TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
టోపీల వ్యాపారి
బషీర్ వృత్తి టోపీల వ్యాపారం. వాళ్ళ నాన్న కూడా టోపీలమ్మేవాడు. వాళ్ల తాతా అదే పని. బషీర్ ఈ పనిలో మెళకువల్ని, అందరిలాగే, తన తండ్రినుండి పుణికి పుచ్చుకున్నాడు. బషీర్ కు దుకాణం లేదు. అతను ఇల్లిల్లూ తిరిగి టోపీలమ్మేవాడు. టోపీలను చక్కగా మడిచి, దొంతరలుగా పేర్చి, గట్టి బట్టతో కట్టి తలపై పెట్టుకొని, ఊరూరా తిరిగి అమ్ముకునేవాడు. ఒక రోజున బషీర్ తలమీద బరువైన టోపీల మూటతో పోతున్నాడు, ఓ దారి వెంబడి. అప్పటికే అతను రెండు గ్రామాలు తిరిగి బాగా అలసిపోయి ఉన్నాడు. ఎండాకాలం. మధ్యాహ్నపు ఎండ దహించి వేస్తున్నది.
అతను ఊరికి దూరంగా, ఓ చెట్టుకింద ఆగి, తలమీది మూటను దించి, భార్య ఇచ్చిన భోజనపు డబ్బా తెరచి తృప్తిగా తిని, ఓ కునుకు తీశాడు. అలసిపోయి ఉన్నాడేమో బలంగా నిద్రపట్టింది. కళ్లు తెరచి చూసుకునేటప్పటికి, తన టోపీల మూట విప్పదీసి ఉన్నది. బట్ట పూర్తిగా నేల మీద పరచి ఉన్నది. టోపీలన్నీ మాయం! బషీర్ కంగారుగా అన్ని దిక్కులా వెతికాడు. చివరికి అతనికి తలపై టోపీ పెట్టుకొని కులుకుతున్న కోతి ఒకటి కనబడింది. తేరుకున్న బషీర్ తలెత్తి పైకి చూస్తే చెట్టు నిండా కోతులు! ప్రతికోతి తలపైనా తన టోపీనే! బషీర్ కు కళ్ల నీళ్లు వచ్చాయి. కోతులు తనకు టోపీల్ని తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు. వాటికి చిక్కిన టోపీలు పోయినట్లే. తన వ్యాపారం సర్వం ఈ నాటితో సరి. ఇంత పెద్ద దెబ్బను తట్టుకునేంత స్తోమతు తనకు లేదు. అయినా ఏదో ప్రయత్నం చెయ్యాలి గనక, అతను పైకి చూస్తూ అన్నాడు. " అయ్యా, కోతి సోదరులారా, కొంచెం దయ చూపండి. నా టోపీలు నాకు తిరిగి ఇచ్చెయ్యండి. నేను నాశనమైపోతే మీకు ప్రత్యేకంగా ఏమీ సంతోషం కలగదు గదా! అందుకని, ఇచ్చెయ్యండి. దయచేసి ఇవ్వండి. దయచేసి" అని.
కోతులు అతను చెప్పినదాన్ని శ్రద్ధగా విన్నై. కానీ ఏమీ చెయ్యలేదు. బషీర్ కి కోపం వచ్చింది. ఇక కోతుల్ని తిట్టడం మొదలెట్టాడు. "పిచ్చి కోతుల్లారా! టోపీలు పెట్టుకుంటే మీరు మరింత వికారంగా కనబడుతున్నారు. మర్యాదగా టోపీల్ని పడేస్తారా, లేకపోతే మిమ్మలనందర్నీ చంపెయ్యమంటారా?" అని చిందులు వేశాడు. కోతులు వెకిలిగా నవ్వాయి. బషీర్ కి నిజంగా కోపం వచ్చింది. ఒక కట్టెపుల్ల తీసుకొని , దాన్ని తీవ్రంగా ఊపడం మొదలెట్టాడు. దాని వల్ల కూడా పని జరగలేదు. కోతులకది వినోదంగా అనిపించింది. అవి కూడా చిన్న పుల్లల్ని తుంచి బషీర్ ని బెదిరించటం మొదలెట్టాయి. ఎలాగూ కట్టెపుల్లలకి అందనంత దూరంలో ఉన్నామని వాటికి తెలుసు! బషీర్ ముఖం కోపంతో ఎర్రబారింది. అతను నేలమీది నుండి రాళ్లు ఏరి, కనబడిన కోతిమీదికల్లా విసరటం మొదలుపెట్టాడు. కానీ అవి రాళ్లకు అందకుండా తప్పించుకుంటున్నాయి. విసిరీ విసిరీ బషీరే అలసిపోయాడు తప్పిస్తే, ఒక్క టోపీ కూడా కిందికి రాలేదు. కోతులకు ఇంకా సంతోషమైంది. అవి కొమ్మ నుండీ కొమ్మకు దూకుతూ ’గుర్ గుర్’ మనటం మొదలెట్టాయి ఆటగా.
బషీర్ అలసిపోయాడు - శారీరకంగాను, మానసికంగా కూడాను. రెండు చేతుల్తోటీ తల పట్టుకుని నేలపైనే చతికిలబడ్డాడు. ఏం చేయాలో పాలుపోలేదు అతనికి. కొంచెంసేపు కదలకుండా కూర్చున్న తరువాత అతను కొద్దిగా సమాధానపడ్డాడు. క్షణకాలం పాటు, తను మోస్తున్న ఆర్థిక భారాన్ని మరిచిపోగల్గాడు. నిటారుగా నిలబడి, తన నెత్తి మీదున్న టోపీని తీసి చేతిలో పట్టుకొని, "మీరు వినరు కదూ? అయితే తీసుకోండి, దీన్ని కూడా- ఈ ఒక్కటీ నాకెందుకు?" అని, దాన్నీ నేల మీద పడేశాడు- నిరాశగా. అతన్నే గమనిస్తున్న కోతులన్నీ- ..అలాగే చేశాయి!! -తమ నెత్తి మీదున్న టోపీల్ని తీసి అవికూడా నేల మీదికి గిరాటేశాయి. వివిధ రకాల టోపీలు - రంగురంగుల టోపీలు - చిన్నవి, పెద్దవి- టోపీలతో నేలంతా నిండిపోయింది! బషీర్ నోట మాట రాక నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. తేరుకోగానే అతను టోపీలన్నీ ఏరుకొని తిరిగి మూటగట్టుకున్నాడు. " నేనేం చేయాలో నాకు తెలుసని నేను అనుకున్నంత కాలమూ నాకేమీ తెలీలేదు. కానీ నాకేమీ తెలీదన్నపుడు, నాకు తెలిసి వచ్చింది!" అనుకుంటూ. (మీకేమన్నా తెల్సిందా?) ఈ కథ పిల్లలందరికీ తెల్సిందే అయినా దాన్ని ఈ రీతిగా చెప్పిన ఘనత శ్రీ పర్తాప్ అగర్వాల్ గారిది. వారికి అనేకానేక ధన్యవాదాలు.
Courtesy..
kottapalli.in