TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
దొంగతనాలు బంద్
హైదరాబాద్ లో హఠాత్తుగా దొంగతనాలు ఎక్కువయ్యాయ్. రోజూ ఏదో ఒక ఏరియాలో దొంగతనం జరుగాతూనే ఉంది. పోలిస్ స్టేషనన్లలో వంద కొద్దీ కేసులు నమోదు అవుతున్నాయ్.
ఆ దొంగతనాల గురించి రకరకాల రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి. కొందరేమో మహారాష్ట్ర నుండి ఒక దొంగల ముఠా నగరంలో దిందని అంటే, మరీ కొందరేమో బెంగాల్ నుండి దొంగలు వలస వచ్చారని అన్నారు.
రూమర్ల మాట ఎలా ఉన్నా పోలీసులు మాత్రం దొంగల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు.
కానీ పోలీసులు దొంగల్ని పట్టించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎందుకంటే ...
బాపనయ్య ఇంట్లో దొంగలు పడ్డారు గాబట్టి.
బాపనయ్య అంటే అల్లాటప్పా కాదు. మినిష్టర్ మిన్నారావు బామ్మర్ది.
ఏ అర్దరాత్రి వేళో దొంగలు వచ్చి గప్ చుప్ గా దొంగతనం చేస్కుని పోయారు.
తెల్లారి లేచింతర్వాత గానీ బాపనయ్యకి తెలీదు దొంగలు పడినట్టు. ఏమేం దొంగతనం జరిగాయో లెక్కే చుస్కున్నారు. యాభైవేలు ఖరీదు చేసే నగలు, ఎనిమిదివేల రూపాయల నగదు, ఒక వాచీ, నాలుగైదు పట్టుచీరలు పోయాయి.
బాపనయ్య భార్య నాంచారమ్మ ధన్ ధన్ మంటూ గుండెలు బాదుకుని "వామ్మో ...వామ్మో ..." అంది.
బాపనయ్య నేనేం తక్కవ తిన్లేదు అని ధణేళ్...ధణేళ్ మణి గుండెలు బాదుకుంటూ తన బావగారైన మినిష్టర్ మిన్నారావు దగ్గరికి పరుగు తీశాడు.
" మా ఇల్లు దొచేశారు బా..." అన్నాడు ఘోల్లుమంటూ.
"నా పేరు చెప్పుకొని నువ్వు ఊళ్ళో వాళ్ళని దోచేస్తున్నావని విన్నాన్... అట్టాంటి నిన్నే దోచేశారా?...హ్హహ్హహ్హ.." అన్నాడు మినిష్టర్ మిన్నారావు .
"ఏంటా ఇకిలింపు...ఇంకాపుతారా నాలుగు కాజాలు తినిపించనా?..." అంది మిన్నారావు భార్య అచ్చమాంబ.
మినిష్టర్ మిన్నారావు నవ్వటం మాని బిక్కమొహం వేసి అచ్చమాంబ వైపు చూశాడు.
"అవును గానీ వాడిల్లు దొంగలు దోచుకొని బాధపడ్తుంటే మీరేంటి వాడికి సహాయం చేయడం పోయి హాస్యాలాడుతున్నారు?...ఆ?..." భర్త వంక కోపంగా చూస్తూ అంది అచ్చమాంబ.
"హయ్యో ... సహాయం ఎందుకు చెయ్యనూ... తప్పకుండా చేస్తాను...హిహి...అది నాకానందం కాదా ?..." అన్నాడు మినిష్టర్ మిన్నారావు .
అప్పటికప్పుడే మినిష్టర్ మిన్నారావు పోలీసు ఆఫీసర్లకి ఫోన్ చేసి తన బామ్మర్ది బాపనయ్య ఇంట్లో దొంగతనం గురించి వెంటనే ఇన్వేస్టిగేషన్ మొదలెట్టి దొంగలని పట్టుకొని సొమ్ము వసూలు చేయాలని ఆదేశాలిచ్చాడు. ఈ వార్త పేపర్లోకి ఎక్కింది.
దీన్ని పట్టుకొని ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో గలాభా చేశారు.
"దొంగతనాలవల్ల ఇంతకాలం ప్రజలు బాధపడ్తుంటే ప్రభుత్వం పట్టించుకోలేదు...అటువంటిది ఇప్పుడు బాపనయ్య ఇంట్లో దొంగతనం జరగ్గానే తల్లక్రిందులు అయ్యిపోతున్నారు..యేం! బాపనయ్య మినిష్టర్ మిన్నారావుకు బామ్మర్దనా?" ఓ ప్రతిపక్ష నాయకుడు మైకు విరిచేస్తూ ఆవేశంగా ప్రశ్నించాడు.
"ఏం?...మిన్నారావు బామ్మర్ది ప్రజల్లో ఒకడు కాడా...ఆ?..."అంటూ అధికార పార్టీ యమ్మేల్యే ఒకడు తను కూడా మైకు విరగ్గొట్టి వైరు తెంపి, కసిగా నవ్వాడు.
అధికార పార్టీ సభ్యులంతా బల్లల మీద "ధన ధన ధన" మని చరుస్తూ " షేం...షేం... షేం..."అని అరిచారు.
ఆ దెబ్బకి ఇందాక మైకు విరక్కొట్టిన ప్రతిపక్ష సభ్యుడు కంగారుపడి వంగి తన ఫ్యాంటు జిప్పువంక చూస్కున్నాడు. జిప్పు బాగానే ఉంది.
అధికార సభ్యులంతా ఘోల్లున నవ్వి "మేం అందుకు షేమ్ షేమ్ అన్లేదుగా!..."అన్నారు.
అప్పుడా ప్రతిపక్ష సభ్యుడికి అర్ధం అయింది. వాళ్ళంతా ఎందుకు షేమ్...షేమ్ ... అన్నారో. తను మైకు విరగ్గొడితే అధికార పార్టీ సభ్యుడేమో మైకు విరగ్గొట్టి వైరు కూడా తెంపేశాడు. నిజ్జంగా షేమే...
వెంటనే ఆ ప్రతిపక్ష సభ్యుడు ఆవేశంగా "ఎహెహెహె...హో..." అని గట్టిగా అరిచి ఆంజినీలుసామిలా గాల్లోఒక్క గెంతు గెంతి ఆనక ఇంకో మైకు విరగ్గొట్టి దాని వైరుని ముక్కముక్కలుగా తెంపేశాడు.
దాంతో తిక్కరేగిన అధికారపక్ష సభ్యులు బల్లలు విరక్కొట్టారు.
ప్రతిపక్ష సభ్యులు వాళ్లుకూడా బల్లలు విరక్కొట్టారు.ముఖ్యమంత్రి చిరునవ్వుతో అంతా చూస్తున్నాడు.
"మీరిట్టా చేస్తే నేను వెళ్ళిపోతానంతే....ఆ ..." అన్నాడు స్పీకర్ బుంగమూతి పెడ్తూ.
ఉన్నట్టుండి ఏమైందో ఏమో... ఒక్కసారిగా బూతులు తిట్టుకుంటూ చొక్కాలు చింపుకుంటూ సభ్యులు కొట్టుకోడం మొదలుపెట్టారు. అప్పుడు పోలీసులు రంగంలోకి దూకి వారిని అదుపులో పెట్టారు.
"అసలు మీరంతా ఎందుకు ఇలా కొట్టుకు చస్తున్నారు.?..." అన్నాడు స్పీకర్ సభ్యుల వంకా చూస్తూ.
"ఆ విషయమే ఇందాకట్నుండీ నేనూ అడుగుదామని అనుకుంటున్న..." అన్నాడు చీఫ్ మినిష్టర్ చిరునవ్వులు చిందిస్తూ. ఆయనలా చిరునవ్వులు చిందించడానికి కారణం ఉంది. అధికార పార్టీ సభ్యులకంటే ప్రతిపక్ష సభ్యుల చొక్కాలు ఎక్కువగా చిరిగాయ్. వాళ్ళకి దెబ్బలుకూడా ఎక్కువ తగిలాయ్.
కాస్సేపు సభ్యులంతా మౌనంగా ఉండి ఆలోచించడం మొదలుబెట్టారు.
ఇంతకీ తాము అందరూ ఎందుకు కొట్టుకున్నట్టు?...
మినిష్టర్ మిన్నారావు కిసుక్కున నవ్వాడు.
ఆయన నవ్వడం చూడగానే అందరికీ గుర్తొచ్చింది తామెందుకు బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారో.
"మిన్నారావు బామ్మర్ది ఇంట్లో జరిగిన దొంగతనం గురించి పోలీసులు పట్టించుకోడానికి వీల్లేదు..." అని అరిచాడు ఒక ప్రతిపక్ష సభ్యుడు.
"పోలీసులు పట్టించుకు తీరాలి!...' ప్రతిగా అరిచాడు అధికార పార్టీ సభ్యుడు.
"పట్టించుకోడానికి వీల్లేదు..." ఇంకా గట్టిగా మూడు నాలుగు గొంతులు అరిచాయ్.
"దొంగతనం జరిగితే దొంగని పట్టుకోవద్దంటారేం?" మిన్నారావు విసుగ్గా మొహం పెడ్తూ అన్నాడు.
"ఏం?... దొంగతనం మీ బామ్మర్ది ఒక్కడి ఇంట్లోనే జరిగిందా? ఊళ్ళో అందరిళ్ళలోనూ జరగడంలేదా?..." ఒక ప్రతిపక్ష సభ్యుడు ప్రశ్నించాడు.
"దొంగతనం జరిగిన వాళ్ళు అధికార పార్టీలోని వాళ్ళకి ఎవరికో ఒకరికి బామ్మర్ది అవుతేనే పోలీసులు పట్టించుకుంటారు సార్..." మరో ప్రతిపక్ష సభ్యుడు కామెంట్ చేశాడు.
ఆ కామెంట్ కి ప్రతిపక్ష సభ్యులంతా ఘొల్లున నవ్వారు.
వాళ్ళలా నవ్వుతుంటే ఊర్కే కూర్చుంటే బాగుండదని అధికార పార్టీ సభ్యులు బల్లలు గుద్దుతూ "షేమ్ షేమ్..." అంటూ అరిచారు.
దాంతో రెండు పక్షాలకి సంబంధించిన సభ్యులూ మళ్ళీ వాగ్వివాదానికి దారి తీశారు.
"ఇట్టగయితే నేనెళ్ళిపోతానంతే...." అంటూ బుంగమూతి పెట్టాడు స్పీకర్.
"ఇకముందు ఎవరింట్లో దొంగతనం జరిగినా మా పార్టీ సభ్యుల బామ్మర్దుల ఇళ్లలో దొంగతనం జరిగినట్టుగా ఫీలయి పోలీసులు దొంగల్ని పట్టుకుని సొమ్ములు అప్పచెప్పేలా చేస్తామని హామీ ఇస్తున్నాను. అంతేకాదు... ఒక ముందు దొంగతనాలు జరక్కుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయిస్తాం..." అంటూ హామీ ఇచ్చాడు ముఖ్యమంత్రి.
ఆరోజు అసెంబ్లీ సెషన్స్ ముగిశాక ముఖ్యమంత్రి పోలీసు కమీషనర్ ని పిలిచి నగరంలోని దొంగతనాల నివారించడం గురించి చర్చించాడు.ఇకముందు దొంగతనాలు జరక్కుండా చూడమని చెప్పాడు.
ఆ మర్నాడు పోలీసు కమీషనర్ సీనియర్ పోలీసు ఆఫీసర్ల మీటింగ్ ఒకటిపెట్టి నగరంలోని దొంగతనాలను నివారించడం గురించి చర్చించాడు.ఈ దొంగతనాలని అరికట్టే బాధ్యత డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ డింభకరావుకి అప్పగించాడు పోలీసు కమీషనర్.
డింభకరావు ఎన్ని చర్యలు తీస్కున్నా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి.
ఒక విషయాన్ని గమనించిన డింభకరావుకి చాలా ఆశ్చర్యం కలిగింది.అదేమిటంటే నగరంలో అన్నిచోట్లా దొంగతనాలు జరుగుతున్నాయ్. కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అస్సలు ఒక్క దొంగతనం జరగలేదు...కారణం ఏమిటి?...
అలా అస్సలు దొంగతనం జరగని ఏరియాలు... మలక్ పేట, సలీమ్ నగర్, ముసారాంబాగ్ ఇంకా కొన్ని ప్రదేశాలు!
డింభకరావు సంగతి తెల్సుకుందామని అతని ఇంటికి దగ్గర్లో ఉన్న మలక్ పేట కాలనీకి వెళ్ళాడు. ఆ కాలనీలోని ఒక ఇంటికి వెళ్ళి ఇంటాయనకి తనని తాను పరిచయం చేస్కున్నాడు డింభకరావు.
"మీ కాలనీలో అస్సలు ఒక దొంగతనం కూడా జరగలేదు... మీ కాలనీ వాళ్ళేమైనా రాత్రిపూట గస్తీ తిరుగుతున్నారా?..." అడిగాడు డింభకరావు ఆ ఇంటాయన్ని.
"లేదే?..." ఆశ్చర్యంగా అన్నాడాయన.
"మరి మీ కాలనీలో ఒక్క దొంగతనంకూడా ఎందుకు జరగలేదు?"
"అదేంటిసార్ అలా అడుగుతారు?... ఇంట్లో అందరూ గాఢంగా నిద్రపోతున్నప్పుడు కదా దొంగలు పడ్తారు. మా కాలనీలో ఒక్కరుకూడా నిద్రపోరుగా... మరి దొంగలెలా పడ్తారు?..."
"ఒక్కడుకూడా నిద్రపోడా?'...అదేం??..." డింభకరావు ఆశ్చర్యంతో తలమునకలవుతూ అడిగాడు.
"ఎలా నిద్రపోతామండీ... మా కాలనీ దగ్గరేగా మూసీనది ఉంది. మూసీనది ఉందంటే చచ్చేన్ని దోమలు ఉంటాయ్ కదా ?... ఎవడికి నిద్ర పట్టిచస్తుంది చెప్పండి.అందుకే మూసీనది ఉన్న ఏరియాల్లో జనాలకి నిద్రపట్టదు,దొంగతనాలు కూడా జరగవు..."
అది వింటూనే డింభకరావు సంతోషంతో కెవ్వున కేకేశాడు.
దొంగతనాలు ఎలా అరికట్టాలో అతనికి తెల్సిపోయింది.
డింభకరావు పరుగునవెళ్లి పోలీసు కమిషనర్ కి విషయం చెప్పాడు. పోలీసు కమీషనర్ సంతోషంతో గుండెలు బాదుకుంటూ ఛీఫ్ మినిష్టర్ దగ్గరికెళ్ళి చెవులు కొరికాడు.
"హమ్మా ...ఇదా సంగతి?" అయితే ఇహనుండి హైదరాదాద్ నగరంలో దొంగతనాలు బంద్ " అన్నాడు చెవులు రుద్దుకుంటూ చీఫ్ మినిష్టర్.
చీఫ్ మినిష్టర్ ఆదేశాలతో పని వెంటనే ప్రారంభం అయ్యింది.
మూసీనది నుండి కాలవలు తీసి హైదరాదాద్ లోని ప్రతి ప్రదేశానికి పారే ఏర్పటు చేస్తున్నారు. డ్రైనేజి నీరు కలిసే ఆ కుళ్ళు నీళ్ళు నగరం మొత్తం పారుతుంటే నగరం మొత్తం దోమలతోనిండి ఒక్కడికీ రాత్రిళ్ళు నిద్రపట్టదు. ఆ విధంగా నగరంలోని దొంగతనాలు అరికట్టవచ్చని ప్రభుత్వం ఆలోచన!...
మల్లిక్