Facebook Twitter
ప్రియ ముళ్ళవనే... కథ

ప్రియ ముళ్ళవనే... కథ

 

- రచన : పద్మిని - హర్ష

 

' ప్రియ ముళ్ళవనే...ప్రియ ముళ్ళవనే...విరహవుమెందొరొ మధురం...' శ్యామలి తన్మయత్వంలో పాడుకుంటూంది. 'అబ్బబ్బా...ఆ పాటే నిన్నటినుంచీ పాడి పాడి చంపుతున్నావ్...ఇంక చాలు తల్లీ..ఆపు నీ ఆడ మళయాళం గోల! " ఈశ్వర్ విసుక్కున్నా, శ్యామలి పాట ఆపటమే లేదు. ఇంకా, నవ్వూ, పాటా రెండూ కలిపి..గొంతు పెంచి మరీ పాడుతోంది. ఈశ్వర్ చెవులు మూసుకుని, బైటికి వెళ్ళిపోయాడు. శ్యామలికీ పాటల పిచ్చి బాగానే ఉంది. ఇప్పుడీ పాట ఆమే ఫేవరెట్ సాంగ్. ' కత్తీ పోయె డోలూ వచ్చె ఢాం ఢాం ఢాం అని సామెతున్నట్టు, ఆయుర్వేద తైల చికిత్స మాటేంటొగానీ, నీకీ మళయాళం పాటల పిచ్చి మాత్రం బాగానే పట్టుకుందీమధ్య. చస్తున్నాన్నేను..' అని వేళాకోళం కూడా చేస్తుంటాడు ఈశ్వర్ యెప్పుడూ..నిజమే ...ఇలా తను మారటానికి దారితీసిన క్రమమంతా సినిమా రీల్ లాగ గుర్తొచ్చింది శ్యామలికి..
.........
' నా దుంప తెంచావ్ నిన్నటినుంచీ! కేరళా వైద్యం చేయించుకోవే నీ మోకాలి నొప్పికి అని..పోనీలే చిన్ననాటి ఫ్రెండ్ వి కదా నీ మాట విందామని నీవిచ్చిన అడ్రెస్ పట్టుకుని ఇక్కడికొస్తే..చెమటలు పట్టిస్తూందీ అడ్రెస్..ఓ పట్టాన కనపడి చస్తేగా? మహాతల్లీ! నా వల్లకాదిక..'

కిసుక్కున నవ్వావైపునుంచీ.. మళ్ళీ మంజుల గొంతు.

.యేంటీ? నా పాట్లు పడలేకే చెప్పావా..సడేలే....అబ్బబ్బా...సరిగ్గా వినబడటం లేదే..రోడ్ నెంబర్ 8 లో ....యెడమ వైపు రెండో సందులో....?
..........
' ఆఆ. చివరో హెరిటేజ్ అడ్వర్టైజ్మెంటున్న షాపుందే తల్లీ!
.........
' ఆ...ఆగాగు...స్కూటీ ఆపనీవే తల్లీ..ఆఆ..ఇది మరీ బాగుందే...అదేదో మాయల మరాఠీ ప్రాణంలాగ ఇలా చెబుతున్నావేంటే? పాల షాప్ వాడు డాక్టర్ ఇల్లు అడ్రెస్ చెబుతాడా. .ఇంతసేపూ ఇక్కడే యీ అడ్రెస్ చేతిలో పట్టుకుని తిరుగుతున్నా చచ్చేట్టు... !
. ..........
' ఆఆ.. భలే చెప్పొచ్చావులే. ఒక్కోసారి మన యెదురుగా వున్న ఇళ్ళే మనకు సరిగ్గా కనబడవు..అప్పుడే ఇలాంటి వుపాయాలు ఆలోచించాల్సింది అంటున్నావ్? నీకే ఇలాంటి తిప్పలొస్తే...అప్పుడు తెలుస్తుందిలే అమ్మగారి సంగతి! ..అర్జునునికి గీతాచార్యునిలా భలే బోధచేశావ్ లే! !...సరేలే..థాంక్స్ తల్లీ! ఆ షాప్ వాణ్ణడుగుతా.., డాక్టర్ ఇల్లు చెప్పకపోయాడా..నీ పని చెబుతా...'
' ..........'
శ్యామలి మాట్లాడుతూనే, షాప్ లోకి వెళ్ళింది. అక్కడో పెద్దాయనున్నాడు.

'ఆ..పెద్దయ్యా.. ఇక్కడ డా. అంబుద గారి ఇల్లెక్కడ చెబుతావా? ?'

' డా. అంబుద మేడమా? ఆయమ్మ, రెండ్రోజులాయ బిడ్డా.. రోడ్ నంబర్ 10కి మారిపోయి గీడ బిల్డింగ్ సరిపోడం లేదంట ....ఆడ, గణేశ్ కిరానా దుక్నం పక్కన పచ్చ బిల్డింగ్ల రెండో మంజిల్ల పెద్ద ఇల్లు రెంట్కి దీస్కుంది ..సూడు..'

'థాంక్స్ పెద్దయ్య..' శ్యామలి షాప్నుండీ బైటికి వచ్చి మంజులకు ఫోన్ కలిపి క్లాస్ పీకింది..'ఆఆ..నీకేం బహుమతిస్తానో తెలుసా? రెండు పిడిగుద్దులూ, నాలుగు మొట్టికాయలూ ..భలేగా చెప్పావుగా అడ్రస్ ?' చెమటతో తడిసిపోయిన మొహం తుడుచుకుంటూ స్పీకర్ ఆన్ చేసింది శ్యామలి ఇంతసేపూ తనకీ సంగతి తట్టనందుకు తనను తాను తిట్టుకుంటూ!

'ఇది మరీ బాగుందే శ్యాం? ఆవిడ వున్నట్టుండి ఇల్లు మారితే నాదా తప్పు? సారీనే..ఇంతకూ అ షాపతను కొత్త అడ్రస్ కూడా చెప్పాడుగా.నేనే గెలిచాకదా! ఇంకే.బయలుదేరు నీ పంచకల్యాణి మీద? ' కిసుక్కున నవ్వు అటువైపు.

శ్యామలీ నవ్వాపుకుంటూ 'సరేలేవే. .అడ్రెస్ కనుక్కుని , డాక్టర్ను కలిసి వెళ్తాలే..పాపం నువ్వేదో నాకు మంచి చెయ్యాలనేగా యీ డాక్టర్ గురించి చెప్పింది.చూద్దాం.ఫోన్ చేస్తా ఈవెనింగ్....వుంటా ..'

హమ్మయ్య!మొత్తానికి శ్యామలి డా. అంబుద కేరళ ఆయుర్వేద మసాజ్ చెంటర్ కు చేరుకుంది. డాక్టర్ చాలా ఆప్యాయంగా వివరాలు కనుక్కుంది. అమెరికాలో కూతురూ, అల్లుడూ, మనుమళ్ళతో, డిస్నీలాండ్ లో తిరుగుతున్నప్పుడు, హఠాత్తుగా పలుకరించి పిక్కల్ని పట్టేసిన మాయదారి నొప్పి గురించీ, తానక్కడ దొరికిన తైలాలతో సొంతంగా మసాజ్ చేసుకుని, హాట్ వాటర్ బాగ్ తో కాపడం పెట్టుకుని, నొప్పి యెలా కంట్రోల్ చేసుకుందో, ఇక్కడికి వచ్చిన తరువాత, తన స్నేహితురాలి ద్వారా ఇక్కడికి యెలా వచ్చిందో అన్నీ వివరంగా చెప్పింది. శ్యామలి చెప్పిన వివరాలన్నిటినీ శ్రద్ధగా విని, నోట్ చేసుకుంది డాక్టర్ అంబుద . మోకాలి నొప్పికి ఆయిల్ మసాజ్ మంచి ట్రీట్మెంట్ అంది. ఆపరేషన్ అవసరం లేకుండా చేస్తామనన్నది. శ్యామలికూడా, తన ఫ్రెండ్ మంజుల వాళ్ళ బంధువిక్కడే ట్రీట్ మెంట్ తీసుకుందనీ, రిలీఫ్ కనిపించిందనీ, తన సలహా పైనే ఇక్కడికి వెతుక్కుని మరీ తను వచ్చిందనీ చెప్పగానే, డాక్టర్ చాలా సంతోషించింది. 'అంబుద అంటే ? మాటల్లో అడిగింది శ్యామలి. 'మేఘమండీ' చక్కటి తెలుగులో బదులిచ్చింది డాక్టర్ నవ్వుతూ! అంబుద..యెంత చక్కటి పేరో! మళయాళం పాటల్లోనూ సంసృతం బాగానే వాడుతారు..యెప్పుడైనా చెవిన పడినప్పుడు తను గమనించిన విషయమిది!

తనకు పూర్తిగా నమ్మకం కుదిరితేనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చనీ, పదహారు సీట్టింగ్ లకూ, పదిహేను వేలవుతుందనీ, నచ్చితే, రేపటినుంచే మొదలెట్టవచ్చనీ చెప్పింది డాక్టర్ అంబుద . డబ్బు మాట వినగానే ఆలోచనలో పడింది శ్యామలి. 'ఒకే విజిట్లోనే ఒప్పుకోవాలని రూలేమీ వుండదెక్కడైనా కదా!' అనుకుని, ఇంటికెళ్ళి, హజ్బెండ్ తో మాట్లాడి ఫోన్ చేస్తానని చెప్పి, బయట పడింది అప్పటికి!

ఇంట్లో శ్రీవారితోనూ, స్నేహితురాలు మంజులతో మరోసారీ చర్చించింది శ్యామలి. బైట యే డాక్టర్ దగ్గర్కి వెళ్ళినా, ఆ టెస్టులూ, యీ టెస్టులూ అంటూ, వేలకువేలవటమెటూ వుంటుంది. ఇక అల్లోపతీ మందుల సంగతి చెప్పేదేముంది? ఖర్చూ, దానికి తగ్గట్టు, వేరే ప్రభావాలూ చూపిస్తాయనీ వాళ్ళూ వీళ్ళూ అంటూనే వుంటారాయె! కేరళ ఆయుర్వేద తైల చికిత్స..ఆ పేరే యెంతో బాగుంది. పైగా ఆయుర్వేదం కూడా! సహజ సుందరమైన కేరళ అందాలలాగే, యీ చికిత్స కూడా, మనస్సునిట్టే ఆకర్షిస్తుందని శ్యామలి నిశ్చితాభిప్రాయం. అందుకే దీనికి వెళ్ళాలనే నిర్ణయించుకుంది శ్యామలి. అనుకున్నదే ఆలస్యం-డేటూ, టైమూ కూడా ఫిక్స్ చేసుకుంది. ఇక వెళ్ళటమే తరువాయి..
....
శ్యామలి డా. అంబుద క్లినిక్ కి చేరుకుంది. ఓ ఐదు నిముషాలు కూర్చున్న తరువాత, ఓ రూంలొకి రమ్మని పిలిచారు. అక్కడ, అంబుద గారితొపాటూ, మరో ముగ్గురు ఆడవాళ్ళు. ముఫై ఐదు నలభైయేళ్ళున్నావిడా, పదహారు పదిహేడేళ్ళ అమ్మాయీ, యిరవై యేళ్ళ యువతీ వున్నారు. అంబుద ఇంగ్లీష్ లో చెప్పింది - బట్టలు విప్పి, నడుము చుట్టూ, ఒక లంగోటా లాంటి తెల్లటి తుండుగుడ్డ చుట్టుకొమ్మని! శ్యామలికి చెప్పొద్దూ, కాస్త సిగ్గేసింది! వున్నది ఆడవాళ్ళే ఐనా, ఉన్నఫళాన బట్టలు మార్చుకొమ్మంటే యెలా వాళ్ళముందే! అల్మారా కేసి తిరిగి, ఓ తలుపు మూసి, బట్టలు మార్చుకుంది శ్యామలి. ఇవన్నీ తమకు మామూలే అన్నట్టు, చూస్తున్నారా ఇద్దరూ! యెదురుగా వున్న చెక్క మంచంపైకెక్కి వెల్లకిలా పడుకొమ్మన్నారు. సిగ్గు సిగ్గుగానే పడుకుంది శ్యామలి. డాక్టర్, శ్యామలిని మాటల్లో పెట్టింది. అమెరికా ట్రిప్ లో యేమేమి చూశారంది. శ్యామలి కూతురూ, అల్లుళ్ళ చదువూ, వుద్యొగ వివరాలూ అడిగింది. శ్యామలి మాటలు వింటూ వింటూనే, మధ్యలో, వాళ్ళీద్దరికీ, మళయాళంలోనే యేవో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుంది.

ఇంతలో యెవరో తలుపు తట్టారు. శ్యామలి చటుక్కున ముడుచుకుపోయింది బల్లమీద!

డా. అంబుద అంది. 'కంగారు పడకండి.యెవరూ రారు లోపలికి. నేవెళ్తాను. వీళ్ళిద్దరూ చూసుకుంటారిక్కడ! ఆ..మీరు వెళ్ళేటప్పుదు, దాహమైతే, వీళ్ళను నీళ్ళివ్వమని అడగంది తప్పక! దాహం వేస్తుంది కూడా!' అంటూ బైటికి దారి తీసింది, ఆ ముఫైయేళ్ళావిడను వెంటపెట్టుకుని! శ్యామలికి మనసులో ఓ వైపు సంకోచం! అక్కడున్న ఇద్దరమ్మాయిలూ తమకివన్నీ అలవాటేనన్నట్టు, శ్యామలి ఒంటిపై, ముందే గోరువెచ్చగా కాచి పెట్టుకున్న పరిమళభరిత తైలాన్ని అరచేతులనిండా తీసుకుని, పాదాలూ, పిక్కలూ, నడుము భాగమూ, చాతీ, భుజాలూ- ఇలా అన్నిటిపైనా వేసి, మసాజ్ మొదలెట్టారు - తమలో తామే మళయాళంలో మాట్లాడుకుంటూ! ఇద్దరమ్మాయిల్లో పదహారేళ్ళమ్మాయి , చామనచాయకంటే ఓ పిసరు యెక్కువే వుంది.ముక్కూ, కళ్ళూ, పళ్ళూ బాగానే ఉన్నాయి. కాసేపటికి ఇద్దరమ్మాయిలూ ఇద్దరూ గొంతులు తగ్గించి, గుస గుసగానే, బోలెడన్ని సంగతులు మాట్లాడేసుకుంటున్నారు. ఒకసారి, యెవరిగురించో ఫిర్యాదుల్లా, మరో సారి ఆనందాన్ని పంచుకుంటున్నట్టు కళ్ళల్లో మెరుపులు! మరో సారి, తెగ నవ్వులూ! యీ మళయాళం లో యెక్కువగా సంస్కృత పదాల వాడకం యెక్కువ. శ్యామలి అప్పుడప్పుడూ, ఏసియా నెట్లో, పాటల పోటిలు చూస్తుంటుంది. చాలా వెరైటీగా వుంటాయవి! వాళ్ళు పాడే పాటల్లోనూ, సంస్కృత పదాలెక్కువగా వినిపిస్తుంటాయి కూడా! కానీ, వాళ్ళు మాట్లాడే విధానం - యేదో ప్రత్యేకంగానే వుంటుంది. యే పదాన్నీ నొక్కి పలక్కుండా, గాల్లో తేలిపోతున్న ఫీలింగ్ వింటుంటే! మొదటమ్మాయి చేతులంత పట్టుగా మసాజ్ చేస్తున్నట్టు లేదు. మాటలపై ఉన్న శ్రద్ధ పనిలో లేదీ పిల్లకు!రెండో అమ్మాయి మనిషిలో ఆకర్షణ లేకున్నా గొంతు తియ్యగానూ, చేతి పట్టూ బాగానే వుందనిపించింది శ్యామలికి! వాళ్ళ మాటలు వింటూ వింటూ, తాను పడుకుని వున్న చెక్క బల్లపై సీలింగ్ లో ఉన్న కథాకళి చిత్రాలనూ, పేరుతెలియని పువ్వులనూ చూస్తూ పడుకుంది శ్యామలి.

భుజాలూ, చేతులూ, అరచేతులూ, చేతివేళ్ళూ, గుండెదగ్గరా, నడుము కింద భాగమూ, పిక్కలూ, పాదాలూ, కాలి వేళ్ళూ- ఇలా అన్ని భాగాలమీద కాసేపు మసాజ్ ముగిసింది.తరువాత, మంచి సువాసనతో నులివెచ్చగా వున్న నీళ్ళు, తీర్థమిచ్చే చెంబులాంటి పాత్రతో ఒంటిమీద పైనుంచీ పడేలగా యేదో పెద్ద పాత్రనుంచీ కాస్త కాస్త తీసుకుంటూ పోశారు ఓ పదిహేను నిముషాలపాటు! శ్యామలి ఇంగ్లీషులోనె వాళ్ళనడిగింది - ఇదేమిటని! వాళ్ళూ వచ్చీరాని ఇంగ్లీషులోనే జవాబు చెప్పారు-ఆ నీళ్ళలో, యెవో ఔషధవిలువలున్న వేళ్ళపొడిలాంటివి కలిపారట! శ్యామలికి సంతోషం వేసింది. అల్లోపతీ, ఆ పతీ, యీ పతీ అంటూ వేరే వైద్యాల జోలికి వెళ్ళకుండా, అసలు సిసలైన భారతీయ వైద్యం తను చేసుకుంటున్నందుకు కాస్త గర్వం కూడా కలిగింది! థాంక్స్ టు ఫ్రెండ్షిప్! మొత్తానికి, యీ కోర్స్ అయ్యేంతలో, తను చకచకా నడవగలుగుతుందనే నమ్మకం వచ్చేసింది.
..................
ఇలాగే మరి రెండు రోజులు జరిగింది. శ్యామలి, ఇంగ్లీషులోనే వాళ్ళను తన సందేహాలడగటం, వాళ్ళూ అలాగే సమాధానాలు చెబుతుండటంతో వాళ్ళిద్దరితో కాస్త దోస్తీ పెరిగింది కూడా! తరువాత రెండు రోజుల్లోనూ, వైద్య విధానం ఇలా జరుగుతుంటే, శ్యామలికి తాను ఇలా మరీ మూగ మొద్దులా పడుకుని వుండటం నచ్చలేదు. అసలే తనకు చిన్నప్పటినుంచీ వాగుడుకాయ అనే పేరు మరి! ఈశ్వర్ కూడా యీమాటే అంటుంటాడు యెప్పుడూ! మనుషుల మధ్య అనుబంధాలు పెరిగేందుకు మాటల పందిరి అవసరమని శ్యామలి ఘంటాపధంగా చెబుతుంది. ఇప్పుడూ, అదే పని మొదలెట్టింది. ఆ ఇద్దరు అమ్మాయిలతో మాటా మాటా కలిపింది. తన వివరాలూ చెప్పింది. పాటలు పాడింది. వాళ్ళిద్దరూ వుత్సాహంగా తమను గురించి చెప్పుకున్నారు. కానీ ఆ విషయాలు విని ఆశ్చర్యపోయింది. కానీ బైట పడలేదు. యెందుకంటే, ఇంత చిన్న వయసులో, కుటుంబాలకు దూరంగా వుంటున్న వాళ్ళిద్దరూ ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయి వుండటమే! పదహారేళ్ళమ్మాయి ప్రియుడు ఇప్పుడు డిగ్రీ ఫష్టియర్లో వున్నాడట అల్లిప్పీలో! ఇద్దరి అమ్మా నాన్నలకు వీళ్ళిద్దరి ప్రేమ గురించీ తెలుసునట! ఇక రెండో అమ్మాయి ప్రియుడు ఇక్కడే, యీ సెంటర్లోనే వుద్యోగం చేస్తున్నాడట! వీళ్ళిద్దరి గురించీ ఇళ్ళల్లో తెలుసట! రెండేళ్ళతరువాత వీళ్ళ పెళ్ళట! ఇద్దరి సంగతీ తెలిసిన తరువాత, శ్యామలి ఒకింత ఆలోచనలో పడింది. మంజులతొ అంటే, తేలిగ్గా కొట్టిపడేసిందీ విషయాన్ని ' అబ్బే యెన్ని చూడలేదు మనమిలాంటివీ? ఇవన్నీ వానకాలం ప్రేమల్లేవే!' అంటూ! ఇంతకీ మొదటమ్మాయి పేరు సహనా, రెండొ పిల్ల పేరు సదియా! సదియా అంటే సత్యవతి లాంటి అర్థం! పేర్లైతే బాగున్నాయి మరి వాళ్ళ ముందు జీవితాలె లా వుంటాయోనని అప్పుడప్పుడూ ఆలోచనలో పడుతూనే వుంది శ్యామలి!

ఈలోగా, వాళ్ళిద్దరితో దోస్తీ బాగానే పెరిగింది. మూడు నాలుగు రోజుల జల వైద్యం, తైలం తో మసాజ్ తరువాతేమి చేస్తారని అడిగింది శ్యామలి వాళ్ళను! ఒక పల్చటి బట్టలో, ఆయుర్వేద మిశ్రమాలను కట్టి వుంచిన 'కీళి' అనే మూటలాంటి దాన్ని, వేడి వేడి తైలంలో ముంచి, దానితో, దేహమంతా కాపడం పెడతారట!

ఇంటికి వెళ్తూనే, యేరోజుకా రోజు ఆయుర్వేద తైల చికిత్సలో యేంచేశారో ఈశ్వర్ కు పూస గుచ్చినట్టు చెబుతున్నట్టే, ఇక్కడి అమ్మాయిల వ్యవహరమూ చెబుతూనే వుంది శ్యామలి! ప్రేమ కథ అనగానే ఈశ్వర్ కు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది కస్త! సహన ఓరోజు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడించిందనిందోరోజు! మరో రోజు సహన, తనీమధ్య తన లవర్ కోసం కొన్న సెల్ చూపించిందట కూడా!

సదియా, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండూ ఇద్దరూ కలిసి పాటలు వింటున్నారటోరోజు! ఆదివారమవటం వల్లా డాక్టర్ రారు. అందుకని, సహన ఒక్కతే కాసేపు మసాజ్ చేస్తుండగా, కాసేపటికి సదియా వచ్చిందట! అన్నట్టు ఓ రోజు తానో తెలుగు పాత పాడితే, సదియా దానికి మళయాళం మాతృక పాడిందట కూడా! 'రోజావే చిన్ని రోజావే,' 'యెంత కాలం యెంత కాలం, కాలమాగి పోవాలీ '. ఇలా! అదిగో..ఆ క్రమంలొనే సదియా పాడిన యీ మళయాళం పాట తెగ నచ్చింది శ్యామలికి! ఆ పాటను యూ ట్యూబ్ లో యెన్ని సార్లో చూసి మరీ తరించింది! మధుశ్రీ నారాయణ్ అన్న గాయని పాడిన ఆపాట శ్యామలి ఫేవరెట్ సాంగ్ ఇప్పుడు! 'కిళి' తో ఒంటిమీద కాపడం పెట్టేటప్పుడు, పాట తాళానికి అనుగుణంగా, సదియా, తనూ, 'ప్రియ ముళ్ళవనే' పాట పాడుకోవటం హైలైట్ శ్యామలికి! మొత్తానికి ఆ అమ్మాయి గొంతులో యేదో మత్తుంది! అది తెగ నచ్చింది తనకు!

యీ పదహారు సిట్టింగులూ యేకధాటిగా జరగలేదు. శ్యామలికి కాస్త జ్వరం రావటమొక కారణం కాగా, వేరే వూళ్ళలో దగ్గరి బంధువుల పెళ్ళిళ్ళు అటెండ్ కావలసి రావటం వల్లా, ఓ వారం రోజుల బ్రేక్ వచ్చింది. శ్యామలికేదో పేద్ద గాపే వచ్చినట్టు ఫీలింగ్. వైద్యం సంగతెటున్నా, అ ఇద్దరమ్మాయిలతో వారం పదిరోజుల సాన్నిహిత్యమూ, ఆ కర్పూరాది తైల చికిత్సా తెగ నచ్చాయి. పైగా, కర్పూర పరిమళానికి, పాటల సౌరభమూ కలిసి, శ్యామలికి, యెన్నో రోజులైనట్టనిపించింది వాళ్ళిద్దరినీ చూసి!

వూరినుండీ తిరిగి వచ్చిన తరువాత అలసటా...మళ్ళీ రెండ్రోజులగ్గానీ, తైల చికిత్సవైపు వెళ్ళలేక పోయింది శ్యామలి. మంజుల జోకులేసింది కూడా నీకు నిద్ర పట్టటం లేదా మీ 'ప్రియముళ్ళవనే' ని ఇంకా కలుసుకోలేదని?' అని! శ్యామలిని వాళ్ళిద్దరూ కూడా బాగానే మిస్సయ్యారట! యెందుకంటే, తనలా ఫ్రెండ్లీగా వుండే పేషంట్లూ, పాటలు కూడా పాడి, పాడించుకునే పేషంట్లు అసలు తామొచ్చిన ఆరు నెల్లలో యెవరూ లేరట! తన పాటలు వాళ్ళనలా మురిపించటంకూడా శ్యామలికి నచ్చింది. ఈశ్వర్ కు పాటలంతగా నచ్చవు. యెప్పుడూ, పాలిటిక్స్, క్రికెట్టూ, సినిమాలూ తప్ప మరో ముచ్చటుండదు తనతో! మంజులైతే కాస్త నయం. తైల చికిత్స సంగతటుంచి, తన గొంతును వీళ్ళిద్దరొ మెచ్చుకోవటమూ, సదియా, ముస్లిం ల పిల్లైనా, తియ్యటి గొంతూ, పాడే విధానమూ కూడా నచ్చటం ప్లస్ పాయింటయింది, శ్యామలికీ చికిత్స నచ్చటానికి! వాళ్ళతో సరదాగా తీసుకున్న సెల్ఫీ కూడా మంజులకూ, ఈశ్వర్ కూ చూపించిన సంగతి చెబితే, వాళ్ళూ సరదగా, సెల్ఫీలు తీసుకున్నారు. యీలోగా, శ్యామలికి మసాజ్ లో నొప్పనిపించినప్పుడు సహన, అడిగింది, ' వేదనె? ' అని, బాధగా మొహం పెట్టి! వేదన అన్న పదం తెలుగులో గ్రాంధికం. కానీ మళయాళంలో వాడుకభాషలో కూడా వాడుతారని తెలుసుకుని, ఆహా,, యెంత బాగుందో ' అని మురిసి మూర్చ పోయింది శ్యామలి. ఇంకా, అని అదిగింది.

అభినయం (నటన) భక్షణం (ఆహారం) సమాదానం (సమాధానం అని తెలుగులో ఒత్తి పలుకుతాం) పరిష్కారం (తెలుగు పదమే) మనోరధం (కోరిక) ఇలాంటి కొన్ని సంస్కృత పదాలు వాడుక భాషలో వాళ్ళు వాడే విధానమూ

విధానమూ నచ్చింది శ్యామలికి!

ఇలా పాడుతూ, పాడించుకుంటూ, మొత్తం పదహార్రోజుల పండుగలాగే, పదహార్రోజుల తైల చికిత్సా ముగిసింది. చికిత్స గురించి ఈశ్వర్ పెదవి విరిస్తే, శ్యామలి, చికిత్సా ప్లస్ పాటలతో కలిపి వందా యాభై మార్కులేసింది. డాక్టర్ కు కృతజ్ఞతలు చెప్పింది. సహన కూ సదియాకూ చెరో వెయ్యి రూపాయలిచ్చి తన గుర్తుగా, డ్రెస్సులు కొనుక్కోమంది కూడా! వాళ్ళ ఫోన్ నంబర్లూ తీసుకుంది. అదే ఈశ్వర్ కు శ్యామలిలో నచ్చనిది! 'వెళ్ళిన పనికంటే, తక్కిన విషయాలపైనే నీకు శ్రద్ధెక్కువ! ' అన్నాడు విసుక్కుంటూ! 'తైల చికిత్స తరువాత నువ్వు పరిగెడుతూ ఇంటికొస్తావనుకున్నాగానీ, ఇలా మళయాళం పాటలు పాడుకుంటూ, కుంటుకుంటూ వస్తావనుకోలేద' ని కోప్పడ్డాడు కూడా! శ్యామలి ప్రతిదీ డబ్బుతోనే కొలవకూడదనీ, యెప్పుడు యెవరితో పరిచయం యెలా రూపుదిద్దుకుంటుందో తెలుసుకొలేమనీ, యే చికిత్స కైనా, ఫలితాలు చూ మంతర్ లా నిలుచున్న ఫళాన రావనీ, నిదానమే ప్రధానమనీ.. చాలా విధాలుగా తన వాదన వినిపించింది శ్యామలి. ఊహూ..ఈశ్వర్ వింటేనా? పనిలో పనిగా పరిచయం చేసిన మంజులనూ కోపగించుకున్నాడు కూడా! శ్యామలి ఒకే మాటపై నిలబడింది. వాళ్ళిచ్చిన టాబ్లెట్స్ అన్ని సరిగ్గా వాడాలింకా..కొన్ని యెక్సర్ సైజులు కూడా చేస్తే అప్పుడు నొప్పి కుదురుకుంటుందని తన గట్టి నమ్మకం. శ్యామలి అంటున్నట్టే, నొప్పి రాను రాను నెమ్మదించింది. నడకలొనూ, వేగం పెరిగింది. మళయాళం పాటల పట్ల ప్రేమ కూడా, ఇంతై వటుడింతింతై వలెనే, పెరిగిపొయింది కూడా!

తరువాత కూడా, వాళ్ళిద్దరితో ఫోన్లో రెండుమూడుసార్లు మాట్లాడింది శ్యామలి. అటుతరువాత, తన పనులూ, ఇంటి పనుల ఒత్తిడి వల్ల దాదాపు నెలరోజులపాటు వాళ్ళతో మాట్లాడలేదు కానీ, 'ఇందు పుష్పం చూడి' అన్న చిత్ర పాడిన పాటను సదియా సలహా పై నేర్చుకుని తెగ పాడుకుంటూంది శ్యామలి. వున్నట్టుండి, ఒక రోజు సదియాతో మాట్లాడాలనిపించి, ఫోన్ చేసింది. ఫోన్ నాట్ రీచబుల్ అంది సెల్లు. పోనీ సహన నంబర్ ట్రై చేద్దామని చేస్తే, అదీ కలవలేదు. ఇద్దరూ, యేదైనా పనిలో వున్నారేమో నని వూరుకుంది. వారం తరువాత మళ్ళీ అదే సమాదానం ..వుండబట్టలేక హాస్పిటల్ కే చేసింది ఫోన్..అంబుద వూళ్ళొ లెరట! అక్కడే పనిచెస్తున్న సదియా బోయ్ ఫ్రెండ్ షరీఫ్ తొ మాట్లాడాలంది! యెవరో తీశారు ఫోన్! అక్కడ వాళ్ళెవరూ ఇప్పుడు పనిచేయటం లేదని చెప్పాడా అబ్బాయి - వచ్చీరాని తెలుగు లో! శ్యామలి ఆశ్చర్యపోయింది. రెండు నెల్లలో వుద్యొగం ముగ్గురూ మానేశారే! ఇదెలా! ఈశ్వర్ తేలిగ్గా అనేశాడు, అబ్బో! వాళ్ళిచ్చే జీతం నచ్చలేదేమో! పైగా సిటీలో యెన్నో కేరళ వైద్యశాలలు! మరెకడికో వెళ్ళిపోయుంటారు..హమ్మయ్య! ఫోన్ బిల్లు తగ్గిందని సంతోషపడ్డాడు కూడా!

శ్యామలి పాటల ప్రాక్టీస్ మానలేదు. ఇంతలో ఒక రోజు పనిమీద బంజరాహిల్స్ వెళ్ళి, యేదో అవసరమొచ్చి, దగ్గరే వున్న మాల్ లో ప్రొవిజన్స్ తీసుకుంటూంది. బిల్ చెల్లిస్తుండగా, లొపల, సహనలాగే యెవరో కనిపించి, వెంటనే వెనక్కి వెళ్ళి చూసింది. దూరంగా సహనే! సంతోషంగా 'సహనా' అని గట్టిగా పిలిచి, గబ గబా అటుకేసి అడుగులు వేసి చూసేసరికి, అక్కడా అమ్మాయి లేదు. ' అరె! అంతలోనే యెలా మాయమైంది? తను కాదా? 'అని సందేహం కూడా! మనసంతా చెదిరి పొయింది. ఇంటికి వెళ్ళగానే, ఈశ్వర్ కి కూడా యీ విషయం చెప్పింది. 'ఆ..నీలాంటి వాళ్ళెంతమందో వాళ్ళకు.. అందరినీ గుర్తు పెట్టుకుని పలకరిస్తూ, టైం వేష్ట్ చేసుకొరమ్మా యెవరూ! నీకే యీ విషయం తెలీదు కానీ! ' అని వెక్కిరించాడు కూడా! 'బతకనేర్చినవాళ్ళు ' అని చక్కటి తాఖీదు కూడా ఇచ్చాడు వాళ్ళకు!

శ్యామలికి యీ విషయమేంటొ తెలుసుకుని తీరాలనిపించింది. మళ్ళీ హాస్పిటల్ కు ఫోన్ చేసింది. డా. అంబుదగారున్నారా అని. ఊళ్ళొనే వున్నారనీ, కాని మధ్యాహ్నం మూడింటికి వస్తారని చెప్పాడా అబ్బాయి! పనిగట్టుకుని శ్యామలి మళ్ళీ వెళ్ళిందక్కడికి! లోపలెవరో పేషంట్ వున్నట్టుంది. పదిహేను నిముషాలు వైట్ చేసినతరువాత, అంబుదగారొచ్చారు. శ్యామలిని చూసీ చూడగానే, 'నొప్పి తగ్గిందా?' అని ఆప్యాయంగా అడిగిందావిడ! తన సంగతంతా చెప్పి, అప్పుడడిగింది శ్యామలి సహనా, సదియాలగురించి! డాక్టర్ ఆశ్చర్యపోయింది - వాళ్ళను గురించి తెలుసుకోవటానికే తను వచ్చానంటుంటే! లోపలికి తీసుకెళ్ళి సోఫాలో కూర్చున్న తరువాత చెప్పిందావిడ ..'ఆ ఆడపిల్లలిద్దరూ, ఆ అబ్బాయీ ఇక్కడ బాగానే పని చేసేవాళ్ళు. సహనకూ, సదియాకూ లవ్ స్టోరీలున్న సంగతి తెలుసు తనకు..షరీఫూ, సదియా యెంతో క్లోజ్ గా వుండేవాళ్ళు. మరో రెండేళ్ళలో వాళ్ళ పెళ్ళట కూడా! ఇంటర్ తరువాత, తైల చికిత్సలో యేదో కోర్స్ చేసిన ఆ ముగ్గురూ, అల్లిప్పీ నుంచీ వచ్చారు! అంతా బాగానే వుంది కానీ,... వున్నట్టుండి, సదియకూ, ఆ షరీఫ్ కూ యేదో గొడవైందట! పైగా, సహన వెంట పడుతున్నట్టుగా కూడా సహనే, సదియాతో చెప్పుకుని యేడ్చిందట! సదియా కూ, షరీఫ్క్ ఊ పెద్ద రాద్ధంతమే అయినదని ఇక్కడే పనిచేస్తున్న మరొకావిడ చెప్పింది! పెళ్ళి కూడా చేసుకుందామనుకుని, అమ్మ నాన్నలను ఒప్పించి ఇంత దూరం వచ్చి, సంతోషంగా వుంటున్న వాళ్ళ మధ్యలో యీ కలతలవల్ల, హాస్పిటల్ పనుల్లో ఇబ్బంది కలుగుతుంటే, తనే వాళ్ళు ముగ్గురినీ వెళ్ళిపొమ్మందిట కూడా! కానీ, మళ్ళీ యేమి జరిగిందొ యేమో, ముగ్గురూ తనకు సారీ చెప్పుకుని బుద్ధిగా వుద్యోగాలు చేసుకుంటామన్నారట! ... ఇది జరిగిన పదిహేను రోజులకే, ఒక రోజు పొద్దునే హాస్పిటల్ నుచీ ఫోన్! సదియా ఫాన్ కు వురి వేసుకుందనీ, కొన వూపిరితో వున్న ఆ అమ్మాయిని, దగ్గర్లోని హాస్పిటల్ లో చేర్పించారనీ, త్వరగా రమ్మనీనూ! యేంచెయాలో తొచలేదు. కంగారుగా వాళ్ళు చెప్పిన హాస్పిటల్ కు వెళ్ళి, ఆ ఖర్చంతా తానే భరించిందట! పొలీసు కేసు కాకుండా, తెలిసిన వాళ్ళతో యెలాగో మేనేజ్ చేసేసరికి తలప్రాణం తోకకొచ్చిందట! చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు, సదియాకు ప్రాణాపాయం తప్పింది కానీ, గొంతు శాశ్వతంగా పోయిందట! ఇంతకూ, ఆ అమ్మాయి యీ పనిచేసిన కారణం వింటే, మతి పోయిందట అంబుదకు! సహనా ప్రేమికుడక్కడ, మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడట! ఆ విషయం తెలిసిన షరీఫ్ మళ్ళీ సహన వెంట పడటం మొదలెట్టాడట! సదియా, సహనా, ఇద్దరూ తిరగబడినా, షరీఫ్ ఒప్పుకోవటం లేదట! పైగా, సదియాతో క్లోజ్ గా వున్న సెల్ఫీలు చూపించి, నోరెత్తవద్దని బెదిరిస్తున్నాడట సదియా ను! అతణ్ణి దారిలో పెట్టుకునేందుకు సదియా చేసిన యీ బెదిరింపు పని ఆ అమ్మాయి తలకే చుట్టుకుని, ఇలా దారి తీసిందట! ఈ స్టోరీ అంతా తెలిసి, కడుపు మండిపోయి, అ ముగ్గురి ఇంటివాళ్ళకూ యీ సంగతంతా చెప్పి, ముగ్గురినీ వుద్యొగాలనుంచీ తీసేసిందట అంబుద! ఇప్పుడు వాళ్ళెక్కడున్నారో కూడా తనకు తెలీదని చెప్పింది, మొహం యెర్రగా చేసుకుని! 'యేదో మా వాళ్ళు కదా అని చేరదీస్తే, నన్నే యిరుకున పెట్టారా ముగ్గురూ' అని చికాకుపడింది కూడా! 'ఐనా, మీరేమిటిలా వాళ్ళగురించి ఇంత ఇదిగా అడుగుతున్నార' ని అడిగింది కూడా! సదియా గొంతంటే తనకిష్టమనీ, అందుకే వచ్చానని చెప్పి, బైట పడింది శ్యామలి! ఈశ్వర్ అనే మాట నిజమే! యేది యేమైనా, ఇంతగా, ప్రతి పరిచయాన్నీ, మనసులొకి తీసుకుని, యేమైనా ఐతే బాధపడుతూ కూర్చోవడం

అవసరమా? అని!

శ్యామలి కూడా మాటలు రాని మూగదైపోయింది! అంటే, సహన ఇక్కడే ఎక్కడో ఉందన్న మాట! మరి సదియా యేమై వుంటుంది? వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిందా! మరి పాటలు పాడని సదియానెలా ఊహించుకోవటం? అదేదో అడ్వర్టైజ్ మెంట్ లో అన్నట్టు, వలపు మంచిదే - సరైన మలుపులుంటే! అది ఆంధ్రాలో కావచ్చూ, కేరళలో కావచ్చు. అనాలోచితంగా శ్యామలి నోటివెంట అదే పాట - 'ప్రియ ముళ్ళవనే! ప్రియ ముళ్ళవనే ' .. కళ్ళలో నీళ్ళతొపాటూ!