TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
తొలిప్రేమ
ఏయ్ మధు...మధూ...ఇక్కడ....
పరిచయమైన గొంతు...గుండె మూలాల్లో నిండిపోయిన పిలుపది..టక్కున వెనక్కి తిరిగి చూసింది మధు...ఆ మనిషి కోసం కళ్ళు ఆత్రంగా వెతికాయి...ఎక్కడా కనిపించలేదు.
'తాను పొరపాటు పడిందేమో' నిరాశగా అనిపించింది.
అంతలో తలపైన చిన్నగా తట్టినట్టు అనిపించింది. గుండె గొంతుకలోకి రావటమేంటో అనుభవమయ్యింది.
'చందూ'.... ? గిరుక్కున తిరిగింది.
నిజంగానే చందూ! ... చందూ నువ్విక్కడ? ఆనందంతో టక్కున తన చేతిని పట్టుకుంది.
నవ్వుతూ చూస్తున్న చందూ కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. ఇద్దరూ నీరు నిండిన కళ్ళతో ఒకరిని ఒకరు కళ్లల్లో నింపుకుంటున్నారు. ఏదో స్పృహ వచ్చినట్టు నెమ్మదిగా చందూ చెయ్యి వదిలేసింది మధు.
ఒక్కడివే వచ్చావా?
ఆ...Office, work....నువ్వు?....'
నేనూ Office పనిమీదే వచ్చాను.
పద బయటకు వెళుతూ మాట్లాడుకుందాం..అంటూ చందూ ముందుకు నడిచాడు.
మాటలు గడ్డకట్టుకుపోయాయి. ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు. Airportలో లగేజి తీసుకుని బయటకు వచ్చారు.
పక్కనే చేతికందేంత దూరంలో ఒకరికి ఒకరు. కాని ఒకరికి ఒకరు ఏమీ కానంత దూరం ఇద్దరి మధ్యా.
ఒకప్పుడు ఒకరికోసం ఒకరుగా బతికారు... కాలం ఇంద్రజాలంలో ఎవరికి వారైపోయారు.
* * *
నువ్వేం అంటున్నావో నీకు తెలుస్తోందా మధూ...
అన్నీ ఆలోచించే చెబుతున్నా చందూ నువ్వు ఆలోచించు మన జీవితం మనది మాత్రమే కాదు మన వాళ్ళది కూడా అమ్మానాన్న, అక్కా, అన్న వీళ్ళందరిని కాదనుకొని మనిద్దరమే అనుకోవటం ఎంత స్వార్థం చెప్పు? ప్రేమలో స్వార్థం వుండచ్చా?
కాని మధు మన జీవితాలు?
నడుస్తాయి చందూ కాలానికి ఆ మ్యాజిక్ తెలుసు.
ఇంపాజిబుల్ నేను ఒక్క క్షణం కూడా ఆ ఆలోచనని తట్టుకోలేను. ఇక బతకటం?
ఇదే మాట మీ నాన్నగారు కూడా అంటున్నారు తన కొడుకుని వదిలి ఉండలేనని మరి ఆయన ప్రేమకి విలువ లేదా?
ఇలా ఒకరోజు కాదు పదిరోజులు సాగాయి వాదోపవాదనలు ఇద్దరి మధ్యా, దూరమైనా ఒక్కో ప్రేమకథలో ఒక్కో కారణం.. ఉన్నట్టు చందూ నాన్నగారి పట్టుదల వీళ్ళప్రేమకథలో దూరానికి కారణం .
ఆరేళ్ళ ప్రేమ. ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. పార్కుల వెంట తిరుగుతూ, సినిమా హాల్లో కబుర్లు చెబుతూ సాగిన ప్రేమ కాదు వారిద్దరిది. జీవితం, లక్ష్యాలు వాటిని సాధించే మార్గాలు ఆ దశలో ఒకరికి ఒకరు భరోసా, ఒకరికి ఒకరు ఆదర్శం. కలసి చదువుకున్న మంచి మంచి పుస్తకాలు దాచుకున్న పాటల క్యాసెట్లు జీవిత కాలానికి మించిన మంచి అనుభూతులు ఇద్దరి స్వంతం. ఆ ఆరేళ్ళ ప్రేమ జీవితమంతా పరుచుకోకుండానే విడిపోవాలంటోంది. ఇద్దరికీ బాధే కాని 'స్వార్థంతో' ఆలోచించలేక రాజీ పడ్డారు. 'నేను' కాదు 'మేము' ముఖ్యం అనుకున్నారు. వీడ్కోలు చెప్పుకున్నారు.
ఆరోజు ఒక్కసారి చందూని గట్టిగా పట్టుకుని ఆ భరోసాని గుండెల్లో ఓ అనుభూతిగా దాచుకోవాలనుకుంది మధు. చందూకీ అలానే అనిపించింది. కానీ ఇద్దరూ నీరు నిండిన కళ్ళతో చేతులుని వదలలేక వదలుతూ...బై చెప్పుకున్నారు. ఇక ఎవరి జీవితాలు వారివి. ఫ్రెండ్స్ గా కూడా కలవద్దు. తలచుకోవద్దు. హ్యాపీగా ఉండటమే ఒకరికొకరు ఇచ్చుకునే బహుమతి అనుకున్నారు.
"ప్రేమ ఒకింత గర్వంగా, మరికొంత నిస్సహాయంగా వారి వీడ్కోలుని చూస్తూ వుంది".
* * *
ఏ హోటల్?. సాయంత్రం కలుస్తావా? నెమ్మదిగా అడిగాడు చందూ.
కామ్ గా చందూ కళ్ళలోకి చూసింది మధు.
చూస్తాను చందు.
తనమాట పూర్తి కాకుండానే టక్కున మధు చెయ్యి పట్టుకున్నాడు చందూ.
మధూ ప్లీజ్ పన్నెండేళ్ళ తర్వాత కలిసాం. ఇలా ఇప్పుడే మళ్ళీ విడిపోవటం. నీతో చాలా మాట్లాడాలి.
సరే 6'o Clock కి Minerva లో కలుద్దాం. Bye అంటూ గబగబా ముందుకు నడిచేసింది మధు. ఇంకొక్క క్షణం అక్కడ వున్నా చందూని వదిలిరాలేదు.
నిస్సహాయంగా వెళ్ళిపోతున్న మధూనే చూస్తూ నుంచున్నాడు చందూ.
* * *
చందూ...కళ్ళముందు కదులుతుంటే రోజంతా మనసులో ఏదో అలజడి. ప్రేమలోని తియ్యటి అనుభూతి గుండెనిండా నిండుతుంటే..మధుకి ఏదో ఇబ్బందిగా అనిపిస్తోంది. ఏంటి ఇంకా చందూని తను ప్రేమిస్తూనే వుందా. మొదట్లో చందూని చూడటానికి, తనతో కలసి వుండటానికి మనసు ఎంత ఆతృత పడేదో ఇప్పుడూ అదే ఆతృత అదే తియ్యటి ఆనందం. మరి ఇన్నేళ్ళుగా శేఖర్ తో పంచుకున్న ప్రేమ ఉట్టిదేనా..కాదు శేఖర్ తన జీవితంలో ఎంతగా నిండిపోయాడో తనకే తెలుసు. అయినా ఎక్కడో ఏదో మూల 'ప్రేమ' అన్న మాట వినపడగానే కళ్ళముందు చందూ కదలాడుతాడు. అదేంటో? అక్కడ చందూ కూడా అవే ఆలోచనలతో ఆరు ఎప్పుడవుతుందా అని చూస్తున్నాడు.
* * *
చాలా మారిపోయావు మధూ.
లావెక్కాను కదా. ఇద్దరు పిల్లలు నాకిచ్చిన బహుమతి ఇది. నవ్వుతూ అంది.
మరీ కాదులే .కాస్త లావెక్కావు అంతే.
నువ్వు మాత్రం అలానే వున్నావు ఇంకా నీ జిమ్ కంటిన్యూ చేస్తున్నావా?
ఇద్దరూ ఒకరి ఫ్యామిలీ గురించి ఒకరు చెప్పుకున్నారు. Life లో సాధించిన విజయాలు, చేస్తున్న ఉద్యోగం, పిల్లలు, చదువు వారి జీవిత భాగస్వామితో జీవితం ఎంత బావుందో అన్నీ చెప్పుకున్నారు.
ఇవన్నీ పై మాటలే. ఇద్దరి మనస్సులో ఏదో అలజడి. ఇంకేదో అడగాలని, మరింకేదో చెప్పాలని.
ఎలా వున్నావు మధు? నెమ్మదిగా అడిగాడు చందూ.
చర్రున మధు కళ్ళలోకి నీరు పొంగుకొచ్చింది.
"'చందూ... జీవితం ఎప్పుడూ మనకి ఏది మంచిదో అదే చేస్తుంది. మనమే మొండిగా నాకిదే కావాలని పట్టుబడతాం. మనిద్దరి జీవితాలే అందుకు ఉదాహరణ. లైఫ్ ని ఆక్సెప్ట్ చేస్తూ వెళితే ఎప్పుడూ ఆనందంగానే వుంటాం."
"నువ్వేం మారలేదు. ఇప్పటికీ Life ని అదే Positive attitude తో చూస్తున్నావ్. అందుకే నా మధు Something unique అనేసి టక్కున మధువైపు చూసాడు.
మధు నవ్వుతూ ' నీ మధు కాదు. మా.. శేఖర్ మధుని'...శేఖర్ కూడా ఇలాగే అంటాడు.
మూడు గంటలు ఎలా గడిచాయో తెలీదు. కాసేపు కబుర్లు, మరికాసేపు మౌనం.
లేచి బై చెప్పుకుంటుంటే....
మళ్ళీ ఎప్పుడు? చందూ ప్రశ్న.
ఇలాగే...లైఫ్ ఎప్పుడో తిరిగి కలిసినప్పుడు.
'రాక్షసి' పెద్దయిపోయాం. కనీసం ఫోన్ నెంబర్?
వద్దు చందూ. బలహీనత ప్రేమని చంపేస్తుంది.
మళ్ళీ కలుస్తామో లేదో. తిరిగి ఎప్పుడైనా చూసుకోగలమా? ఇద్దరి మనసుల్లో బెంగ.... బోల్డంత బెంగ.... బై అనటానికి మనసు, నోరు రెండూ సిద్ధంగా లేవు. కలసి అడుగులు వేస్తుంటే మధు చందూ చేతిని నెమ్మదిగా పట్టుకుంది. ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ నీరు నిండిన కళ్ళతో చేతులు వదిలేసి నెమ్మదిగా చెరో వైపు కదిలిపోయారు. ఇన్నేళ్ళ తర్వాత కూడా అదే కోరిక ఒక్కసారి గట్టిగా హత్తుకోవాలని,
మనసు వెనక్కి లాగుతోంది. సంస్కారం ముందుకు నడిపిస్తోంది.
ప్రేమా...మనసులో నిలిచిపోయావ్,
కాలంతో పాటు కరిగిపోతావనుకుంటే గుండె లోతుల్లో ఇంకా నేనున్నానంటున్నావ్,
ఇదేనా మొదటి ప్రేమలోని తియ్యదనం?
అవునేమో....
రమ ఇరగవరపు