TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
“అజ్ఞాత కులశీలస్య..” 39వ భాగం
కపిలేంద్ర దేవుడి రాజ్యపాలనలో అధిక భాగం రాజ్య విస్తరణ, సరిహద్దుల్లో శత్రువులని ఆణచడంలో గడిచి పోతోంది.
కపిలేంద్ర గజపతి మహారాజు దండయాత్రలు తెరలు తెరలుగా, సముద్రంలో అలలవలే సాగుతుండడంతో వాటిని గజపతుల తళ్లు అని పిలువ సాగారు. సూర్య వంశీయుడైన కపిలేంద్రుడు, గజపతిగా పేరు పొందాడు.. గజబలంతో యుద్ధవిజయాలు దక్కుతుండడంతో. అతని వంశమే గజపతుల వంశంగా పేరు పొందింది.
గజపతుల తళ్ళు సాగినంతకాలం, దేశం యుద్ధవాతావరణం లోనే ఉంది. ఆలయాలలో అర్చనలు సైతం ఆగిపోయాయి, ప్రజలు అల్లల్లాడి పోయారు.
కళింగంలో పురుషోత్తమదేవుడు, మాధవుడు మాత్రం రాజ్యాన్ని ప్రజారంజితంగా పాలిస్తున్నారు.. అంతః కలహాలు లేనందు వల్ల.
కపిలేంద్ర దేవుడు గంగానది నుంచి కావేరి వరకూ సామ్రాజ్యాన్ని స్థాపించి సార్వభౌముడయ్యాడు. “గజపతి గాడేశ్వ నవకోటి కర్ణాట, కలుబరుగేశ్వర” అను బిరుదులు సంపాదించాడు.
అన్ని దేశాలలోనూ, తగు వారిని పరీక్షలుగా నిలబెట్టి, కటకానికి వచ్చి, సుస్థిర పాలన కొనసాగిస్తున్నాడు.
కపిలేంద్రుడు వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తాడు. అతని పాలనలో పూరి జగన్నాధుని ఆలయం నిత్య ధూప దీప నైవేద్యాలతో, భక్త జన సందోహంతో కళకళలాడ సాగింది.
జగన్నాధ రథయాత్ర వైభవాన్ని గురించి చెప్పనే అక్కరలేదు. పద్మావతీ, పురుషోత్తముల వివాహ సందర్భంగా లోక విదితం ఆయింది.
కళింగ సామ్రాజ్యం, సంగీత, నాట్య సాహిత్యాలకి కేంద్రంగా విలసిల్లింది. ఒడిస్సి నాట్యం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఉత్తరాన ఢిల్లీ సుల్తానులు, ఈశాన్యాన జానుపూర్ సుల్తాను, దక్షిణాన బహమనీ సుల్తానుల దండయాత్రలు, మతమార్పిడి బెదిరింపుల మధ్య మహారాజు వైదిక మత ఉద్ధరణకై కృషి చేస్తున్నాడు.
వైష్ణవ మతాచరణ చేస్తున్నప్పటికీ, భువనేశ్వర్‍లో కపిలేశ్వరుని ఆలయం నిర్మించాడు.
శైవులను కూడా సమానంగా గౌరవిస్తున్నాడు.
అంతే కాదు..
సాహిత్య గోష్ఠులను జరుపుతూ కవులకు ప్రోత్సాహం ఇస్తున్నాడు.
ఈ సాహిత్య గోష్ఠులు మాధవుని ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి.
“మాధవ మంత్రీ! ఈ రోజు మన కవితా గోష్టిలో రెండు విశేషాలున్నాయి.” కపిలేంద్ర దేవుడు, సభ ప్రారంభిస్తూ అన్నాడు!”
“అవశ్యం ప్రభూ!” సభ నిర్వహిస్తున్న మాధవుడు మహారాజుకి అభివాదం చేశాడు.
భోజరాజు సభని తలపింప చేస్తున్న గజపతుల సాహిత్య గోష్ఠి కన్నుల పండువగా, వీనుల విందుగా సాగుతోంది.
“మన సభకి సరళ దాసుగారు వస్తున్నారు. వారు మహా భారతం ఒడియా భాషలో రచించారు. వారిని సత్కరిస్తున్నాము.”
“ఇంకోక విశేషమేమి ప్రభూ?”
“నేను ‘పరశురామ విజయం’ అను గ్రంధాన్ని సంస్కృతంలో రాశాను.. ఒక చిన్న ప్రయత్నం చేశాను. అది వారి చేత ఆవిష్కరింప చేద్దామని..”
“ప్రభూ! నిజమా? తమరికి సమయం ఉండేదే అతి తక్కువ, ఇన్ని పోరుల మధ్య ఈ విధమైన సాహిత్య సేవ ఎంతో ఎన్న దగినది ప్రభూ! చాలా ఆనందంగా ఉంది.” మాధవుడు సంతోషంగా ఏర్పాట్లు చేయ సాగాడు.
“అంతే కాదు మాధవ మంత్రీ.. సరస్వతీ వరప్రసాదులైన మహాకవి సరళదాసుగారిచే ఆవిష్కరింపబడటం కూడా నా కావ్యానికి దక్కిన అదృష్టం.”
“నిజమే ప్రభూ! దాసుగారు మహాభారతాన్ని ఒడియాలో రాశారని తెలుసు.. కవిత్రయం తెలుగులోనూ, పంపకవి కన్నడంలోనూ రాసినట్లుగా.. ఇతిహాసాన్ని రచించారనే కదా సరస్వతీ వరప్రసాది అంటున్నారు?” మాధవుడు అడిగాడు.
“సభికులందరికీ తెలియవలసిన విశేషమొకటి ఉంది, కవీశ్వరుల జీవితంలో.”
“ఏమది ప్రభూ?” సభలోని కవి ఒకరు లేచి అడిగాడు.
“సరళ దాసు కవి, ఒక రైతు బిడ్డడు. ఏ గురువు వద్దా చదువు నేర్చుకోలేదు. అతడి తల్లిదండ్రులు పెట్టిన పేరు సిద్ధేశ్వర పరిదుడు. పొలంలో దున్ను కుంటూ., తనకి వచ్చిన గేయాలేవో పాడుకుంటూ పనులు చేసుకుంటున్నాడు. ఆ పాటలను సరస్వతీ దేవి స్వయంగా విని, సిద్ధేశ్వరుడికి వరం ఇచ్చింది.. పద్యాలు రాయగల శక్తినిచ్చింది. కాళిదాసు కవికి కాళికాదేవి ప్రత్యక్ష్మై ఇచ్చినట్లుగానే. అప్పటి నుంచీ వారికి కవితాఝరి వరప్రసాద మయింది. యుక్త వయసులో ఆ మహాకవి మన సైన్యంలో సైనికాధికారిగా కూడా ఉన్నారు. సరళా దేవి వరప్రసాది కనుకనే అతడిని సరళ దాసు అని పిలుస్తున్నారు.”
తన సైన్యంలో పని చేసిన వాడయినా, తక్కువ కులం వాడయినా.. అతడి విద్వత్తును గుర్తించి తగిన గౌరవాన్ని అందిస్తున్నాడు కపిలేంద్ర దేవుడు.
సభ లోని వారంతా లేచి నిలబడి, కరతాళ ధ్వనులు చేస్తుండగా సరళ దాసుని తీసుకుని వచ్చారు ద్వారపాలకులు.
కవిగారికి సముచిత స్థానాన్నిచ్చి, సత్కరించారు మాధవుడు, యువరాజు పురుషోత్తమ దేవుడు.
సరళ మైన భాషలో గ్రామీణ ప్రజలకి కూడా అర్ధమయేలా సరళ దాసు కావ్యాలు నడుస్తాయని, సభలోని పండితులు వివరించారు.
కపిలేంద్ర దేవుని కావ్యం, పురుషోత్తమ దేవుని అభినవ గీత గోవిందం కూడా ఆవిష్కరించి, సాహిత్య సభకి నిండుతనం చేకూర్చాడు, సరళ దాస కవి.
సభ లో నర్తకీమణులు వచ్చి ఒడిస్సీ నృత్యంలో సరళదాస భారతంలోని ఒక ఘట్టాన్ని కన్నుల విందుగా ప్రదర్శించారు.
సరస్వతీ దేవి అణువణువునా ప్రత్యక్షమయిందక్కడ.
సభ అనంతరం ఆంతరంగికులతో మహారాజు సమావేశమయ్యారు.
మాధవుడు, పురుషోత్తముడు, మహామంత్రి గోవింద మహాపాత్రుడు దేశ పరిస్థితులను విశ్లేషిస్తున్నారు.
కం. అంతా బాగేనంటే
వింతే కాదా, రవంత విధి తన యునికిన్
సుంతైనా చూపవలెన్
సంతాపము నొసగ తాను జవముగ రాగా.
“ప్రభూ! కృష్ణా తీరం నుంచి వేగులు వచ్చారు. మిమ్ములను అత్యవసరంగా కలువవలెనట.”
అనుమతి తీసుకుని సమావేశంలో ఉన్న కపిలేంద్రుని వద్దకు వచ్చారు ద్వార పాలకులు.
“ప్రభూ! హంవీర కుమారులు తిరుగుబాటుకి ప్రణాలికలు వేస్తున్నారని నమ్మకంగా తెలిసింది. వారి కుమారుడు దక్షిణ కపిలేశ్వరునితో కలిసి కృష్ణా తీరాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించబోతారుట.” వేగులు భయపడుతూనే చెప్పారు. మహారాజు గారికి కుమారులాయె మరి. కోపం వస్తే.. కొరడా దెబ్బలే.
ఉలిక్కిపడి చూశారు పురుషోత్తమ మాధవులు.
కపిలేంద్ర దేవుడు మౌనంగా ఆలోచిస్తూ ఉండి పోయాడు.
ఎప్పుడో ఈ విధంగా జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాడు. కానీ ఇంత త్వరితంగా అనుకోలేదు. కనీసం కొన్ని సంవత్సరాలైనా జీవితంలో ప్రశాంతంగా గడప వచ్చని అనుకున్నాడు.
“సమయానికి వచ్చి హెచ్చరికలు చేసినందుకు ధన్యవాదాలు.” వేగులని పంపి వేశాడు.
“ప్రభూ! ఏమి చేయ దలచుకున్నారు?” మాధవుడు సన్నగా అడిగాడు.
ఒక్క సారిగా వయోవృద్ధుడై పోయినట్లు, నీరసంగా నిస్సహాయంగా చూశాడు మహారాజు. “ఏదోఒకటి చేయవలెను మంత్రీ.. అదే ఆలోచిస్తున్నా.”
“ఏదయినా ఇంక యుద్ధము వలదు మహారాజా! తమరు నిరంతర రణములతో డస్సి పోయి యున్నారు. సామరస్యమున పరిష్కారం ఆలోచించండి ప్రభూ! అన్నదమ్ముల మధ్య ఆ ముష్కురుల వలే మనం కూడనూ..” ఆపేశాడు మాధవుడు.
అంతటి మహరాజుకి తాను సలహా ఇవ్వటమా!
ఒక నిశ్చయమునకు వచ్చి, సింహాసనము మీదినుంచి లేచాడు కపిలేంద్రుడు.
“పురోహితుల వారికి కబురు చెయ్యండి. అత్యవసరంగా మమ్మల్ని కలవమని.” తన మందిరానికి వెళ్లి పోయాడు. మరొక్క మాట చెప్పకుండా.
కపిలేంద్ర దేవుడు, పురుషోత్తముని తల్లి, పార్వతీ దేవి మందిరంలో సమావేశమయ్యాడు.
“అతి త్వరలో పురుషోత్తమునికి రాజ్యం అప్పగించి కృష్ణాతీరానికి పయనమవుతాను. అచ్చట హంవీర రాకుమారునితో అన్ని విషయాలూ విశదంగా చర్చించి వచ్చెదను.”
పార్వతీ దేవి చిరకాల వాంచ నెరవేర బోతోంది. ఆవిడ సంతోషానికి అవధు ల్లేవు.
“అన్ని విద్యలయందు నిష్ణాతుడు, స్థిర చిత్తుడు, తొందరపాటు లేని వాడు, కవి, పండితుడు, ప్రజల కష్ట సుఖాలు పట్టించుకునేవాడు అయిన పురుషోత్తముడే ఓఢ్ర చక్రవర్తి.”
“ప్రభూ! ఈ వయసులో మీరు ప్రయాణం చెయ్యడం అంత అవసరమా? హంవీర రాకుమారుడు ఇచ్చటకి రానున్నారు కదా! అప్పుడు విడమరచి చెప్ప వచ్చునేమో ఆలోచించండి.” మాధవుడు అనునయించ బోయాడు.
“అంత వ్యవధిలేదు మాధవా! పురుషోత్తమ చక్రవర్తికి మీరే అండగా ఉండాలి. భవిష్యత్తు ఊహాతీతమే. నేను చెయ్యగలిగినది చేస్తాను. ఏది ఏమయినా, నా తరువాత పురుషోత్తముడే రాజ్యపాలన సాగించవలె. ఆ పిదప, ప్రతాపరుద్రుడు చక్రవర్తి కావాలి. అదే నా కోరిక. అందుకే ఇంత సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాను.” పురోహితుని పట్టాభిషేకానికి ప్రయత్నాలు చెయ్యమని చెప్పి, కపిలేంద్రుడు నిష్క్రమించాడు.
పురుషోత్తముడు మౌనంగా ఉండిపోయాడు.
మాధవునికి మనసంతా గుబులుగానే ఉంది.
తురగవల్గన రగడః- అన్నదమ్ము లైన కాని అవని కొరకు పోరు టేను
చిన్న సరుదు బాటు కూడ సేయ వలను కాద యేని
ఎన్న యమాయకులు జనులు ఎప్పటికిని వగచగాను
పన్నుగాను యోచనంత బాగ సేయ లేక గాని
ఇలను యిందుకేన సృష్టి ఇంత చేసె దైవమదే
కలగ మారి కరిగి పోగ కనుల ముందు సర్వమదే
అలసి సొలసి ఉస్సు రనుచు యంత రొష్టు పడను కదే
కలసి మెలసి కలత లేక గడప రాద రోజులదే!
మాధవుడు చింతిస్తూ ఇంటికి సాగాడు.
సరిగ్గా వారం నాటికి పురుషోత్తముడిని రాజును చేసి కపిలేంద్ర దేవుడు కృష్ణా తీరానికి తరలి వెళ్లాడు, తగినంత సైనిక బలంతో.
………………….
......మంథాభానుమతి