TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
వారసులు
శ్రీమతి శారద అశోకవర్ధన్
జూబ్లీ హిల్స్ లో ఎత్తయిన కొండమీద అత్యంత అధునాతనంగా కట్టిన పాలరాతి బంగళా జాబిల్లి చిమ్మే వెండి వెలుగుల జిలుగులతో తళ తళా మెరుస్తోంది. ప్రహరీగోడ చుట్టూ వాచ్ మాన్ లలా నుంచున్న అశోక వృక్షాలు వెన్నెల కాంతికి మెరిసిపోతూన్నట్టున్నాయి. అందమైన చిన్న లాను, చుట్టూ అనేక రకరకాల పూల తొట్లూ ఆ యింటి గొప్పదనాన్ని చాటుతున్నాయి. కాపలాదారు మాత్రం నిద్రకాపుకోలేక కాపలా పని ఆల్ సేషన్ కుక్కలకి వొదిలేసి, వెన్నెల స్నానం చేసినట్టు హాయిగా గేటుదగ్గరే కటికనేలమీద గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. క్షణమైనా కన్ను మూత పడక నిద్రపట్టని నరహరిగారు కిటికీలోంచి ఈ దృశ్యాన్ని చూసి నవ్వుకున్నాడు. ఎనభైఏళ్ళ నాటి గోడగడియారం ఎవరికీ నచ్చనందున అది నరహరిగారి గదిలో చోటుచేసుకుంది. దాని డ్యూటీ అది చేస్తూ మూడు గంటలు కొట్టింది. నరహరిగారు మంచం దిగి పక్కన టేబిల్ మీద వుంచిన రాగి చెంబు వొంపుకుని గ్లాసుడు నీళ్ళు గడగడా తాగేశాడు. మంచం మీద వెల్లకిలా పడుకుని, కిటికీ చువ్వలలో నుంచి కనిపిస్తూన్న చందమామను చూస్తూ పసిపిల్లాడిలా పులకరించిపోతూ రాని నిద్రకోసం జపంచేస్తూ కళ్ళు మూసుకున్నాడు.
గడియారం క్రమం తప్పకుండా తన కర్తవ్యాన్ని తను నెరవేరుస్తూ నాలుగు గంటలు కొట్టింది. మార్నింగ్ వాక్ చెయ్యడం అలవాటున్న వరహరిగారు పొద్దుటే బయలుదేరి ఆరు కిలోమీటర్లు నడిచాక టాంక్ బండు మీదుగా వస్తూ, పరుగెడుతున్న జనాన్ని చూసి అర్ధం కాక అడిగారు కనిపించిన ప్రతివాణ్ణీ. "అసలు ఇక్కడ ఏం జరిగింది? ఎక్కడికి అలా కంగారుగా పరుగెత్తి పోతున్నారు? చెప్పండి. ఏం జరిగింది?" గొడవేమిటో తెలీక పరుగెడుతూన్న జనాన్ని చూసి, ఎవరూ జవాబు చెప్పక పోవడంతో తనూ పరుగెత్తారు నరహరిగారు. జనాన్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్నారు. అందరి మొహాల్లోనూ ఏదో భయం. ఆడవాళ్ళు వొణికిపోతున్నారు. పసిపిల్లల నెత్తుకున్న తల్లులూ, గర్భిణీలూ, ముసలీ ముతకా పరుగో పరుగు. నరహరిగారికి చెమటలు పట్టాయ్. మరి పరుగెత్తలేకపోతున్నారు. పోలీసులు తరుముకొస్తున్నారు. అందరూ దుకాణాలు మూసేస్తున్నారు. ఇళ్ళలో వాళ్ళు తలుపులు బిడాయించుకుంటున్నారు. నరహరిగారికి పంచె కాళ్ళకి అడ్డం తగిలింది. తూలిపడ్డారు. వెనకనుంచి ఎవరో పట్టుకుని, పదవయ్యా గబగబా అంటూ తనే రెక్కపట్టిలాగి, ఎవరిగేటులోకో దూరిపోతూ అతణ్ణీ లోపలికి లాగి గేటు మూసేశాడు.
పెద్ద ఊరేగింపుతో, బాజాభజంత్రీలతో, రకరకాల జానపదాల వంటి నృత్యాలతో, పూలతో అలంకరింపబడ్డ లారీ కనిపించింది. ఏదో దేవుడి ఊరేగింపు అనుకుని "ఏ దేముడు బాబూ?" అడిగారు. అతడు నరహరిగారి నోటిమీద చెయ్యివేసి, మెల్లగా మాట్లాడ మన్నట్టు సౌజ్ఞ చేసి "దేముడా పాడా? ఎవరో రౌడీ షీటర్ చచ్చిపోయాట్ట....క....క....కాదు....చంపబడ్డాట్ట మరో రౌడీ షీటర్ చేత. ఇరు వర్గాలమధ్య ఘర్షణ జరిగి, మరో ఇద్దరు పొడుచుకున్నార్ట....దాంతో ఈ గొడవంతా...." "మరీ...." ఏదో అనబోయిన నరహరి, ఊరేగింపు లారీ దగ్గరకి రావడం, అందరి అరుపులూ, కేకలూ, శోకాలూ, గందరగోళం విని మాటరాక అక్కడే చతికిలబడిపోయారు దాదాపు రెండు గంటలసేపు నరహరిగారు! అది దుఖఃమో, సంబరమో తెలీని విధంగా భయ బీభత్సాలని మాత్రం సృష్టిస్తూ రథం లాగ కదిలిపోయింది. సదరు శవయాత్ర తాలూకా లారీ! 'బతుకు జీవుడా' అని బయటపడ్డ నరహరిగారు, రామ్మూర్తి గారింటికెళ్ళి లోపలకి అడుగుపెట్టబోతూ అడుగు ముందుకు పడక అక్కడే ఆగిపోయారు. రామ్మూర్తిగారూ తనూ కలిసిపనిచేసిన రోజులు కళ్ళముందు తిరిగాయ్ పాపం! రామ్మూర్తి మధ్య వయస్సులోనే కష్టాలకుంపట్లో కాలి మసై పోయాను.
అతని సంతతి నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు కష్టపడి చదువుకుని వారాలు చేసుకుని, స్వయంకృషితో పైకొచ్చారు. అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అన్నదమ్ములు కలిసి కట్టుగా కష్టాలనన్నీ ఎదుర్కొని ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ఇద్దరు సోదరీమణులకీ పెళ్ళిళ్ళు చేసి రామ్మూర్తిగారిని ఎరిగున్న వాళ్ళందరి చేతా శెభాష్ అనిపించుకున్నారు. అయితే ఉద్యోగాలూ హోదా పెరిగాక, వారి వారి భార్యామణుల్లో కలిగిన మనస్పర్ధలూ, పెరిగిన స్వార్ధం అన్నదమ్ముల్లో జ్వాలలు రేపాయి. రక్తసంబంధాన్ని కూడా మరచిపోయి, ఆప్యాయతలని అడుగున మట్టు బెట్టి, మమకారాన్ని మంటగలిపి, గర్భశత్రువుల్లా పోట్లాడుకుంటున్నారు. ఆ రోజు వారి పోట్లాట తారాస్థాయి నందుకుంది. నరహరిగారు ఆ దృశ్యాన్ని చూసి నోటమాటరాక చలించిపోయారు. ఒక్కొక్కరినే పిలిచి సర్దిచెప్పబోయారు. ఫలితంగా అందరినుంచీ తిరస్కారాలూ ఛీత్కారాలూ అందుకున్నారు. తనక్కడ వున్నాడన్న మర్యాద కూడా లేకుండా ఒకరినొకరు చంపుకున్నంతగా మండిపడుతూ తిట్టుకు చచ్చారు. ఇంచుమించు నరహరిగారిని కూడా చీవాట్లు పెట్టినంత పనిచేయడంతో, నోరెత్తలేక, మూగవేదనతో తిరుగు ముఖం పట్టారు నరహరిగారు. ఆ కంగారులో సరిగ్గా చూసుకోకపోవడంవల్ల, కాలు బురదలో పడి బాగా మట్టి అంటుకుపోయింది. దారిలో బోరింగ్ పంపు దగ్గర కాలు కడుక్కుందామని ఆగారు. ధార సన్నగా వొస్తోంది.
నిమిషాల్లో అక్కడ బారులు తీసిన బెందెలు, అదేదో సినిమాలో బిందెల డాన్సులాగా కనిపించి, 'ఇదేదో సినిమా షూటింగు కాదుకదా!" అనుకుని తిరిగి చూసేసరికి ఆడవాళ్ళు నీళ్ళకోసం బిందెలతో గుద్దుకోవడం కనిపించి గుండె ఆగిపోయి వాళ్ళనాపడానికెళ్ళి చాతకాక బిందె దెబ్బలు తిని, మూలుగుకుంటూ బయటపడ్డారు ఇక లాభం లేదని. అప్పటికే టైము తొమ్మిది దాటడంతో కడుపులో ఎలుకలు తిరగడం మొదలెట్టాయి. "ఇంటికెళ్ళి స్నానం చేసి ముందు పాలు తాగెయ్యాలి. ఇవ్వాళ ఆలస్యమైపోయింది" అనుకుంటూ, షార్టుకట్ కదా అని బోట్ క్లబ్బు దగ్గరి నుంచి బస్సెక్కి వెళదామనుకుని బస్ స్టాండ్ దగ్గర నుంచున్నారు. ఎంతకీ బస్సులు రాలేదు. మళ్ళీ కాళ్ళకి బుద్ధి చెప్పి అంత దూరం నడిచినందుకు తనని తానే తిట్టుకుంటూ, ఆటో కోసం చూడగా, జూబిలీహిల్స్ అంటే ఒక్కడూ రానన్నాడు. అరగంటకి కానీ కారణం తెలీలేదు నరహరిగారికి. ఇద్దరు వేరువేరు మతస్థుల మధ్య మతాబాలాగా అంటుకున్న గొడవల చిచ్చు దావానలమై, అది ఇళ్ళూ గుళ్ళూ కూలగోట్టుకుని తలలు పగిలేదాకా పెరిగిందట. దాంతో బస్సులూ, ఆటోలూ అన్నీ బంద్! హోటళ్ళూ తెరిచినవి మూసేశారు. ఉస్సురంటూ అడుగులు అతికష్టం మీద వేస్తూ నడక ప్రారంభించారు. కానీ కాస్సేపటికి ఆయాసం పట్టుకుంది. చిన్న కిల్లీ కొట్టు దగ్గర ఆగి వున్న టిఫిను బండి కనిపించింది. కిల్లీ కొట్టు దగ్గరే వున్న దుకాణంలో న్యూస్ పేపరు కొని, పక్కనున్న టిఫిను బండి దగ్గర ఒక కప్పు టీ తాగి, కాళ్ళు పీకుతుండడంవల్ల, కాస్సేపు మూసున్న దుకాణం అరుగుమీద కూర్చుండిపోయారు.
అసలే ఆంధ్రకేసరీ, పఠాభి వంటి మహనీయులతో కలిసి పనిచేసి, నేడు స్వాతంత్ర్యసమర యోధుడుగా పెన్షన్ పుచ్చుకుంటూన్న నరహరిగారు, భోజనం లేకపోయినా వుంటారేమోగానీ, వార్తలు చదవకుండా వుండలేరు. పేపరు చదవకపోతే, కడుపులో తిప్పినట్టయి, వాంతి చేసుకున్నంత పనవుతుంది అతనికి. "ఏ కులానికెన్ని సీట్లు కేటాయించాలీ, ఎవరెవరు పదవుల కోసం పార్టీలు మారుస్తూ కులాల పేరుతో కులకాలని చూస్తున్నారూ దానికోసం ఎన్ని వంచనలూ, ఎన్ని సంచలనాలూ, కక్షలూ కార్పణ్యాలూ? ఎంత మారిపోయింది కాలం! పదవికోసం, పలుకుబడి కోసం, పైసా కోసం పెళ్ళాన్నయినా అమ్ముకునే నీచత్వం , కుటుంబానికి విలువలేని విచ్చిన్న పరిస్థితులకు దారితేసే తిక్క సిద్ధాంతాలూ, కపట రాజకీయాలూ, వికట వ్యాసంగాలూ - ఎంత కలుషితమైపోయింది వాతావరణం! నీతికి నిలిచినావాడికి నిలువ నీడలేదు. భీతి వొదిలి సిగ్గువిడిచిన వాడు రొమ్ము విరుచుకు స్వైరవిహారం చేస్తున్న సమయం...." మరి చదవలేక పేపర్ని విసిరికొట్టి మళ్ళీ నడక ప్రారంభించారు. గుంపులు గుంపులు జనాలు! పెట్టే పేడా బట్టుకొని కొందరూ, బుట్టా, తట్టా, చేతి సంచీలూ కర్రలూ వగైరాలతో కొందరు.... నేల ఈనినట్టుంది జన సందోహం! నరహరిగారికేమీ అర్ధం కాలేదు. "ఎవరు మీరంతా?" ఒకర్ని చెయ్యి పట్టుకుని మరీ ఆపి అడిగారు. "మేమంతా సాయంత్రం మీటింగు కొచ్చినోళ్ళం! లారీలన్నీ పచ్చిక గార్డెను కాడా ఆపేసినారు. అదేదో కాలేజీ అంట. ఆడ మీటింగంట! పెద్ద పెద్దోల్లందరూ వొచ్చి, ఓటెవరికెయ్యాలో దేశాన్నెట్టా బాగుసెయ్యాలో సెప్తారంట. నిన్న రేతిరి బయల్దేరి వొచ్చాం, తలకో ఇరవై రూపాయలు ఇత్తామంటే మా ఇంటిల్లిపాదీ ఒచ్చాశాం." నవ్వుతూ చెప్పాడతడు. తన కుటుంబ సభ్యులని పరిచయం చేస్తూ. నరహరిగారికి ఏడుపొచ్చింది. మౌనంగా నడవడం మొదలెట్టారు.
కానీ జనం.... జనం.... జనం! తోసుకుపోతున్నారు. ఒకచోట ఇద్దరు ముసలాళ్ళు రొప్పుకుంటూ రోజుకుంటూ కనిపించారు. "వీళ్ళ ఇరవై రూపాయల ఆశపాడుగానూ, వీళ్ళకీ డబ్బు పిచ్చే ఈ వయస్సులో! అనుకుంటూ ఆ మాటే అడిగేశారు నరహరిగారు. "డబ్బా పాడా? మీటింగూ లేదు గీటింగూ లేదు. మా వూళ్ళో. ప్లేగొచ్చింది! ఇప్పటికి సగం వూరు చచ్చింది! మందిచ్చేడాక్టర్లూ మనుషులే కదా! వాళ్లూ పారిపోతూంటే ఏం చెయ్యాలి? మేము ఒచ్చేశాం. మా కొడుకూ కోడలూ, కోడలి వూరి కెళ్ళారు బెంగుళూరు." "మీదే వూరు?" "మాదీవూరే - సికింద్రాబాదు. మా బాబుకి సూరత్ లో ఉద్యోగం. అందుకని అక్కడున్నాం." ఆ మాటలు వింటూనే చుట్టూవున్నవాళ్లు వాళ్ళతో మాట్లాడేలోపే వాళ్ళకి ప్లేగ్ అంటుకుంటుందన్నట్టు భయంగా పరుగులు దీశారు. ఆ పరుగుల్లో ఆ కలకలంలో రాపిళ్ళు! తోపిళ్ళు! పెనుగులాటలు! దొంగతనాలు! హాహాకారాల జనం! ఆక్రందనల జనం! వందలమంది పరుగులు తీస్తూ ఒకరిమీద ఒకరు పడిపోతున్నారు. పోలీసు దళాలు అదుపు చెయ్యలేక కాల్పులు జరుపుతున్నారు. ఒక తూటా చూస్తుండగానే క్షణాల్లో ఒచ్చి నరహరిగారి కాలికి తగలడం. ఆయన వృక్షంలా అక్కడికక్కడే నేలకూలడం జరిగింది. నరహరిగారు స్పృహ కోల్పోతున్నారు. ఎవరో కొంతమంది ఆయనని లేవనెత్తి కారులో కెక్కించడం జరిగింది. మొహాన నీళ్ళు జలాలు. నీరసంగా కళ్ళుతెరిచి "ఎవరుబాబూ మీరు? నన్నెక్కడికి తీసుకెళుతున్నారు?" అన్నారు మధ్యలో. "నరహరిబాబుగారూ నేనండి, ఇన్ స్పెక్టరు బాలకృష్ణని. ఈ తొక్కిసలాటలో జాగర్తకోసం పోలీసులు కాల్పులు జరిపారు. ఓ తూటా ప్రమాదవశాత్తూ మీ కాలికి తగిలింది. మీరు కిందపడిపోవడం చూసి, నేను పక్కనే పార్కుచేసిన కార్లో తెచ్చి మిమ్మల్ని డాక్టరుకి చూపించాను." "డాక్టరుగారు నన్ను చూశారా?" "చూశారండీ! తూటా మీకాలిలోకి దూసుకుపోలేదు. ఊరికే తగిలి పక్కకిపోయి నేలమీద పడింది. మీకు వెంటనే స్పృహపోయింది. ఇప్పుడే వచ్చింది."
"బాబూ!" "ముందు ఈ పాలు తాగండి తరవాత మాట్లాడుదురుగాని." పాలకప్పును నోటికందించాడు. పాలు తాగగానే అమృతం తాగినట్టనిపించింది. పొద్దుటినుంచీ పరగడుపునే పడుతూన్న కష్టాలన్నీ మటుమాయమైపోయినట్టనిపించింది. "బాబూగారూ! మీరెందుకు ఇటువై పొచ్చారు? ఎక్కడ మీ ఇల్లు జూబ్లీహిల్స్! ఎక్కడ ఖైరతాబాదు! నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేది? అయినా మీరిలా ఒంటరిగా ప్రయాణం చెయ్యొచ్చా?" "ఏమిటయ్యా? నువ్వనేది?" అన్నారు పకపకా నవ్వుతూ నరహరిగారు. బాలకృష్ణ జవాబు చెప్పేలోపలే. "ఆడపిల్ల అర్దరాత్రి ఒంటరిగా క్షేమంగా, తిరగగలిగిననాడు నిజమైన స్వాతంత్ర్యం ఒచ్చిన రోజు అన్నారు గాంధీజీ. అంతేగానీ, స్వాతంత్ర్యం వొచ్చిన నలభైఏడు వసంతాల తరువాత, స్వాతంత్ర్య సమరయోధుణ్ణి, మగాణ్ణి నన్ను నిలదీసి ఇలా చెబుతావేమయ్యా, నేనేదో పరాయిదేశంలో వున్నట్టు?" అన్నారు. "బాబుగారూ! మీరు భారతదేశ స్వాతంత్ర్యంకోసం, దేశమాత బంధనాల విముక్తికోసం బ్రిటీష్ వారికి ప్రాణాలొడ్డి, దేశాన్ని కాపాడిన వీరులుకి అప్పుడు మన భారతదేశంలో తెల్లవారొక్కరే శత్రువులు. కాని ఇప్పుడో? మీ పొరుగునున్న ప్రతీవారూ శత్రువులే! వేరే మతస్థుల మధ్య సహృద్భావంలేక శత్రువులు. ఒక కులంవారికీ, మరో కులంవారికీ రాజకీయ లబ్దికోసంకు పడే కుస్తీల వల్ల శత్రుత్వమే! బలాబలాలు ప్రదర్శించుకోవడానికి ఎవరి రక్షణకోసం వారు పోషించుకునే రౌడీషీటర్లు శత్రువులే! ఎవరికోసం ఎవరు పోరాడుతున్నారో, ఎవరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో తెలీని అమాయక ప్రజలు కూడా ఒకరికొకరు శత్రువులే! చివరకి ప్రతీదీ పైసాతో ముడిపెట్టడం, ముఠా రాజకీయాలవల్ల పెరిగిన స్వార్ధంలో, ఆర్ధిక స్తోమతనే గౌరవించే సంఘంలో ఒక్క తల్లి పిల్లలూ హెచ్చుతగ్గుల బేరీజులో శత్రువులే! ఇక ఎవరు స్నేహితులు సార్? మీలాగా ఆలోచించిన తరం, నీతికీ నిజాయితీకీ నిలబడిన తరం కనుమరుగైపోయింది. ఎక్కడో....అక్కడా....అక్కడా....మీబోటివాళ్ళున్నారు. అక్కడా....అక్కడా మీలాంటివారి అడుగుజాడల్లో నడచిన గుర్తులను నేమరేసుకుంటూ ఇంకా ఆ ఓల్డ్ థాట్స్ ని, ఆ ఆలోచనలని మర్చిపోలేని నాలాంటివాళ్ళున్నారు. రేపటి తరంలో మీలాంటివాళ్ళు అసలుండరు సరికదా నాలాంటివాళ్ళూ మిగలరు. ఉండేదంతా పాలకులూ, పాలితులూ, పోలీసులూ, జనం, టీచర్లూ, విద్యార్ధులూ, అందరూ ఇలాగే ఇందాకటినుంచి మీరు చూస్తూన్న లాంటివారే సార్! మనిషిని చూసి మనిషి భయపడుతూన్న తరుణంలో ఇంట్లో, బయటా అంతా శత్రు భయమే! దినంలో ఎన్నోసార్లు ఛస్తూబతకాలి - అంతే!" ఆవేశంగా, అర్ధవంతంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన బోధలా చెప్పుకుపోతున్నాడు బాలకృష్ణ. ఖాకీ దుస్తుల్లో కఠినుడిగా పేరు పొందిన ఇన్స్ పెక్టర్ బాలకృష్ణ నరహరిగారి కంటికి! కారు గేటుముందాగింది. బాలకృష్ణ నరహరిగారిని మెల్లగా నడిపించి తీసికెళ్ళి, వసారాలో కంగారుగా తిరుగుతున్న అతని భార్యామణి దుర్గాబాయమ్మ గారూ, కొడుకు రాజేంద్ర ప్రసాద్, కోడలు ఝాన్సీ, మనుమరాలు ప్రియదర్శినీ వాళ్ళందరికేసీ చూసి సోఫాలో కూర్చోబెట్టాడు. వారందరూ పడుతున్న ఆందోళనని గ్రహించి, జరిగినదంతా చెప్పి, తను అర్జంటుగా వెళ్ళిపోవాలి గందరగోళం జరుగుతున్న ప్రదేశానికని వెళ్ళిపోయాడు.
ఇంటిల్లిపాదీ మరోసారి అతణ్ణి అలా వొంటరిగా అంతదూరం వాకింగ్ కి వెళ్ళొదని వారించి, మంచం మీద పడుకోబెట్టారు. మర్నాడు పేపరు చదువుతూ ఆశ్చర్యంతో నోరు మూతపడక అలాగే వుండిపోయారు నరహరిగారు. "పోలీసులు రాక్షసుల్లా ప్రవర్తించడంవల్ల అనేకమంది మరణించారు. గాయపడ్డారు. ముఖ్యంగా ఇన్స్ పెక్టర్ బాలకృష్ణ ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికే వ్యతిరేకం! మానవతకే మచ్చ! అతడిని వెంటనే బదిలీ చెయ్యాలి" అంటూ అనేక రాజకీయ ప్రతినిధుల వ్యాఖ్య. "ఛీ! ఛీ! పాడులోకం! పాపిష్టి మనుషులు! అంతా అబద్ధం. పచ్చి అబద్ధం! బాలకృష్ణ చాలా మంచివాడు. కర్తవ్య పరాయణుడు." కేకలు పెడుతూన్న నరహరిగారి గొంతువిని, ఇంటిల్లిపాదీ లేచొచ్చి లైటు వేసి చూశారు. "ఇదా....నా దేశం? వీళ్ళా నా ప్రజలు? గాంధీ మహాత్ముని వారసులు? నో....నో.... నా కొద్దీ స్వాతంత్ర్యం! అడుగడుగునా ఛస్తూ, మనిషిని చూసి మనిషి భయపడే ప్రజాస్వామ్యం నా కొద్దు....ఒద్దూ....ఒద్దూ. మహాత్మా! ఎక్కడున్నారు మీరు? మీ రనేవారు జ్ఞాపకం వుందా? ఇప్పుడు మనం పోరాడుతున్నది కలిసికట్టుగా ఒక్క తెల్లవారితోనే! కానీ, స్వాతంత్ర్యం వొచ్చాక మనం పోరాడవలసింది ప్రతి నిత్యం, ప్రతి మనిషితో అని. అది అక్షరాలా నిజం బాపూ! మా కేదైనా దారి చూపు! నేను నీలాగే ఆ రోజే మరణించి వుంటే ఈ ఘాతుకాలు చూసుండేవాణ్ణి కాదు. ఇప్పుడు నా భయం నా గురించి కాదు. నా ముందు తరం గురించి! వారికి ఏ విధంగా మీ సందేశాలు తెలుపగలను? ఏం చెయ్యగలను? ఈనాడు ప్రజల దృష్టిలోనే నసమర్దుణ్ణి!
బాపూ....బాపూ....చెప్పండి?
వీరా మన వారసులు?
ఇదా మీరు కోరిన సమాజం?"
"అబ్బబ్బబ్బబ్బబ్బ! ...
నిద్రలో కూడా ఇదే అవస్థ....
ఇదే ధోరణి!
ఎలా బాబూ రాజేంద్రా!" దుర్గాబాయమ్మగారి కళ్ళు చమర్చాయి. ఇంటిల్లిపాదికీ గుండె కరిగిపోయింది అతనిలో సిన్సియారిటికి! "మనసా వాచా, కర్మణా వారు నిజమైన గాంధేయులు, అమ్మా! నిద్రావస్థలో కూడా వాళ్ళు నిజాయితే మాట్లాడుతారు. ఏ విధమైన భేషజాలు లేని వ్యక్తులు!" అన్నాడు రాజేంద్ర తండ్రిని మెల్లగా తట్టి లేపుతూ. ఉలిక్కిపడి లేచారు నరహరిగారు. అర్ధంకాక అందరికేసి అదోలా చూశారు. "మంచినీళ్ళు తాగండి" అంటూ దుర్గాబాయమ్మగారు గ్లాసు నందించారు. నీళ్ళు గుటగుట తాగేసి గ్లాసు నామెకందిస్తూ, "కలవరించానా?" అన్నారు నవ్వుతూ. "కలవరపడ్డారు కూడా!" అది ఆమె నవ్వుతూ. "పెద్ద కల....ఆ కలలో".... "అర్ధమయింది అంతా! ఇక ఆ ధోరణిమాని కాస్సేపు పడుకోండి. ఇంకా పూర్తిగా తెల్లారలేదు" అంది దుర్గాబాయమ్మ దీపాన్నార్పేస్తూ.