Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 37వ భాగం

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 37వ భాగం


   “ఏ జన్మలోనో ఇక్కడ విహరించినట్లుగా అనిపించింది హుస్సేన్ గారూ.  కళింగ దేశీయుడిని, ఈ ప్రాంతమునకు రావడం ఇదే కదా! చాలా ఆహ్లాదంగా ఉంది ప్రకృతి ఇచ్చట”
   మాధవుని బుద్ధి హెచ్చరించింది.. ప్రమాదంలో పడవద్దని.
   “ఏమయినా.. మీ పద్యం వింటుంటే మా చిన్నతనం గుర్తుకొచ్చింది మంత్రిగారూ! మేము అన్నదమ్ములం అక్క చెల్లెళ్లతో కూడి ఆ విధంగానే ఆటలాడే వాళ్లం. ఆ ఆనంద మంతా చెల్లా చెదురై పోయింది.. విధి విలాసం.” ఆజమ్ హుస్సేన్ విచారంగా అన్నాడు.
   “అయితే.. మీ కుటుంబం అంతా..” మాధవుడు ఆగిపోయాడు. కంఠం నొక్కుకు పోయినట్లు అనిపించగా.
   “చెల్లా చెదరై పోయింది. మునుపటి రాజుగారికి దగ్గరి బంధువులం మేము. గణేశ వంశస్తులం. కత్తికొక కండగా నరికిన వారిని నరకగా మిగిలిన వాళ్లం.” చిన్నా భిన్నం అయిన తన కుటుంబాన్ని తలచుకుని, కళ్ల నిండా నీళ్లతో అన్నాడు ఆజమ్ హుస్సేన్.
   “అవును విన్నాను. గణేశుల వంశం వారినందరినీ బలవంతంగా మతం మార్పించేశారని.”
   “అంతే కాదు.. ఇష్టం లేని వారిని మా కళ్ల ముందే చంపేశారు. మా పిన్నిగారు కొడుకుని తీసుకుని పారి పోయారు. వారి జాడ తెలియలేదు. అందరం కలసి మెలసి ఆడుకుంటూండే వాళ్లం. మీ పద్యం వింటూ ఉంటే ఆ పాత సంగతులన్నీ గుర్తుకొచ్చాయి.” హుస్సేన్ విచారంగా అన్నాడు.
   ఒక్క నిమేషం ఆలోచించాడు మాధవుడు.
   తనెవరో చెప్పాలా అని.
   చెప్తే.. తన కుటుంబాన్ని కలుసు కోవచ్చును. కానీ వివేకం వద్దని హెచ్చరించింది. అమ్మ మాటని పాటించమంది.
                            
                     కం.    గతమంత చరిత్ర యెగా
                              వెతకల్గిన చేయునంత విధములు లేవే
                              గతి లేదు విధియె రాసెను
                              కతలుగ చెప్పుకొన తప్ప కాలము గడవన్.

   “అంతే హుస్సేన్ సాబ్. పాత సంగతులు తలచుకొనుట తప్ప చేయ గలిగిందేమీ లేదు. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ దేశం.. కాదు కాదు.. మన దేశం సస్య శ్యామలంగా ఉంది. కలకాలం ఆ విధంగా ఉండాలని ఆ దుర్గా మాతని కోరుతున్నాను. మహరాజు గారి ఆనతి అయింది. మేము రేపే బయలు దేరుతున్నాము.” మాధవుడు వీడ్కోలు చెప్పి తన విడిదికి బయల్దేరాడు.
   ఒకే ఒక్క సారి హుస్సేన్ గారి ఇంటికి తీసుకెళ్లమని అడగాలన్న కోరికని అదిమి పట్టి, ముందుకి నడిచాడు.
   ఆజమ్ హుస్సేన్ కూడా అర్ధ మనస్కుడై అచ్చటి నుంచి కదిలాడు..
   రక్త బంధం వెనక్కి, రాజకీయం ముందుకి నడవ మన్నాయి. రాజకీయమే గెలిచింది.
   మాధవుని జీవితంలో వంగ దేశంలో గతమనే అధ్యాయానికి తెర పడి పోయింది.

   విజయోత్సాహంతో కటకం ప్రవేశించారు కళింగ సైనికులు.
   కోటలోనికి ప్రవేశిస్తూనే మాధవుడు తన గృహమునకు సాగి పోయాడు. సంధ్య వేళ దాటి ఘడియ అయింది.
   కోటంతా దీప తోరణాలతో అలంకరించారు.
   మాధవుడు అన్య మనస్కంగానే కోటలో తన అశ్వాన్ని నడుపుతున్నాడు.
   అన్న గారు కలిస్తే, కనీసం.. తన వారు ఎవరెవరు ఉన్నారో కూడా అడగ లేక పోయాడు.
   వంగ దేశానికి వెళ్లకుండా ఉన్నా బాగుండేది. అంతా భ్రమ కానీ, వెళ్లడం వెళ్లకపోవడం తన చేతిలో ఏముంది?
   రాజుగారి ఆనతిని కాదన గలడా?
   తన ఇంటిని సమీపిస్తూ ఉండగానే, అతడి కన్నులు విచ్చుకున్నాయి.
   అది తన గృహమేనా?
   ఏమా అలంకరణ..

                                                                        

   ద్వారమందే ఎదురేగి, హారతి ఇచ్చింది ధర్మపత్ని. ఆ వెనుకే నిలిచి ఆనందం నిండిన కన్నులతో ప్రియ పుత్రుడిని చూసుకుంటున్నారు నంద, గౌతమిలు.
   సీతమ్మ అస్వస్థత కారణంగా ఎక్కువ సమయం తన కక్ష్య లోనే గడుపుతోంది.
   “ఇదీ నా ఇల్లు. వీరంతా నా వాళ్లు. గతాన్ని తలచుకొని వగచడం మానివేయాలింక” మాధవుడు మనసు దిటవు పరచుకుని ధృడ నిశ్చయంతో, చిరు నవ్వుతో అందరినీ పలుక రించాడు.

   కపిలేంద్ర దేవుని కుమారులందరూ రాజ్య విస్తరణ జరుపుతుండగా, పురుషోత్తమ దేవుడు, కళింగ రాజ్యానికి కాపలాగా ఉన్నాడు, తండ్రి యానతి మేరకు.
   పురుషోత్తమ దేవునికి గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ కాలం గడుపు తున్నాడు మాధవుడు.
   చెరువులు తవ్వించడం, కాలువలు తీయించడం.. పాడి పంటలకు లోటు లేకుండా పాలన సాగుతోంది. గజపతుల పాలనలో సామాన్య ప్రజానీకం లోటు లేకుండా జీవిస్తున్నారని ఇతర దేశాలలో అనుకుంటున్నారు.
   నంద గౌతమిలకు వృద్ధాప్యపు ఛాయలు సోకుతున్నాయి. సీతమ్మ స్వర్గారోహణ చేసింది. మాధవుడే శాస్త్రోక్తంగా కర్మ కాండలు చేశాడు.
   వివాహమైన ఏడు సంవత్సరాలకి, కాదంబరీ దేవి శుభవార్త మాధవుని చెవిన వేసింది. నందుని గృహమంతా ఆనంద డోలికలలో ఊగి పోయింది. ఇంటిలోనికి పసిపాప రాబోతుంటే.. ఇంకేం కావాలి?
   అదే సమయంలో పురుషోత్తమ దేవుని భార్య పద్మావతీ దేవి కూడా శుభవార్త చెప్పింది.
   అంత కన్న సంతోషమేముంటుంది..
   మహారాజు కపిలేంద్ర వర్మ కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. రాజమండ్రీ తో పాటుగా కృష్ణా తీరం కూడా గజపతుల కైవశ మయింది. గజపతుల తళ్లు సాగుతూనే ఉన్నాయి. రాజకుమారుడు హంవీరుడు, వాని పుత్రుడు, మిగిలిన అన్న దమ్ముల సహకారంతో అదే పని మీద ఉన్నారు.
   గంగా నది నుంచీ కావేరి వరకూ విస్తరించింది గజపతుల సామ్రాజ్యం.
   ఒక శుభ ముహుర్తాన కాదంబరీ దేవి అమ్మాయిని, పద్మావతీ దేవి అబ్బాయిని ప్రసవించారు.
   మాధవుడు తన కుమార్తెకు కాత్యాయని అని పేరు పెట్టాడు.. కాదంబరీదేవికి కూడా చాలా నచ్చింది ఆ పేరు. నందుని ఆనందమునకైతే అంతే లేదు. గౌతమికి ఎప్పుడూ చిన్నారి కాత్యాయని ధ్యాసే.
   మాధవుని ఇంటనే కాదు.. కోటలోని తోటలన్నీ కిలకిలా రావములతో నిండి పోతున్నాయి.
   అప్పటి వరకూ తాము ఎంతటి ఆనందాన్ని కోల్పోయారో.. పాపాయి కాత్యాయని ముద్దు మాటలతో తెలియ వచ్చింది. ఆట్టి ఆనందానికి నోచుకున్నందుకు జగన్నాధునికి సర్వదా కృతజ్ఞతలు తలుపుకుంటాడు నందుడు.
   మాధవుని రాక తమ జీవితాలనే మార్చి వేసిందంటుంది గౌతమి.
   ఆ రోజు కృష్ణాష్టమి.
   కాత్యాయనిని చిన్ని కృష్ణునిలాగ అలంకరించి సాయం కాలం భవనం ముంగిట తోట లోనికి తీసుకు వచ్చారు. అప్పుడే మహరాజు కూడా వన విహారానికి వచ్చి, మాధవుని ఇంటికి వచ్చారు. మనుమరాలు బుడిబుడి అడుగులతో తాత కెదురేగి స్వాగతం పలికింది.
   కాలి మువ్వలు మంజీర నాదాన్ని పలికాయి.
   “చిన్ని కృష్ణుడు వచ్చేశాడే నా వద్దకు.” తాత సంబరంగా, మీసాలు దువ్వు కుంటూ దగ్గరగా తీసుకుని ఎత్తుకున్నారు. ఎన్ని రాజ్యాలు జయించినా కలుగని ఆనందం కపిలేంద్ర దేవుని మోమున.
   “అవును ప్రభూ! మనందరికీ ఆనందం కలిగిస్తూ వచ్చేశాడు.

       “మ.     మరియా మంజుల నాదమున్ మురిసెనా మాయిల్లు, ముచ్చట్లతో
                   మురిపాలన్ మునిగేముగా, మిసిమితో మోగేటి మువ్వల్సడిన్
                   సిరినిం బోలు వరాల పాప తన బోసిన్నవ్వులన్ జల్లగా
                   హరి రాడా మరి సంబరాల కిపుడే హాయౌ కదా సందడిన్.”
   
   “ఎంత చక్కని పద్యం అల్లావయ్యా. సెభాష్.” మెళ్లో ఉన్నముత్యాల హారం తీసి అల్లుడి మెడలో వేశాడు కపిలేంద్రుడు.
   కాదంబరీ దేవి పరుగు పరుగున వచ్చి తండ్రిగారికి పాదాభివందనం చేసింది.
   “దీర్ఘాయుష్మాన్ భవ. బాగున్నావా తల్లీ?” ఒకే కోటలో ఉన్నా తండ్రీ కూతుళ్లు కలుసు కోవడం ఎప్పుడో కానీ పడదు.
   “బాగా ఉన్నాను తండ్రీ. అంతా మీ ఆదరణ, ఆశీర్వచనముల ప్రభావము.

                   సీ.       అత్తమామలు నన్ను యాదరించుచు నెంతొ
                                    కన్న కూతురివలె కాచు కొనగ
                              అనురాగ జలధిని యలరించి హర్షమున్
                                    పతియె చెంతనె యుండి పలుకరించ
                              ముద్దులొలుకు పాప మురిపించి యొడిచేర
                                     మాతృత్వ మధురిమ మనసు నిండ
                              మా మంచి గృహమిదే మది సంతసమునుంచు
                                      కనరాదు యెందునా కలత యెపుడు
           
                        ఆ.వె.   చదువులమ్మ యిచట సంగీత సాహిత్య
                                  రూపు దాల్చి నిలిచె యెపుడు తాను
                                  నెమ్మి యిచట సతము కమ్మగా వడ్డించు
                                  వచ్చి పోవు వారి కిచ్చకముగ.”

   తియ్యని కంఠస్వరముతో, రాగయుక్తంగా వీనుల విందుగా తన సంసారాన్ని వర్ణించిన ప్రియ పుత్రికని హత్తుకుని, నుదుటి మీద చుంబించి, మెడలోని నవరత్న హారాన్ని కుమార్తెకి అలంకరించాడు మహా రాజు.
   “ఇదంతా పతి సాంగత్య మహిమే! అంతియే కాదు.. మీ సోదరుడు పురుషోత్తమ దేవుడు కూడా మంచి కవే. గ్రంధ రచన సాగిస్తున్నాడు సుమా! మాధవ మంత్రి గారికి తెలిసియే యుండును. మనము తెలుగు నాడు నందలి రాజ్యాలనేలుతున్న సమయంలో కమ్మనైన తెలుగులో మీరు కవిత లల్లుతుంటే అవధిలేని ఆనందం కలుగుతోంది మాకు. మా జన్మ సార్ధక మైనట్లే మంత్రీ!”
   “మహారాజా! మా గృహం పావనం చేయరా?” కపిలేంద్ర దేవుడు వచ్చిన వార్త విని పరుగున అచ్చటికి వచ్చిన నందుడు అర్ధించాడు.
   “మరొక్క మారు తప్పక వచ్చెదము మహా పాత్రా! మిమ్మందరినీ కృష్ణాష్టమి వేడుకలకి మా మందిరాని ఆహ్వానించాలని వచ్చాము.”  ఆప్యాయంగా నందుడిని ఆలింగనం చేసుకుని అన్నాడు.
   “మీరు రావాలా మహారాజా! ఎవరితో నైనా..”
   “ఇది మహారాజు ఆహ్వానం కాదు మిత్రమా! వియ్యాలవారి పిలుపు. మీ కోసం ఎదురు చూస్తుంటాము.” కపిలేంద్రుడు తన మందిరానికి పయనమయ్యాడు.

   రాచ మందిరం ముందే.. కృష్ణుని రాసలీల అలంకరణ చేశారు. చిన్నారి కాత్యాయని బొమ్మల దగ్గరగా పరుగెత్తుకుని వెళ్లి అన్నీ సుతారంగా పట్టుకుని ఆనందిస్తోంది.. తన చిరు గజ్జలు సవ్వడి చేస్తుండగా.         

......మంథా భానుమతి