బస్సు అవసరమూ కలగలేదు. నేను బస్సెక్కి దాదాపు పాతికేళ్ళుదాటుతుంది అనుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. కాలేజీలో చదివేటప్పటి మూడేళ్ళూ తలుచుకుంటే బస్సంటే ఒకరకమైన ప్రేమ! మళ్ళీ బస్సెక్కాలనిపిస్తుంది. ఆ రోజుల్లో డబుల్ డెక్కర్ ఎక్కి పై బస్సులో కూర్చుని అక్కడి నుంచి కిందకి చూడాలంటే ఏదో సరదా! ఫ్రెండ్సందరం కలిసి బస్సుకోసం కబుర్లు చెప్పుకుంటూ ఎదురుచూడడం, బస్సు రాగానే హడావుడిగా బిలబిలమంటూ ఎక్కడం, గమ్యం చేరేంతవరకూ ఏవేవో కబుర్లు. బాల్యంలోని తీపిగుర్తులలో బస్సు ప్రయాణం కూడా ఒక భాగమే. మా గ్రూపులో అందరికన్నా జానవి చాలా లావుగా ముందు సబితా, సుశీలా నుంచుని అది మధ్యలో వుండేట్టు చూసేవాళ్ళం. డబుల్ డక్కర్ మెట్లక్కడం ఒక మేడమెట్లెక్కినట్టే వుండేది.
మా చిన్నతనంలోనూ సిటీబస్సుల్లో జనం, బాగానే వుండేవారు. కాకపోతే మరీ ఇప్పుడున్నంత రాపుళ్లూ తోపుళ్లూ వుండేవి కావు. ఆకతాయిమూక కాస్త అల్లరి పట్టించినా అదీ ఒక స్టైల్లో అందంగానే, ఆనందంగానే వుండేది. ఇప్పటిలా భయంగా ఉండేదికాదు. ఉదాహరణకి ఒకతను వుండేవాడు. తెల్లగా, నాజూగ్గా - ఆ రోజుల్లో హీరో నాగేశ్వర్రావు లాగా చూడగానే బుద్దిమంతుడిలా వుండేవాడు. మేము ఏ బస్సెక్కితే ఆ బస్సే ఎక్కేవాడు. మేము ఎక్కడ దిగుతామో అక్కడే దిగేవాడు. అది గమనించిన మేము ఒక్కోసారి బస్సు ఒచ్చినా ఎక్కడం మానేసేవాళ్ళం. పాపం, మేము తప్పకుండా బస్సు ఎక్కుతామని అనుకున్న అతడు, తోసుకుంటూ బస్సెక్కేసి, మేము ఎక్కకపోవడం చూసి, ఉస్సురంటూ మావంకచూసి, నెక్ట్స్ స్టేజిలో దిగిపోయి మళ్ళీ మా దగ్గర కొచ్చి నుంచునేవాడు. చాలాసార్లు అతడి ప్రవర్తన గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పడమో లేదా బస్సులోవాళ్ళకి చెప్పి, నాలుగు తగిలించాలనో అనుకునేవాళ్ళం. కానీ అతడిని చూశాక 'పోనీలే పిచ్చాడు, మననేమీ అనడంలేదుగా' అనుకుని ఊరుకునే వాళ్ళం.
రాను రాను రోజూ అతణ్ణి బస్ స్టాండులో చూసి అలవాటయిపోయి, ఒక్కరోజు అతడు కనబడకపోతే చుట్టూ కలయజూసేవాళ్ళం. ఒకరోజు మాలో అందరికన్నా చిలిపిదైన కుసుమ నన్నుచూసి 'అడుగో హీరో నాగేశ్వర్రావు! పాపం, మనని పలకరించాలని ఎలా నుంచున్నాడో' అంది. ఒక్కక్షణం అతడు బిత్తరపోయినా, వెంటనే తేరుకుని "అవునండీ సూర్యకాంతంగారూ! మీ పక్కనున్న భానుమతిగారిని కాస్త పరిచయం చేస్తారా? లేకపోతే ఆ పక్కనున్న అంజలిదేవిని" అన్నాడు. మాకా నిక్ నేమ్స్ కాలేజీలో వుండేవి. ఇతడికెలా తెలుసబ్బా? అని ఆశ్చర్యబోయినా, అతడు మన సంగతులన్నీ కనుక్కుంటున్నాడేమో అని భయపడి చచ్చిపోయి, పిచ్చిగా వాగినందుకు చెంపలేసుకుని, మనసులోనే ఆంజనేయ దండకం చదువుకున్నాం! ఎంతటి నిష్కల్మషమైన వయస్సు!
ఇదిలా వుండగా ఒక రోజు ఏడో నెంబరు డబుల్ డెక్కర్ లో ఒక కొత్త కండక్టరుని చూశాం. పెద్ద బొద్దు మీసాలూ, నల్లటి రంగు, తెల్లటి పలువరుస. విశాలమైన నుదురు. బొద్దుగా ఎదిగిన జుట్టుని చక్కగా దువ్వుకున్న క్రాఫ్. మంచి బలిష్ఠమైన శరీరం, చూడగానే అందరి దృష్టినీ ఆకర్షించే పర్సనాలిటీ. దానికితోడు ఏవో సినిమా పాటలు ఈలవేస్తూ ఈలతో పాడుతూ 'టిక్కెట్ టిక్కెట్' అని అరుస్తూ అందరితోటి జోక్ చేస్తూ టిక్కెట్లిచ్చేవాడు. అతణ్ణి చూస్తే భయంగా ఆర్. నాగేశ్వర్రావుని చూసినట్టుండేది. అతని ప్రవర్తన కూడా అదోలా అనిపించేది. మా దగ్గరికొచ్చి ఒక్కొక్కళ్ళనే 'టిక్కెట్టు పాపా!' అని అడిగేవాడు. ఆ పిలుపు మాకు ఒళ్లుమండేది. "పాపా.....ఏమిటిట పాపా....ఇంకానయం.... చీ.... చీ.... అని పలకరించడంలేదు" అంది బిర్రుబుర్రులాడుతూ పద్మ "ఊరుకోవే, గొడవచెయ్యకు." వారించింది కుసుమ. అతడు నాకేసి తదేకంగా చూసి, ఆ తరువాత ఏదో లోకం నుండి దిగొచ్చి అప్పుడే మేల్కొన్న వాడిలా చిరునవ్వు నవ్వేడు. నాకు ఒళ్లుమండింది. "ఏయ్.... అపర భానుమతీ! నీకు లైట్ కొడ్తున్నాడు జాగ్రత్త" అంది సబిత. "అవునే.... కళ్ళు కళ్ళు కలిపి....రేపు చెయ్యి చెయ్యి కలిపి." రాగంతో పాడుతూ అంది జానవి. "ఛీ! నోర్మూసుకోండి!...." అంటూ ఒక్క కసురు కసిరేను వాళ్ళని. దాంతో వాళ్ళు నోరుమూసుకున్నారు. మర్నాడు మళ్ళీ అదే వరస. ఈసారి నేను డబ్బులిస్తుంటే "ఒద్దులే పాపా!" అంటూ టిక్కెట్టు చింపి చేతిలో పెట్టేడు. "టిక్కెట్టు తీసుకోకపోతే రిపోర్టు చేస్తాం." అరిచింది విజ్జి. "ఇదుగో, టిక్కెట్టు ఇచ్చేనుగా" అన్నాడు అతను నవ్వుతూ. "డబ్బులు?" అరిచింది జానవి. "ఆ పాప టిక్కెట్టు డబ్బులు నేనిచ్చేస్తానులే పాపా!" అన్నాడు. "నీకు అందరూ పాపలే! అదేమో స్పెషల్ పాప! వొట్టి బ్రూట్!" అంది విజ్జి గట్టిగా అతడికి వినబడేలాగే! అతడు వినిపించుకోకుండానే "సంసారం సంసారం ప్రేమసుధా...." పాటని విజిల్ లో పాడుకుంటూ వెళ్ళిపోయాడు. 'టిక్కెట్, టిక్కెట్' అనుకుంటూ.
ఆరోజు నుంచి అందరూ "రావే స్పెషల్ పాపా! నీకు టిక్కెట్టక్కరలేదు" అంటూ ఆట పట్టించేవారు స్నేహబృందం.
ఆరోజు నాజీవితంలో మరిచిపోలేని రోజు. కాలేజీ పరీక్ష ఫీజు కట్టడానికీ, ప్రాక్టికల్స్ కీ, ఇంకా ఏవో కొన్ని పుస్తకాలు కొనుక్కోవడానికీ అయిదు వందలు నాన్న దగ్గర తీసుకొని హడావుడిగా ఒచ్చేస్తూ బ్యాగ్ లో పెట్టకుండా చేతిలో వున్న కెమిస్ట్రీ టెక్ట్స్ బుక్ లో అయిదునోట్లు మడిచి పెట్టేసి ఒచ్చేశాను. ఆ రోజు కెమిస్ట్రీ టెస్టు వుంది. బస్సులో కూర్చుని పేజీలు తిరగేస్తున్నాం. సబిత దగ్గర టిక్కెట్టుకి చిల్లర లేదు. పది రూపాయల నోటుంది. నన్ను చిల్లరడిగింది. పుస్తకం పక్కనపెట్టి జామెట్రీ బాక్స్ లోంచి చిల్లర తీసి దానికిచ్చాను. ఇంతలో మేము దిగవల్సిన స్టేజీ రావడంలో కంగారుగా బస్సు దిగిపోయాం. ఆ తొందరలో కెమెస్ట్రీ బుక్కు బస్సులోనే వుండిపోయింది. గుండె ఆగినంత పనయింది. దాన్లో అయిదొందలున్నాయి! ఆపుకోలేక దుఃఖాన్ని కదిలిపోతూన్న బస్సువైపు బాధగా చూసి ఏడ్చేశాను. మా స్నేహబృందం అంతా కలిసి నన్ను ఊరుకో బెట్టడానికి శతవిధాల ప్రయత్నించారు. చివరకి విజ్జి వాళ్ళింటికి ఫోన్ చేసి, వాళ్ళ మమ్మీతో చెప్పి, ఇంటినుంచి అయిదొందలూ తెప్పించి ఫీజు కట్టేసింది. ఆ రోజు పని జరిగిపోయింది. కానీ, ఆ డబ్బు వాళ్ళకి తిరిగిచ్చేదెలా? అసలే నాన్న ముక్కోపి నా అజాగ్రత్తకి నానాతిట్లూ తిడతారు. అమ్మ సరేసరి దండకం చదివేసి నాలుగు బాదుతుంది కూడా! అన్నింటినీ మించిన నాలో బాధ. అసలే మా పరిస్థితులు ఆర్ధికంగా బాగులేని రోజులు. అతికష్టం మీద నాన్నగారు ఆ డబ్బులు నా ఫీజుకని ఇచ్చారు. అమ్మ ఇంకేదో ఖర్చు చెబుతున్నా వినక. ఆ రోజంతా పిచ్చిదానిలా అయిపోయాను. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉల్లిపాయల్లా అయిపోయాయి. ఎలాగో ఇల్లు చేరుకున్నాను.
సాయంత్రం ఆరున్నర దాటింది, అప్పుడే ఇంటికొచ్చిన నాన్నకి అసలు విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాను. అప్పటికే అమ్మ చాలాసార్లు అడిగింది. 'మొహం ఎందుకు అలా ఏడ్చినట్టుంది? కళ్లు ఎర్రబడ్డాయి' అని. తమ్ముళ్ళు అమ్మకి వంతపాడారు. ఏం చెయ్యాలో, ఎలా చెప్పాలో ఎటూ పాలుపోక ,గేటు దగ్గర వరండాలో కూర్చున్న నాన్న దగ్గరకి చేరుకున్నాను. నా కళ్లు నాలుగిళ్ల అవతలవున్న వ్యక్తిమీద పడ్డాయి. గుండె ఆగినంత పనయింది. కాళ్ళు వొణుకుతున్నాయి. ఇంట్లోకి పారిపోవాలంటే పాదాలు భూమి కంటుకుపోయినట్టున్నాయి. అడుగు పడడం లేదు. అంతలో ఆ వ్యక్తి నన్ను చూసేశాడు. మా ఇంటి వైపే ఒస్తున్నాడు. మరింత గబగబా నడుచుకుంటూ! "ఇడియట్ ఇల్లు కూడా ఎంక్వయిరి చేసి తెలుసుకున్నాడన్న మాట!" అనుకుంటూండగానే "నీహారికగారిల్లిదేనాండీ?" అడిగేడాయన నాన్నగారిని, నాకేసి చూస్తూ? నాన్నగారు అతనికేసీ, నాకేసీ అదోలా చూసి "అవును మీరెవరూ?" అనడిగేరు. "అంతలోనే అతడు నాకేసి చూచి చిన్నగా నవ్వుతూ "నా పేరు సుందరం నేను బస్ కండక్టర్ని. ఈ పాప వెళ్ళే రూట్ లోనే నెల రోజులుగా డ్యూటీ పడింది నాకు. ఏడో నెంబరు బస్సులో ఈ రోజు ఈ పాప మా బస్సులో ఈ పుస్తకాన్ని మరిచిపోయింది మామూలుగా అయితే రేపొచ్చినప్పుడు ఈ పుస్తకాన్ని ఇచ్చేసేవాడిని. కానీ ఇది తిరగేసే సరికి ఇందులోనుంచి అయిదువందల రూపాయల నోట్లు కనబడ్డాయి. డబ్బూ పుస్తకం రెండూ పోయాయని పాప దిగులు పడుతుందని, పైగా పారేసినందుకు మీరు ఏం కోప్పడతారో అనీ వెంటనే పుస్తకంమీదున్న పేరూ అడ్రసు చూసి, నా డ్యూటీ అయిపోగానే, మీ ఇల్లు వెదుక్కుంటూ వొచ్చాను" అని డబ్బునీ, పుస్తకాన్నీ నాన్న చేతికందించాడు సుందరం కండక్టర్.
నాన్నగారు అతని చేతిలోంచి పుస్తకాన్నందుకుని చూశారు. అది నా పుస్తకమే. అతని చేతిలోని డబ్బునీ తీసుకున్నారు. ఈ కాలపు పిల్లల అజాగ్రత్త గురించీ, చదువు సంధ్యలు గురించీ నాన్నగారొక క్లాసు తీసుకున్నారతనికి.
పాపం! అతడు మంచి బాలుడిలాగా నాన్నగారు చెప్పేదంతా వింటూ వొచ్చాడు. "ఇంకా ఈ పిల్లలు నయం సార్! కొందరొస్తారు. చదువుకోవడానికెళుతున్నారో, కాలక్షేపానికెళుతున్నారో అర్ధం కాదు. బస్సులో వాళ్ళు చేసే అల్లరి కూడా అంతా ఇంతా కాదు. ఇక మొగపిల్లల సంగతి సరేసరి. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు వారిని చదివిస్తూ వుంటే ఏ బాధ్యతా లేకుండా చేతిలో పుస్తకాలూ, జేబులో బీరుసీసాలు పెట్టుకుని వెళ్ళే పిల్లల్ని చూస్తే బాధనిపిస్తుంది" అన్నాడు సుందరం డబ్బును మరోసారి చూసి జేబులో పెట్టుకుంటూ, నాన్నగారు అతనికి థాంక్స్ చెబుతూ, కృతజ్ఞతాపూర్వకంగా లోపలికి ఆహ్వానించారు. అతను లోపలికొచ్చి కూర్చుని "కాసిని మంచినీళ్ళియ్యి పాపా!" అన్నాడు. భయం భయంగానే వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి గ్లాసందించాను. "రావుగారూ! మీ పాపని చూస్తే అచ్చు నాకు మా చెల్లాయి జ్ఞాపకమొస్తుందండీ! విచిత్రం! ఎంత పోలికో! అందుకే, పాప బస్సెక్కుతే దిగేదాకా ఆమెనే చూస్తూండేవాడిని. అందుకు పాప నన్ను చూసి కోపగించుకోవడం, విసుక్కోవడం కూడా నాకు తెలుసు. కానీ, బస్సులో పాపకి నా అభిప్రాయాన్ని ఎలా చెప్పగలను? నేను నవ్వినప్పుడల్లా పాప పళ్ళుకొరికేది. టిక్కెట్టు నా డబ్బులతో కొని ఎక్కౌంట్ చూపించేవాణ్ణి. పాప దగ్గర డబ్బులు తీసుకోనందుకు కూడా పాపా, వాళ్ళ ఫ్రెండ్సందరూ ఏవేవో అనేవారు. కాని నా చెల్లెలి దగ్గర నేను డబ్బులు తీసుకుని టిక్కెట్టెలా ఇవ్వగలను?" అతని గొంతు ఆర్ద్రతతో నిండిపోయింది. కళ్ళల్లోని తడి తళుక్కున మెరుస్తోంది.
అతనిలోని సోదరి ప్రేమకు నాన్నగారు కూడా చలించిపోయినట్టున్నారు. "మీ చెల్లెలు ఎంత అదృష్టవంతురాలు, ఈ రోజుల్లో కూడా ఇంత అభిమానమున్న అన్నయ్య వున్నందుకు ఆమె గర్వపడాలి. ఎక్కడున్నారు ఆమె? ఏం చేస్తున్నారు?" అడిగేరు. "ఆమె ఈ ప్రపంచంలో లేదు. రెండు సంవత్సరాల క్రితం కేన్సర్ వ్యాధితో మరణించింది." మరి మాట్లాడలేకపోయాడు సుందరం. గుండె బాధతో గొంతులో అడ్డుపడిపోతోంది. కన్నీళ్లు సెలయేరులా అతని చెంపల మీదుగా కారిపోయాయి. నా గుండె పగిలిపోయినట్టనిపించింది. అతని గురించి అంత అసహ్యంగా అనుకున్నందుకు, తనమీద తనకే ఒళ్ళు మండిపోయింది. "అన్నయ్యా!" అని నోరారా పిలవాలనిపించింది. కాఫీ పట్రా అమ్మా!" అన్నారు నాన్నగారు. గబగబా వంటింట్లోకెళ్ళి, నేనే కాఫీ కలిపేసి అతని కందించాను. నవ్వుతూ కాఫీ కప్పందుకుని, "థాంక్స్ పాపా!" అన్నాడు.
"ఒస్తూవుండండి మీ చెల్లెల్ని చూడ్డానికి అప్పుడప్పుడు సుందరంగారూ!" అన్నారు నాన్నగారు, అతనికి ప్రతిఫలంగా ఒక వంద నోటుని అందిస్తూ.
"సార్!....మీ డబ్బు మీకు అందించినందుకు నాకు ప్రతిఫలమా? ఒద్దు సార్! మానవతకి డబ్బుతో వెల కట్టకండి. పైగా, నేనిలా వెతుక్కుంటూవొచ్చి నా చెల్లెలి రూపంలో వున్న పాపని, నీహారికని ఒక్కసారి చివరిగా చూసిపోవాలన్న స్వార్ధంతో కూడా వొచ్చాను" అన్నాడు.
చివరి మాటలు నన్నూ నాన్నగారినీ కూడా ఆశ్చర్యపరచాయి.
"చివరిసారి అంటావేంటి బాబూ?" అడిగేరు నాన్నగారు.
"నాకు ఈ వూరి నుంచి బదిలీ అయింది. నిజామాబాద్ వేశారు" అన్నాడు.
ఎందుకో నా గుండెల్లో ముల్లు గుచ్చుకున్నట్టయింది!
"పోనీ, హైదరాబాదొచ్చినప్పుడల్లా మా ఇంటికి రండి - మీ చెల్లెల్ని చూసిపోదురు గాని. ఇంకా మీలాంటి నిజాయితీపరులూ, మానవతా విలువలూ వున్నవారు వుండబట్టే, ఈ ప్రపంచం ఈ మాత్రంగానైనా నిలుస్తోంది. స్వార్ధం పెరిగి, అభిమానాలూ, ఆప్యాయతలూ అంతరించి స్వంత అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళే కత్తులు నూరుకుంటూన్న ఈ రోజుల్లో మీలాంటివారు నూటికీ కోటికీ ఒక్కరుంటారు." నాన్నగారు ఆవేశంగా అంటున్నా ప్రతీ అక్షరం నిజమనిపించింది. సెలవు తీసుకుని సుందరం వెళ్ళిపోయాడు.
అతడు లేని బస్సు ఎక్కబుద్ది కాలేదు! ఎలాగో ఆ సంవత్సరం చదువు పూర్తి చేశాను. అంతలో నాకు పెళ్ళయిపోవడం, ఇండియానే ఒదిలిపెట్టి పోవడం జరిగింది. ఎన్నేళ్ళు గడిచినా బస్సు ప్రయాణం అంటే సుందరం కండక్టరే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాడు. ఇలాంటి నిజాయితీపరులకి ఒక ఇంక్రిమెంటు ఇవ్వడమో, ప్రమోషనివ్వడమో, ఆర్. టీ.సీ వాళ్ళు చేస్తే బాగుంటుంది.
నాన్నగారు వివరాలన్నీ రాస్తూ అతనికి ఇంక్రిమెంటు రికమెండ్ చేస్తూ ఉత్తరం రాశారుట. కానీ, ఏం జరిగిందో ఫలితం తెలుసుకునే అదృష్టం మాకు లేకపోయింది. నేను భర్తతోసహా అమెరికాకి వెళ్ళిపోవడం, నాన్నగారికి హైదరాబాదు నుంచి బొంబాయి ట్రాన్స్ ఫర్ అవ్వడం వెంటవెంటనే జరిగిపోయాయి. కాలచక్రంలో ఎన్నో సంవత్సరాలు దొర్లిపోయినా, సుందరం కండక్టరుని మాత్రం మా ఇంటిల్లిపాదీ ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటుంటాం.