Facebook Twitter
పునర్వివాహం

పునర్వివాహం

- వసుంధర 
     

           నా చేతిలో గోవిందరావు పెళ్ళి శుభలేఖ వున్నప్పుడు విన్నాను-దేశంలో మధ్యంతర ఎన్నికలని. అయినా నా ఆలోచనలు గోవిందరావు చుట్టూ తిరగడం మానలేదు. గోవిందరావు పెళ్ళాం చేచ్చిపోయిందని తెలిసినపుడు చాలామంది అడిగిన ప్రశ్న - ఆత్మహత్య చేసుకుందా? అని. అందుకు కారణాలు లేకపోలేదు. అతడు పేరున్నవాడు పేరుతెచ్చ్చే పనులు చేస్తాడు. అతడెప్పుడూ నవ్వుతూంటాడు. ఎదుటివాడెంత మాటన్నా ఆవేశపడడు కానీ వీలునిబట్టి చమత్కారంగా తిప్పి కొడతాడు. ఇంటికెవరొచ్చినా వారి వారి అలవాట్లు తెలుసుకుని ఏ లోపమూ జరక్కుండా మర్యాదలు చేస్తాడు. అయితే గోవిందరావు తాగుతాడు. వ్యభిచారగృహాలకు వెడతాడు. ఈ రెండూ తప్పనుకుందుకు లేదు. గొప్పతనానికి అవి కూడా చిహ్నమే! అందువల్ల భార్యపరంగా ఆలోచిస్తే తప్ప అతన్ని చెడ్డవాడనడానికి లేదు. గోవిందరావు చాలా పెద్ద ఆస్తికి ఏకైక వారసుడు. పద్దెనిమిదవ ఏట పదిహేనేళ్ళ శారదను పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళికి అతడు భారీగా పాతికేళ్ళవాడిలా వుండేవాడు. ముప్పై ఏళ్ళొచ్చినా ఇప్పుడూ అలాగే వున్నాడు. శారద మాత్రం కాపురం చేసిన పదేళ్ళలో నలభై ఏళ్ళదానిలాగైపోయింది.

     గోవిందరావుకి అన్నీ తండ్రి పోలికలు. మొగుడు పెళ్ళాన్నెలా చూస్తాడో తండ్రిని చూసే తెలుసుకున్నాడతను. గోవిందరావు తల్లి సహజంగా కాక ప్రమాదవశాత్తూ మరణించింది. ఆ ప్రమాదం కాకతాళీయమనీ, ఆమె తనకు తానే కల్పించుకున్నదనీ, గోవిందరావు తండ్రి కల్పించాడనీ వాగ్వివాదాలున్నాయి. అప్పుడు గోవిందరావు వయస్సు పదిహేనేళ్ళు. భార్య పోయిన ఏడాదికి గోవిందరావు తండ్రి క్యాన్సరుతో మంచానపడితే చాలామంది ఆదాయాన పాపాలకు శిక్ష అన్నారు. గోవిందరావు ఎక్కువగా చదువుకోకపోయినా వ్యవహారజ్ఞుడు. మేజరు కాకపోయినా ఆస్తి వ్యవహ్యారాలు చూడడం ఆరిందాగా మసలడం నేర్చుకున్నాడు. అతడి పెళ్ళయిన ఆర్నెళ్లకె తండ్రిపోతే నదురు, బెదురూ లేకుండా ఆ ఇంటికి ఏకాచ్చత్రాధిపతి అయ్యాడు. అతడి ఆస్తి, పరిస్థితి చాలామంది బంధువుల్ని ఆకర్షించాయి. స్తోత్రపాఠాలలో ఆరితేరిన రామాయమ్మగారిని తప్ప మిగతా అందరినీ అతడు తెలివిగా వారించగలిగాడు. రామాయమ్మ విధవ. గోవిందరావు దగ్గర చేరేటప్పుడావిడ వయసు నలభై అయిదు. చూడగానే సెంచరీ కొట్టే శాల్తీ అనిపించేంత ఆరోగ్యం. తమ్ముడు రమణకు ఆవిణ్ణి అంటిపెట్టుకుని వుండటం మినహా వేరే పనిలేదు.

       భార్య సుభద్ర అతడి పక్కన కాకి ముక్కుకు దొండపండులా వుంటుంది. ఆమె కొడుకు వెంకట్రావు. రమణ బుర్రలో తెలివి శూన్యం. చెప్ప్పిన పని చెప్పినట్టు చేయడం అతడి ప్రత్యేకత అంటుంది రామాయమ్మ. కానీ సుభద్ర ఒప్పుకోదు. వెంకట్రావునామే తన కొడుకంతుంది తప్ప మా అబ్బాయని ఎక్కడా అనదు. వెంకత్రావులో తల్లి పోలిక సంగతి చెప్పలేం కానీ తండ్రి పోలిక ఏ కోశానా లేదు. పైగా కాస్తో కాస్తో తెలివితేటలూ వున్నాయి. రామాయమ్మ గోవిందరావుకు దూరపు వరుసలో దొడ్డమ్మ అవుతుంది. తానేక్కడికి వెళ్ళాలన్నా సుభద్ర పెద్ద అసెట్ అని ఆమెకు తెలుసు. చెప్పుకుందుకో మొగుడూ, మాతృప్రేమకొ కొడుకూ వున్న సుభద్రకు రామాయమ్మ సలహాలే చేయూత. గోవిందరావు సుభద్ర అందాన్ని చూసే రామాయమ్మకాశ్రయమిచ్చాడు. ఆమె అతడికంటే ఏడేళ్ళు పెద్ద. వాళ్ళ సంబంధానికా వయోభేదం అడ్డురాలేదు. శారద ఆ ఇంట్లో నిలదొక్కుకుని లోకమంటే ఏమిటో తెలుసుకుందుకు మూడు నాలుగేళ్ళు పట్టింది. అప్పటికి భర్త రామాయమ్మ చెప్పుచేతల్లోకీ, సుభద్ర చేతుల్లోకీ వెళ్ళిపోయాడు. అట్నించి నటుక్కు రావాలనుకునే రామాయమ్మ శారదను బుట్టలో వేసుకుందామనే ప్రయత్నించింది. అయితే అక్కడి పరిస్థితి తెలిసి పుట్టింటి వారిచ్చే సలహాల ఫలితంగా గోవిందరావు కేవలం తనవాడనీ, తనాయింటి యజమానురాలనీ శారద ఓ బిడ్డ తల్లి కూడా అయింది. అప్పుడామె మాతృత్వానికి సంబంధించిన స్వార్థానికి కూడా లోనై భర్తను చెప్పుచేతల్లో తీసుకుందుకు గట్టి ప్రయత్నం ప్రారంభించడంతో సుభద్రతో భేటీ వచ్చింది.

        సుభద్ర రామాయమ్మను సలహా అడిగింది. శారదకూ, సుభద్రకూ తేడా వుంది. శారద శరీరంపై గోవిందరావుకు సర్వహక్కులూ వున్నాయి. సుభద్ర అతడికి పొరుగింట పుల్లకూడా. భర్త చాటు భార్య. రమణవంటి భర్త కారణంగా ఆమె ఒకప్పుడు చాలామంది మగాళ్ళను మరిగి చాలా విద్యలు నేర్చుకుంది. వలచి వలపింపచేసుకునే ఆమె తెలివి, అనుభవం, విద్యలు అన్నింటినీ ఇప్పుడామె తనకంటే చిన్నవాడైన గోవిందరావును మచ్చిక చేసుకుందుకుపయోగిస్తుంది. పైగా గోవిందరావు తనకు తాళికట్టిన భర్త కాదు కాబట్టి ఆమె అతడి చెడుతిరుగుళ్ళను సమర్థిస్తూ "మీకేం మగమహారాజులు'' అంటుంది. అందువల్ల రామాయమ్మ సలహా ప్రకారం సుభద్ర గోవిందరావుకు శారదమీద నేరాలు చెబితే అతడు భర్తను దెబ్బలాడేవాడు. మొదట్లో శారద ఊరుకునేది కానీ క్రమంగా సమాధానమివ్వడం ప్రారంభించింది. "భార్య అంటే నోరెత్తకుండా పడి వుండడమేనని'' గోవిందరావు శారదకు మోటుగా చెప్పాడు. ఏకాంతంలో భర్త ఎన్ని మాటలన్నా ఊరుకునే శారద, సుభద్ర ఎదుట మాత్రం చిన్నమాట కూడా భరించలేక ఎదురు తిరిగితే గోవిందరావు ఆమెపై చేయి చేసుకునే స్థితికి వచ్చాడు. "నేను మీ భార్యను. మీరేమన్నా పడతాను, ఏం చేసినా సహిస్తాను. రామాయమ్మ బృందాన్ని ఇంట్లోంచి తరిమేయండి'' అన్నది శారద చిన్ని కోరిక. "సుభద్ర కాలిగోటికి పోలవు నువ్వు. ఆమెను మెప్పించు. ఆమెను నొప్పించావో నిన్ను పుట్టింటికి పంపగలను'' అన్నది గోవిందరావు సమాధానం. అతడు సుభద్రకూ తనకూ గల సంబంధం భార్యకు తెలిసేలా ప్రవర్తించసాగాడు. శారద స్థానం క్రమంగా ఆ ఇంట్లో పడిపోయింది. రామాయమ్మ ఆమెకు ఆ ఇంటి దాసిని చేసింది.

        గోవిందరావుకు తెలియకుండా అతడి పిల్లల చేత కూడా ఆమె ఊడిగం చేయించేది. గతిలేక అభిమానాన్ని చంపుకున్న శారదకు పండుగ రోజున పనివాళ్ళతో పాటు ముతకచీరనిచ్చి తను పట్టుచీర కొనుక్కునేది సుభద్ర. సుభద్ర పుట్టినరోజున గోవిందరావు, ఆమె గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకునేవారు. వాళ్ళిద్దరూ ఒకే మంచంమీద పడుకుని వుండగా శారద, మరో దాడి సుభద్రకు చెరో పాదం ఒత్తేవారు. ఫలితంగా ఆమె పనివాళ్ళక్కూడా లోకువైపోయింది. తన ముగ్గురు బిడ్డలకోసం అన్నీ సహించి దుర్భరజీవితాన్నీడ్చాలనే శారద అనుకుంది. అయితే పెళ్ళయిన పన్నెండేళ్ళకు స్టవ్ వెలిగిస్తూ భగ్గున మండింది శారద. ఆమె వంటిమీద అంత కిరసనాయిలు ప్రమాదవశాత్తూ ఎలా వచ్చిందో తెలియదు కానీ అది హత్య అన్నవాళ్ళు మూర్ఖులే. శారదను హింసించడం వినోదంగా పెట్టుకున్న ఆ ఇంట్లో మనుషులామెను చేజేతులా చంపుకుంటారా? ఈ దేశంలో ఆడపుట్టుక పుట్టిన నేరానికి - మరేదారీలేక కన్నా మమకారాన్ని కూడా వదులుకుని నూరేళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన శారద ఆత్మహత్య చేసుకుందనడంలో సందేహం లేదు. ఆమె పరిస్థితి తెలిసినవారు మాత్రం ఇంతాలస్యం చేసిందేమని ఆశ్చర్యపడ్డారు. శారద మరణం గోవిందరావుళ్ ఒఎలాంటి మార్పు తెచ్చిందో తెలియదు కానీ రామాయమ్మ బృందం ఆ ఇల్లు విడిచి వెళ్ళింది. ఎనిమిది, ఆరు, మూడేళ్ళ వయసు పిల్లలతో ఆ ఇంట్లో మిగ్లాడు గోవిందరావు. శారద తండ్రి చూడ్డానికివస్తే గోవిందరావు బావురుమన్నాడు.

     ఆయన అల్లుణ్ణి ఓదార్చుతూ తనూ ఏడ్చాడు. చాలాకాలం తర్వాత అవకాశం రావడంవల్ల శారద పుట్టింటి వారా ఇంట్లో మకాం పెట్టి కొంతకాలమున్నారు. "శారద తిరుగుతూంటే ఇల్లంగా నిండుగా వుండేది. చూడండి ఒక్క మనిషి లేక ఇల్లెలా చిన్నబోయిందో?'' అని గోవిందరావేడిస్తే అంతా ఓదార్చారు తప్ప "నీ మూలంగానే నీ భార్య పోయింది'' అని ఒక్కరు కూడా అనలేదు. "కొన్నాళ్ళపాటు నీకు ఒంటరితనం పనికిరాదు. మాకిక్కడుండడం కుదరదు. మా ఇంటికొచ్చేయ్'' అన్నాడు మామగారు. గోవిందరావు మామగారింటికి వెళ్ళి రెండు నెలలున్నాడు. అక్కడ నంగనాచిలా, ముంగిలా మసిలి రెండు నెలల్లో ఎందరి సానుభూతినో సంపాదించాడు. "మళ్ళీ పెళ్ళి చేసుకోరాదూ?'' అన్నాడొక రోజున శారద తండ్రి. "నాకు పెళ్ళా?'' అన్నాడు గెడ్డం పెరిగి వేదాంతిలా వున్న గోవిందరావు అదే ధోరణిలో. "నీకు పెళ్ళామక్కర్లేదు. కానీ నీ బిడ్డలకు తల్లి కావాలిగా'' అన్నాడు మామగారు. "కావాలి కానీ మరో ఆడది నా పిల్లలకు తల్లి కాలేదు ...'' "అయితే అల్లా చూడు'' అన్నాడు శారద తండ్రి. గోవిందరావటు చూసి కళ్ళు తుడుచుకున్నాడు. శారద చెల్లెలు హేమకు ఇరవై రెండేళ్లు. గోవిందరావు పిల్లలు ఆమె తల్లీబిడ్డల్లా కలిసిమెలిసి ఆడుకుంటున్నారు. అంతకుముందే గోవిందరావోసారి శారదా అని అరిచి హేమ చేయిపట్టుకున్నాడు. హేమ అయిదు నిముషాలతడి కౌగిట్లో వుండి, ఒక చిన్న ముద్దు కూడా అందుకున్నాక "ఏమిటి బావా?'' అని విదిపించేసుకుని జరిగిందాట్లో పూర్వభాగాన్ని తలికి చెప్పగా తల్లి తండ్రికి చెప్పగా ఆయన ఇప్పుడీ ప్రస్తావన తెచ్చాడు. ఆయన డబ్బిబ్బందుల్లో వుండడం వల్ల బంగారు బొమ్మలాంటి హేమకు నాలుగేళ్ళుగా ప్రయత్నిస్తూ కూడా సంబంధం కుదర్చలేకపోతున్నాడు. శారద చనిపోగానే తన రెండో కూతుర్నే గోవిందరావుకిస్తే అనిపించిందాయనకు. ఇరవై రెండుకు ముప్పై చక్కని జత. స్వయానా అక్కపిల్లలు కాబట్టి వాలకు సవితి తల్లి బాధ వుండదు. గోవిందరావు స్వతహాగా మంచివాడనీ, రామాయమ్మ బృందమే శారద కష్టాలకు మూలమనీ కూడా ఆయన సరిపెట్టుకుంటూ ఇంట్లో తర్జనభర్జనలు జరిగితే హేమ తల్లితో "అసలు లోపం కొంత అక్కలో కూడా వుందేమో. సుభద్ర బావని కట్టిపడేసుకుందిగదా తనాపని ఎందుకు చేయలేకపోయిందీ?'' అంది. తండ్రికీ మాటలు రుచించి "నాకు మటుక్కు హేమను నీకివ్వాలని వుంది. కానీ చాలామంది శారద చావుకి కారణం నువ్వే అంటున్నారు'' అన్నాడు అల్లుడితో అక్కడికి తనకేమీ తెలియనట్టు. "నా సంజాయిషీ శారదను బ్రతికిస్తుందని హామీ ఇస్తానంటే అందరికీ జరిగిందేమిటో చెప్పగలను'' అన్నాడు గోవిందరావు వేదాంతిలా. అల్లుడిపట్ల మామగారి గౌరవాభిమానాలు రెట్టింపయ్యాయి. గోవిందరావు అందం, డబ్బు, వయసు వున్న మగాడు కావడంవల్ల అతడికి హేమతో పెళ్ళి నిశ్చయమయింది. శారద విషయంలో తన ప్రవర్తన గురించి అతడు ఇనుమంత కూడా పశ్చాత్తాపం వెలిబుచ్చలేదు. ఎవ్వరూ అతడి తప్పుల గురించి నొక్కించలేదు.

    ఆఖరికి హేమ కూడా తనకు వేరే వరుడు దొరకడనో ఏమో ఈ పెళ్ళికి సుముఖత చూపించింది. ఆ శుభలేక నా చేతిలో వుంది. వెయ్యికోట్ల ఖర్చుతో అయిదేళ్ళకొక్కసారే ఎన్నికలు భరించడం కష్టంగా వున్న అతి బీద భారతదేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రజానాయకులు అయిదేళ్ళపాటు కలిసి వుండాలన్న జ్ఞానం కూడా లేక అంతఃకలహాలతో విలువైన కాలాన్ని వృధాచేస్తూ పదవికోసం దేశంలో కులమత భేదాలను రెచ్చగొట్టి దారుణహత్యాకాండకు కారుఅకులై మధ్యంతర ఎన్నికలంటూ ప్రజల ముందుకు వస్తూంటే నాకు వారిలో ప్రతి ఒక్కడిలోనూ గోవిందరావు కనిపిస్తున్నాడు. గోవిందరావుకు పునర్వివాహం. ప్రజానాయకులకు మధ్యంతర ఎన్నికలు. అటు గోవిందరావు ... ఇటు ప్రజానాయకులు. అటు హేమ ... ఇటు భారతపౌరులు. శుభలేఖ ఇంకా నా చేతిలోనే వుంది. టి.వి.లో వార్త కొనసాగుతూనే వుంది.