TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
“అజ్ఞాత కులశీలస్య..” 38వ భాగం
పురుషోత్తమదేవుని తల్లి, పార్వతీదేవి మోము పున్నమి చంద్రుని లా వెలిగి పోయింది.
మిగిలిన భార్యలు మ్లాన వదనాలతో లేచి నిలబడ్డారు.
హంవీర దేవుడు, అతని కుమారుడు దక్షిణ కపిలేశ్వరుడు నిశ్శబ్దంగా నిష్క్రమించారు.
రాజ్యం లో ప్రజలందరూ పురుషొత్తమ దేవుని సాక్షాత్తు జగన్నాధుని అవతారంగా భావించి అతడే తమ భావి చక్రవర్తి అని అనుకుంటున్నా, అతని అన్నదమ్ములకీ విషయం అవగాహన అవలేదు.
కపిలేంద్ర దేవుని కుమారులందరూ, మహారాజు తో సహా, దండయాత్రలు సాగించడంలో నిమగ్నమై ఉండగా పురుషోత్తమ దేవుని కళింగ రాజ్యంలోనే ఉంచి, రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచుతూ, ప్రజలు సుఖ శాంతులతో జీవించేటట్లు పాలన సాగించేట్లు చూశాడు కపిలేంద్రుడు.
కపిలేంద్రుని కుమారులు అందరు.. పురుషోత్తముడు తప్ప, కాబోయే చక్రవర్తి హంవీరదేవుడనే ఆనుకున్నారు.
రాజ్యం సుస్థిర పడడానికి హంవీరుని పరాక్రమం తోడ్పడిందనడం లో సందేహం లేదెవరికీ. కానీ.. కుమారులలో కొందరు పురుషోత్తముని కూడా ఆహ్వానిస్తూ.. మహారాజు ప్రకటనకి సంతోషిస్తున్నట్లే కనిపిస్తోంది.
మందిరం బయటికి రాగానే, హంవీరుడు ఆగ్రహంతో ఊగిపోయాడు.
“లోకంలో ఎక్కడైనా ఇంతటి అన్యాయం కనగలమా? పట్టపురాణీ కొడుకుని నేను. మహరాజు ఆవిడగారిని పెండ్లి కూడా ఆడలేదు. ఆవిడకి పుట్టినవాడు వారసుడా? కాబోయే చక్రవర్తా? ఈ రాజ్యం నిలవడానికి సరిహద్దుల్లో మనం రణం సలుపుక పోతే కటకం ఒక్కటే ఉండేది కళింగంలో.” నిప్పులు చెరుగుతూ హంవీరుడు తన మందిరానికి వెళ్లాడు. అతని వెనుకే అతని పరివారమంతా..
అతని కుమారుడు దక్షిణ కపిలేశ్వరుని దగ్గరగా పిలిచాడు.
“రేపే మనం బయలుదేరుతున్నాం. సూర్యోదయాత్పూర్వమే.. అశ్వశాలకీ, గజ శాలకీ వెళ్లి ఏర్పాట్లు చేయించు. కొండవీడుకి వెళ్లి, ఆక్కడ ఆలోచన సాగిద్దాం. జగన్నాధుని అవతారమట.. చూద్దాం!”
ప్రకటన చేశాడే కానీ కపిలేంద్రుడు, ఆ రాత్రంతా అసహనంగా పచార్లు చేస్తూనే ఉన్నాడు. మిగిలిన కుమారులు మౌనంగా తన నిర్ణయాన్ని ఆమోదిస్తారని తెలుసు. హంవీరుడు హర్షించడనీ తెలుసు. కానీ తనకి చెప్పకుండా, వీడ్కోలు లేకుండా, మందిరం నుండి నిష్క్రమించడం ఆవేదన కలిగిస్తోంది.
తను చేసిన పని ఎంత వరకు సక్రమమైనది?
తన ప్రియసఖికి ఇచ్చిన మాట నిలుపుకోవడానికేనా పురుషోత్తముని తన వారసునిగా ఎన్నుకున్నది? అటువంటి ప్రలోభాలకి లొంగుతే తన వివేచనకి విలువేముంది?
అది మాత్రమే కారణం కానే కాదు.
నిజమే.. హంవీరుడు పరాక్రమవంతుడే. ఎన్నో యుద్ధములలో గెలిచి అవలీలగా ఆ రాజ్యాలను ఆక్రమించి, సామ్రాజ్య విస్తరణకి తోడ్పడ్డాడు.
కానీ ఇంతటి సువిశాల సామ్రాజ్యాన్ని ఏలగల సామర్ధ్యం అతనికి ఉందా?
పరిపాలనకి పరాక్రమం ఒకటే సరిపోదు.
సమన్వయం, సరైన సమయంలో తీసుకోవలసిన నిర్ణయం, వివేకం, విచక్షణ, శాంతం.. ఎన్నో లక్షణాలు కావాలి. తళ్ళు సాగిస్తూ, రాజ్యం పెంచుకుంటూ పోతుంటే ప్రజల కష్ట సుఖాలు చూడగలవారెవరు?
పురుషోత్తముడు సౌమ్యుడు. అవసరమైనప్పుడు తన పరాక్రమాన్ని చూపగల ధీరుడు. అతనికి దైవకృప కూడా ఉందని కాంచీపురం రణంలోనే నిరూపించబడింది. తన వద్ద పొరపాటున్నపుడు, ఆవేశంతో తప్పు చేయబోయినప్పుడు వెనుకడుగు వేసి, పెద్దల మాట వినగలవాడని, పద్మావతి పరిణయం సమయాన తెలిసింది.
పైగా తనకి తోడు నీడగా మాధవ మంత్రి ఉండనే ఉన్నాడు.
తన నిర్ణయం ముమ్మాటికీ సమంజసమైనదే.
ఆ ఆలోచన వచ్చాక.. తనని తాను సమర్ధించుకున్నాక, ఎప్పుడో అర్ధరాత్రి దాటాక కాస్త నిద్ర పట్టింది కపిలేంద్ర దేవునికి.
“ప్రభూ!” ఎవరో పిలుస్తున్నట్లు లీలగా వినిపిస్తోంది. కలలోనా ఇలలోనా..
కను రెప్పలు తెరిచాడు కపిలేంద్ర దేవుడు. తలంతా భారంగా.. కనురెప్పలు బరువుగా అనిపించాయి. గవాక్షాలకున్న తెరలు తొలగించారెవరో. సూర్యకిరణాలు తీక్షణంగా పలుకరించాయి.
ఎందుకు లేపాలి? కాస్త విశ్రాంతి తీసుకోనియ్యరా? కోపంగా అటూ ఇటూ చూశాడు.
పరిచారకుడు.. చేతులు కట్టుకుని నిలుచున్నాడు, వినయంగా. ప్రభువు ఆగ్రహానికి గురి కావలెనా అనుకుంటూ..
భృకుటి ముడిచి చూశాడు మహారాజు.
“యువరాజు పురుషోత్తమ దేవుడు, మాధవ మంత్రి తమ దర్శనార్ధమై వేచి ఉన్నారు ప్రభూ.. మూడు ఘడియలు దాటింది.”
ఇరువురి మిత్రుల, ఇటువంటి ఆగమనం ఇదే ప్రధమం. ఏదో అనూహ్యమైన విశేషమే జరిగి ఉంటుంది.
మహారాజు త్వరగా లేచి కాలకృత్యాలు తీర్చుకుని వెలుపలికి వచ్చారు.
పురుషోత్తముడు ఎదురేగి తండ్రిగారిని తోడ్కొని వెళ్ళి ఆసీనులని చేశాడు.
మాధవుడు అభివాదం చేశాడు. అతని కళ్లలో ఏదో వ్యాకులత.
కపిలేంద్రుడు ఇరువురినీ మార్చి మార్చి చూశాడు.. మౌనంగా.
“ప్రభూ! యువరాజు హంవీర దేవుడు, తమ బలగాన్ని తీసుకుని వెడలి పోయారు. గజములు, అశ్వములు, పదాతి దళం..”
మాధవుడు వర్ణించాడు.. ఏమేమి తీసుకుని వెళ్లారో..
తల పంకించాడు కపిలేంద్రుడు. హంవీరకుమారుని వెంట వెళ్లడం అలవాటే కనుక మారు మాటాడక తరలి ఉంటారు సేనానులు.
“ఎటు పక్కగా వెళ్లారో తెలిసిందా?”
“దక్షిణ దిక్కుగా ప్రభూ!”
“కొండవీటి స్థావరానికి వెళ్లి ఉంటారు. ఫరవాలేదు. నేను త్వరలో వెళ్లి
కుమారుని ఊరడించి సర్ది చెప్పి వచ్చెదను. మీరు నిశ్చింతగా ఉండండి.”
“సేనాధిపతి దామెర తిమ్మభూపతి తమ దర్శనార్ధం వచ్చారు ప్రభూ!” కొలువు తీరి ఉన్న కపిలేంద్రుని వద్దకు వచ్చి చెప్పాడు సేవకుడు.
హంవీరుడు అలిగి వెళ్లిపోయి పది దినములయింది. సైన్యంలో కొంత భాగమును.. రాత్రికి రాత్రి సేకరించగలిగినంత మందిని తోడ్కొని వెళ్లాడు. కృష్ణాష్టమి సంబరాలలో ఉన్నారు కనుక ఎక్కువ మందిని.. సేకరించలేక పోయాడు.
కపిలేంద్రుడు పెద్ద కుమారుని వద్దకు వెళ్లుటకు సంసిద్ధమవుతున్నాడు.
పురుషోత్తమునికి, కోట పరిరక్షణ బాధ్యత అప్పగించి, సభలో అందరికీ వారి వారి పనులను నిర్దేశించడానికి సభనేర్పాటు చేశాడు.
సేనాధిపతుల నందరినీ ఆప్రమత్తులై ఉండాలని ఆదేశమిచ్చాడు.
“తిమ్మనాయకుల వారిని లోనికి తోడ్కొని రండి.” ఆనతిచ్చాడు ప్రభువు.
దామెర తిమ్మనాయకుడు తెలుగు వాడు.
కపిలేంద్ర గజపతికి, హం వీరుని వలెనే యుద్ధములయందు కుడి భుజమై విజయానికి కారకుడైన వాడు.
తెనుగు కవులు అతడి మీద చాటువులు కూడా అల్లారు.. అతని పరాక్రమమును
వర్ణిస్తూ..
“ప్రభూ! బహమనీ సుల్తానులను ఓడించడానికిదే మంచి సమయం. అచ్చట కరవు తో ప్రజలు అల్లల్లాడి పోతున్నారనీ, సైనిక బలం తగ్గిందనీ, బలహీనంగా ఉందనీ వార్తలు వచ్చాయి. హంవీర కుమారుడు దక్షిణానికి సైన్యాన్ని తీసుకుని వెళ్లినా మన దగ్గర గజ బలం, అశ్వబలం బాగా ఉంది.”
కపిలేంద్రుడు నిమేష మాత్రం ఆలోచించాడు.
తిమ్మనాయకుడు ఇంతవరకూ మంచి సలహాలే ఇచ్చాడు.
గోదావరీ, కృష్ణాతీరాలను స్వాధీన పరచుకున్నాము కదా.. తెలంగాణా కూడా మన ఏలుబడిలోకి రావాలి. అవశ్యం మనం బహమనీ సుల్తానుల మీదికి తళ్లు సాగిద్దాం. ఈ విషయం ఎక్కడా పొక్కనీయ వద్దు. దక్షిణ దిశకే, తీరానికే వెళ్తున్నామనే చెప్పండి.”
“మరి.. హంవీర కుమారుడు అలిగి వెళ్లి పోయారు కదా.. ఏ ఉపద్రవం వస్తుందో! మీరొక్కమారు వెళ్లి వస్తే బాగుంటుందేమో ప్రభూ!” మాధవుడు నెమ్మదిగా అన్నాడు.
“ఫరవాలేదు మాధవ మంత్రీ.. ఇంకా చాలా సమయముంది. కుమారుని కూడా మాకు తోడుగా యుద్ధానికి రమ్మని కబురు చేద్దాము.. మా మాట కాదనరు. . వాయు వేగంతో వెళ్లగలిగే అశ్వాలని తీసుకుని ఇరువురు చారులను, కుమారునికి పత్రం రాసి పంపుతాను. బహమనీ సుల్తానుల మదమణచి, మన రాజ్యం స్థాపించాలి అక్కడ. తిమ్మనాయకుల సలహా తీసుకుందాము.”
తండ్రిగారి లేఖనందుకున్న హంవీరుడు తన సైన్యాలని తీసుకుని మధ్య మార్గమున తండ్రిగారితో చేరాడు.
స్వభావ సిద్ధంగా అతనికి రణమందున్న అభిలాష, సింహాసనం సంగతి చూసుకోవడాని కింకా సమయముందిలే అన్న ధీమా.. హంవీరుని బహమనీలపై యుద్ధానికి సన్నద్ధం చేశాయి.
కపిలేంద్రదేవుని సైన్యం వాయవ్య దిశగా సాగింది.
తిమ్మ భూపతి సేకరించిన వార్త నిజమే.. బహమనీ సుల్తాను అహమద్ షా అస్తవ్యస్త స్థితిలో ఉన్నాడు. తాత ఫిరోజ్ షా వేల సంఖ్యలో హిందువులని హతమార్చాడు. దాంతో సైనికులు గణనీయంగా తగ్గి పోయారు. దానికి తోడు కరవు.. ప్రజలు తిండిలేక కొట్టుకుంటున్నారు.
అదే సమయంలో రాజధాని గుల్బర్గా నుంచి బీదర్ కు మార్చారు.
బహమనీ సుల్తానుతో స్నేహంగా ఉంటున్న దేవరకొండ రాజు, ఓరుగల్లు వెలమ దొరలు ఓఢ్ర దేశాధీశునికి సహాయ పడ్డారు.
ఇంతటి గందరగోళంలో బహమనీ సుల్తాన్ లొంగిపోయి కప్పం కట్టటానికి ఒప్పుకున్నాడు.
విజయోత్సాహంతో దేవరకొండ, ఓరుగల్లు రాజ్యాలను కూడా కలుపుకుని, ఓఢ్ర జండా నెగుర వేశాడు కపిలేంద్ర గజపతి.
విజయాలన్నిటిలో తిమ్మ భూపతి పోషించిన పాత్ర తక్కువేమీ కాదు.
గజపతులు సంపాదించిన రాజ్యాలన్నింటిలోనూ అతని ప్రాధాన్యతను గుర్తించిన కవులెవరో చాటువులల్లి, అగ్రహారాలు తాము సంపాదించుకున్నారు.
తిమ్మభూపతిని ప్రస్తుతించినా ఆ చాటువుల్లో గజపతుల తళ్లన్నీ వివరించారు.
* సీ. కటకంబు లోపలి గజవాడ బెజవాడ
యొద్ది బండారల్లు యోరుగల్లు
తోటకూరంగళ్ళు తొండమారయగుళ్ళు
పెరటి బచ్చలితోట బెడదకోట
వీర పుంగవులకు వేటలు మాడెలు
మణికి విహారంబు మాహురంబు
గజయూధముల గట్టు గంబాలు గంబాలు
పట్టణంబు గుర్రాల పల్లె ఢిల్లి
తే.గీ. ఇట్టి గజరాజు శౌర్యంబు లెన్ని చూడ
కొలది మీరిన దేవర కొండ కొండ
నీదు కోర్గంటి సింహంబు నిఖిల బిరుదు
దిశలముల సూపు దామెర తిమ్మ భూప.
*(అజ్ఞాత కవి విరచితము)
ఆ విజయ పరంపర ఒక దశాబ్దం పాటు కొన సాగుతూనే ఉంది.
తెలంగాణా తరువాత, విజయనగరం నరపతులు కూడా దాసోహ మన్నారు. కపిలేంద్ర దేవుని ప్రశస్తి ఢిల్లీ వరకూ పాకింది. హంప (రాయలసీమ), ధారా(కర్ణాటక), కలుబరుగ (మహారాష్ట్ర), ఢిల్లీ లను వణికించేశారు గజపతులు.
ఈ విజయాలన్నింటినీ కపిలేశ్వరుని తామ్రశాసనంలో నిక్షిప్త పరచారు పురుషోత్తమ మాధవులు.
కపిలేశ్వరునికి “నవకోటి కర్ణాటేశ్వరా” అను బిరుదు, “కలుబరుగేశ్వరా”కి కలిసింది.
తన ఘన విజయాలకి కారకుడైన మనుమడు, హంవీరుని కుమారుడు నైన దక్షిణ కపిలేశ్వర కుమార మహాపాత్రుని, దక్షిణాన జయించిన ప్రాంతాలకి పరీక్షగా నియమించాడు కపిలేంద్రుడు.
అప్పటికి హంవీరుడు, దక్షిణ కపిలేశ్వరుడు సంతుష్టి చెందినట్లే..
......మంథాభానుమతి