TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
అభిమాని
- వసుంధర
రచయితగా నేను మంచి పేరు సంపాదించా ననడానికి నిదర్శనం అన్ని పత్రికలలోనూ నా రచనలు ప్రచురింపబడడమే కాదు దేశం నలుమూలల నుంచీ అభిమానులుత్తరాలు వ్రాయడం!
ఇళ్లకు వచ్చి వెడుతూండే అభిమానులు కొందరున్నారు. వీరిలో కొందరు ప్రముఖులున్నారు. వాళ్ళు నా బోటి వాళ్ళకు సన్మానం చేసి తమ పలుకుబడిని పెంచుకోవాలనుకుంటారు. రచయితగా నేను వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోగలను. అయినప్పటికీ వాళ్ళంటే నాకు ఇష్టమే! వాళ్ళకు నా రచనలంటే ఇష్టం లేకపోవచ్చు. వాళ్ళ అభిమానం నటన కావచ్చు. అయినప్పటికీ నాకు సన్మానం చేశారనో, చేస్తారనో అభిమానముంటుంది. అలా కాకుండా కేవలం నా మీద అభిమానంతో నా యింటికి వచ్చి నాతో సాహిత్య చర్చ చేయాలనుకునే వాళ్ళ మీద మాత్రం నేను కోపం దాచుకోను. ఈ నా స్వభావం కూడా నాకు వన్నె తెస్తుందని కొందరంటూంటే విని నేను గర్వపడ్డాను కూడా. నాకో అభిమాని ఉన్నాడు. అతడి పేరు సూరిబాబు. అతడికి తెలుగు వ్రాయడం, చదవడం వచ్చు. నా రచనలన్నీ తనకి నచ్చుతాయట. అంతవరకూ బాగానే ఉన్నది. కానీ నా సహకారంతో అతడు రచయిత కావాలనుకుంటున్నాడు. అందుకని తను వ్రాసిన కథలు నాకు పంపిస్తూంటాడు.
సినిమా ఫీల్డులో సినీతారల ఉన్నతి వారి సెక్రెటరీలపై ఆధారపడి ఉంటుందంటారు. అదీ కొంతవరకూ నిజమేననిపిస్తుంది. నా యింట్లో శ్రీమతి నాకు సెక్రెటరీగా పని చేస్తూంటుంది. నా దస్తూరీ బాగుండదు. అందుకని నేను వ్రాసే ప్రతి ఉత్తరాన్ని ఆమె ఫెయిర్ చేసి పంపిస్తుంది. కథలకు సంబంధించినంత వరకూ ఆమె నాకు కేవలం అభిప్రాయాలు చెప్పి ఊరుకుంటుంది. ఉత్తరాల విషయంలో మాత్రం తను సెన్సారాఫీసరులా పనిచేస్తుంది. ఆమె అలా చేయడం నాకిష్టముండదు. కానీ ఆమె అనేది ఒక్కటే!
"వాళ్ళంత అభిమానంతో మీకు ఉత్తరాలు రాస్తున్నారు. వాళ్ళు అమాయకులు కావచ్చు, తెలివితక్కువగా వ్రాసి ఉండవచ్చు. కానీ రచయితగా మీ కర్తవ్యం వారిని చిన్నబుచ్చకుండా ఉండడం''
ఈ కారణంగా నా అభిమానుల సమాఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది.
కానీ వారిలో సూరిబాబు అంత రెగ్యులర్ గా నాకుత్తరాలు వ్రాసే వాళ్ళు వేరెవ్వరూ లేరు.
అతడు వారానికొకటి చొప్పున నాకు ఉత్తరం వ్రాస్తాడు. జవాబు ఆలస్యమైతే ప్రేయసి కన్నా ఎక్కువగా గాభరాపడతాడు. అతడు పంపిన కథలు పరమచెత్తగా ఉన్నాయని నేను వ్రాసినా చిన్నబుచ్చుకోడు. నేను కస్తపడి చదివి అభిప్రాయం వెలిబుచ్చినందుకు థాంక్స్ చెబుతాడు.
సూరిబాబు కథలు నాకు తరచుగా వస్తున్నాయి. అవి చదవుతూంటే నాలో అసహ్యం పెచ్చు మీరిపోతోంది. మరీ ప్రాథమిక దశలో ఉంటున్నాయవి. అలాంటి కథలు వ్రాసేవాడు నా అభిమాని అంటే నాకు చిన్నతనంగా కూడా అనిపించేది.
ఓసారి సూరిబాబు నుంచి నాకు ఉత్తరం వచ్చింది. అందులో అతడు సమకాలీన రచయితలందర్నీ పేరుపేరునా సమీక్షించి అందరిలోకి నేనే గొప్పవాడినని తేల్చాడు. ఈ ఉత్తరం నాకు ఏమాత్రం సంతోషానివ్వలేదు సరిగదా చాలా కోపాన్ని కూడా తెప్పించింది.
అతడితో వ్యక్తిగతంగా మాట్లాడ దల్చుకున్నట్లు ఉత్తరం వ్రాసాను. ఉత్తరం అందుకున్న మర్నాడతను మా యింటికి వచ్చాడు.
బియ్యే చదువుతున్న కుర్రాడు. ముఖంలో అమాయకత్వం ఉన్నది. ఎక్కువగా బాధ్యతలున్నట్లు లేవు. మనిషి దర్జాగా ఉన్నాడు.
మిమ్మల్ని కలుసుకోవడం నా అదృష్టం ...'' అన్నాడతను.
శ్రీమతి అతడికి బాగానే మర్యాద చేసింది.
"నేను నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా?'' అడిగాను.
తెలియదన్నట్లు తలూపాడతను.
"నువ్వు రాసిన కథల మీద నా అభిప్రాయం వెలిబుచ్చాను. పంపే ముందు అవి చాలా మంచి కథలనే నువ్వు అభిప్రాయపడ్డావు. అవునా?''
అతడు అవునన్నట్లు తల ఆడించాడు.
"అంటే నీకు మంచి కథలెలాగుంటాయో తెలియదు. నేను ఎత్తి చూపే వరకూ నీ కథల్లోని లోపాలు నీకు తెలియలేదు. నేను ఎత్తి చూపినా ఆ తరువాత నువ్వు రాసే కథల్లో ఆ లోపాలు సవరింపబడడంలేదు. అంటే నీకు లోపాలు తెలుసుకోవడం చేతకాదు. అనగా నువ్వు కథకుడిగా మాత్రమే కాక, విమర్శకుడిగా కూడా పనికిరావు. అవునా?''
అతని ముఖం చిన్నబోయింది. "రచయితలందరిలోకి నువ్వు నన్ను అగ్రస్థానాన కూర్చోబెట్టాలనుకున్నావ్. కానీ రచయితల్లో నా స్థానాన్ని నిర్ణయించే అర్హత నీకు ఉన్నదా? అహంకారం నిన్నిందుకు ప్రోత్సహించింది''
అతడు తడబడుతూ "నా వల్ల పొరపాటు జరిగినట్లుంది నన్ను మీరు మన్నించాలి'' అన్నాడు.
"మన్నించమనడం కాదు. ఇకమీదట ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. నేల విడిచి సాము పనికి రాదు. ముందు నీది అంటూ ఓ మంచి కథ రాయి. ఆపై ఎదుటివారి కథలమీద విమర్శల సంగతి చూడవచ్చు'' అన్నాను.
అతను తల వంచుకున్నాడు.
"ఓ మంచి కథ రాయాలంటే అది ఇప్పట్లో నీ వల్లనయ్యే పనికాదనిపిస్తోంది. అందుక్కారణం నీకు సమగ్రమైన ఆలోచనాశక్తి లేకపోవడం మరి కొన్నాళ్ళ పాటు నావీ, మరికొందరు ప్రముఖులవీ రచనలు చదువుతూండు. ఓ ఏడాది దాకా కథలు రాయకు.''
అన్నింటికీ అతడు తల ఊపాడు. ఏ క్షణంలోనూ తిరగబడాలని చూడలేదు.
అతడు వెళ్ళిపోయాక శ్రీమతి నన్ను దెబ్బలాడింది. అభిమానులతో మాట్లాడవలసిన తీరు అది కాదంది తెలివితేటలు అందరికీ ఆయాచితంగా లభించవు. ఆ మాత్రం దానికే అతడిని నిరసించరాదంది.
"నువ్వు రాజకీయం మాట్లాడుతున్నావు. నాకు రాజకీయాలు నచ్చవు. నా మనసులోని మాట అతడికి చెప్పాను. అతడు నా అభిమానిని. అతడి గురించిన నిజం అతడికి తెలియజేయటం నా కర్తవ్యం.
"మిమ్మల్ని అభిమానించడం అతడు చేసిన తప్పు. ఆ తప్పునతడు ఈ పాటికి గ్రహించే ఉంటాడని ఆశిస్తాను'' అంది శ్రీమతి.
శ్రీమతి అంచనా తప్పయింది. అతడు ఇల్లు చేరాక నాకు మళ్ళీ ఉత్తరం రాశాడు. తన తప్పులకు మరోసారి క్షమార్పణ కోరాడు. తనలోని లోపాన్ని ఎత్తిచూపించినందుకు ధన్యవాదాలర్పించాడు. నా పరిచయం తన అదృష్టమన్నాడు. తన ఉత్తరాలకు ఎప్పటిలాగే బదులివ్వడం మానవద్దన్నాడు.
ఆ ఉత్తరం చదవగానే నాకు మనసేదోలాగైపోయింది. అతడిపట్ల నేను కఠినంగా వ్యవహరిస్తున్నందుకు బాధ కలిగింది. శ్రీమతి అతడి ఉత్తరం చదివి "ఇలాంటి అభిమాని దొరకడం మీ అదృష్టం'' అంది.
"అదృష్టం కాదు. అది నా అర్హత'' అన్నాను.
"మీకు చాలా అహంకారం'' అంది శ్రీమతి.
ఆ తర్వాత సూరిబాబుని మళ్ళీ ప్రత్యక్షంగా కలుసుకుంటాననుకోలేదు. కలుసుకుంటే ఈసారి అతడితో ప్రేమగా మాట్లాడాలని అనుకున్నాను. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలుచునంటారు.
ఆ రోజు 'కోణార్క్' ట్రయిన్లో ఉన్నాను. కాలక్షేపం కోసం ఓ యింగ్లీషు నవల చదువుతున్నాను. ఏ నవలైనా చదివేటప్పుడు నేను కాస్త శ్రద్ధగానే చదువుతాను. నచ్చిన వాక్యాలు పెన్సిల్ తో అండర్ లైన్ చేస్తూంటాను. రచయిత ఏం చెప్పదల్చుకున్నాడూ ఎలా చెబుతున్నాడూ అన్నది చాలా శ్రద్ధగా గమనిస్తాను.
నవల చదవడంలో నా ఆసక్తి గమనించినట్లున్నాడు నా పక్కనున్న ఆసామి. నన్ను పలకరించి "మీకు సాహిత్యాభిలాష ఎక్కువనిపిస్తుంది'' అన్నాడు.
"ఊ...'' అన్నాను అన్యమనస్కంగా.
"ఆంగ్ల సాహిత్యమేనా, తెలుగు సాహిత్యంపై ఆసక్తి ఉన్నదా?''
"ఆంగ్ల సాహిత్యం కంటే తెలుగు సాహిత్యమంటేనే ఇష్టం. తెలుగులో కథలు వ్రాసే సరదా కూడా ఉంది'' అన్నాను నేను రచయితను సుమా అని సూచిస్తూ.
"అయితే ప్రముఖ రచయిత 'నిరంజన్'' తెలుసా మీకు?'' అనడిగాడతను.
హఠాత్తుగా నిరంజన్ ప్రసక్తి రాగానే ఆశ్చర్యపడ్డాను. అది నాకలం పేరు. ఈయన నన్ను గుర్తుపట్టాడా! లేకపోతే అర్థాంతరంగా ఈ ప్రశ్న ఎందుకు?
"ఏం?'' అన్నాను కుతూహలంగా.
"మీరు కలుసుకోవాలనుకుంటే నిరంజన్ ఇప్పుడు ఈ ట్రయిన్లోనే ఉన్నాడు'' అన్నాడు ఆసామి.
ఆ సంగతి నాకూ తెలుసు. ఇతడు నన్ను గుర్తుపట్టాడు. ఏ సభలోనో చూసి ఉంటాడు లేదా పత్రికల్లో ఫోటో చూసి ఉంటాడు. ఆ విషయం చెప్పకుండా తెలివిగా మాట్లాడుతున్నాడు. నేను కూడా తెలియనట్లు అమాయకంగా ముఖంపెట్టి "ఎక్కడండీ?'' అన్నాను. అప్పుడతడు "మీరు రచయితలే కాదు మంచి నటులు కూడా'' అంటాడనుకున్నాను.
కానీ అలా జరగలేదు "పక్కబోగీలో'' అన్నాడు ఆసామీ.
"నిజమా?'' అన్నాను నమ్మలేనట్లు.
"నేనిప్పుడే ఆయన్ని కలిసి వచ్చాను. కావాలంటే మీరూ వెళ్ళి రండి''
"మీ మాటలు నేను నమ్మను'' అన్నాను.
"ఎందుకని?'' అన్నాడతను ఆశ్చర్యంగా.
రచయితగా అతడి కళ్ళలోని ఆశ్చర్యాన్ని చదివాను. అర్థం చేసుకున్నాను. అతడు మోసగాడు కాదు.
నేను పక్క భోగీలోకి వెళ్లాను. కోణార్క్ వెస్టిబ్యూల్ టైపు కావడం నాకు చాలా మంచిదనిపించింది.
"నిరంజన్ గారూ. మీ భగ్నప్రేమికుడు నవలకు ప్రేరణ ఏమిటండీ?'' ఎవరో అడుగుతున్నారు. నన్నే అడిగినట్లు ఉలిక్కిపడి గొంతు సవరించుకునేలోగా సమాధానం వచ్చేసింది. నిరంజన్ మాట్లాడుతున్నాడు. భగ్న ప్రేమికుడు నవలకు ప్రేరణగా నేను ఏయే విశేషాలు చెప్పబోతానో అవే అతడూ చెబుతున్నాడు.
ముందుకు నడిచి అతడెవరా అని చూశాను.
అతడు సూరిబాబు.
అతడికక్కడ శీతలోపచారాలు జరుగుతున్నాయి. అతడి చుట్టూ ఓ అరడజను మంది ఉన్నారు. వారిలో ఓ అమ్మాయి కూడా ఉంది.
వాళ్ళు అడుగుతున్నారు అతడు చెబుతున్నాడు, వాళ్ళతడిని మెచ్చుకుంటున్నారు. నా ఉత్తరాల ద్వారా తను తెలుసుకున్న సమాచారం వాళ్ళకు అందచేసి తాత్కాలికంగా గౌరవం పొందుతున్నాడతను.
ఇదా అతడు నా నుంచి ఆశించిన ప్రయోజనం? ఇదా నా అభిమాని ఆడుతున్న నాటకం?
కొంతమందికి పదిమందిలోనూ గొప్ప వారిగా గుర్తింపబడాలని ఉంటుంది. తమ అర్హత గురించి వారాలోచించరు. సూరిబాబు ఆ కోవకు చెందిన వాడన్న మాట!
సూరిబాబు నన్ను చూడలేదు.
నేను నా ఆవేశాన్నణచుకుని వీలైనంత శాంతంగా "నిరంజన్ గారూ!'' అన్నాను. అతడు చటుక్కున నావైపు తిరిగి చూసి "మీరా?'' అని తడబడ్డాడు. అయితే అతడిలో తడబాటే తప్పితే భయం కనబడడం లేదు.
అతడు చటుక్కున బెర్తుదిగి "ఒక్క క్షణం వీరు నాకు గురుతుల్యులు'' అని "అలా కాస్త ముందుకు వెళ్ళి మాట్లాడుకుందాం పదండి'' అన్నాడు.
అతడంత తాపీగా అలా అంటూంటే నా ఆవేశాన్నదుపు చేసుకోడం నాకు చాలా కష్టమనిపించింది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరనిపించేక ఆగి "ఓ రచయిత పేరును స్వంతం చేసుకున్నంత మాత్రాన నువ్వా రచయితవుకాలేవు. తాత్కాలికంగా నీకు గౌరవం లభించవచ్చు. కానీ ఏదో ఓ రోజున నీ మోసం బయటపడుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా?'' అన్నాను.
"ఇలాంటి విషయాల్లో నేను పూర్తిగా మీ శిష్యుణ్ణి సార్! ఒక రచన చేసేటప్పుడు మీరెంత పకడ్బందీగా ప్లాటు అల్లుతారో ఇల్లాంటి నాటకమాడే ముందు నేను చుట్టుపక్కల వారందర్నీ జాగ్రత్తగా గమనించి పకడ్బందీగా కబుర్లు చెబుతాను'' అన్నాడు.
"కానీ ఇప్పుడేమయింది?'' "నేనిప్పుడు అందరిముందు నిజం చెబితే ఏమౌతుంది?'' అన్నాను.
సూరిబాబు అదోలా నవ్వి "దయచేసి మీరాపని చేయకండి. నేనీనాటకమాడుతున్నది నాకోసం కాదు మీకోసమే'' అన్నాడు.
"నా కోసమా?'' అన్నాను ఆశ్చర్యంగా.
"అవును సార్! నాకు మీరంటే పిచ్చి అభిమానం. అంతా మీగురించి మంచిగా చెప్పుకోవాలని వుంటుంది. కానీ మీ ఇంటికి వచ్చి వెళ్ళాక మీరు కాస్త ఆవేశపరులనిపించింది. ఆ కారణంగా కొందరు మీ గురించి చెడ్డగా చెప్పుకునే అవకాశముంది. మిమ్మల్నెరుగని వారు మీ గురించి మంచిగా చెప్పుకోవాలనే ఉద్దేశ్యంతో ఉడతా భక్తిగా ఈ నాటకమారంభించాను మీరే వెళ్ళి వినండి ... అక్కడివారు మీ గురించి ఏం చెప్పుకుంటున్నారో'' అన్నాడు సూరిబాబు.
నేను ఆశ్చర్యపడ్డాను. అతడు చెప్పేది వింటూంటే నోటమాట రాలేదు. వెనకడుగు వేశాను.
"ఓ కథ రాస్తే చాలు ఓ హేన్రీలా మాట్లాడతారు చాలామంది. ఇలాంటి వినయగుణం గల రచయితనెక్కడా చూడలేదు''
నిరంజన్ గురించి పొగడ్తలు మార్మోగిపోతున్నాయా భోగీలో.
నేను వెళ్ళి నా సీట్లో కూర్చున్నాను. ఇంతకాలం సూరిబాబు అర్హతల గురించి ఆలోచించాను నేను. కానీ అతడి అభిమానం పొందడానికి నా అర్హతలేమిటి?
అర్హతల గురించి మాట్లాడటానికి కూడా అర్హత ఉండాలి. ఈ విషయాన్ని నేను విస్మరించినట్లున్నాను.