Facebook Twitter
చిన్న సూర్యుడు

 

చిన్న సూర్యుడు

 

ఓ గ్రామంలో పండితుడు ఒకాయన నివసిస్తూ ఉండేవాడు.

ఊళ్ళోవాళ్లందరికీ ఆయనంటే చాలా గౌరవమూ, మర్యాదానూ.

ఆయనకు ఒక కొడుకు. పేరు చిన్నయ్య.

చిన్నయ్యకు మాత్రం విద్యాగంధం అనేది ఏమాత్రమూ అంటలేదు.

తండ్రి దగ్గర చదువు నేర్చుకోవటం మాట అలా ఉంచి, మర్యాదగా మాట్లాడికూడా ఎరుగడు చిన్నయ్య.

మెల్లగా అతనికి పదహారు సంవత్సరాలు వచ్చాయి. ఇంకా అక్షరాలు గుర్తించటం కూడా రాదు. పనికొచ్చే పని ఒక్కటీ రాదు.

16సంవత్సరాల వయసులో మనిషి శరీరంలో ఏవేవో మార్పులు సంభవిస్తాయి. మన ఆలోచనా వ్యవస్థ, భావనల తీరు, మొత్తం చాలా సున్నితంగా తయారౌతై.

ఆ సమయంలోనే చిన్నయ్య మేనమామ ప్రక్కఊరినుండి వాళ్ళింటికి వచ్చాడు.

ఒక రోజంతా ఏమీ అనకుండా చిన్నయ్య పోకడల్ని గమనిస్తూ ఉన్నాడాయన. ఆ తరువాత ఊరికి వెళ్తూ, వెళ్తూ, చిన్నయ్య భుజంమీద చెయ్యివేసి ఊరి చివరి వరకూ తీసుకెళ్ళాడు, ఏవేవో సంగతులు మాట్లాడుతూ.

ఏం చెప్పాడో, ఏమో! వెనక్కి వచ్చే సరికి చిన్నయ్య చిన్నయ్యగా లేడు. అదే రోజు రాత్రి అతను ఇల్లు విడిచి పెట్టి వెళ్ళిపోయాడు.

ఆ తరువాత - అద్భుతమే అనాలి - ఆరు సంవత్సరాల తరువాత - అతని తెలివితేటలు, పాండిత్యం గురించి దేశమంతటా చెప్పుకోవటం మొదలైంది. సంస్కృతాంధ్ర భాషలు రెండింటిలోనూ అతని ప్రజ్ఞాపాటవాలు అసామాన్యమైనవని పండితులందరూ అంగీకరించారు. సంస్కృత 'నీతి చంద్రిక' ను తెలుగులో 'పంచతంత్రం' గా వ్రాసిన చిన్నయసూరి తన పేరును తెలుగు సాహిత్యంలో అజరామరం చేసుకున్నాడు. ఇంతటి అసమాన ప్రతిభను అతి కొద్దికాలంలో సాధించిన చిన్నయసూరి, తనకు 16సంవత్సరాలు వచ్చేంతవరకూ చదువుకోలేదంటే ఆశ్చర్యమనిపిస్తుంది.

ఈ అద్భుతానికి కారణం చిన్నయ్యలో జాజ్వల్యమానంగా వెలుగొందిన దీక్షా శక్తా?

లేక ఆ ఆరేడేళ్ళూ అతనికి విద్య గరపిన గురువుల దక్షతా?

గురువులు విద్యను అందించే మాధ్యమాలు మాత్రమే. వారినుండి పిల్లలు ఎవరికి తోచినంత జ్ఞానాన్ని వారు సేకరించుకుంటారు. దానికి అనువైన వాతావరణాన్ని బడి కల్పించాలి. అలాకాక, 'బళ్ళూ, గురువులూ పిల్లల్ని తోమటం' అనే ప్రక్రియ, ఎప్పుడు మొదలైందో గాని, అది పిల్లలకే కాదు, గురువులకూ బరువై కూర్చున్నది. -ఏమంటారు?

Courtesy..
kottapalli.in