Facebook Twitter
సీత-సావిత్రి

సీత-సావిత్రి

- వసుంధర 

 

              తెల్లచీర కట్టుకుని జడనిండా మల్లెపూలు పెట్టుకుని దూరానికే గుభాళించిపోతున్న ఆమె నన్ను చూడగానే పలకరింపుగా నవ్వింది. ఆ నవ్వు నాకు వళ్ళంతా గిలిగింతలు పెట్టింది.

ఎదురింటి గోవర్ధన్ భార్య ఆమె. పేరు సీత.

ఆమె మెరుపుతీగలా వుంటుంది. పాయసంలా ఆకర్షిస్తుంది.

ఆమెను చూడగానే నా మనసేదోలాగైపోతుంది.

ఆమె నవ్వుకు నేనూ నవ్వుతో బదులిచ్చాను.

ఆమె సిగ్గుతో తలవంచుకుంది. అంతే! ఆమె ముఖం నాకిక కనపడదు.

నిట్టూర్చి ఇంట్లోకి వెళ్ళాను.

నేను వచ్చే సమయానికి సావిత్రి తలుపులు దగ్గరగా వేసి వుంచుతుంది. సావిత్రి నా భార్య. సావిత్రి కూడా అందంగా వుంటుంది. అయితే అనుభవానికి వచ్చిన అందానికి అవసరంలో తప్ప గుర్తింపువుండదు. ఆమెకు నేనంటే చాలా ఇష్టం. నాకిష్టమైనవన్నీ చేసిపెడుతుంది. నా యిష్టమే తనిష్టంగా భావిస్తుంది. ఆఖరికి చీరల ఎన్నికలో కూడా ఆమె నా అభిరుచికే తలవంచుతుంది. నాకు సేల్సుటాక్సు డిపార్టుమెంటులో ఉద్యోగం. వూర్లో నాకు మంచి పలుకుపడి దుకాణాలున్నవారందరూ నేను కనబడితే చాలు సలాములు చేస్తుంటారు. నా వుద్యోగం నాకు అక్రమ ధనార్జనేకాదు-దురలవాట్లను కూడా సంపాదించి పెట్టింది. నేను తరచుగా బార్లకు వెడుతూంటాను. అట్టే ప్రమాదంలేని అక్రమ సంబంధాలకూ పాల్పడుతుంటాను. ఎదురింటి సీత భర్త గోవర్థన్ కి ఊళ్ళో పెద్దషాపే వుంది. అందులో ఫాన్సీ, కిరానా సరుకులేకాక నిత్యావసరానికి సంబంధించిన ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ గూడ్సు దొరుకుతాయి. ఆ దుకాణంలో ఎప్పుడూ రష్ గా వుంటుంది. నాకక్కడ ఒక్క పైసా కూడా దొరకదు. మా డిపార్టుమెంటు కొలీగ్ ఒకతను "అందమైన భార్య వున్నవాడెవ్వడూ డబ్బు లంచంగా యివ్వడు'' అనేశాడు. అప్పట్లో గోవర్థన్ భార్య ఎలా వుంటుందో నాకు తెలియదు. మూడు వారాలక్రితం గోవర్థన్ మా ఎదురింట్లోకి వచ్చాడు. ఆ పోర్షన్ అతడు కోనేశాడని తెలిసింది. వచ్చిన రెండురోజుల్లోనే అతడు నన్ను కుటుంబసమేతంగా వాళ్ళింటికి పిలిచాడు. నాతొ స్నేహం పెంచుకున్నాడు. అతడిభార్య స్నేహమాయి. ఎక్కువగా మాట్లాడు కానీ ఎప్పుడు చూసినా చిరునవ్వులు చిన్దిస్తుంది. ఆ నవ్వులో ఆహ్వానం వంటిదున్నదనే అనిపిస్తుంది. నేనామె గురించి బాగా ఆలోచించసాగాను. అప్పుడు నా కొలీగ్ మాటలు గుర్తొచ్చాయి.

                    "అందమైన భార్య ఉన్నవాడెవ్వడూ డబ్బు లంచంగా యివ్వడు'' గోవర్థన్ కావాలని నా ఎదురింటికి వచ్చాడు. అతడి ప్రోత్సాహం మీదనే అతడి భార్య నన్ను చూసి నవ్వులు చిందిస్తున్నదేమో. గోవర్థన్ రోజూ సాయంత్రం ఆరింటికి ఇంటికొస్తాడు. అతడికోసంఅరగంట ముందునుంచే గుమ్మంలో నిలబడి ఎదురుచూస్తుందతడి భార్య. ఆ టీములు నాకు తెలియగానే ఓ పావుగంట ముందుగా నేనింటికి రావడం ఆరంభించాను. సాధారణంగా నేను ఆఫీసునుంచి తిన్నగా ఇంటికి రాకుండా స్నేహితులతో తిరిగేవాణ్ణి. సీతను చూడాలని ఆ అలవాటు మార్చుకున్నాను. కానీ యిలా ఎన్నాళ్ళు? సీతను చూస్తే నా మనసెలా స్పందిస్తుందో నాకు తెలుసు. అందుకే సావిత్రిని గుమ్మంలో నిలబడనివ్వను. ఆమెతో కలిసి బజార్లకు తిరగను. మేమిద్దరం కలిసి వెళ్ళేది అప్పుడప్పుడూ సినిమాలకు మాత్రమే! నా భార్యపై పరపురుషుల దృష్టి పడకూడదని ప్రయత్నాలు చేస్తూనే పరాయి స్త్రీల గురించి ఆలోచిస్తున్నాను. నేను లోపలకు రాగానే ఉత్సాహంగా వచ్చింది సావిత్రి. "టమేటాబాత్ చేశానండీ'' అందామె. ఇటీవల ఆమెలో ఉత్సాహం పెరగడం గమనించాను. అందుకు కారణం నాకు తెలియదు. "టమేటాబాత్ చేశానండీ'' అంది సావిత్రి మళ్ళీ. అది నాకెంతో యిష్టమైన టిఫిను. కానీ రోజురోజుకూ సీత ఆలోచనలతో నా మనసు నిండిపోతుంది. సీత తప్ప యింకో ధ్యాస లేకుండాపోతోంది. అందుకే టమేటా బాత్ పేరు నా నోట్లో నీరూరించలేదు. కానీ వెంటనే సావిత్రిని దగ్గరగా తీసుకుని "టమేటాబాత్ కంటే నువ్వంటేనే నాకిష్టం'' అంటూ పెదాలపై ముద్దు పెట్టుకున్నాను. నా ప్రవర్తనకు సావిత్రి ఆశ్చర్యపడి వుండాలి. ఉన్నట్లుంది ఆమెలో సీతను చూస్తున్నానని ఆమెకు తెలియకపోవచ్చు. తర్వాత టమేటాబాత్ మేమిద్దరం కలిసి తిన్నాం.

               "నీవంటలు అద్భుతం'' అని మెచ్చుకున్నను. "అబద్ధం ... మొన్న వాళ్ళింటికెళ్ళినప్పుడు సీత వంటలు కూడా మెచ్చుకున్నారు మీరు'' ఆశ్చర్యపోయాను. నేనెలా తీసుకురావాలా అని ఆలోచిస్తుంటే తనే సీత ప్రసక్తి తీసుకొచ్చింది. "సీత ... సీత ... అంటున్నావు. మీ యిద్దరికీ అంట చనువు పెరిగిందా?'' అన్నాను. "ఆమె చాలా మంచిదండీ ... ఇద్దరూ అక్కాచెల్లెళ్ళలా కలిసిపోయాం'' అంది సావిత్రి. సావిత్రి అక్క. సీత చెల్లెలు. అంటే సీత నా మరదలు. 'వరస బాగుంది' అనుకున్నాను. "నోరారా నన్ను చెల్లీ అని పిలిచింది. చూడ్డానికి నాకంటే చిన్నదానిలాగుంటుంది'' అంది సావిత్రి. ఆమె అభిమానానిక్కారణం తెలిసింది. నేను వెంటనే కంగారుపడి "ఆమె నీకంటే చిన్నది. ఆమె నిన్ను చెల్లీ అని పిలిచినా సరే నువ్వామెను అక్కా అనే పిలు'' అన్నాను. "ఎందుకని?'' "ఆమె నిన్ను సంతోషపెట్టి నీద్వారా నన్ను మంచిచేసుకోవాలనుకుంటోంది. ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళ బుద్ధులే అంత! ఉచ్చనీచాలుండవు ...'' "అబ్బే ... ఆమె అలాంటిది కాదండీ. కేవలం స్నేహభావంతో మనింటికొస్తుంది .....'' అంది సావిత్రి. "అంతే రోజూ వస్తోందా?'' ఆశగా అడిగాను. "ఊ'' "అయితే యింకేం ఏదో దురుద్దేశ్యముంది. సావిత్రీ! అంతా నీలాంటి వాళ్ళేననుకుంటావు. నువ్వు నాకోసం కూడా గుమ్మంలో నున్చోవు. ఆవిడా రోజూ సింగారించుకుని గుమ్మంలో నిచోవడమేకాక నన్ను చూడగానే నవ్వుతుంది. ఆ నవ్వు కూడా మామూలుగా పలకరించినట్లు కాక పిలుస్తున్నట్లుంటుంది ...''

      "ఆమె గురించి అలా అనుకుంటే పాపం! తప్పంతా మీ ఆలోచనల్లో ఉంది ...''అంది సావిత్రి. "పోనీ నేనెప్పుడైనా ఎవరి గురించేనా తప్పుగా మాట్లాడానా?'' సావిత్రి ఈ ప్రశ్నకు జవాబివ్వలేదు. ఏ భార్యకూ ఇలాంటప్పుడు నిజం చెప్పే ధైర్యముండదు. "ఆవిడ విషయంలోనే ఎందుకు నేనిలా మాట్లాడుతున్నాను?'' అంటూ నా ప్రశ్నల పరంపర కొనసాగించాను. "ఆమెకు మిమ్మల్ని మంచి చేసుకోవలసిన అవసరమేమిటి?'' "ఒక విధంగా ఆమె భర్తకు వ్యాపారంలో లాభం, రెండో విధంగా ఆమెకు సంతోషం'' "ఇప్పుడామె సంతోషానికి తక్కువేమయింది?'' అంది సావిత్రి. "నీ అదృష్టం నీకు తెలియక అలాగంటున్నావు. నేను గవర్నమెంటుద్యోగిని. వానలు పడకున్నా, వరదలొచ్చినా నా జీతం నాకొస్తుంది. ఆపైన బొజ్జలు పెంచిన శావుకార్లందరూ నా చేతుల్లో ఉంటారు. నాకు వంగి సలాములుచేసి కోరినంత డబ్బిస్తూంటారు. పైసా పెట్టుబడి లేకుండా సంపాదిస్తున్నాను నేను. వ్యాపారస్తుల విషయామలాకాదు ఈనాటి వ్యాపారి రేపటి బికారి. ఇటు కష్టమర్సునీ, అటు నాబోటివారినీ, ఇంకా ఊళ్ళో గూన్దాలనీ అన్నింటికీ మించి రాజకీయనాయకుల్నీ తృప్తిపరచడానికే వాళ్ళ జీవితం. అందుకే డబ్బుతోపాటు భార్యల్ని కూడా అమ అవసరాలకితరులపై ప్రయోగిస్తుంటారు. ఎదురింటావిడ అలాంటి ప్రయత్నంలో వుందని నా అనుమానం ...''

          "మీరు చెప్పిందే నిజమనుకుంటే ఇందులో ఆమె సంతోషమేముంది? అంతా భర్త కోసమే ...'' "ఎందుకులేదు? గోవర్థన్ నాకంటే పొట్టి, నాకంటే రంగు తక్కువ. మనిషి టిప్ టాప్ గా ఉండాలన్న సరదాలేదు. కొత్త ఫేషన్ల మోజులేదు. చూడగానే నైన్ టీన్ ఫార్టీస్ లో సినిమా హీరో ఫాన్ లా ఉంటాడు ...'' సావిత్రి మాట్లాడలేదు. "నా మాట అబద్ధమంటావా ... మాట్లాడవేం?'' పరాయిమగాడికంటే నేనే బాగున్నానని భర్త అంటే కాదనడానికి ఏ భార్యకు ధైర్యముంటుంది? "ఎందుకొచ్చిన పోలికలండి యివి?'' అంది సావిత్రి. "అలా కాదు ఇలా ఎంతకాలమో సాగాడు, గోవర్థన్ ఏడింటికల్లా బయటకు వెళ్ళిపోతాడు. నువ్వామెను మనింటికాహ్వానించు. నేనింట్లో ఉన్నట్లు చెప్పదు. తన ఉద్దేశ్యమేమిటో నిలదీసి అడుగు. ఏం చెప్పిందో నేనూ వింటాను. నిజం నీకు తెలుస్తుంది ...'' అన్నాను. గోవర్థన్ ఇంటికి మళ్ళీ రాత్రి పదిన్నర దాటేక వస్తాడు. ఈలోగా ... నా బుర్రలో రకరకాల పథకాలు మెదుల్తున్నాయి. నా అనుభవాలను పురస్కరించుకుని ఆమె ఇష్టపడితే అవకాశమెలా కల్పించుకోవాలో, ఆమె ఇష్టపడకపొతే ఎలా ఇష్టపడేలా చేసుకోవాలో ఆలోచిస్తున్నాను. సావిత్రి అంగీకరించింది. ఏడున్నరకామె సీతను పీల్చుకుని వచ్చింది. వాళ్ళిద్దరూ బెడ్రూంలోకి వెళ్ళి కబుర్లు ప్రారంభించారు. నాకు వీలుగానే వుంది వారిని గమనించడం. సావిత్రి వ్యాపారస్తుల పద్ధతులూ, వారి భార్యల అక్రమసంబంధాల ప్రస్తావనా తీసుకొచ్చింది. సీత వెంటనే "మావారలాంటివారు కాదు'' అంది. "వ్యాపారస్థులు సాధారణంగా అందమైన భార్యలనెన్నుకుంటారు. నువ్వు అందమైనదానివి'' అంది సావిత్రి. "ఆ మాటకొస్తే నువ్వు కాకంటే అందమైన దానివి'' "ఆడదాని అందాన్ని అంచనా వేసేది మగాడు ...'' "అవును. నేను చెబుతున్నది నామాట కాదు. నా భర్త నీ అందాన్ని ఆరాధిస్తాడు. నేను నీతో పరిచయం పెంచుకుందుకదే కారణం ...'' ఉలిక్కిపడ్డాను. "అంతే నీ భర్త తరపున రాయబారానికోస్తున్నావా?'' "ఛీఛీ అందాన్నారాధించే వాళ్ళందరూ రాయబారాలు పంపే కుసంస్కారులేనంటావా?'' వాళ్ళిద్దరి మాటలూ వింటూంటే నాకు మతిపోయినట్లయింది.

    నాతో వివాహానికి ముందు సావిత్రి, గోవర్థన్ పరస్పరం ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేమనుకున్నారు. పెళ్ళి చేసుకోవాలనే అనుకున్నారు. ఇద్దరికీ కులాలు కలవలేదు. ఇరువైపులా పెద్దలు తీవ్రంగా వారి ప్రేమను నిరసించారు. ఈ పెళ్ళి జరిగితే చస్తామన్నారు. ఫలితంగా ప్రేమికులు ప్రేమను చంపుకున్నారు. వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. పెళ్లైనా గోవర్థన్ కి సావిత్రిపై మోజుపోలేదు. అతడు తన ప్రేమకథను భార్యకు చెప్పుకున్నాడు. సావిత్రికోసమే ఈ ఎదురిల్లు కొన్నాడు. సావిత్రిలో విశేషమేమిటో తెలుసుకుని ఆ లక్షణాలు తను సంతరించుకోవాలనీ, సీత ఆమెతో పరిచయం పెంచుకుంది. అలంకరణలో, అభిరుచులలో మార్పు తెచ్చుకుంది. గోవర్థన్ ఆమెపై సానుభూతి చూపించి "సీతా నువ్వు సావిత్రివి కాలేవు'' అన్నాడు. అతడి మనసులో ఒక్కసారైనా సావిత్రి ననుభావిన్చాలన్న కోరిక వుంది. భర్త నమితంగా ప్రేమించే సీత అతడికి సహకరించాలనుకుంది. "నేకు సిగ్గులేదూ? ఇలాంటి రాయబారానికి నేనంగీకరిస్తానా? నీ భర్తను పరాయి స్త్రీకప్పగించడానికి పురాణకాలం కాదు'' "పురాణకాలం నుంచీ పురుషుల బుద్ధి ఒక్కటే! స్త్రీకి శరీరసుఖానికి మించి త్యాగం తృప్తినిస్తుంది. అన్నివిధాల నీ భర్త కంటే అధికుడైన నాభర్తను నువ్వు కాదంటావనుకోను'' అంటూ సీత తన భర్త ఎలా అధికుడో చెప్పింది. అతడొకరి కింద ఉద్యోగం చేయలేదు. ఓ కలెక్టరేడాది జీతంగా తెచ్చుకునేది నెల్లాళ్ళలో సంపాదిస్తున్నాడు. నావంటివాళ్ళను బిచ్చగాళ్ళుగా భావించి బిచ్చం చేసినట్టు లంచం పారేస్తాడు. ఆపైన అందం, ముఖవర్చస్సు, పర్సనాలిటీ, మగతనం ఉట్టిపడే వ్యక్తిత్వం ... "ఇవి నీ అభిప్రాయాలు.

    నేను నా భర్త గురించీ ఇలాగే అనుకుంటాను ...'' అంది సావిత్రి. "కానీ నేకు నీవై ఎన్నుకున్న వ్యక్తి నా భర్త. నీ భర్తను పెద్దలు నీకంటగట్టారు. కాదంటావా?'' అంది సీత. సావిత్రి ఏమందో తెలియదు కానీ నా కళ్ళు బైర్లుకమ్మాయి. నన్ను చూసి నవ్వులు చిందించే ఓ అందమైన ఆడది ... నన్నెలా తీసిపారేసింది? అదీ మరో మగాడితో పోల్చి. మళ్ళీ నేను వాళ్ళ మాటలు వినగలిగే స్థితికి వచ్చేసరికి "నువ్విందు కంగీకరిస్తే నేను నీ భర్తతో ఒక రాత్రి గడపడానికి సిద్ధంగా ఉన్నాను'' అంది సీత. అప్పుడు నాకు వళ్ళంతా గిలిగింతలు. అమ్మదొంగా అసలు విషయానికి వచ్చావన్నమాట అనుకున్నాను. మరి దీనికి సావిత్రి ఏమంటుందో? సీత భర్త సంస్కారి. తను సావిత్రిని కోరుకున్నప్పుడు తన భార్యను సావిత్రి భర్తకప్పగించడం అతడికి న్యాయమనిపించింది. నేను సీతతో తప్పు చేస్తే తప్ప అతడికి సావిత్రితో తప్పు చేసే ధైర్యంరాదు. అందుకే సీత నన్ను పలువిధాల ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. "నా భర్తను నువ్వాకర్షించగలవా? నేను నీకంటే అందమైనదాన్నిగా ...'' "మగాడికి భార్య అందంగావుండాలి. పరాయి ఆడడైతే ఎలాగున్నా ఫరావాలేదు. నీ భర్తను నేను లొంగదీసుకోగలను ...'' సావిత్రి సీతను తీవ్రంగా మందలించి గోవర్థనాన్ని కూడా హెచ్చరించినట్లు చెప్పమంది. తన భర్త అపర శ్రీరామచంద్రుడంది. "అదే నిజమైతే నేన్ను క్షమించు'' అంది సీత. "ఏం క్షమిచాను? ఇప్పటికే నువ్వు వారికి నాపట్ల దురభిప్రాయం కలిగించానంటున్నావు?'' నేనేం చేశాను? ఓ చిరునవ్వు విసిరాను. అది తప్పా? మగాణ్ణి చూసి ఓ చెల్లి నవ్వదా? తల్లి నవ్వదా?'' అంది సీత. వాళ్ళు కావాలనే అలా మాట్లాడుకున్నారో లేక అంతా నిజమేనేమో నాకు తెలియదు. తెలుసుకోవాలనికూడాలేదు.

    ఓ సీతను నేను కోరితే అందుకు చెల్లించాల్సిన మూల్యం సావిత్రి. అందుకు సిద్ధపడలేకపోతే సీతను కోరే అర్హత నాకు లేదు. నన్ను చూసి నవ్వినా ఆడదానిమీద మనసుపడేముందు ఓ చెలి నవ్వదా, ఓ తల్లి నవ్వదా అన్న విషయం గుర్తుంచుకోవాలి. శృంగారం సృస్తి సహజం. ఆ సహజత్వాన్ని సమాజమామోదించిన పద్ధతిలో నడిపితేనే అది సరసం! సరసం గురించి నాలో అభిప్రాయం మారినప్పుడల్లా నేను చెల్లించాల్సిన మూల్యం హెచ్చరికంగా వుంటోంది. అందుకేనేమో వున్నట్లుండి నా జీవనవిధానం మారి, సంసార జీవితం నాకూ, సావిత్రికీ పరిమితమైపోయింది.