Facebook Twitter
సాహసవీరుడి కథ

సాహసవీరుడి కథ

అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఇద్దరు కొడుకులు. వాళ్లు ఒక రోజున పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ పెళ్ళి చేసుకునేందుకు ఒక్క అమ్మాయి కూడా దొరకలేదు!

దాంతో వాళ్లిద్దరూ వాళ్ళకు కావలసిన రాకుమార్తెల్ని వెతుక్కొని రావాలని నిశ్చయించుకున్నారు. మరుసటి రోజున ఇద్దరూ గుర్రాల మీద ఎక్కి అడవిమార్గం గుండా ప్రయాణం‌ మొదలు పెట్టారు. అట్లా చాలా దూరం వెళ్ళాక, వాళ్లు పోతున్న దారి చీలింది- ఒక వైపుకు పోతే ఒక రాజ్యం, రెండో వైపుకు పోతే రెండో రాజ్యం‌ వస్తాయి.

అప్పుడు వాళ్లు ఇద్దరూ ఏమనుకున్నారంటే- “ముందుగా మనం ఇక్కడ రెండు మొక్కలు నాటుదాం. తర్వాత ఇద్దరం తలా ఒక దారీ పట్టుకొని పోదాం. మనకు ఎదురైన రాజ్యాలలో‌ మన మనసులకు నచ్చే రాకుమార్తెలు ఉన్నారేమో చూద్దాం, వీలైతే పెళ్ళి కూడా చేసుకుందాం! ఏది ఏమైనా సరే, మూడు నెలల్లో ఇక్కడికి తిరిగి వచ్చేయాలి. మనిద్దరిలో ఎవరం వచ్చినా సరే, ఇక్కడ రెండోవాడు నాటిన మొక్కను చూడాలి. అది బాగుంటే సోదరుడు బాగున్న్నట్లే లెక్క. వాడికోసం ఇక్కడే ఆగి ఎదురు చూడాలి. అట్లా కాక అది గనక వాడి పోయి ఉంటే వాడు కష్టాలు ఎదుర్కొంటున్నట్లు లెక్క. వాడికి 'సహాయం కావాలి' అని అర్థం, అదే ఆ మొక్క గనక పూర్తిగా చనిపోయి ఉంటే సోదరుడు చనిపోయాడన్న మాట! అప్పుడు ఇక అతని కోసం ఒక్క క్షణం కూడా ఆగనక్కర లేదు. సరేనా?” అని.

"సరే" అని ఇద్దరూ చెరొక దారిని పట్టుకొని పోయారు.

చిన్నవాడు అట్లా పోతుంటే అతనికి అందమైన రాజకుమార్తె ఒకామె ఎదురైంది. అటువైపు ఉన్న ఆ రాజ్యం ఆమెదేనట! వేటకోసమని ఆమె అడవికి వచ్చింది. అయితే తోటి సైనికులనుండి వేరుపడి అడవిలో దారి తప్పింది. దాహమై, నీళ్ళకోసం వెతుక్కుంటోంది.

 

"నాకు కూడా దాహంగానే ఉంది- పద- ఇద్దరం కలిసి నీళ్ళు వెతుక్కుందాం" అన్నాడు తమ్ముడు. అట్లా పోతుంటే వాళ్లకు ఒక చిన్న గుడిసె కనబడింది. గుడిసె తలుపు తట్టి, "కొంచెం నీళ్లు ఇస్తారా" అని అడిగారు వాళ్ళు.

అంతలోనే గుడెసె లోపలి నుంచి 'రాయిగా మారిపో!' అని వినబడింది. వెంటనే చిన్న రాకుమారుడు, ఆ రాజకుమార్తె ఇద్దరూ- ఉన్నవాళ్ళు ఉన్నట్లే- రాళ్ళుగా మారిపోయారు!

ఇక పెద్దవాడు వెళ్తుంటే అకస్మాత్తుగా ఒక పులి అతని మీదికి దూకింది. రాకుమారుడు ధైర్యంగా పోరాడి, అతి కష్టం మీద దాన్ని తుదముట్టించాడు. దాని చర్మం, గోర్లు తీసుకొని అతను అవతలి రాజ్యం చేరుకున్నాడో, లేదో ప్రజలందరూ అతనికి జేజేలు పలికారు! అతన్ని తమ రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. “ఇన్నేళ్ళుగా మా వాళ్ళు ఎంతమంది ప్రయత్నించినా ఆ పులిని చంపలేకపోయారు. నువ్వు మహా వీరుడివి! నీకు మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాను!” అన్నారు రాజుగారు.

రాకుమారిని చూడగానే ఆమె నచ్చేసింది రాజకుమారుడికి! దాంతో వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగిపోయింది.

మూడు నెలలు కావస్తుండగా పెద్ద రాకుమారుడు తన భార్యకు, అత్తమామలకు చెప్పి, తను, తమ్ముడు విడిపోయిన చోటికి చేరుకున్నాడు. చూస్తే అక్కడ తమ్ముడు నాటిన చెట్టు వాడిపోయి ఉన్నది!

 

ఇంక ఆలోచించేది ఏమున్నది? తమ్ముడు ఏదో‌ కష్టంలో ఉన్నాడని గబగబా తమ్ముడు వెళ్ళిన దారి వెంట వెళ్ళాడు అన్న.

అక్కడ ఒక ఒంటరి గుడిసె, దాని ముందు రక రకాల సైజుల్లో‌ రాళ్ళు కనిపించాయి. వాటిలో ఒక శిలను చూడగానే తన తమ్ముడి పోలికలు గుర్తించాడు రాజకుమారుడు. దాంతో సంగతి అర్థమైంది. 'ఏం చెయ్యాలా?' అని ఆలోచిస్తున్నంతలో గుడిసెలో ఏదో అలికిడి అయ్యింది. రాకుమారుడు వెంటనే ఒక రాయి మాటున నక్కాడు.

గుడెసె తలుపు తీసుకొని ఓ ముసలి మంత్రగత్తె బయటికి వచ్చింది. అక్కడున్న రాయినొకదాన్ని చూసి విక వికా నవ్వుతూ “మీ‌ బ్రతుకు ఇంతే. నన్ను మాట్లాడించద్దంటే విన్నారా? అందరూ శిలలై పడి ఉన్నారు!” అన్నది గట్టిగా.

ఆమె మాటలు విన్న రాజకుమారుడు ఉగ్రరూపుడైపోయాడు. సర్రున కత్తి దూసి, మంత్రగత్తె ముందు దూకాడు. ఆమె తేరుకునేలోగా ఆమెను హతం చేసాడు!

మంత్రగత్తె చనిపోగానే అక్కడున్న శిలలన్నీ మనుషులుగా మారిపోయాయి. వాళ్లలో తన తమ్ముడిని చూసిన రాజకుమారుడి సంతోషానికి మేరలేదు. అటుపైన తమ్ముడి పెళ్ళి తను మెచ్చిన రాకుమారితో వైభవంగా జరిగింది!

 

Courtesy..
kottapalli.in