TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
“అజ్ఞాత కులశీలశ్య….” 8వ భాగం
మాధవుడు విద్యలన్నింటిలోనూ బాగా రాణిస్తున్నాడు.
ఒక రోజు అడవిలోకి వెళ్లి, ఒళ్లంతా రక్త సిక్తమై వచ్చాడు. అప్పటికే అతడు వెళ్లి చాలా సేపు అవడం వల్ల, ఇంటిలోని వారందరూ ఆందోళనగా ఉన్నారు.
మాధవుడిని చూసి సీతమ్మ వాకిలి నుండే గట్టిగా అరిచింది. గౌతమి, నందులు పరుగెత్తుకుని వచ్చారు.
“అయ్యో! ఏమయింది కన్నయ్యా? అడవిలోకి వెళ్లద్దంటే వినవు కదా.” గాభరాగా అంటూ బట్టలు విప్పి, ఒడలంతా పరీక్ష చేశాడు నందుడు. కాళ్లూ చేతులూ వణుకుతుండగా స్తంభాన్ని ఆనుకుని కూల బడింది గౌతమి.
సీతమ్మ లోనికి పరుగెత్తి, వేడి నీళ్లు కాచ సాగింది.
“ఫరవాలేదమ్మా! పైపైనే గీరుకు పోయింది. గాయాలు లోతుగా లేవు. నాలుగైదు దినాల్లో తగ్గిపోతుంది.”
“ఈ విధంగా రక్తాలు కారుతూ ఎలా వచ్చావు కన్నయ్యా?”
“కళ్యాణి తీసుకొచ్చిందమ్మా. నా పక్కనే నడుస్తూ.. జాగ్రత్తగా! గుర్రం మీదికి ఎక్కలేదు.” మాధవుని మాట స్పష్టంగానే ఉంది. మెడ పై భాగానికి దెబ్బలేం లేవు. అది కాస్త నయమే అనుకున్నాడు నందుడు.
సీతమ్మ తెచ్చి వేడి నీటిలో బట్ట ముంచి, కొద్దిగా చల్లారాక ఒడలు తుడవడం మొదలు పెట్టింది. అప్పటికి గౌతమి కూడా తేరుకుని ఇంకొక బట్ట తీసుకుంది.
మాధవుని మాట నిజమే.. పైపైనే ఉన్నాయి గాయాలు.
వాటిని తుడుస్తుంటే కిక్కురు మనలేదు మాధవుడు. గౌతమి, నందుడు ఒకరి వంక ఒకరు చూసుకున్నారు… కర్ణుడి కథ జ్ఞప్తికి వచ్చి. ఇతడు బ్రాహ్మణ బాలుడేనా?
కానీ, వెంటనే వారి సందేహం నివృత్తి అయింది. సీతమ్మ పసుపు తెచ్చి అద్దుతున్నప్పుడు దిక్కులు పిక్కటిల్లేట్లు అరిచాడు మాధవుడు.
సగం.. నిజంగానే మండటం వల్ల. సగం, గౌతమీ, నందుల ముఖ కవళికలు గమనించడం వల్ల. బాలునికి తెలిసి పోయింది.. బాధను తట్టుకునే శక్తి బ్రాహ్మణులకి తక్కువుంటుందని.
పరిచర్య పూర్తయి, పల్చని అంగవస్త్రం వక్షం మీద ఆచ్ఛాదనగా వేశాక వినిపించాయి..
వెనుక వాకిలి నుంచి గుర్రం సకిలింపు, దాంతో పాటుగా.. మే.. మే అనే కేకలు.
“అయ్యో కళ్యాణి మాట మరచాం. దానికేం దెబ్బలు తగల్లేదు కదా!” ఆందోళనగా అన్నాడు నందుడు.
“లేదు.. లేదు. అశ్వం బాగానే ఉంది. నేనే ఎగిరి ముళ్ల కంప లో పడ్డాను. ఆకలికి అరుస్తోంది.” లేవబోయాడు మాధవుడు.
“లేవకు. నేను వెళ్లి గుగ్గిళ్లు వేసొస్తా.” సీతమ్మ లేచింది.
“ఫరవాలేదు. అమ్మమ్మా! మీకు తెలియదు. నే వెళ్లి చూస్తా. ఈ గాయాలు గాలికి ఆరితే తగ్గిపోతాయి త్వరగా.”
మాధవుడు సునాయాసంగా లేచి పెరటి వాకిలి దాటి బైటికి వెళ్లాడు.
గుర్రం మాధవుడిని చూసి నిలువుగా తలూపింది. తన యజమాని ఎలా ఉన్నాడో అని ఆ ప్రాణికి ఆదుర్దా కలిగినట్లుంది.
వెనుకగా వచ్చిన నందునికి కన్నుల నీరు తిరిగింది. ఈ మూగజీవుల కున్న విశ్వాసం మానవులకుంటే ఎంత బాగుండునో అనుకున్నాడు.
మాధవుడు తన అశ్వం దగ్గరగా వెళ్లి, వీపు మెడ నిమురుతూ ఆహారం తినిపించాడు. అంతలో ఒక పక్క నుంచి మే..మే.. అంటూ అరుపులు వినిపించాయి. నందునితో పాటుగా వచ్చిన గౌతమి మొదటగా గమనించింది..
ప్రాకారం పక్కగా.. కిందకి వంగి ఉన్న జామ ఆకులు నముల్తూ ఉన్న రెండు మేక పిల్లలు. ఒకటి తెల్ల మేక. మూతి నల్లగా.. ఒంటి మీద అక్కడక్కడ చిన్న నల్లని మచ్చలు. ఇంకొకటి నల్ల మేక. అక్కడక్కడ చిన్నగా తెల్లని మచ్చలు.
గౌతమి మేకల వంక చూస్తుండడం గమనించి మాధవుడు కళ్యాణి వెనక్కి వెళ్లి దాక్కున్నాడు.. దొంగ చూపులు చూస్తూ. వెన్న దొంగిలించి గోడ వెనుక దాక్కున్న కృష్ణుడిలాగా అనిపించాడు సీతమ్మకి.
“ఇవేమిటయ్యా?” అడగనే అడిగింది గౌతమి.
“కోట పక్కన ముళ్ల పొదల దగ్గర దిక్కులేకుండా తిరుగుతున్నాయమ్మా. అక్కడి నుంచి వాటిని తప్పించ బోయే, పొదల్లోకి పడిపోయాను. అప్పుడే ముళ్లు గీరుకు పోయాయి. వాటిని పట్టుకుని నడిచి వచ్చాను. అందుకే ఆలస్యమయింది.”
ఎలాగా తెలిసి పోయింది కదా.. మాధవుడు మేకల దగ్గరికి వెళ్లి వాటిని సవరించ సాగాడు. గుర్రంకూడా ఆనందంగా తలూపుతోంది.
“బాగుంది నీ పరివారం. ఇప్పుడు ఆ మేకల యజమానులొస్తే.. మన మీద దొంగతనం నేరం మోపరా?” నందుడు అడిగాడు.
“లేదనుకుంటా నాన్నగారూ.. వీటిని చూడలేక వదిలి పెట్టినట్లున్నారు. అక్కడక్కడా మేస్తూ అనాధల్లా తిరుగుతున్నాయి. ఎవరైనా వస్తే అప్పుడే ఇచ్చేద్దాం. మన దగ్గర పెట్టుకుందామా? వాటికి ఖర్చు ఏమంత అవదు. నేను వెళ్లి మేపుకొస్తాను.” గోముగా అడిగాడు.
“వాటివల్ల మనకి ఏం ఉపయోగం?” సీతమ్మ సందేహం..
“ఉపయోగం అంటే.. ఏం లేదు. ఆ.. మేక పాలు చాలా శ్రేష్టం. అమ్మమ్మా! మీ కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. ఇంక సంవత్సరం లోగా ఆ మేకకి పాపాయి పుడుతుంది.” మేకల గురించి తెలిసిన వాడిలాగ చెప్పాడు మాధవుడు.
“ఛా.. మేక పాలా?” సీతమ్మ మొహం చిట్లించింది.
“మేకపాలకీ, ఆవు పాలకీ తేడా ఏముందమ్మమ్మా? రెండూ తినేవి ఆకులే కదా.. రెంటికీ ఒక దగ్గర్నుంచే కదా పాలు వచ్చేది..”
“ఉండు.. నీ పని చెప్తాను. అంతా అపసవ్యం మాటలూ నువ్వూనూ..” సీతమ్మ ఒక కర్ర పట్టుకునొచ్చింది.
మాధవుడు ఆవిడకి దొరక్కుండా అటూ ఇటూ పరుగెత్త సాగాడు.
నంద, గౌతమిలు నవ్వుతూ చూస్తున్నారు.
అంతలో తెల్ల మేక వచ్చి, మూతి పైకెత్తి గౌతమి చేతికి రాయడం మొదలు పెట్టింది. కిందికి వంగి చూస్తే దాని కాలి నుంచి రక్తం కారుతోంది. మొహం మీద, తోక దగ్గర.. అన్నీ గాయాలే. కళ్లు పెద్దవి చేసి చూసిన గౌతమికి నల్ల మేక పరిస్థితి అంత కంటే ఘోరంగా కనిపించింది. దానికైతే, ఒళ్లంతా రక్తం మరకలే.
“ఇదేమిటి మాధవా?” వణుకుతున్న కంఠంతో అడిగింది.
“అదే తెలీదమ్మా. ఏదైనా పెద్ద జంతువు తరుముతూ వస్తే పొదల్లో పడిపోయాయేమో.. వాటి యజమాని వెదకి వేసారి వెళ్లి పోయుండవచ్చు. అక్కడే ఏటి గట్టున శుభ్రం చేద్దామనుకున్నా కానీ, మీరు ఆందోళన పడుతుంటారని తీసుకొచ్చేశాను. నా శరీరం మీదున్న సగం రక్తం వాటిదే. ఇప్పుడు శుభ్రం చేద్దామా? అమ్మమ్మని అడిగి ఔషధంకూడా రాద్దాం.” మాధవుడు ఆదుర్దాగా చూస్తూ అడిగాడు.
“వీటిని మన దగ్గర ఉంచుకుందామా లేదా అనేది తరువాతి సంగతి.. ముందుగా, వాటి దెబ్బల సంగతి చూద్దాం. వదిలేస్తే అదొక పాపం చుట్టుకుంటుంది.” నందుడు మేకలని బావి వద్దకి తీసుకెళ్లాడు.
నందుడు గాయాలని కడుగుతుంటే సన్నగా మూలుగుతున్నాయి మేక పిల్లలు.
మధ్య మధ్యలో కళ్యాణి సకిలిస్తోంది.
సీతమ్మ, ఇంటి వెనుక నున్న తోటలోకి వెళ్లి ఏవో ఆకులు తెచ్చి నూరి ముద్ద చేసింది.
సీతమ్మకి మూలికల వైద్యం తెలుసు. ఆవిడ తండ్రి తాతలు వైద్యులు. కొన్ని అత్యవసర మైన చిట్కాలు నేర్పించారు. ప్రాధమిక చికిత్స చెయ్య గలుగుతుంది.
“మాధవుడి గాయాలు పైపైనే ఉన్నాయి. అందుకే పసుపు రాస్తే సరి పోతుంది. కానీ, ఈ మేక పిల్లల దెబ్బలు, బాగా లోతుగా ఉన్నాయి. మూలికల చూర్ణం పట్టీ వేస్తే కానీ తగ్గవు.” అలా అంటూనే గట్టిగా పేనిన చాంతాడు చివర అంటించి, నిప్పు చేసి తీసుకొచ్చింది సీతమ్మ.
“అదెందుకమ్మమ్మా?” భయం భయంగా అడిగాడు మాధవుడు.
గాయాల్ని శుభ్రం చేసిన నందుడికి అర్ధమయింది. గౌతమి, కళ్యాణి దగ్గరగా వెళ్లి మెడ కింద, గంగడోలు నిమర సాగింది.
“వీటి వయసెంతుంటుందో?” నిప్పు ఎర్రగా మండేలాగ ఊదుతూ అడిగింది సీతమ్మ.
“నాలుగైదు నెలలు ఉండచ్చు. చిన్న పాపాయిలు.. పాపం. ఎక్కడ్నుంచి వచ్చాయో!” నిప్పు చివరని ఎర్రగా అయేలా ఊదుతున్న సీతమ్మని కళ్లు పెద్దవి చేసి చూస్తూ అన్నాడు మాధవుడు.
“నందా! తయారేనా? ఒక్కొక్క చోట్లో జాగ్రత్తగా పట్టుకో. ఇంకొక చెయ్యి జీవి కదలకుండా..” సీతమ్మ నిప్పుని మేక దగ్గరగా తీసుకు రాబోయింది.
కెవ్వున కేక పెట్టాడు మాధవుడు.
“ఏం చేస్తున్నారు అమ్మమ్మా?”
అప్పుడనిపించింది పెద్ద వాళ్లకి, పిల్లవాడికి అంతా చెప్పి చేస్తుంటేనే నయం అని. నందుడు దగ్గరగా రమ్మని పిలిచాడు.
మేక పిల్ల కాళ్లని చూపించాడు. నాలుగు కాళ్లకీ, వేళ్ల పైనా కిందా.. తొడల దగ్గర చిన్న చిన్న జలగలు అతుక్కుని ఉన్నాయి.
“వీటిని చూశావా? జలగలు. శరీరానికి అతుక్కుని వదలవు. రక్తం అంతా పీల్చేస్తాయి. ఇవి పట్టాయంటే, ఏ జంతువైనా, మనుషులైనా నిర్వీర్యం అయిపోవలసిందే. చూడకుండా వదిలేస్తే ప్రాణాలు కూడా పోతాయి.”
“నిజమే.. కానీ కాలుస్తే మేక కూడా కాలుతుంది కదా? అంతకంటే గోటితో గిల్లేస్తే పోదా?” భయంగా అడిగాడు బాలుడు.
“అది ఇంకా బాధ. కాళ్లు సన్నంగా ఉంటాయి కదా. పట్టు ఉండదు. జాగ్రత్తగా కాలుస్తారు సీతమ్మగారు. మరి నైపుణ్యం అంటే అదే. ఏటికి మంచి నీటికి వెళ్లినప్పుడు అమ్మనీ, అమ్మమ్మనీ కూడా పడ్తుంటాయి. నిప్పు తగలగానే పట్టు వదిలేస్తాయి. ఆ తరువాత కడిగేసి పసుపు అద్దేస్తే తగ్గి పోతుంది. మనం తినంకానీ, ఉల్లిపాయ నూరి పట్టీ వేస్తే కూడా తగ్గుతుంది. కోమటి కొట్టుకెళ్లి తీసు కొద్దాం. ముందు ఈ జలగలన్నీ రాలి పోనీ.” నందుడు మేక కాలు పట్టుకున్నాడు.
విచిత్రంగా మేక కదలకుండా పడుక్కుంది.
జంతువులకి కొన్ని లక్షణాలు అమర్చాడు ఆ దేవుడు. ఎవరైనా తమకు మేలు చేస్తున్నారని నమ్మాయంటే చాలు పూర్తిగా తమ భారాన్ని వారి మీదికి వదిలేస్తాయి. అందులో మేత కోసం ఏటి ఒడ్డున తిరిగే ఏ ప్రాణినైనా జలగలు పట్టకుండా వదలవు. వాటి ఆహారం రక్తం మరి. పైగా.. మేకలు రెంటికీ అంతకు ముందు అలవాటు ఉన్నట్లే ఉంది జలగల్ని పీకించుకోవడం.
……………….
మాధవుని ఆనందానికి హద్దుల్లేవు. మేకలు రెండూ సీతమ్మ వైద్యం పని చేసి, ఆరోగ్యంగా తయారయ్యాయి. శ్వేత, శార్వరి అని పేర్లు పెట్టాడు మాధవుడు వాటికి. చెంగు చెంగున గెంతుతూ తోటంతా తిరుగుతుంటాయి.. అంది నంత మేర ఆకుల్ని నములుతూ.
సమయం దొరికినప్పుడు బుజ్జి మేకలతో ఆడుకుంటుంటాడు. కళ్యాణి కూడా తల పైకీ కిందికీ ఊపుతూ హర్షాన్ని తెలుపుతుంటుంది.
అదే సమయంలో.. నందుడు ఒక ఆవుని, దూడని కూడా తీసుకొచ్చాడు. మూగ జీవుల పనులన్నీ మాధవుడు సంతోషంగా చేస్తున్నాడు, అమ్మమ్మ సహాయంతో.
‘కళింగం’ పూటకూళ్ల గృహం వెనుక భాగం అంతా రాజుగారి కోట కిందికి వస్తుంది. అటుపక్క సరిహద్దు గోడలుకానీ, కంచెలు కానీ ఏమీ లేవు. ఒక క్రోసు దాటాక కందకం వస్తుంది. అప్పటి వరకూ ఎవరూ అటు ప్రక్కకే రాలేదు. అసలు ఆ స్థలం అంతా భానుదేవుని తండ్రి, మహాపాత్రుడికి అరణంగా ఇచ్చిందే.
ఎవరైనా వచ్చి అడిగినప్పుడు చూసుకోవచ్చులే అనుకుని, కొంత మేర పశువులకి కంచె వేసి, గ్రాసం పెంచడం మొదలు పెట్టాడు నందుడు.
అక్కడే పశువుల కొట్టం కూడా దించాడు.
సీ. తెలతెల వారగ తెల్లావు తువ్వాయి
ఇటునటు తిరుగుతూ యెగురగాను
దానికి దీటుగా తైయని గెంతేటి
మచ్చల మేకల మైమరపులు
నేనేమి తక్కువనే యశ్వమది గోను
తలతిప్పి కాలెత్తి తకిట యనగ
గోమాత నెమరేస్తు కొండాటముం జెంద
సూరీడు వేవేగ చొచ్చి వచ్చు
ఆ.వె. వింత కాంతు లన్ని వెలుగొందె వెనుకింట
చేరిచేరి యన్ని చెంత నిలువ
మున్ను కనని కళలు మురిపాన పొడచూపె
నందునింటి లోన నాణ్యముగను.
సూర్యోదయానికి ముందే లేచి, అంతా శుభ్రం చేసి, కుడితి తయారుచేసి, గ్రాసం వేసి.. అప్పుడు తన పనులు చేసుకుంటాడు మాధవుడు. అప్పుడే సీతమ్మ, గౌతమి లేచి, వాకిలి ఊడవడం, కళ్లాపు జల్లి ముగ్గులు వేయడం చేస్తారు.
అంతలో నందుడు లేచి, మాధవుడిని తీసుకుని ఏటి వద్దకు వెళ్లి, స్నానం, సంధ్యావందనం కార్యక్రమాలు ముగించుకుని, కావడి మీద మంచినీళ్లు తీసుకొస్తారు. ఆ పిదప, మడికట్టుకుని, పూజ ముగించుకున్న గౌతమి పొయ్యి అంటించి పాలు కాచి అందరికీ క్షీరం అందిస్తుంది.
సీతమ్మ కూడా స్నానాదులు ముగించుకుని, శాకాలు తరగడం మొదలు పెడుతుంది.
సాధారణంగా రోజుకు పదిమందికి తక్కువ కాకుండా వస్తుంటారు బాటసారులు. కొందరు ముందురోజే వచ్చి, రాత్రి వసారాలో విశ్రమిస్తారు.
మాధవుడు వచ్చినప్పటి నుంచీ రద్దీ బాగా పెరిగింది. ముఖ్యంగా సైనికుల తాకిడి ఎక్కువయింది, మామూలుగా కంటే బాగా..
……………...
......మంథా భానుమతి