TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
“అజ్ఞాత కులశీలశ్య….” 9వ భాగం
కోట
సీ. నిట్ట నిలువుగనే నిల్చిన కోటంత
పట్టి నడచునట్టి భయము భీతి
ఏదొ యేదొ వెదక నేమియు కనరాదు
కలతయె నన్నిట కలిగి యుండ
ఎంత నసహజత్వ మెందెందుఁజూసినా
కాకమీ దున్నదా కాల్చు నెండ
కదలక మెదలక గాలియు స్థంభించ
క్రమశిక్షణన్ కూడె ఖగమనములు
ఆ.వె. అటునిటు నడయాడు నాయుధము ధరించి
యోధు లంత కూడి యూసులాడ
పెద్దలు సమ కూడి పేర్మిని యోచింప
పట్టణమును గట్టి పర్చగాను.
మాధవుడు కళింగం వచ్చి సంవత్సరం అవుతోంది. అక్కడి పరిసరాలకి బాగా అలవాటు పడిపోయాడు.
ఆ రోజు. ఉదయపు కార్యాలను ముగించుకుని, కళ్యాణిని తీసుకుని కోట వంకే చూస్తూ బయలు దేరాడు. రోజూ ఆరాధనగా చూసే కోటే.. ఏదో మార్పు..
కోట బైట సైనికులు అక్కడా అక్కడా పొదల మాటున మాటు వేస్తూ అప్రమత్తంగా, ఆందోళనగా కాపలా కాస్తున్నారు.
చుట్టూ స్వారీ చేస్తున్న మాధవుని కంట పడింది .. కోట వెనుకగా, పెద్ద పెద్ద చెట్లు, గుబుర్ల వెనుక కొత్తగా ఏర్పడిన ద్వారం. పరీక్షగా చూస్తే కానీ తెలియట్లేదు. ఆ ద్వారం సన్నని బాట చివర ఉంది. ఆ బాట ఊరి బయటికి దక్షిణం వేపుగా సాగి పోతుంది. అది పట్టుకుంటే శ్రీముఖలింగం, రాజమహేంద్రం చేరుతామని తండ్రిగారు చెప్పారు.
అప్పుడప్పుడు సైనికులు తిరగడం, స్వారీలు చెయ్యడం, జరుగుతున్నదే అయినా ఆ రోజు ప్రత్యేకంగా అనిపించింది.
అఘ మేఘాలమీద.. కళ్యాణిని కళ్లెంతో వేగిర పరచి ఇంటికొచ్చేశాడు.
ఇంటి బయట సైనికులు గుంపులుగా మాట్లాడుకోవడం చూసి, ఇంటి వెనుకకి వెళ్లి గుర్రాన్ని కట్టేసి.. చుట్టూ తిరిగి వాకిలి ముందుకి వచ్చాడు.
నెమ్మదిగా నడుస్తూ లోనికి వెళుతుండగా అతడి చెవిని పడ్డాయి సంభాషణలు, వంగ భాషలో. ఏమీ ఎరగనట్లు, అతి నెమ్మదిగా ఆగి ఆగి కదులుతున్నాడు మాధవుడు.
వారు చర్చిస్తున్న సమస్య తీవ్రమయింది..
ఒక పక్కగా ఒదిగి ఒదిగి నడుస్తున్న మాధవుడిని చూసి తలెగరేశాడొక సైనికుడు, ఎవరన్నట్లు.
“ఈ పూటకూటింటి వాని కొడుకు.” ఇంకొకడు సమాధానం ఇచ్చాడు.
“హేయ్.. చేపలు పులుసు చేయిస్తావా? నాలుక పీకేస్తోంది?” వంగ భాషలో అడిగాడు మరొక సైనికుడు.
అందరినీ కలియ చూశాడు మాధవుడు. మొత్తం పాతిక మంది పైగా ఉన్నారు. అంత మందికి వండడం అలవాటే. కానీ చేపలంటే.. అయోమయంగా, అమాయకంగా చూశాడు. అది శాఖాహార పూటకూళ్ల ఇల్లు. వారికి తెలిసే అడుగుతున్నారు.
కత్తి చూపించి, చేసి తీర వలసిందే అంటే?
అమ్మకి ఎంత కష్టం?
వీరి ఆగ్రహానికి గురి అవకుండా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు మాధవుడు.
“వీడికి భాష రాదనుకుంటా. ఐనా ఏదో కడుపు నింపుకోవాలి కానీ.. రుచులంటే ఎక్కడ?” సైన్యాధికారి లాంటి వాడు మందలించాడు.
“సర్సరే.. లోనికి పరుగెత్తి త్వరిత గతిని ఆ శాకాలేవో తయారయే విధం చూడు.” కసిరాడు మరొకడు.
“సైనికులు కఠినంగా మాట్లాడినా ఏమనుకోకూడదు మనం. మనం మనడానికి ఆధారం ఈ గృహం. వచ్చిన వారికి ఆకలి తీర్చడం మన బాధ్యత. పైగా ఆ సైనికులు, భార్యా పిల్లలని, తల్లిదండ్రులనీ వదిలి మాసాల తరబడి, ఎండనక, వాననక, తినీ తినక తిరుగుతుంటారు. నీడ పట్టున ఉన్న మన వంటివారికీ, వారికీ మనో భావాల్లో చాలా భేదం ఉంటుంది.” మాధవుడు వచ్చిన కొత్తలో నందుడు చెప్పిన మాటలు చెవిలో ప్రతిధ్వనిస్తుండగా లోపలికి నడిచాడు మాధవుడు.
అంతా యుద్ధ వాతావరణం.
ప్రతీ యుద్ధంలోనూ వందల మంది ప్రాణాలు కోల్పోతారు. గెలిచినది పరాయి రాజులైతే, ఊరి మీద పడి బీభత్సం చేస్తారు. దోపిడీలు, అత్యాచారాలు లెక్కే ఉండదు. కొందరి కళ్లల్లో భీతి, మరి కొందరి కళ్లల్లో క్రౌర్యం.
ఎవరికీ నచ్చని ఈ యుద్ధాలు ఎందుకు?
పాలకుల రాజ్య కాంక్ష తీర్చడానికే..
మాధవుని వంటి చిన్న పిల్లలకి కూడా మనసంతా విరక్తి భావం ఏర్పడుతుంది.
ఇంటిలో కూడా ఎక్కడ చూసినా సైనికులే.. సరిపోయేటన్ని సంభారాలున్నాయో లేదో! మాధవుడు లోనికి పరుగెత్తాడు. తన కళ్యాణి ఎలా ఉందో!
సైనికులు గుర్రాల మీద పడ్తారు. మేకలు కూడా.. ఏముంది? రెండు ముక్కలు చేస్తే ఒక పూట ఆహారం.
అదృష్టం.. అంతకు ముందే, వెనుక ఆవరణ లేనట్లుగా గోడ మూసేశాడు నందుడు.. గడ్డి మేటు అడ్డంగా వేసి. ఆవు, దూడ మాత్రం గడ్డి మేస్తూ కనిపించాయి. మిగిలిన జీవులు గోడ వెనుక.. వాటికి కూడా తెలిసిపోయింది, వాతావరణంలో మార్పు. నిశ్శబ్దంగా ఉండిపోయాయి.
…………………
పాతికమంది పైగా ఉన్నారు సైనికులు.
వెనుక, పెరట్లో తవ్విన గాడి పొయ్యి వెలిగించింది సీతమ్మ. పెద్ద గంగాళం నిండా నీళ్లు పోసింది, మరిగించడానికి.
అర బస్తా బియ్యం కడిగి ఆరపోశాడు నందుడు. దానికి సరిపోయే కూరలు తరుగుతోంది గౌతమి. అప్పటికే శేరు పైగా పప్పు నాన పోసింది సీతమ్మ. బాగా కారంగా పచ్చడి కూడా చెయ్యాలి.. ఏం చేద్దామా అని ఆలోచిస్తోంది..
“మిరపకాయ పచ్చడి చేస్తున్నావా అమ్మమ్మా? బావుంటుంది..” అప్పుడే అక్కడి కొచ్చిన మాధవుడు అన్నాడు.
“నీకు భలే ఆలోచనల్రా.. ఇంతున్నావు కానీ..” నవ్వుతూ చూసింది సీతమ్మ.
“ఇంతంత చేస్తున్నావే అమ్మమ్మా? మిగిలి పోతుందేమో కదా..”
“అక్కడున్నారే.. వాళ్లు, ఒక్కొక్కళ్లు శేరు బియ్యం అన్నం తినగలరు. పైగా.. ఆ సమయానికి ఇంకా ఇంత మంది వస్తారు చూడు.” సీతమ్మ గంగాళంలో సగం నీళ్లు తీసి వేరే డేయిసా లో పోసి అది కూడా గాడిపొయ్యికెక్కించింది. మరిగాక అందులో పప్పు పోసింది.
సరిగ్గా రెండి ఘడియల్లో వంటయిపోయింది.
వసారా బయట, తాటి చాపలు పరచి, సైనికులందరినీ పిలిచి కూర్చోమని.. అరిటాకుల మీద వేడిగా పొగలు గక్కుతున్న సన్న బియ్యం అన్నం వడ్డించారు, నందుడూ, గౌతమీ.
కమ్మ్టటి నెయ్యి వేసుకుని ఎన్ని రోజులయిందో పాపం.. ఒక్కొక్కళ్లు పురిషెడేసి వేసుకుని పప్పు కలిపి అందులో పచ్చిమిరప కాయ పచ్చడి నంచుకుని మాట్లాడకుండా తినేస్తున్నారు. మాట్లాడితే ఆ క్షణం వృధా అవుతుందని.
సీతమ్మ అన్నట్లుగానే, మరో పదిహేను మంది వచ్చేశారు సమయానికి. వాళ్లంతా అంత ఆబగా తింటుంటే ఆవిడకి కళ్లలో నీళ్లు తిరిగాయి. అంత మందికి వండి వార్చిన అలసట అంతా మాయమైపోయి, హృదయం కదిలి పోయింది.
“మరికొంచెం.. మరికొంచెం” అంటూ కొసరి కొసరి వడ్డించింది.
మాధవుడు పిడతల్లో మంచినీళ్లు నింపుతూ, నెయ్యి మారు వడ్డిస్తూ తిరిగాడు.
అందరూ కడుపు నిండుగా తిని, లేచాక చూస్తే.. సరిగ్గా నందుడి కుటుంబానికి సరిపోయేటన్ని మాత్రం మిగిలాయి ఆధరవులు. అమ్మమ్మ అనుభవంతో చెప్పిన మాటలు.. మాధవునికి ఆశ్చర్యం వేసింది.
భోజనాలయ్యాక సైనికులందరూ లేచి చేతులు కడుక్కుని వెళ్లి పోయారు.. కోటలోనుంచి కొమ్ము బూరా పిలుపులు వినిపించగానే!
ఏమీ మాట్లాడకుండా.. మొహల్లో కొంచెమైనా అసహనం చూపించకుండా నిశ్శబ్దంగా
ఆకులు తీసి అంతా శుభ్రం చేశారు నంద గౌతమిలు.
“అదేమి అమ్మమ్మా? అంత మంది తిని ఏమీ ఇవ్వకుండా వెళ్లి పోయారు? మనకి ఒక వారాని సరిపోయే సంభారాలు అయిపోయాయి” మాధవుడు అడిగాడు చిరాకుగా.
“తొందరపడి ఏ వ్యాఖ్యానాలు చెయ్యకూడదు నాయనా.. వేచి చూడు. వాళ్లకి కోట నుంచి ఎప్పుడు పిలుపందుతే అప్పుడు వెళ్ళాలని ఆజ్ఞ. ఏమీ చెయ్యలేరు. నిత్యం కత్తి మీర సామే వారి పని. నా ఊహ సరైతే, వాళ్లంతా ఇప్పుడో.. ఇంకాసేపట్లోనో బయల్దేరుతారు.”
అంతలో వాకిలి బైట గంటలు వినిపించాయి. మాధవుడు పరుగెత్తుకుంటూ బైటికెళ్లి చూశాడు. వరుసగా ఎడ్లబళ్లు కోట దిశగా వెళ్తున్నాయి.
మళ్లీ ఇంట్లోకి పరుగెత్తాడు మాధవుడు.
“సైనికులు బైటికెళ్లట్లే.. బళ్లు లోపలికెళ్తున్నాయి. తెరలు కట్టించి అంతఃపుర స్త్రీలని ఎక్కడికైనా పంపుతారేమో.. కోట ఖాళీ చేసేస్తారేమో! అప్పుడు నేను లోపలికెళ్లి చూడచ్చా?”
“వేచి చూద్దాం కన్నయ్యా ఏం జరుగుతుందో! ఈ లోగా మనం భోజనాలు చేద్దాం. ఆకలి దహించేస్తోంది.” నందుడు బాలుడు ఉత్సాహానికి అడ్డు కట్ట వేశాడు.
మాధవునికి కూడా పేగులు గోల పెడుతున్నాయి.
ఆకలికి మాత్రమే కాదు..
ఏదో తెలియని భయం.. ఏం జరగ బోతోంది?
వాళ్లు భోంచేస్తుండగానే కోటలో కలకలం.. గబగబా తినేసి, వాకిలి దగ్గరకు వెళ్లి చూశారు.
సైనికులు.. ముందుగా పదాతి దళం, తరువాత అశ్వదళం వెళ్తున్నారు.. దక్షణ దిశగా. ఆ వెనుక గజ దళం. మధ్యలో ఒక ఏనుగు మీద అంబారీ.. అందులో పూర్తి కవచ రక్షణలో ఉన్నాడు, కళింగ రాజు నాల్గవ భాను దేవుడు.
నందుడు, మాధవునికి చూపించాడు మహా రాజుని. గౌతమి, సీతమ్మలు కూడా కనుచూపు మేర చూసి లోపలికి వెళ్లారు నిట్టూరుస్తూ.
“అమ్మ, అమ్మమ్మ విచారంగా ఉన్నారు నాన్నగారూ.. ఇక్కడ కూడా ఇప్పుడు యుద్ధాలు వస్తున్నాయా?” మాధవుని శరీరం వణికింది. వంగ దేశం నుంచి తప్పించుకుని వస్తే ఇక్కడ కూడా..
“అదే కదా.. గత కొద్ది వారాలుగా అట్టుడికి పోతోంది. నగరం అంతా. మనం కూడా కావలసిన బియ్యం, పప్పులు.. అన్నీ నాణాలున్నంత వరకూ తెప్పించి పెట్టుకున్నాము. అయినా.. యుద్ధం ఆరంభం అయితే ఏ విధంగా పరిస్థితులు మారుతాయో చెప్పలేం.”
“వంగ దేశం నుంచి.. ఏమైనా భయం ఉందా? అక్కడి సుల్తాను..” మాధవుడు ఆందోళనగా అడిగాడు.
“అవును. జానుపూర్ సుల్తాన్ ఉత్తారాన చాలా సార్లు దండెత్తాడు. కానీ మాల్వా సుల్తాన్ పశ్చిమం నుంచి వంగ దేశాధీశుడిని చికాకు పెడ్తుండడంతో వెనక్కి వెళ్లిపోయాడు. పది సంవత్సరాల నుంచీ ఈ రాజు, నాల్గవ భానుదేవుడు ఏలుతున్నాడు.. కానీ ప్రజలేమంత సంతోషంగా లేరు. ఇప్పుడు చూడు.. దేశంలో ఎన్నో సమస్యలున్నాయి. చెరువులు ఎండి పోతున్నాయి. రహదారులు నిర్మించ వలసి ఉంది. పన్నులు పెంచేస్తున్నారు. ప్రజలు విలవిల్లాడి పోతున్నారు. దక్షిణాన రెడ్డిరాజులు కలహించుకుంటున్నారని అక్కడ గెలిచి, రాజ్యం పెంచుకోవచ్చని బయల్దేరాడు. ‘ఉట్టికెగరలేని వాళ్లు స్వర్గానికి ఎగరడం’ అంటే ఇదే..”
“చిన్న పిల్లవాడు. వానికి ఈ రాజకీయాలు నేర్పించ తగునా నందా?” సీతమ్మ కోప్పడింది.
“ఫరవాలేదండీ సీతమ్మగారూ! అర్ధం చేసుకున్నంతే.. ఈ సమయంలో ఏదీ దాచ కూడదు. పరిస్థితులు ఏ విధంగా మారుతాయో ఎవరు చెప్పగలరు?”
గౌతమి మ్లాన వదనంతో ఇంట్లోకి వెళ్ల బోయింది.
అంతలో.. రెండు ఎడ్ల బళ్లు వచ్చి ఇంటి ముందు ఆగాయి. వాటి నిండుగా బియ్యం, పప్పులు వంటి దినుసులు.. నందుడు సైనికుల భోజనాలకి వాడిన వాటికి నాలుగింతలు వచ్చాయి.
“మీ సేవకి సంతుష్టులైన కపిలేంద్ర దేవుల వారు పంపించారండీ. ఎప్పుడైనా ఎవరైనా సైనికులు వచ్చిన యెడల వారికి వండి పెట్టమని చెప్పమన్నారు. ఇంకా కొంత ధనము కూడా ఇచ్చారు.” మామూలు దుస్తులు వేసుకున్న ఒక యువకుడు, ఆశ్చర్యంతో చూస్తున్న నందుడి వద్దకు వచ్చి చెప్పాడు.
“కపిలేంద్రుల వారికి కృతజ్ఞతలు అంద చేయండి.” నందుడు వచ్చిన వారి సహాయంతో సంభారాలన్నీ లోపలికి తరలించాడు.
“అందుకే తొందర పడవద్దన్నాను. చూశావా మాధవా?” సీతమ్మ అంది.
మాధవుడు అర్ధమయిందన్నట్లు తలూపాడు.
……………….
......మంథా భానుమతి