TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
నొప్పింపక తానొవ్వక
- వసుంధర
శంకరం బయట పాంటు, షర్టు వేసుకుంటాడు. ఇంట్లో పంచ, లాల్చీ! బయట దేవుణ్ణి తిడతాడు, ఇంట్లో రోజూ పూజ చేస్తాడు. బయట కాంగ్రెస్ పార్టీనీ, నెహ్రూ కుటుంబాన్ని దుమ్మెత్తి పోస్తాడు. ఇంట్లో తన పడక గదిలో నెహ్రూ, ఇందిర, సంజయ్ ల ఫోటోలున్నాయి. ఇటీవల వాటి పక్కన రాజీవ్ ఫోటో తగిలించాడు. ఆఫీసులో స్త్రీ స్వాతంత్ర్యం గురించి లెక్చర్లిస్తాడు.
లేడీ కొలీగ్సుకి అతడంటే చచ్చేటంత ఆరాధనాభావం. కానీ ఇంట్లో అతడి భార్య ఏడుగజాల చీరను వళ్ళంతా కప్పుకుని రూపాయా కాసంత బొట్టుతో ముసలి ముత్తైదువులాగుంటుంది. ఆమె పేరంటాలకొ, దైవదర్శనానికో తప్ప బయటకు రాదు. భార్యాభర్తలు కలిసి బయట కనబడరు.. నాకు శంకరం తత్త్వం అర్థంకాదు. కొందరు వాణ్ణి లౌక్యుడంటారు. నాకు మాత్రం హిపోక్రాట్ అనిపిస్తుంది. నా భార్య పేరు లక్ష్మి.
నేను తనని లక్కూ అని పిలవాలనుంటుంది. నా పేరును కట్ చేసి రాజ్ అని పిలుస్తుంది. నలుగురిలోనూ నన్ను నువ్వంటుంది. తను చీరలు మాత్రమే కాక మినీలు, మిడీలు, చురీదార్లు, ఘాగ్రాలు వేస్తుంది. చీరాల మీద స్లీవ్ లెస్ వేస్తుంది. పెదాలకు లిప్ స్టిక్ రాస్తుంది. ముఖానికి క్రీమ్సు పూస్తుంది. ఇష్టం వచ్చిన సినిమాలు చూస్తుంది. నన్ను శాసిస్తుంది. ఆమెను స్నేహితురాండ్రు హాయ్ లక్కీ అని పిలుస్తారు.
నేను మనసా, వాచా స్త్రీ స్వాతంత్ర్యానికి ప్రాధాన్యతనిచ్చేవాణ్ణి. అందుకని అంతా లక్కూ ఇష్టానికే విడిచిపెట్టినా ఆమె చేసే అన్ని పనులూ నాకు నచ్చవు. తప్పు ఆమె చేసే పనుల్లోకాక నా మనసులోని మగాడిలో వుందని గ్రహించి ఊరుకున్నా ఏదో అసంతృప్తి నన్ను బాధిస్తుంది. మానసికంగా హిపోక్రాట్ నైనా ఆచరణలో కానందుకు గర్వపడుతూంటాను. నాకు నా గురిన్చిఉ గర్వమే కాదు.
శంకరం భార్య గురించి విపరీతమైన జాలి కూడా వుంది. అయితే పేరంటంలో ఆమె అందరికంటే సంతృప్తితోనూ, సంతోషంగానూ కనిపిస్తుందనీ ఎంతో తెలివిగా మాట్లాడుతుందనీ అంతా ఆమెను పెద్దవాళ్ళకంటె ఎక్కువగా గౌరవిస్తారానీ లక్కూ నాకు చెప్పేది. చెప్పి ఊరుకోకుండా, ప్రపంచంలో ఆమెకి తెలియని విషయాలు లేవు. ఆడదానికంత తెలివి అనూహ్యం. వాళ్ళాయనే అన్ని చెప్పి నేర్పుతుంటాడని నా అనుమానం. మీరెప్పుడూ పోసుకోలు కబుర్లు తప్ప ఇంకేం చెప్పరు నా తెలివి పెరిగిపోతుందని బెంగ'' అంటూ ఆమె నా మీద నెపం వేసింది.
శంకరంతో పోల్చి నన్ను చిన్నబుచ్చడం సహించలేక అతగాడు భార్యనెలా ఆంక్షలు పెడుతున్నాడో వివరించాను.
లక్కూ అంతా విని "ఆమెకి వాళ్ళాయనంటే ప్రాణం. అతడిమీద ఈగ వాలనివ్వదు. అంటే అతడి గోప్పతనేం! నాక్కూడా మీరే ప్రాణంగా బ్రతకాలనీ, మీమీద ఈగ వాలనివ్వకూడదనీ వుంటుంది. కానీ మీరాస్థాయికి ఎప్పటికి ఎదుగుతారో ఏమో'' అనేసింది. నా భార్య నన్ను గౌరవించదు సరికదా అందుకు నన్నే తప్పుపడుతోంది. ఆమెనేమీ అనలేక ఊరుకున్నాను కానీ నా మనసు ప్రతీకారజ్వాలతో రగిలిపోతోంది. అంతకాలం నేనెప్పుడూ శంకరానికెదురు వెళ్ళలేదు.
ఇక తప్పదనిపించి మర్నాడాఫీసులో అతడు నాస్తికత్వం మీదా, స్త్రీ స్వాతంత్ర్యంమీదా, రాజకీయాల మీదా ఉపన్యాసాలు దంచుతూంటే మధ్యలో ఆపి ఆడి లక్షణాలన్నీ బయటపెట్టి "నువ్వు హిపోక్రాట్ వి'' అన్నాను. ఎదుటపడి శంకరాన్నంతవరకూ అంతమాటన్నవారు లేరు.
అయినా శంకరం నివ్వెరపోక "కనిపించని దేవుడి గురించి కనీ పెంచిన తల్లిదండ్రుల మనసుకు కష్టం కలిగిస్తే వాడు ఆస్తికుడైనా నాస్తికుడే! అందుకే ఇంట్లో నేను నా వాళ్ళని తృప్తిపరచడం కోసం దేవుడికి పూజ చేస్తాను. నెహ్రూ కుటుంబాన్ని ఆరాధిస్తాను. నా భార్యను అదుపులో వుంచుతాను. అయితే నా అసహాయాతను, బలహీనతలను నా భార్య దగ్గర ఒప్పుకుని ఏకాంతంలో ఆమె శాసనాలకు తలవంచుతాను.
నేను తనవాడినని నా భార్య నమ్మినంతగా మరే భార్యా తన భర్త గురించి అనుకోదని సవాలు చేయగలను. నువ్వు నన్ను నాస్తికుడను, హిపోక్రాట్ అను, స్త్రీలకు శత్రువను. నాకు అభ్యంతరం లేదు. నా భావాలేమైనా నా ఎదుటివారిని నొప్పించకపోవడమే నా మతం! ఉదాహరణకి ఇప్పుడు నువ్వు నన్ను నానా మాటలూ అన్నావు. నాకు నీ మీద కోపం రాలేదు. అందుకు సాక్ష్యంగా రేపు సాయంత్రం మన స్టాపునందర్నీ మా ఇంటికి అల్పాహారానికి ఆహ్వానిస్తున్నాను. ఆహ్వానం నీకూ వుంది. తప్పక రావాలి'' అన్నాడు.
అందరూ నవ్వేశారు. నాకు చిన్నతనం అనిపించింది. మర్నాడు పార్టీకి వెళ్లాను. మొత్తం ఇరవైమంది కొలీగ్సు. అందరూ వచ్చారు. ఇంకా ఆశ్చర్యం శంకరం బాస్ ని పిలవకపోవడం. ఇలాంటి విషయాల్లో బాస్ కి పట్టింపెక్కువ. రేపు శంకరం మీద ఇది తెలిసి మండిపడినా పడవచ్చు. పార్టీలో ఇడ్లీ, పులిహోర, గులాబ్ జాం, పాయసం పెట్టారు. పదార్థాలన్నీ ఎంతో రుచిగా వున్నాయి.
పార్టీలో శంకరం భార్య తానొక్కతీ అందరికీ వడ్డన చేస్తూ ఏలోటూ జరక్కుండా చూసింది. మనిషిలో ఉత్సాహం చెప్పనలవి కాదు. శంకరం తల్లిదండ్రులెంతో ఆప్యాయంగా అందర్నీ పలకరించారు. ఆ కుటుంబం సుఖసంతోషాలకు మారు పేరన్నట్లుంది. పార్టీ ముగిసేసరికి శంకరంపట్ల నాకు గౌరవం పెరిగిపోయింది. ఏదో కోర్టుకేసులో పోయిందనుకున్న ఆస్తి తిరిగి స్వాధీనమైందని ఈ పార్టీ ఇచ్చాడు శంకరం. నేను శంకరాన్ని కలుసుకుని నిన్నటి నా ప్రవర్తనకు సారీ చెప్పుకుని కోర్టు కేసు నెగ్గినందుకు అభినందించాను.
"జరిగింద మరిచిపో! నీకెవరిమీద కోపం వచ్చినా పదిమందిలో ఎటాక్ చేయకు. నీలో తప్పుంటే పదిమందిలో అపహాస్యానికి గురవుతావు. నిన్న నీక్కలిగిన సందేహాల్ గురించి ఏకాంతంలో మాట్లాడి వుంటే విషయం మన మధ్యనే వుండిపోయేది అవునా?'' అన్నాడు శంకరం. అందులో హెచ్చరిక ధ్వనించింది.
"బాస్ ని పిలవలేదేం?'' అన్నాను.
అతడి హెచ్చరిక నన్నూ హెచ్చరికకు ప్రోత్సహించిందనుకుంటాను. శంకరం నవ్వి ఊరుకున్నాడు. ఆ నవ్వు అతన్ని ఎత్తులో వుంచింది. నాలో అసూయ మళ్ళీ మొదలయింది. ఆ అసూయ మర్నాడు నన్ను బాస్ వద్దకు పంపింది.
నేను శంకరం ఇచ్చిన పార్టీ గురించి ఆయనకు చెప్పి "పార్టీలో మీకు కూడా వుంటే బాగుండేది'' అన్నాను.
బాస్ నవ్వి "మిమ్మల్ని పిలిచినట్లు నన్నూ అల్పాహారానికి పిలిస్తే బాగుండదని ప్రత్యేకంగా ఈ రోజు విందు భోజనానికి పిలిచాడు. అందుకని నిన్న మీరంతగా నన్ను మిస్ కాక తప్పలేదు. నీ అభిమానానికి థాంక్స్'' అన్నాడు.
తెల్లబోయాను. కొలీగ్సుకు టిఫిను, బాస్ కి డిన్నరు. శంకరం అవకాశవాది! అంతేకాదు. ఇది కొలీగ్సుకందరికీ అవమానం కూడా! వెంటనే నలుగురిలో శంకరాన్ని కడిగేయాలనుకున్నాను. కానీ ఆవేశాన్నణచుకున్నాను. శంకరం ఏం బదులిచ్చి నన్ను చిన్నబుచ్చుతాడో! అందుకు ముందుగా కోలీగ్సందర్నీ ఆకట్టుకుని అప్పుడతగాణ్ణి ఎటాక్ చేయాలి. ఈ ఉద్దేశ్యంతో అందరికంటే ముందు కిశోర్ ని కలుసుకున్నాను.
కిశోర్ బాస్ అంటే పీకలదాకా కోపం. ఊళ్ళో పలుకుబడి వుండడం వల్ల బ్రతికిబట్టకట్టగల్గుతున్నాడు. కానీ ఆఫీసులో అతగాడికి నీళ్ళు పుట్టేవి కాదు. ఉన్న ఇరవైమందిలోనూ ఆరుగురు కిశోర్ కి చెంచాలు. మరో ముగ్గిరికి కిశోర్ అంటే భయం.
శంకరం బాస్ ని మెప్పించడం కోసం కోలీగ్సందర్నీ ఎలా నొప్పించాడో కిశోర్ కి వివరించాను. "అందరూ నాకులా ధైర్యవంతులు కాలేరు. పోనీలెద్దూ'' అన్నాడు కిశోర్ తేలికగా.
"కానీ ఈ విషయం మన దగ్గర ముందు చెప్పలేదు. తెలిస్తే వెళ్ళి వుండేవాళ్ళం కాదు పార్టీకి. బాస్ కి డిన్నరు, మనకి టిఫిను ... ఛీఛీ ... ఎంత అవమానం?''
"నాకు ముందే తెలుసు'' అన్నాడు కిశోర్.
మళ్ళీ ఆశ్చర్యం నన్ను కమ్మేసింది. జరిగిందేమిటంటే శంకరం కిశోర్ ని ముందుగా కలుసుకుని "నేను నీకులా ధైర్యవంతున్ని కాను. బాస్ ని కూడా మా ఇంటికి పిలవాలి. ఆయనొస్తే నువ్వు రావు. మరికొందరు రారు. ఆ వచ్చిన మిగతా వాళ్ళు కూడా పార్టీలో ఫ్రీగా వుండలేరు. ఎంజాయ్ మెంటుండదు.
అందుకని ముందుగా బాస్ లేకుండా మన కోలీగ్సందర్నీ పార్టీకి పిలుస్తాను. అందరికీ డిన్నర్ కష్టం కాబట్టి టిఫిను పెడతాను. బాస్ ని విడిగా ఒక్కణ్ణి పిలుస్తాను. ఒక్కడికి టిఫిను పెడితే బాగుండదు కాబట్టి డిన్నరంటాను. ఏది ఏమైనా నా ఈ విషయంలో నాకు సలహా కావాలి'' అన్నాడు. కిశోర్ శంకరం చెప్పినదానికి ఆమోదముద్ర వేయకుండా వుండగాలడా? అప్పటికి శంకరం నాకు అర్థమయ్యాడు.
అతడు తను మంచి అని నమ్మినది చేస్తూనే ఎవ్వర్నీ నొప్పించకూడదనుకుంటాడు. ఆ ప్రయత్నంలో అహంకారాన్ని కూడ పూర్తిగా విడిచిపెట్టగలడు. శంకరంలా ఉండడం నాకు సాధ్యం కాదు. కానీ అతన్ని హిపోక్రాట్ అంటే మాత్రం నేను హిపోక్రాట్ నవుతాను.