TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
అర్జునుడూ - అనసూయమ్మా
- వసుంధర
అంట్లు తోమడమన్నది లక్ష్మీ వంశానికి కొత్తకాదు. లక్ష్మీ కొత్తకాదు, కానీ పెళ్ళయినాక అంట్లు తోమవలసిన అవసరం లక్ష్మీకి రాలేదు. అయెం మొగుడు రిక్షా లాగి బాగా సంపాదించేవాడు.
అయితే ఒకసారి ఆమె మొగుడికి హఠాత్తుగా జబ్బు చేసింది. అప్పుడు లక్ష్మికి ఒక రింట్లో పని మనిషిగా కుదరాల్సిన అవసరం ఏర్పడింది.
ఇదివరలో ఆమె కేవలం తన తల్లికి సహాకురాలిగా మాత్రమే పనికి వెడుతూండేది. నిజానికి ఎవరెవరి ఇళ్లలో ఎలా ఎలా మసులుకోవాలో ఆమెకు సరిగ్గా తెలియదు. అందుకే చుక్కమ్మ జట్టులో చేరింది.
లక్ష్మితో కలిపితే చుక్కమ్మ జట్టులోని సభ్యలు పదిమంది అవుతారు. వాళ్ళందరూ కలిసి ఒక కాలనీలోని ఇళ్లను గుత్తకు తీసుకున్నారు. ఆ కాలనీలో చుక్కమ్మ జట్టు సభ్యులు తప్ప మరెవరూ పనిమనుషులుగా చేరడానికి వీలులేదు.
ఆమె నాయకురాలు కావడానికి కారణం చదువు. చుక్కమ్మకు వ్రాయడమూ చదవడమూ కూడా వచ్చు. ఆమెకు పురాణాల్లోని అనేక కథలు కూడా తెలుసు. ఇవన్నీ కాక, తన అనుభవాన్ని నిత్యజీవితావసరాల కుపయోగించుకోవడం ఆమెకు బాగా తెలుసు.
లక్ష్మీ తల్లి గౌరమ్మ, చుక్కమ్మ జర్రులోనే వుంది. ఆమె కారణంగానే లక్ష్మికి చుక్కమ్మ జట్టులో సభ్యత్వం దొరికింది. చుక్కమ్మ జట్టుకిప్పుడు చేతినిండా పని ఉంది. జట్టులో కొత్త సభ్యులు అవసరం లక్ష్మికి అయిదిల్లు దొరికాయి, అన్నీ ఇళ్ళలోనూ పని ఎక్కువగానే ఉంటుంది. నెలకు పదిరూపాయలిస్తారు. టిఫిన్, కాఫీ లిస్తారు. అడపా తడపా అన్నం పెడుతుంటారు. ఏడాది కొకటి రెండుసార్లు పాత చీర లిస్తుంటారు ... లక్ష్మికి బాగానే జరిగిపోతుంది.
లక్ష్మి ఉదయం ఆరుగంటలకు పనిలోకి వెడుతుంది. ఇరవై నిమిషాలకో ఇల్లు చొప్పున చకచకా పనిచేసి ఎనిమిది గంటల ప్రాంతాన ఓసారి ఊపిరి పీల్చుకుంటుంది. ఈ ట్రిప్పులో ఆమె క్రితం రాత్రి తాలూకు అంట్లగిన్నెలు తోముతుంది. మళ్ళీ తొమ్మిది గంటలకు రెండో త్రిప్పు మొదలుపెడుతుంది. ఈ ట్రిప్పులో బట్టలుతకడం, ఇళ్ళూడవడం ఆమె డ్యూటీ. మూడవ ట్రిప్పులో ఆమె మరోసారి అంట్లగిన్నెలు తోముతుంది. మధ్యాహ్నం రెండయ్యేసరికి ఆమెకారోజు పని ముగిసిపోతుంది.
ఈ పద్ధతిలో పనిచేస్తూ లక్ష్మి ఒక మంచి పనిమనిషిగా పేరుకెక్కింది. పని శ్రద్ధగా చేసుకుపోవడమూ, మాతకుమాట జవాబిచ్చే అలవాటు లేకపోవడమూ, తనకు తానై యజమానురాండ్ర నేమీ యాచించక పోవడమూ లక్ష్మి ప్రత్యేకతలు.
అయితే లక్ష్మి తన ప్రత్యేకతలను నిలబెట్టుకోవడానికి కొంచెం ఎక్కువ కష్టపడవలసి వచ్చింది. అందుకు కారణం చుక్కమ్మ సలహాలు. లక్ష్మి యజమానురాండ్రపట్ల మసలవలసిన తీరులో కొన్ని మార్పులు సూచించింది చుక్కమ్మ. ఆ మార్పులు లక్ష్మి తత్వానికి సరిపడ్డవి కాదు.
చుక్కమం లక్ష్మికి మార్పు సూచించడానికి వేరే కారణాలున్నాయి.
లక్ష్మి బాగా పనిచేస్తోందని గ్రహించి చాలామంది తమ ఇంటికి కూడా లక్ష్మినే పంపించావలసిందని అడగ నారంభించారు. చుక్కమ్మ జట్టులో లక్ష్మికి మంచి పేరు రావడంతోపాటు ఇతర సభ్యురాండ్రకి చెడ్డపేరు రాసాగింది. అందుకే చుక్కమ్మ లక్ష్మికి నీతి బోధ చేసింది.
"పని ఎక్కువున్న వారింట్లో అప్పుడపుడోరోజు నాగా పెడుతూండాలి. సుఖం మరిగిన మీదట ఒకరోజు అంట్లు తోముకోవాలన్నా ఇంటి ఇల్లాలికి ఇబ్బంది అనిపిస్తుంది. దాంతో పనిమనిషి అవసరం బాగా కనిపిస్తుంది. ఎక్కువ గిన్నెలు పడ్డప్పుడు కొంచెంగానైనా విసుక్కోవాలి. లేకపోతే ఆ విషయాన్ని ఇంటి ఇల్లాళ్ళు గుర్తించరు. అడపా తడపా పాత చీరో, పాత జాకెట్టో అడుగుతూండాలి. ఇతర యజమానురాండ్రను గురించి రెండు విధాలుగా చేబుతూండాలి.
"ఆవిడకి కక్కూర్తి లేదమ్మా ... తమకేం చేసుకున్నా నాక్కూడా పెడుతుంది'' అని ఒకామె గురించీ, "ఆవిడ మరీ పిసినారి తల్లీ ... చిరిగిపోయిన జాకెట్టు గుద్దయినా ఇవ్వదు'' అని మరో ఆమె గురించీ చెబితే ఈ పనిమనిషి ఇచ్చేవాళ్ళ గురించి అందరివద్దా మంచిగా చేబుతుందనీ ఏమీ ఇవ్వని వాళ్ళను నలుగురివద్దా తీసిపారేస్తుందని విన్న ఇల్లాలి కర్థమవుతుంది. ఇది ఆమె మనస్తత్వం మీద చక్కగా పనిచేయడంతో పనిమనిషికి బహుమతులు లభిస్తాయి. ఎవరైనా ఇల్లాలు అన్యాయంగా దెబ్బలాడబోతే ఊరుకోకూడదు. పెద్దింటి ఆడవాళ్ళు గట్టిగా అరిచి దెబ్బలాడ్డానికి సంకోచిస్తారు'' ... ఇవీ చుక్కమ్మ చెప్పిన కొన్ని నీతులు మాత్రమే.
ఇవి లక్ష్మి మనస్తత్వానికి సరిపడనివి, ఇవికాక లక్ష్మి తత్వానికి సరిపడే మరికొన్ని సూక్తులు కూడా చెప్పింది చుక్కమ్మ. లక్ష్మికున్న అయిదిళ్ళలోనూ ఏ ఇంట్లో ఎలా మసులుకోవాలో వివరించి చెప్పింది చుక్కమ్మ.
కొంచెం కష్టమేననిపించినా నెమ్మదిగా తన ప్రవర్తనను మార్చుకోసాగింది లక్ష్మి. అయినా ఆమెకున్న మంచిపేరు పోలేదు. అలా సుమారు పదినెలలు గడిచిపోయాక ఆ కాలనీకో కొత్త మెంబరోచ్చింది. ఆవిడ పేరు అనసూయ.
అనసూయ కాలేజీలో బియ్యే రెండేళ్లు చదివి పెళ్ళికావడంతో చదువుకు స్వస్తి చెప్పిన బాపతు. సుమారు ఇరవైయేళ్ళ వయసున్నా వయసుకు తగ్గ అనుభవం లేని యువతి పెళ్ళై ఏడాది అయినా భర్తతో కాపురానికి రావడం ఈ కాలనీకే.
అనసూయ తెలివైనది, కాలేజీలో ఆమె చదువులోనే కాక ఆటల్లో కూడా అనేక బహుమతులు గెల్చుకుంది. కానీ కాస్త కలిగినవారి బిడ్డ కావడంవల్లనో ఏమో ఆమె ఎన్నడూ వంటచేసి ఎరుగదు. వంటిల్లన్నా, వంటగిన్నెలన్నా ఆమెకు చచ్చేంత భయం. అందువల్లనే అనసూయతో పాటు ఆమె అమ్మమ్మ కూడా వచ్చింది.
అనసూయ వంట భయం గురించి ఆ కాలనీలోని ఆడవాళ్ళందరూ ఆమె లేని సమయంలో చర్చలు జరిపి ఆనందిస్తూండేవారు.
చుక్కమ్మ జట్టువాళ్ళు అనసూయను 'అనసూయమ్మ' అనేవారు. వచ్చేరాగానే పనిమనిషికోసం తాపత్రయ పడిపోయింది. అనసూయ. చుక్కమ్మ వచ్చి ఆమెతో మాట్లాదేక లక్ష్మికి ఆ ఇల్లు అప్పగించింది.
అనసూయ ఇంట్లో పని చాలా తక్కువ. కానీ ఆ తక్కువ పనికే పనిమనిషి అవసరం చాలా ఎక్కువున్నట్టు ప్రవర్తిస్తుంది అనసూయ. ఆమె లక్ష్మిపట్ల చాలా ఉదారంగా ప్రవర్తిస్తూండేది. లక్ష్మికి అనసూయనుండి తరచుగా బహుమతులు ముడుతూండేవి. అనసూయ ఇంట్లో పని లక్ష్మికి చాలా హాయిగా ఉంటోంది.
వంటింటి విషయం అలాగుంచితే అనసూయ మిగతా విషయాల్లో ప్రజ్ఞగలదనే చెప్పుకోవాలి. ఎంత కష్టమైన కొత్త భాషనైనా ఆమె కృషిచేసి తొందరగా నేర్చుకోగలదు. అల్లిక, కుట్టుపనుల విషయంలో ఆమెది ఆ కాలనీలో అగ్రస్థానమని చెప్పవచ్చు.
ప్రతిరోజూ అనసూయ గురించి లక్ష్మిని వివరాలడిగి తెలుసుకుంటూండేది చుక్కమ్మ. అనసూయ మనస్తత్వాన్ని గురించి ఒక అంచనా వేసుకోడానికి అయిదారు నెలలు పట్టింది చుక్కమ్మకి. ఆ తర్వాత లక్ష్మికి ఓ విలువైన సలహా పారేసింది. ఏ పరిస్థితుల్లో అనసూయ ఇంట్లో నాగా పెట్టవద్దన్నదామె సలహా. చుక్కమ్మ అంత మంచి సలహా ఎందుకు చెప్పిందో లక్ష్మికి బోధపడలేదు.
అనసూయ అమ్మమ్మ ఎంతోకాలం ఉండలేదు. మనుమరాలి బలవంతం మీద ఆవిడ అయిదు నెలలవరకు మాత్రమే ఆమెకు తోడుగా ఉండి, ఆ తర్వాత తన ఊరు వెళ్ళిపోయింది. అంత కాలమూ కూడా చుక్కమ్మ సలహా మేరకు ఒక్కరోజు కూడా పనికి నాగా పెట్టలేదు లక్ష్మి. తన అమ్మమ్మ వెళ్ళిపోయాక అనసూయ లక్ష్మికి మరీమరీ చెప్పింది, 'ఇంటిపని విషయంలో భారమంతా నీదే'నని.
ఒకసారి లక్ష్మికి జ్వరం వచ్చ్జి మూడు రోజులు పనిలోకి రాలేకపోయింది. ఆ మూడు రోజులూ లక్ష్మికి బదులు అనసూయ ఇంటికి చుక్కమ్మ వెళ్ళి పనులు చేసింది. లక్ష్మి తాలూకు మిగతా ఇళ్లకు ఆమె వెళ్ళలేదు. లక్ష్మి పనిలో చేరాక మిగతా ఇల్లాళ్ళు ఆమెమీద విరుచుకుపడ్డారు. నాగాపడ్డ రోజులకు జీతం విరగ్గోస్తామని బెదిరించారు. కాని చుక్కమ్మ దగ్గర శిక్షణపొందిన లక్ష్మి ఘాటుగానే సమాధానమిచ్చింది.
రోజులూ, వారాలూ, నెలలూ గడిచిపోతున్నాయి.
ఒకసారి చుక్కమ్మ స్వగ్రామం వెళ్ళింది. వెళ్ళడం చాలా పెద్ద పనిమీదే వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఆమెకున్న ఎనిమిదిళ్ళలోనూ అయిదింటి బాధ్యత మాత్రం జట్టులో మనుషులకి అప్పగించింది. మూడుల్లు వదిలేసుకుని తను మలేలే తిరిగి వచ్చేదాకా మరెవరినయినా చూసుకోమని నిష్కర్షగా చెప్పింది. లక్ష్మి మాత్రం ఏ పరిస్థితుల్లోనూ అనసూయ ఇంటికి మాత్రం నాగా పెట్టవద్దని మరీమరీ చెప్పింది.
చుక్కమ్మ ఆమె వెళ్ళిన వారంరోజులకి ఆమె నెల రోజులపాటు వదిలేసుకున్న మూడిళ్ళలోనూ ఒక ఇంటి యజమానురాలైన లక్ష్మమ్మగారు హఠాత్తుగా జబ్బు చేసి మంచాన పడింది. ఉన్నఫళంగా పనిమనిషి అవసరమైనదావిడకు.
ఆవిడ ఇంట్లో జనం చాలామంది ఉన్నారు. ఆ జనానికి తగ్గ పనికూడా ఉండి. అంత ఎక్కువపని ఉండడంవల్లనే ఒక నెల రోజులపాటూ ఇంటికి వదులుకుందుకు సిద్ధపడింది చుక్కమ్మ. అయితే ఇప్పటి పరిస్థితిలో ఆవిడకు పనిమనిషి తప్పనిసరికదా. చుక్కమ్మ జట్టులోని మనుషులను బతిమాలవలసి వచ్చింది. కానీ అందరికీ ఎవరి పనులు వారికి ఉన్నాయి. ఎవరూ అంగీకరించలేదు. వేరే మనుషుల్ని చూసుకుందామన్నా అక్కడ దొరకరు. అందుకని ఆవిడా అందరిలోకీ మెత్తనిదైన లక్ష్మిని బాగా బ్రతిమిలాడింది. ఆవిడ పరిస్థితికి లక్ష్మి జాలిహృదయం కరిగిపోయింది. ఆమె బాగా ఆలోచించి సరేనంది.
మహాలక్షమ్మ ఇంట్లో పనులకు ఒప్పుకున్నాక లక్ష్మి మిగతా ఇళ్లలో తన టైములు మార్చుకోవలసి వచ్చింది. అందరితో పాటు అనసూయ ఇంటికీ టైము మారింది.
అనసూయ ఒక పధ్ధతి ప్రకారం మసులుకునే మనిషి. లక్ష్మి టైము మార్చడం ఆమెకు కొంచెం ఇబ్బందే అయింది. కానీ పని అంటే వున్న భయంవల్ల అతికష్టం మీద అందుకు అడ్జస్టు కాగలిగింది. అయితే ఆమె ఇబ్బంది అక్కడితో ఆగలేదు. లక్ష్మి ఒకోపూట నాగా పెట్టడం కూడా ఆరంభించింది.
మహాలక్ష్మమ్మ ఇంట్లో ఉండే పని వత్తిడివల్ల లక్ష్మికి అప్పుడప్పుడు ఒకో ఇంట్లో నాగా పెట్టడం తప్పేదికాదు. మానవత్వం గల మనిషిగా లక్ష్మి మహాలక్ష్మమ్మ గారికి చాలా సేవలు చేసేది. అలా సేవలు చేయడంలో ఆమె చుక్కమం సలహా నతిక్రమించి అడపాతడపా అనసూయ ఇంట్లో నాగాలుపెట్టసాగింది. అనసూయమ్మకు ఏంటో పని ఉండదు కదా ఎలాగో అలా సర్దుకుపోదా అన్న వుద్దేశ్యంతో ఆమె నాగా అవసరం పడినప్పుడల్లా అనసూయ ఇల్లే ఎగరేస్తూ ఉండేది. అలా ఆమె రెండు వారాల్లో నాలుగు నాగాలు పెట్టింది.
ఇది అనసూయకు చాలా ఇబ్బంది కలిగించింది. లక్ష్మి రానప్పుడు ఇంట్లో అంట్లగిన్నెల సంఖ్యా పెరిగిపోతుండేది తప్పితే ఆమె ప్రయత్నించి అంట్లు తోమడమన్నది జరగలేదు.
చుక్కమ్మ మరోవారం రోజులకు వస్తుందనగా మహాలక్ష్మమ్మ గారిని హాస్పిటల్ లో జాయిన్ చేయవలసి వచ్చింది. ఆ సందర్భంలో లక్ష్మి నాలుగైదు రోజులు హాస్పిటల్ లో ఉండి మహాలక్ష్మమ్మ గారికి సహాయపడింది. ఫలితంగా అనసూయ ఇంట్లో అయిదారురోజులు తిరిగి నాగా పడింది.
ఆ నెలలో చివరి రెండు రోజులూ పనిచేశాక ఒకటో తారీఖునాడు లక్ష్మికి జీతం ఇచ్చి "ఈ నెలలో చాలా నాగాలు పెట్టినా పూర్తి జీతం ఇచ్చేస్తున్నాను నీకు. ఎందుకంటే ఈ రోజు నుంచీ నువ్వు మరి పనిలోకి రానవసరం లేదు'' అంది అనసూయ.
లక్ష్మి తెల్లబోయి "అదేంటమ్మా ... అంత కోపం ఏటి ...'' అని సణగబోయింది. కానీ, అనసూయ చాలా సీరియస్ గానే చెప్పింది.
లక్ష్మికి కోపం వచ్చి "చూస్తానుగా నేనుండగా ఇంకో పనిమనిషిని ఎలా పెట్టుకుంటారో'' అంది.
అనసూయ మాట్లాడలేదు కానీ, ఆమె తర్వాత మరో పనిమనిషి కోసం ప్రయత్నించలేదు.
అనసూయ ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన లక్ష్మిలో చాలా ప్రశ్నలు రేగాయి. చుక్కమ్మ రాగానే విషయం చెప్పి "పనంటే అంత భయపడే అనసూయమ్మ హఠాత్తుగా ఇలా ఎందుకు మారిపోయింది?'' అని అడిగింది.
తన సలహాను విననందుకు లక్ష్మిని తీవ్రంగా మందలించేక చుక్కమ్మ చెప్పిన వివరం ఇది. అర్జునుడికి చీకట్లో భోజనం పెట్టవద్దని అశ్వద్ధామ వంటవాడికి ఆజ్ఞాపించేడట. కానీ ఒకసారి భోజనాల సమయంలో దీపాలారిపోయాయట. చీకటిగా ఉన్నప్పటికీ చేత్తో ముద్దా కలిపి మామూలుగా భోజనం చేస్తున్న అర్జునుడికి, అభ్యాసముంటే చీకట్లో అయినా గురితపప్కుండా బాణాలు ప్రయోగించవచ్చునని తోచి ఆ రోజునుంచే చీకట్లో విలువిద్యనభ్యసించడం మొదలుపెట్టి సత్ఫలితాలు సాధించాడట. అలాగే అనసూయమ్మ బద్ధకస్తురాలు కాదు. అన్నిపనుల్లో ఆరితెరినది.
ఎన్నడూ ముట్టుకొని అంట్లగిన్నెలంటే ఆమెకు భయం. అయితే తప్పనిసరై ముట్టుకోవలసి వచ్చేసరికి ... ఇంతేనా అంట్లు తోమడమంటే అని గ్రహించేసింది. దాంతో ఆమెకు పనిమనిషి వృధా అనిపించింది. చుక్కమ్మ కాపాడుకుంటూ వచ్చిన రహస్యాన్ని లక్ష్మి అజాగ్రత్తవల్ల అనసూయ గ్రహించేసింది. అదీ కథ.