Facebook Twitter
ఓటమిలో గెలుపు

ఓటమిలో గెలుపు

- వసుంధర

 

నేను తల్లిదండ్రుల చాటు బిడ్డను కావడం నా అదృష్టమే కానీ నాలోని లోపం కాదు. అమ్మానాన్నలకు నేను ఒక్కన్నే కొడుకును కాదు. అయినా వాళ్ళు నన్ను అపురూపంగా పెంచారు. చిన్నప్పట్నించీ కంటికి రెప్పలా చూసుకునేవారు. నాకు చదువు బాగా వస్తూంటే చదివించారు. నేను బి.కాం. ప్యాసవ్వగానే నాన్న డబ్బూ, పలుకుబడి ఉపయోగించి ఓ నేషనలైజ్ద్ బ్యాంకులో ఉద్యోగం కూడా వేయించారు. ఉద్యోగంలో చేరాక కూడా వాళ్ళు నన్ను నా మానానికి వదిలి పెట్టలేదు. ఆఫీసులో నాకెలాంటి ఇబ్బందులూ రాకుండా నాన్నా, ఇంట్లో నాకే కష్టమూ కలక్కుండా అమ్మా చూసుకుంటున్నారు నన్నెంతో ఇదిగా.

ఇదంతా బాగానే వుంది. కానీ ఎంతమంది తల్లిదండ్రులిలా ఉంటున్నారు? అందుకని నా మిత్రవర్గంలో చాలామందికి నేనంటే అసూయ. ఆ అసూయతో వాళ్ళు నన్ను తరచుగా వేళాకోళం చేస్తుంటారు.
నా మిత్రులు మొత్తం అరడజను మంది. అందులో ఇద్దరికీ చదువే రాలేదు. ఇద్దరికీ చదువొచ్చింది కానీ ఉద్యోగం రాలేదు. మరో ఇద్దరికీ ఉద్యోగాలున్నా అవి వాళ్ళు బ్రతకడానికి చాలవు.

ఈ ఆరుగురూ కాక నాకింకా స్నేహితులుండేవారు. నాకంటే ఉన్నత స్థానంలో ఉన్న వాళ్లనే కాదు, నాతొ సరిసమానుల్ని కూడా నేను సహించలేను. అందుకే నాకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఈ ఆరుగురూ నాకు మిత్రులుగా మిగిలారు.
అదేం దురదృష్టమో నాతో స్నేహం చేసిన ప్రతివాడూ నా మీద జోకువేయడానికి ప్రయత్నించేవాడు. ఇప్పుడున్న ఆరుగురు మిత్రులూ కూడా నామీద దారుణంగా జోకులు విసుర్తూనే వుంటారు. సరిసమానులూ, నాకంటే గొప్పవాళ్ళు వేసిన జోకుల్లా, వీరి జోకులు నన్ను బాధించక పోవడంవల్ల వీరితో స్నేహాన్ని నేను కొనసాగించగల్గుతున్నాను.

"ప్రస్తుతం నాకు ఉద్యోగం లేదు. అయితే వుద్యోగం కోసం సుధాకర్ కి అన్నింటికీ నాన్నే ఆధారం. నీకులా లేమన్నదే మాకు తృప్తి'' అన్నారు చదువురాని వాళ్ళు.
"మాకొచ్చే జీతంతో నాలుగువేళ్ళూ లోపలికి పోవడంలేదు. ఇటే ఏం స్వయంకృషితో సంపాదించిన నాలుగు పైసలూ, నాలుగు లక్షల్లా కనబడతాయి'' అన్నారు చిరుద్యోగులు.
నేను వేటికీ చలించకుండా "మీ అసూయే మీ చేత ఆ మాటలు పలికిస్తోంది. ఐనా నేను స్పోర్టివ్ గా తీసుకుంటున్నాను, నేను కావాలని ఎవరిమీదా ఆధారపడలేదు. కాలవ దాటడానికి బల్లకట్టున్నప్పుడు ఈత కొట్టుకొంటూ వెళ్ళాలా? వడ్డించిన విస్తరి నా జీవితం. అది నా అదృష్టం'' అన్నాను.
"అదే ... అదే ... అదే నిన్ను చేతకానివాణ్ణి చేస్తోంది'' అన్నాడు నిరుద్యోగి.
"చేతకాని వాణ్ణి అంటే ఎలా?'' అనడిగాను.

వాళ్ళంతా ఆలోచనలో పడ్డారు. వాళ్ళవంకే చిద్విలాసంగా చూస్తున్నాను నేను.
ఆఖరికి ఒకడు "నువ్వు అమ్మాయిల్ని ప్రేమించగలవా?'' అనడిగాడు.
"అది మంచి బాలుడి లక్షణం కాదు. కాబట్టి అలాంటి ప్రయత్నం కూడా చేయను'' అన్నాను.
ఉన్నట్లుంది చిరుద్యోగి అన్నాడు. "చెడ్డ బాలుడిలా ప్రవర్తించవద్దు . చేతనైతే ఒకమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకో''
రెండో చిరుద్యోగి ఇంకా కన్సెషన్ ఇచ్చాడు "నీకు తెలియని అమ్మాయిని ప్రేమించే సాహసం వీవల్ల కాదని నాకెలాగూ తెలుసు. కానీ మీ ఇంట్లో నీకు వరుసకు మరదలుంటే ప్రేమించు చాలు. నీ గురించి నమ్ముతాం''
"ఏమిటీ సవాల్?'' అన్నాను చిరాగ్గా.

అప్పుడే నా మనసులో ఆ ఊళ్లోనే ఉన్న మరదలు పిల్ల కాత్యాతని మెదిలింది.
ఆ మధ్య ఎవరో బామ్మగారు ఏదో చుట్టపు చూపుగా మా ఇంటికొచ్చి మా కాత్యాయని ఈ ఊళ్ళోనే చదువుకొంటోందని చెప్పినప్పుడు ఆ కాత్యాయని గురించీ, నాకూ ఆమెకూ వున్న వరుస గురించీ తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ కాత్యాయని ప్రసక్తి ఇంట్లో రాలేదు.
కాత్యాయని ఉమన్స్ కాలేజీలో రెండో సంవత్సరం బియ్యే చదువుతోంది. కాలేజీ హాస్టల్లో ఉంటోంది. బామ్మగారుండగా ఓసారి కాత్యాయని మా ఇంటికి వచ్చింది. అప్పుడు చూసిన రూపం ఇంకా గుర్తుంది. మనిషి బాగుంటుంది. 'కత్యాయనిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటే వీళ్ళ సవాలుకు జవాబుగా వుంటుంది, నాకో చక్కని జోడూ దొరికినట్లుంటుంది' అనుకున్నాను.

మర్నాడే ఉమన్స్ కాలేజీ గేట్ దగ్గర కాత్యాయాన్ని కలుసుకున్నాను. నన్ను చూడగానే ఆమె గుర్తుపట్టింది. అందుకు నాకెంతో సంతోషం కలిగింది.
"మీతో మాట్లాడాలి. చాలా ముఖ్యమైన విషయం. ఓసారి పార్కుకు వస్తారా?'' అన్నాను.
కాత్యాయని ఒప్పుకొని తిన్నగా  పార్కుకు వచ్చింది.

"నాకు డొంక తిరుగుడుగా మాట్లాడ్డం చేతకాదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరూ నన్ను ప్రేమించగలరా?'' అనడిగాను కత్యాయాన్ని.
కాత్యాయని నావంక అదోలా చూసి "పెళ్ళి గురించి నాకెన్నో కలలున్నాయి. మీరు యద్దనపూడి సులోచనారాణి నవలలు చదివారా?'' అనడిగింది.
"లేదు. నవలలు చదివితే చేదిపోతానని అమ్మా, నాన్న చెప్పారు'' అన్నాను.
"ఆ నవలల్లో హీరోలా ఉండాలి మీరు. ముందు చదివి తెల్సుకోండి'' అంది కాత్యాయని.

నేను వెంటనే లేచి, "ఆ పుస్తకాలెక్కడ దొరుకుతాయి?'' అనడిగాను.
"మీ ఇంట్లో ఉండకపోవచ్చునేమోగానీ, మీ ఇరుగూ పొరుగూ ఇళ్లలో తప్పకుండా వుంటాయి'' అంది కాత్యాయని. ఆమె కూడా లేచి నిలబడింది.
"సరే, అయితే మళ్ళీ కలుద్దాం. కానీ ఎన్ని నవలలు చదవమంటారు?'' అన్నాను.
"కనీసం ఆరు'' అంది కాత్యాయని.
ఇద్దరం విడిపోయాం. తర్వాత నేను వీథిలో వాకబుచేయగా కాత్యాయని చెప్పిన మాట అక్షరాల నిజమని తెలిసింది. ఆ వీధిలోనే నాకు 10 పుస్తకాలు దొరికాయి.
ఇంట్లో తెలియకుండా ఒకటి కాదు, రెండు కాదు పది నవలలు చదివాను. ఇంకా చదవాలనిపించింది. కానీ అప్పటికే కాత్యాయాన్ని కలుసుకుని నెల రోజులు దాటింది. అందుకని ఇంకా నవలలు చదివే ఉద్దేశ్యం అప్పటికి కట్టిపెట్టి మళ్ళీ కాత్యాయన్ని గేటు దగ్గర కలిశాను.


"చాలా కాలమైంది మిమ్మల్ని చూసి'' అంది కాత్యాయని.
"పార్కులో మాట్లాడుకుందాం'' అన్నానుఇద్దరం పార్కుకి వెళ్ళాం.
"మీరు ఆరన్నారు, కానీ నేను పది చదివాను'' అన్నాను.
కాత్యాయని ఆశ్చర్యంగా "ఈజిట్!'' అని "ఎలా వున్నాయి?'' అంది.
"మీకు చాలా థాంక్స్ ... చాలా బాగున్నాయి ...'' అన్నాను.
"సరే. కనీ మీరీమధ్య కనబడలేదు ...''
"నవలలు చదివేదాకా మిమ్మల్ని చూడకూడదనుకున్నాను''
"నవలలు చదువుతున్నప్పుడు నేను గుర్తుకొచ్చానా?''
"లేదు. నాది అర్జునుడిలాంటి శ్రద్ధ, ఏకాగ్రతతో నవల చదువుతున్నప్పుడు మరే విషయమూ నా బుర్రలో వుండేది కాదు'' అన్నాను గర్వంగా.
కాత్యాయని ముఖం అదోలాగైపోయింది. పోనీ నవల చదవడం అయ్యాకయినా నన్ను చూడాలని పించేదా?''
"లేదు. తర్వాత చదవవలసిన నవల గురించి ఆలోచించేవాణ్ణి'' అన్నాను గర్వంగా.
కాత్యాయని చాలా భారంగా నిట్టూర్చింది.

"ఇప్పుడు చెప్పండి ... మీరు నన్ను ప్రేమించగలరా?'' అన్నాను.
"పెళ్ళి గురించి నాకెన్నో కలలున్నాయి. వాటిలో కొన్నింటిని మీరు చదివి తెల్సుకున్నారు. ఇంకా చూసి తెల్సుకోవాల్సినదుంది. మీరు అమితాబ్ బచ్చన్ సినిమాలు చూస్తారా?'' అంది కాత్యాయని.
"చూడలేడు. కానీ అతడు హిందీలో పెద్ద హీరో అని తెలుసు'' అన్నాను. అమితాబ్ బచ్చన్ పేరు నే నెరుగున్నది కావడమే నాకు చాలా గర్వకారణ మనిపించింది.

"అతడి సినిమాలు చూడండి. ఈ రోజుల్లో ఆడపిల్ల కోరుకునే మగవాడు అలా వుండాలి'' అంది కాత్యాయని.
"అలాగే!'' అని లేచాను. ఇంక కాత్యాయనితో మాట్లాడవలసిందేముంది?
ఆమె వెళ్ళి పోతూండగా చటుక్కున గుర్తుకు వచ్చి "ఏవండీ!'' అని పిలిచాను.
కాత్యాయని వెనక్కి తిరిగింది. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. నే నామెవంక నడిచి, "అన్నట్లు ... ఎన్ని సినిమాలు చూస్తే చాలంటారు?'' అన్నాను.
ఆమె కళ్ళలోని మెరుపు మాయమైంది. "కనీసం నాలుగు!'' అని చరచరా నడిచి వెళ్ళిపోయింది. నేను మళ్ళీ ఎక్కడ పిలుస్తానోనన్న భయం ఉన్నదానిలాగా.

ఊళ్ళో అమితాబ్ బచ్చన్ సినిమాలు రెండు ఆడుతున్నాయి.
నన్ను ఎన్నోమాటలు మిత్రులు బలవంత పెట్టారు. కానీ ఎన్నడూ హిందీ సినిమా చూడలేదు.
ఇప్పుడు కాత్యాయని కోసం చూస్తున్నాను. ప్రేమ ఎంత బలమైనది!
ఇంట్లో తెలియకుండా రెండు సినిమాలూ చూశాను. నాకెంతో నచ్చాయి. వాటిలో అమితాబ్ బచ్చన్ ఎంత చక్కగా నటించాడు!
మరో రెండు సినిమాలు అమితాబ్ బచ్చన్ వి మా ఊరు రావడానికి ఆరువారాలు పట్టింది. అవి కూడా చూశాక నా అభిప్రాయం మరింత బలపడింది.
ఇకమీదట హిందీ సినిమాలు క్రమం తప్పకుండా చూడాలని కూడా అనుకున్నాను.
నాలుగు సినిమాలు చూడడం అయ్యేక మళ్ళీ వాళ్ళ కాలేజీగేటు దగ్గర కాత్యాయనిని కలుసుకున్నాను.
కాత్యాయని నన్ను చూసి నీరసంగా నవ్వింది.
"పార్కుకి వెడదామా?'' అన్నాను.
"ఊ.('' అందామె.
ఇద్దరం పార్కు చేరాక'' నాలుగు సినిమాలు చూడ్డం పూర్తయ్యేదాకా నన్ను చూడకూడదనుకున్నారు కదూ?'' అంది.
"అవును బాగా ఊహించారు. ఆ మాటకొస్తే ఈ మధ్యకాలంలో మీరసలు నాకు గుర్తే లేరు!'' అన్నాను నేను గర్వంగా.
"అనుకున్నాన్లెండి!'' అంది కాత్యాయని.
"ఇప్పుడు చెప్పండి ... మీరు నన్ను ప్రేమించగలరా?'' అనడిగాను ఆత్రంగా.
"ఇప్పుడే చెప్పలేను. నాకు మూడునెల్ల వ్యవథి కావాలి. అంత వరకూ మీరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. అంటే మనం కలుసుకోకూడదన్న మాట!'' అంది కాత్యాయని.
"ఓస్ .. .ఇంతే కదా?'' అన్నాను.
"ఎలా గడుస్తాయ్ మీకు రోజులు ... బోరనిపించదూ?'' అంది కాత్యాయని.
"ఇదివరలో అయితే ఏమోగానీ ఇప్పుడు ఫరవాలేదు. నవలలు చదువుతూ, సినిమాలు చూస్తూ గడిపేయగలను'' అన్నాను.


కాత్యాయని చటుక్కున లేచి "సరే, అలాగే చేయండి'' అని వెళ్ళిపోయింది.
ఆ తర్వాత నేను నవలలు చదవడానికి, సినిమాలు చూడ్డానికీ ఇంట్లో పర్మిషన్ అడిగాను. నేనూహించుకున్నట్లుగా అమ్మ అభ్యంతర పెట్టలేదు. ఆమె అర్జంటుగా నాన్నగార్ని పిలిచి "మనవాడు పెద్దవాడౌతున్నాడండీ! ఇంకా వాడికి పెళ్ళి చేసేయొచ్చు'' అంది.
నాన్నగారు కూడా విషయం విని ఆనందంగా ముఖంపెట్టి "వీడి అన్నయ్య విషయంలోనూ అచ్చం ఇలాగే జరిగింది. ఈ వయసులోనే వాడు ...'' అని మాట నాన్చేశాడు.
రోజులు గడుస్తున్నాయి.


ఇప్పుడు మళ్ళీ నేను నా మిత్రుల్ని కలుసుకుంటున్నాను. ప్రతి రోజూ వాలు తన సవాల్ గురించి అడుగుతూంటే నేను చిరునవ్వుతో "కంగారెందుకు? మీరే చూస్తారుగా'' అనేవాణ్ణి.
ఒకరోజున వాళ్ళలో ఒకడు చిరాగ్గా, "ఇలా ఎన్నాళ్ళు దాటవేస్తావ్? ఇంతవరకూ నువ్వు ప్రేమ కలాపం ప్రారంభించనైనా లేదు'' అన్నాడు.


"ప్రారంభించకేం? అంతా అయింది. పెళ్ళి ముహూర్తం నిర్నంయ్యాక అన్ని వివరాలూ నీకు చెబుతాను'' అన్నాను.
"అలాగే అంటావ్. పెద్దలు నిర్ణయించిన అమ్మాయిని చూపించి ఆమెనే ప్రేమించానని కోస్తావు. ఇదేమ లాభంలేదు. మాకు ఋజువు కావాలి'' అన్నాడో చిరుద్యోగి.
వాళ్ళు బాగ్ఫా నొక్కించడంతో కాత్యాయని పేరు చెప్పక తప్పలేదు. ఆ పేరు వింటూనే వాళ్ళకు ఆశ్చర్యంతో కాసేపు నోట మాట రాలేదు.
"ఆ అమ్మాయినెప్పుడు కలుసుకున్నావు? ఎలా కలుసుకున్నావు?'' అనడిగారు వాళ్ళంతా ఏక కంఠంతో.
"ఆమె నిన్తవరకూ నేను ముచ్చటగా మూడుసార్లు కలుసుకుని మాట్లాడాను. అంతకుమించి మీకీమీ చెప్పలేను. నాలుగోసారి నేను, ఆమె కలుసుకున్నప్పుడు వివాహం గురించి చర్చించుకుంటాం'' అన్నాను నేను.


"ఒక్కసారి ఆ అమ్మాయిని చూపించు'' అన్నారు వాళ్ళు.
"ఆమెను కలుగుకోనని మాటిచ్చాను. ఆ గడువింకా పూర్తి కాలేదు. మీకు కావాలంటే ఆమె అడ్రెస్ ఇస్తాను. వెళ్ళి చూడండి'' అన్నాను.


రెండ్రోజుల తర్వాత నిరుద్యోగి నాతో, "కాత్యాయనిని చూశాను. మనిషి చాలా బాగుంది. కానీ, ఆమె నిన్ను ప్రేమిస్తోందంటే నమ్మను. ఆమె ఎవరో యువకుణ్ణి రోజూ పార్కులో కలుసుకుంటోంది'' అన్నాడు.
"నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను'' అన్నాను.
"నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం!'' అన్నాడు చిరుదోగి.
నాకు అనుమానం కలిగింది, 'మా ప్రేమ ఏదో విధంగా ఫెయిలవ్వాలని చిరుదోగి ప్రయత్నిస్తున్నాడేమో? గడువులోగా నేనామెను కలుసుకున్నానంటే నా ప్రేమ విఫలమైనట్లే!


"పోనీ కలుసుకుంటే కలుసుకోనీ! నేను మీకులా అసూయాపరుణ్ణి  కాను, స్పోర్టివ్ గా ఉంటాను. కాత్యాయనిపై నాకు నమ్మకముంది. మీరేం చెప్పినా నమ్మను;; అన్నాను.
"నమ్మకపోతే నీ కర్మ. కానీ నువ్వు కాత్యాయాన్ని పెళ్ళి చేసుకుంటే అప్పుడు తప్పకుండా చేతకాని వాడివే అవుతావు. శీలంలేని ఆడపిల్లను చేతకానివాళ్ళే చేసుకుంటారు'' అన్నాడు చిరుద్యోగి తీవ్రంగా.


ఎందుకైనా మంచిదని కాత్యాయనిని రహస్యంగా గమనించసాగాను. నిజంగానే ఆమె ఓ యువకుడితో కలిసి పార్కుకు వెడుతోంది. ఆ యువకుడు అందచందాల్లో నాకు సాటి వస్తాడనిపించలేదు. వేషభాషలను బట్టి కూడా నాకులా ఉన్నవాడనిపించదు. సులోచనారాణి నవలల్లోని హీరోకి కానీ, అమితాబ్ బచ్చన్ కి కానీ వాడు దరిదాపుల్లో లేడు.


గడువు తీరిన రోజున కూడా ఆమెను ఎప్పటిలా గేటువద్ద కలుసుకోలేదు. ఎం చేస్తుందోనని రహస్యంగా గమనించాను. ఆమె ఆ యువకున్ని కలుసుకుని పార్కుకు వెళ్ళింది. ఇద్దరూ దట్టంగా ఉన్న క్రోటన్స్ మొక్కల చాటుకు వెళ్ళారు. వాళ్ళు మొక్కల కవతల ఉంటే నేను ఇవతల ఉన్నాను. వాళ్ళక్కడున్నట్లు నాకు తెలుసు. కానీ నేనక్కడున్నట్లు వాలు తెలియదు. వాళ్ళు గట్టిగా మాట్లాడడంలేదు. కానీ శ్రద్ధగా వింటే వాళ్ళ మాటలు వినిపిస్తాయి. నేను శ్రద్ధగానే వింటున్నాను.


"నీ గురించి ఆలోచిస్తూ ఈ రోజు లెటర్లో ఎనిమిది తప్పులు రాసి, ఆఫీసర్ చేత ముఖం వాచేలా చీవాట్లు తిన్నాను''
"నన్ను క్షమించు మదన్! నీ ఆలోచనల్లోకి రావడం నాదే తప్పు''
"అలాగానకు కాత్యా! ఆఫీసర్ నన్ను తిట్టినా బాధలేదు. కానీ నువ్వు మాత్రం నా ఆలోచనల్లోకి వస్తూనే వుండాలి.''
"నేనంటే నీకుందుకీ ఆకర్షణ?''
"నువ్వంటే ఎవరైనా ఆకర్షించబడతారు. ఆ ఆకర్షణ సహజమే! నన్ను నువ్వామోదించడమే నా అదృష్టం''


వాళ్ళిద్దరూ ఎన్నో ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నారు. అవి వింటూంటే ఏదో నవలలో చదివినట్లూ, సినిమాలో చూసినట్లూ అనిపిస్తోంది. వినడానికి నాకెంతో ఆసక్తికరంగా ఉన్నాయి. నే నుత్సాహంగా వింటున్నాను ... మధ్యలో నా ప్రసక్తి వచ్చేవరకూ!.
"అయితే నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా?'' అన్నాడు వాడు.


"ఆ సందేహ మెందుకొచ్చింది నీకు?'' కాత్యాయని కంఠంలో ఆశ్చర్యం ధ్వనించింది.
"ఎవరో సుధాకర్ నీకు బావ వరుస అవుతాడనీ అతడు నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడనీ రెండు మూడుసార్లు చెప్పావు గదా! నువ్వు చెప్పాక ఆ సుధాకర్ ని చూసి వచ్చాను. అతగాడు అందంలో పర్సనాలిటీలో, డబ్బులో అన్నింట్లోనూ నన్ను మించిన వాడు. అతన్ని కాదని నన్ను చేసుకుంటావా?''


నా ఛాతీ ఉబ్బింది. ఆ యువకుడిపై కాస్త గౌరవభావం కూడా కలిగింది.
కాత్యాయని నవ్వుతూ మాట్లాడినట్లుంది "ఆ సుధాకర్ కథ చెప్పనా నీకు?'' అందామె.
"ఊ ...''


"అతగాడికి వయసులో వున్న ఆడపిల్లతో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. నాకు సులోచనారాణి నవలల్లోలాంటి హీరో అంటే ఇష్టమన్నాను. ఓ నెల్లాళ్ళపాటు నన్ను కూడా మర్చిపొయి ఆ నవలలు చదివాడు. ఆ నెల్లాళ్ళలో ఒక్కసారి కూడా నన్ను తల్చుకోలేదు సరికదా తన ఏకాగ్రత గురించి చెప్పుకున్నాడు.
"తర్వాత అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టమన్నాను. రెండు నెలలు కనబడడం మానేశాడు. ఆ రెండు నెలల్లోనూ నాలుగు బచ్చన్ సినిమాలు కూడా చూసి వచ్చి నన్ను ఒక్కసారి తల్చుకోలేదు.''


"ఆ తర్వార నేనే విసిగిపోయి ఓ మూడు నెలలు కనపడవద్దన్నాను. 'ఓస్ అంతేగదా' అన్నాడు తప్పితే ఏమాత్రం బాధ వ్యక్తం చేయలేదు. నోరు విడిచి అడిగినా కూడా 'బాధెందుకు?' అన్నాడు తప్పితే ఏమాత్రం ఆకర్షణ వ్యక్తం చేయలేదు''
"మూడుసార్లు కలుసుకున్నాం మరదలై నందుకయినా చనువుగా నువ్వని పిలవొచ్చు. మీరేనే మన్నించాడు. ఒక్క ప్రేమ కబురు లేదు ... పెళ్ళికి ఒప్పుకుంటావా అన్న ప్రశ్న తప్ప! రెండ్రోజుల పరిచయంలోనే మనం దగ్గరైపోయాము. ఒక్కరోజు చూడకపోతే వుండ్లేక పోతున్నాను. నీలాంటి డ్నోదిలి ఆ మొద్దును నేనెలా ప్రమిస్తాను? ఎలా పెళ్ళి చేసుకుంటాను?'' అంది కాత్యాయని.


నాకు తల తిరిగినట్లయింది.
"మూడు నెలలైపోయాయా?''
"ఏమో! నాకు గుర్తులేదు. అయిపోగానే అతడే ఠంచనుగా వచ్చి గుర్తుచేస్తాడులే. ఈసారి ఇంకో నాలుగు నెలలు కనపడొద్దని చెప్పానంటే అయిపోతుంది'' అంది కాత్యాయని.
ఇద్దరూ పకపకా నవ్వుకున్నారు. కిలకిలా నవ్వుకున్నారు. హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
నేనింక అక్కడ ఉండలేకపోయాను. వెంటనే లేచి ఇంటికి వెళ్ళిపోయాను.
ఆ రాత్రంతా ఏదోలా ఉన్నాను.


అయితే ఒక్క రోజులో నేను సర్ధుకోగలిగాను. కాత్యాయని పరిచయం ఒక విధంగా నాకు మేలే అనిపించింది. ప్రతిదీ స్పోర్టివ్ గా తీసుకోవడం నాకు అలవాటు. కాత్యాయని, మదన్ ల సంభాషణ వినడంవల్ల ఆడపిల్ల మగవాడినుంచి ఏం కోరుకుంటుందో, మగవాడు ప్రేమ కబుర్లు ఎలా చెప్పాలో నాకు తెలిసింది.


అలా నేను చెప్పగలనా అన్నది వేరే సంగతి.
నా మిత్రులు నన్ను కాత్యాయని గురించి అడిగారు. విషయం చెప్పకుండా దాచేస్తున్నాను.
అయితే నే నూహించిన సంఘటన ఒకటి జరిగింది. వూళ్ళోనే నాకో పెళ్ళి సంబంధం వచ్చింది. తల్లిదండ్రుల కొక్కర్తే కూతురు. వాళ్ళు మరీ ఉన్నవారు కాదు. కానీ సంప్రదాయమైన కుటుంబం. అమ్మాయి బియ్యే చదువుతోంది. పేరు రూప.
ఆశ్చర్యమేమిటంటే రూప మదన్ చెల్లెలు.


నా మిత్రులు అన్నట్లుగానే తల్లిదండ్రులు కుదిర్చిన రూపను పెళ్ళి చేసుకున్నాను. రూపవంటి సౌందర్యవతి నా భార్య కావడం అదృష్టమే. కానీ మిత్రుల సవాల్ కు నిలువలేకపోయానన్న బాధ నా మనసులో కొంత వెలితిని సృష్టించింది.
తొలిరాత్రి రూప దగ్గర నా సందేహం బయటపెట్టకుండా ఉండలేకపోయాను. "నువ్వు నిజంగా నేనంటే ఇష్టపడుతున్నావా?'' అని అడిగేశాను.


"ఇష్టమేమిటి? నా పట్టుదల మీదనే ఈ పెళ్ళి జరిగింది'' అంది రూప.
"అదెలా?'' అన్నాను ఆశ్చర్యంగా.
"అన్నయ్య కాత్యాయిని అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి మీ గురించి ఏం చెప్పిందో చెప్పి ఒక రోజు వేళాకోళం చేసాడు. మీ లక్షణాలు నాకు చాలా నచ్చాయి. ఆ విషయం అమ్మకు చెబితే అమ్మా నాన్నలిద్దరూ చర్చించుకున్నారు. వాళ్ళకీ మీ లక్షణాలు నచ్చాయి'' అంది రూప.


"కానీ నువ్వు నాతో సుఖపడగలననుకుంటున్నావా?'' అన్నాను అనుమానంగా.
"కాత్యాయిని తెలివితక్కువది. ఈ రోజుల్లో ఏ ఆడపిల్లయినా భర్తగా కోరుకునేది మీలాంటి వాళ్ళనే! కాస్త ఆలస్యంగానైనా ఏ ఆడపిళ్ళైనా తెలుసుకునేది ఈ విశేషమే!'' అంది రూప.
నాకు చాలా సంతోషం కలిగింది. అప్పుడే మరో విషయం గ్రహించాను.ఒక ఆడపిల్ల అందులోనూ నాకు మరదలు వరుస కాని పిల్ల ... నన్ను కావాలని ఏరి కోరి చేసుకుంది. మరి నేను చేతకాని వాడినా?


నేను చేతకాని వాడిని కావడమే రూప ఆశయమా!
ఆమె ఆశయం ఏదైనా మిత్రులు చేసిన సవాల్లో నేను నెగ్గానా, ఓడానా అన్న విషయానికి నాకు జవాబు స్ఫురించడం లేదు.