TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
సెల్లు సొల్లు
రచన - మల్లిక్
విశ్వనాధంకి ఎంతో ఆనందంగా ఉంది ఆ రోజు.
"బుజ్జిముండ!... ఎంత ముద్దొచ్చేస్తుందో?" అనుకున్నాడు...
అలా అని ఆ రోజు... అప్పటికి వందసార్లు అనుకున్నాడు.
అంత ముద్దొచ్చే బుజ్జిముండ ఎవరు? అతని భార్య?...
ఛఛ... కాదు!
అయితే డెఫెనెట్ గా ప్రియురాలే!...
ఉహు... అస్సలు కాదు.
కొంపదీసి పెంపుడు కుక్కపిల్లా?...
అబ్బే!... అదీ కాదు.
మరి అంత ముద్దొచ్చేది ఏమై ఉంటుందబ్బా అని బుర్ర గోక్కుంటున్నారా?బాధపడకండి... చెప్పేస్తున్నా!...
ఆ బుజ్జిముండ అతని అరచేతిలో నల్లగా మెరుస్తుంది!
కొత్త సెల్ ఫోన్... నల్లటి రంగులో మెరిసిపోతుంది!
సెల్ ఫోన్ కాదు... సెల్ ఫోన్ కనెక్షన్ కూడా కొత్తదే!... కొత్త కనెక్షన్ అనే కాదు... అదే మొదటిసారి సెల్ ఫోన్ కనెక్షన్ తీస్కోడం కూడా.
అసలు విశ్వనాధానికి సెల్ ఫోన్ కనెక్షన్ తీస్కోడంలో పెద్ద ఇంటరెస్ట్ లేదు...
"ఆ... నేనేమైనా పెద్ద బిజినెస్ మాగ్నెట్ నా... నాకెందుకూ సెల్ ఫోన్... నేను ఇంట్లో ఉన్న లాండ్ ఫోనే సరిగా ఉపయోగించను..." అనుకునేవాడు.
భార్య సత్యవతి మీరుకూడా సెల్ ఫోన్ తీసుకోండీ అని ఎన్నిసార్లు చెప్పినా పై కారణాల వల్ల అతను వినిపించుకోలేదు.
కానీ... ఈ మధ్య విశ్వనాధానికి కొన్ని అవమానాలు జరిగాయ్... దాంతో అతను సెల్ ఫోన్ ని తీస్కోక తప్పలేదు...
ఒకసారి...
బాత్రూమ్ లో టైల్స్ కాస్త పగిలితే ఓ మేస్త్రిని పిలిచాడు విశ్వనాధం.
పగిలిన టైల్స్ తీసేసి కొత్త టైల్స్ వెయ్యడానికి రెండొందలు అడిగాడు మేస్ర్తీ. కొత్తటైల్స్, సిమెంట్ ఖర్చూ విశ్వనధందే.
"అమ్మో అంతా?..." అన్నాడు విశ్వనాధం.
మేస్ర్తీ ఓసారి విశ్వనాధం వంక సీరియస్ గా చూసి మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోసాగాడు.
పెళ్ళంపోతే మరోదాన్ని ఈజీగా చేస్కోవచ్చు... అదే మేస్త్రి వెళ్లిపోతే మరో మేస్త్రిని వెతికి పట్టుకోడం ఎంత కష్టం... అందుకే చెంగున ఎగిరి మేస్త్రి ముందుకి గెంతి రెండు చేతులూ బార్లా చాపి అడ్డంగా నిలుచున్నాడు.
"నేను వెళ్లనివ్వనుగా!!" చిలిపిగా నవ్వుతూ అన్నాడు విశ్వనాధం!!
మేస్త్రితో అలా నవ్వకుండా సీరియస్ గా మాట్లాడ్తే వాడు ఫీలయిపోయి వెళ్లిపోతే ఎంతకష్టం?...
"మరి రెండొందలు ఇస్తావా?" మేస్త్రిమాత్రం సీరియస్ గానే అడిగాడు.
"ఓ... అలాగే... నీ ఇష్టం..." సర్దాగా నవ్వేస్తూ అన్నాడు విశ్వనాధం.
"పని ఈ రోజే మొదలెట్టేస్తాను... టైల్స్ షాపు తెరిచాడో లేదో ఫోన్ చేసి కనుక్కుంటా..." అన్నాడు మేస్ర్తీ.
"అదిగో... ఆ మూలనున్న టీపాయ్ మీద ఫోనుంది... చెయ్యి!" అన్నాడు విశ్వనాధం.
"అదెందుకు?" అని జేబులోంచి సెల్ ఫోన్ తీసి ఓ నెంబర్ కొట్టి టైల్స్ షాపు వానితో మాట్లాడాడు.
విశ్వనాధం తెల్లబోయి చూశాడు. సత్యవతి మాత్రం విశ్వనాధాన్ని కొరకొరా చూసింది.
తర్వాత సెల్ నుండి మరో నెంబర్ కొట్టి "రేయ్ వెంకటేసు... ఇక్కడ కాలనీలో నూట పదకుండు ఇంట్లో పని ఉంది... వెంటనే రా..." అని చెప్పి సెల్ ఆఫ్ చేసి "నా అసిస్టెంట్ ని రమ్మని చెప్పా" అన్నాడు.
ఈసారి విశ్వనాధం మరింత తల్లబోయి చూశాడు... సత్యవతి అతన్ని మరింత కొరకొరా చూసింది.
"నేను సిమెంట్,ఇసుక,టైల్స్ తెచ్చుకుంటా... డబ్బులివ్వు!" అన్నాడు మేస్త్రి చెయ్యి చాపుతూ.
విశ్వనాధం మేస్త్రికి డబ్బులు ఇచ్చి పంపించాడు.
"చూడు...ఏబ్రాసి మోహమూ మీరూనూ...వాడికే కాదు... వాడి అసిస్టెంటుకి కూడా సెల్ ఫోన్ ఉంది!!..." అంటూ అతనికి జల్లకాయ్ కొట్టింది.
విశ్వనాధం కృంగిపోయాడు...
మరోసారి...
బజార్లో వెళ్తుండగా విశ్వనాధానికి సత్యవతితో మాట్లాడాల్సి వచ్చింది... కూరగాయలు ఏమైనా తేవాలా... ఒకవేళ తేవాలంటే ఏ కూరగాయలు తేవాలి?... అని సత్యవతిని అడగాలి.
విశ్వనాధం ఒక కిరాణాషాపుకి వెళ్లి"బాబూ... ఓసారి ఫోన్ చేస్కోవచ్చా?..." అని అడిగాడు.
షాపువాడు విశ్వనాధం వైపు చూడకుండానే "కుదర్దు...ఫోన్ చెడి పోయింది..." అని చెప్పాడు.
విశ్వనాధం వెనక్కి తిరిగాడు.
అప్పుడే షాపులోని ఫోన్ మోగింది... షాపువాడు రిసీవర్ ఎత్తి ఫోన్ లో మాట్లాడసాగాడు.
అంటే ఫోన్ పనిచేస్తున్నా షాపువాడు అబద్ధం చెప్పాడన్నమాట!!
ఒరేయ్... నువ్వు నాశనం అయిపోతావురోరేయ్ అని మనసులో అనుకుంటూ వేరే షాపు దగ్గరికెళ్లి వాడినీ అడిగాడు.
"బాబూ... ఓసారి ఫోన్ చేస్కోనా"
"ఉహు!... కుదర్దు!!" అన్నాడు షాపువాడు మొహం చిట్లించి.
"ఏం?... ఇది కూడా చెడిపోయిందా?"
"లేదు... బాగానే ఉంది... అయినా నేనివ్వను! పోవయ్యా ఫో... పనీ పాటు లేకుండా..." అంటూ ఛీదరించి కొట్టాడు... బిచ్చగాడిని ఛీదరించి కొట్టినట్టు.
దెబ్బకి విశ్వనాధం ఇంటికెళ్లి మంచంమీద బోర్లాధబేలుమని పడి... తలగడలో మొహం దాచుకుని భోరుమని ఏడ్చాడు.
రెండ్రోజుల తర్వాత మరో ఘోరమైన సంఘటన జరిగింది.
విశ్వనాధం పుట్ పాత్ మీది నుండి వెళ్తుంటే ఓ బిచ్చగాడు అతనికి ఎదురుపడి "బాబూ... ధర్మం చెయ్యండి... మీకు పుణ్యం వస్తది." అని బొచ్చెని మొహం మీద పెట్టాడు.
"పోరా ఫో... దున్నపోతులా ఉన్నావ్... ఏదైనా పనిచేస్కోలేవు?..." అని వాడిని కసిరికొట్టాడు.
వెంటనే ఆ బిచ్చగాడు ప్యాంటు జేబులోంచి ఓ సెల్ ఫోన్ తీసి ఏదో నెంబర్ నొక్కి"ఒరేయ్ ఓబులేసూ... ఆ వైపుగా గళ్లషర్టూ నల్లప్యాంటూ వేస్కుని ఓ దరిద్రుడు వస్తున్నాడు... ఆడిని అడక్కు... వేస్టు నాయాలు" అని చెప్పాడు.
విశ్వనాధం నవనాడులూ కృంగిపోయాయ్...ఆఖరికి బిచ్చగాడికి కూడా సెల్ ఫోన్ ఉందిగానీ తనకి సెల్ ఫోన్ లేదు...
సత్యవతి కూడా ఈ మధ్య రోజూ విశ్వనాధంతో పోరు పెడ్తూంది ఫలానావాళ్లు యింటికి ఫోన్ చేస్తే మీరు లేరని చెప్తే వాళ్లు మీ సెల్ నెంబర్ అడిగారు... మీకు సెల్ ఫోన్ లేదని చెప్పడానికి నాకెంత అవమానంగా ఉందో... అని.
ఇంక తప్పదని విశ్వనాధం సెల్ ఫోన్ తీస్కున్నాడు. తెల్సిన వాళ్లందరికీ ఫోన్ చేసి తన సెల్ నెంబర్ చెప్పాడు.
"టింగ్ టింగ్ టింగ్ టింగూ...టింగూ..." మంచి రింగ్ టోన్ తో సెల్ మోగితే ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు విశ్వనాధం.
బటన్ నొక్కి"హలో" అన్నాడు.
"హలో...ఎవరు?...అప్పల్రాజేనా?" అవతలి కంఠం అడిగింది.
ఏంటీ?... సెల్ కి కూడా రాంగ్ నెంబర్లు వస్తాయా?...అని ఆశ్చర్యపోతూ "రాంగ్ నెంబర్" అని చెప్పేలోగానే వంటగదిలోంచి సత్యవతి రయ్యిన పరిగెత్తుకు వచ్చి "మా చెల్లెలేనా?..." అంటూ విశ్వనాధం చేతిలోని సెల్ ఫోన్ ని చటుక్కున లాక్కుని.
"ఏంటే.. ఎలా ఉన్నావ్?... నువ్వు పంపిన పేలమందు బాగానే పని చేసింది... ఇప్పుడుద్ నా తలలోని పేలు పోయాయి గానీ మీ బావగారి తలకి బాగా ఎక్కాయ్... హిహిహి...అంది.
"అక్కడ లైన్లో ఉన్నది ఎవడో గన్నాయ్... మీ చెల్లెలు కాదు!!" అని విశ్వనాధం ఆమె చేతిలోని సెల్ ఫోన్ ని లాక్కుని "రాంగ్ నెంబర్" అని ఫోన్ లో అరిచి డిస్కనెక్ట్ చేసేశాడు.
"రాంగ్ నెంబరైతే పోనీలే... నేనే మా చెల్లెలికి ఫోన్ చేస్తాను!"
"పేల గురించి మాట్లాడడానికా?... పళ్లు కొరుకుతూ అన్నాడు విశ్వనాధం.
"ఉహు... కాదు!... అమెరికా ఆర్ధికవ్యవస్థ గురించి మాట్లాడడానికి!..." అని విశ్వనధంకి జల్లకాయ్ కొట్టి అతని సెల్ ఫోన్ లాక్కుని బెంగుళూరులోని చెల్లెలికి ఫోన్ చేసి గంటన్నర మాట్లాడింది... తను ఫాలో అయ్యే సీరియల్స్ కధల గురించి విశ్లేషిస్తూ...
విశ్వనాధం గోడకేసి తల బాదుకుంటూనే ఉన్నాడు ఆ గంటన్నర సేపు.
ఫోన్ డిస్కనెక్ట్ చేసిన సత్యవతి విశ్వనాధం వంక చాలా ఆశ్చర్యంగా చూసింది.
"అదేంటీ... ఇందాక మీ తలకాయ్ పీచుతీసిన కొబ్బరికాయ సైజులో ఉంది... ఇప్పుడేమో ఏకంగా కొబ్బరి బొండం సైజులో ఉంది?" అని అడిగింది.
విశ్వనాధం రెండు చేతుల్తో తల పట్టుకుని బేర్ మన్నాడు.
ఆఫీసులో కూడా తోటి క్లర్కు సుబ్బారావ్ విశ్వనాధాన్ని రోజూ పీక్కు తినసాగాడు సెల్ ఫోన్ లో మాట్లాడడం కోసం.
మా యింటికి అర్జంటుగా మాట్లాడాలోయ్... బాస్ క్యాబిన్ లో కెళ్లి ఫోన్ చేస్కోడం కుదుర్డు కదా మరి?... అంటూ ఒకరోజు... మా అత్తగారికి ఒంట్లో బాలేదోయ్... ఎలా ఉందో కనుక్కోవాలి అని ఇంకోరోజూ... మా ఫ్రెండుకి విరోచనాలు అవుతున్నాయట!... పాపం తగ్గిందో లేదో కనుక్కోవాలి అని మరో రోజూ ... ఇలా ప్రతిరోజూ ఏదో కారణం చెప్పి విశ్వనాధం సెల్ ఫోన్ ని విరివిగా వాడడం మొదలుబెట్టాడు సుబ్బారావ్.
నెల తిరిగేసరికి విశ్వనాధం సెల్ ఫోన్ బిల్లు నాలుగువేలు వచ్చింది.
విశ్వనాధం బేర్ ర్... మన్నాడు.
ఇదిలా ఉంటే సెల్ ఫోన్ వల్ల డిస్టర్బెన్స్ కూడా బాగా ఎక్కువ పోయింది.
ఇది వరకు ఆఫీసు నుండి విశ్వనాధం ఇంటికొచ్చేదాకా అతనితో మాట్లాడడానికి సత్యవతికి వీలుండేది కాదు... ఇప్పుడు విశ్వనాధం దగ్గర సెల్ ఉండడం వల్ల ఆమె అతనికి చీటికీ మాటికీ పోన్ చెయ్యసాగింది."ఆఫీసులో కాఫీ తాగారా?... లంచ్ చేశారా?... సాయంత్రం వచ్చేప్పుడు కూరగాయలు తెస్తారా?..." అంటూ.
దానివల్ల లాండ్ ఫోన్ బిల్లు కూడా ఎక్కువ రాసాగింది.
అంతేకాదు... ఓసారి బాస్ తో మీటింగ్ లో ఉండగా సత్యవతి నాలుగైదు సార్లు విశ్వనాధంకి ఫోన్ చేసింది.
"నీ సెల్ ఫోన్ ఆఫ్ చేస్తావా లేకపోతే నిన్ను మారుమూల అడవుల్లోకి ట్రాన్స్ ఫర్ చెయ్యనా?" అని బాస్ రంకె వేశాడు.
ఓ ప్రక్క సత్యవతితో కూడా చీవాట్లు తినడం మొదలుపెట్టాడు. "ఏం?... సెల్ ఆఫ్ చేసి పెట్టారేం?... నాకేదైనా అర్జంట్ పని తగిల్తే ఎలా?... నాకు జరగరానిది జరిగితేకూడా అంతేనన్నమాట! మీ మొహం మండా..." అంటూ అతను సెల్ ఆఫ్ చేసినప్పుడల్లా సత్యవతి తిట్టేది.
ఓసారి సినిమా చూస్తున్నప్పుడు సెల్ మోగితే విశ్వనాధం తీసి మాట్లాడాడు..."బావగారూ... మీ పేలు తగ్గాయా?...." అంటూ అవతలినుండి మరదలి గొంతు!"
"ఈ..." అంటూ బాధగా అరిచాడు విశ్వనాధం.
వెంటనే వెనకలైనులోంచి నాలుగు చేతులు విశ్వనాధం బుర్రకాయ్ మీద ఠపా...ఠపామంటూ మొట్టాయ్.
"ఏం సార్... మేం సినిమా చూడొద్దా... మీ సెల్ ఆఫ్ చేస్తారా లేదా బయటికి విసిరెయ్యమా?..." అంటూ ఛడామడా తిట్టారు...
ఇలాంటి ఇబ్బందులు కూడా అతను సెల్ ఫోన్ వల్ల ఫేస్ చేశాడు.
రాను రానూ అతని ఫ్రెండ్స్ "అరే...ఏంటీ?... నీ సెల్ ఫోన్ కి కెమెరా లేదా?... ఛా... అదేంటీ... యాక్... సెల్ ఫోన్ కి కెమెరా లేకపోతే అది చాలా బీసీ నాటి సెల్ అయి ఉంటుంది!" అంటూ అతని సెల్ ఫోన్ గురించి చీప్ గా మాట్లాడడం మొదలుపెట్టారు.
వాళ్లందరి బాధ పడలేక కెమెరా ఉన్న సెల్ ఫోన్ ఎనిమిది వేలు పెట్టి కొన్నాడు.
కానీ... ఆ కెమెరాని అతను ఏనాడూ ఉపయోగించిన పాపాన పోలేదు... ఒకవేళ దాంతో ఫోటోలు తీసినా ఏం జాంబవంతుడిలానో... ఆ లంఖిణిలానో వస్తున్నాయ్ ఫోటోలు.
ఇంకొన్నాళ్లు గడిచాక అతని ఫ్రెండ్స్ అతని సెల్ ఫోన్ ని చూసి"ఛీ...యాక్" అన్నారు.
"మళ్లీ ఏం వచ్చింది... దీనికి కెమెరా ఉందిగా?" అన్నాడు విశ్వనాధం...
"కానీ...దీంట్లో ఎఫ్.యమ్. రేడియోలు రావుగా?... యాక్... థూ..." అన్నారు.
విశ్వనాధం భోరుమని ఏడ్చాడు.