Facebook Twitter
మధురాంతకం కథలు- జీవిత పాఠాలు

మధురాంతకం కథలు- జీవిత పాఠాలు

 

మన ముందు తరం రచయితల దగ్గర ఒక గొప్ప లక్షణం ఉంది. వాళ్లు ఫలానా విషయం మీద రాయకపోతే బాగోదేమో! అనుకుని కథలు రాయలేదు. తమలో సహజంగా ఏర్పడిన స్పందనలకి కథారూపాన్ని ఇచ్చారు. తాము చూసిన విషయాలనీ, తమలో ఆలోచనలు రేకెత్తించిన సమస్యలనీ ఇతివృత్తాలు మలచారు. అందుకే వారి కథలను చదువుతున్నప్పుడు దేశకాలమాన పరిస్థితులకు అతీతంగా, ఆ కథ మన ఎదురుగానే జరిగిన భావన కలుగుతుంది. అలాంటి సహజ కథకులలో మధురాంతకం రాజారాం ఒకరు.

మధురాంతకం పూర్వీకులు తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లాకు వలస వచ్చారు. చిత్తూరు ఒక చిత్రమైన ప్రపంచం! తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలతో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. తమిళనాడుకి సరిహద్దులో ఉండటం వల్ల భిన్న సంస్కృతులూ తారసిల్లుతాయి. కానీ పల్లెటూర్లలో మాత్రం సీమ తాలూకు కరువు తాండవిస్తూ ఉంటుంది. అలాంటి వైవిధ్యమైన పరిస్థితులకు సజీవసాక్ష్యంగా నిలిచిన మధురాంతకం రచనలు కూడా అంటే భిన్నంగా సాగుతాయి.

 

 

చిత్తూరులో విద్యాభ్యాసం చేసే రోజుల నుంచే రాజారాంకి సాహిత్యం అంటే అభినివేశం ఉండేది. ఆయన 18వ ఏటనే తొలి కథ ప్రచురితం కావడంతో ఆ ఆసక్తి కాస్తా కార్యరూపం దాల్చింది. తరువాత కాలంలో ఆయన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టినా, కథలు రాయడాన్ని తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నట్లు కనిపిస్తుంది. అందుకనే ఆయన కలం నుంచి 300కు పైగా కథలు జాలువారాయి. వాటితో పాటుగా వ్యాసాలు, నవలలు, తమిళం నుంచి అనువాదాలు కూడా సాగాయి. పరిణతిలోనూ, పరిమాణంలోనూ ఉత్తమమైన కథలను రాయడంతో సీమ సాహిత్య చరిత్రలో రాజారాం తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

రాజారాం కథలు నాలుగైదు పేజీలలో ముగిసిపోయేవి కావు. అవి ఒక జీవితాన్ని పరిచయం చేసి కానీ వదిలిపెట్టవు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం వల్లనో, స్వతహాగా నిదానస్తుడు కావడం వల్లనో... పిల్లవాడికి విజ్ఞాన శాస్త్రాన్ని బోధించినంత నేర్పుగా జీవితపాఠాలను కథారూపంలో అందిస్తారు రాజారాం. రాజారాం కథలన్నీ ఆయన చుట్టూ ఉన్న ప్రాంతాలలోనే తిరుగుతూ ఉంటాయి. అందులోని పాత్రలన్నీ తన అనుభవాల్లోంచి వెలికి వచ్చినట్లే తోస్తాయి. రాజారాం కథలోని నాయకుడు నడుచుకుంటూ వెళ్లాడంటే ఆ తోవంతా వర్ణించాల్సిందే! ఆయన కథలోని ముఖ్య పాత్ర నిలబడి ఉందంటే  దాని రూపురేఖలన్నీ కళ్లకు కట్టాల్సిందే! భాష మీద పట్టు లేకపోయినా, భావప్రకటనలో నిజాయితీ లేకపోయినా... ఇలాంటి ప్రయత్నంతో పాఠకుడు విసిగిపోక తప్పదు. కానీ రాజారాం కథలలో ఉండే ఈ వివరణా విశ్లేషణలే ఆయన కథలకు ఆయువుపట్టులా తోస్తాయి. పాఠకుడిని కూడా సన్నివేశంలో పాత్రగా మలుస్తాయి.

 

మధురాంతకం రాజారాం కథలు అనేక సంపుటాలుటా వెలువడ్డాయి. వాటిలో విశాలాంధ్రవారు ప్రచురించిన నాలుగు సంపుటాలు ఇప్పటికీ ఆదరణకు నోచుకుంటున్నాయి. ఆయన రచనా శైలి గురించి చెప్పుకొన్నాక అందుకు ఒకటి రెండు ఉదాహరణలను కూడా చెప్పుకోవడం భావ్యంగా ఉంటుంది. ‘సర్కసు డేరా’ అనే కథలో రాజారాం బయటకు ఆకర్షణీయంగా కనిపించే సర్కసులోని జీవితాల గురించి ఊహిస్తారు. ‘‘సోదరులారా! మీరు మా అందచందాల్ని మాత్రమే చూస్తారు. ఈ అందచందాల వెనుక మమ్మల్ని కత్తుల ఎదుట నిలబెట్టి, ఒంటి చక్రాల సైకిళ్లెక్కించి, మంటల మధ్య పరుగులు తీయించే కడుపు కక్కుర్తిని మీరు చూడరు. కుందేలు కనబడగానే నాలుక చాచి చొంగలు కార్చుకుంటూ వెంటాడే జాగిలంలా, మాటిమాటికీ మాపై విరుచుకుపడిపోవడానికి పుంకించే కాముకత్వం బారి నుంచి తప్పుకుంటూ, నా అన్న వాళ్లకు దూరంగా పది రోజులకొక మకాముగా మేమెందుకిలా దుర్భర ప్రవాసక్లేశం అనుభవిస్తున్నామన్న సంగతి, తొమ్మిది గంటలప్పుడు యిళ్లల్లో భోజనం చేసిన హాయిగా తాంబూలం నములుతూ భార్యాబిడ్డలతో సహా వచ్చి సర్కసు డేరాలో కూచున్న మీకు అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు. మీకు మాలాంటి తోబుట్టువులుండకపోరు. మీకు మాలాంటి కూతుళ్లుండకపోరు. వాళ్లు గడప దాటకుండా కాపురాలు దిద్దుకోవడమే మీకిష్టం. కానీ మేమిన్ని కాదు మరిన్ని సాహస కార్యాలు చేసి, ఇంతకాదు మరింత నగ్నంగా మా అందచందాల్ని ప్రదర్శించడం మీకానందం! అవును మరి. శరీరాలు మీవి కానప్పుడు, మేము కాశిదాకా ప్రాకినా మీకు నష్టమయ్యేదేమీలేదు. ఎవరికో నష్టం కలుగుతోందని చింతించడం మానవ స్వభావం కాదు. ఇది సర్కసు డేరాకు మాత్రమే పరిమితమయిన న్యాయం కాదు. లోకపు తీరే ఇంత!’’ అంటూ వారి ఆత్మఘోషతోనే మనల్ని ఎండగడతారు రచయిత. అంతేకాదు! కేవలం సర్కసులో చేసే విన్యాసాలే అద్భుతాలు కాదనీ, నిరుపేదలు రోజువారీ పడే అగచాట్లు ఆ ఫీట్లకి ఏమాత్రం తీసిపోవని నాగులు అనే ఓ పాత్ర ద్వారా వివరిస్తారు. పేదవాడికి జీవితమే ఓ సర్కస్‌ అని తేలుస్తారు.

‘సర్కస్‌ డేరా’లో పేదవాడి బతుకుచిత్రం కనిపిస్తే ఛిద్రమవుతున్న బంధాల గురించిన ఆలోచన ‘ఎడారి కోయిల’ అనే కథలో ప్రతిఫలిస్తుంది. అలెక్స్‌ హెయిలీ రాసిన ఏడు తరాలు (రూట్స్) పుస్టకాన్ని ఉట్టంకిస్తూ, మూలాలకు దూరమయ్యే ప్రతివాడూ దురదృష్టవంతుడే అన్న భావనను కలిగిస్తారు రాజారాం. ‘... అదంతా ఒక విజేతల వర్గం. విజేతలైన వారికి పరాజితుల పట్ల ఇసుమంతైనా సానుభూతి ఉండటం లేదు. ప్రేమ, త్యాగం, మమకారం, ఆత్మీయత మొదలైనవి వాళ్ల పాలిటికి అర్థహీనమైన పదాలుగా తోస్తాయి. స్వార్థమే వాళ్ల జీవితానికి పరమార్థమైపోతుంది. సంగ్రహంగా ఇది ఈనాటి సామాజిక చరిత్ర అయి ఉండాలి’ అంటూ సంపద కోసం బంధాలను దూరం చేసుకునేవారి గురించి ముక్తాయింపుని ఇస్తారు.

రాజారాం కేవలం మధ్యతరగతి వారి గురించే రాయలేదు. అలాగని నిరంతరం పేదల గురించిన కథలే వెలువరించలేదు. తనని కదిలించిన ప్రతి జీవితన్నీ పైకెత్తి చూపించారు. కష్టం, మంచితనం ఉన్న ప్రతి సందర్భాన్నీ తన కథలలో ప్రతిఫలించారు. తన కథలకుగాను కేంద్ర సాహిత్య అవార్డు బహుమతి, గౌరవ డాక్టరేట్‌ వంటి పురస్కారాలు ఎన్నింటినో అందుకున్నారు. ఆయన కథలను గుండెల్లో పెట్టుకున్న తెలుగు లోకం పురస్కారాలకు అతీతమైన గౌరవాన్ని ఆయనకు ఏనాడో అందించేసింది.

- నిర్జర.