TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
“అజ్ఞాత కులశీలశ్య….” 7వ భాగం
కం. నిలిచియు నుండెడి దేదీ
యిలను కనబడదు గనెపుడు, యేది మనదనే
తలపులు మనమున వలదని
పలికెదరు గురువులెపుడును బాగుగ వినగా.
సాధారణంగా గురువులు చెప్పేది వినడానికి మాత్రమే అనుకుంటారు... ఆచరణ కొచ్చే సరికి మాయ కమ్మేస్తుంది.
అందరు మత ప్రవక్తల బోధలూ అవే. తాత్కాలికమైన ఈ సుఖాల కోసం తాపత్రయాలెందుకు? కావలసినంత తినగలగడం, నచ్చిన ఆహార్యం ధరించగలగడం, పెద్ద భవంతిలో నివాసం.. ఇవే సుఖాలనుకుంటే ఎంత బాగుండును! అవే సరిపోవు. ఇంకా ఇంకా.. ఏదో కావాలి.
కొద్ది విచారంగా, మతాల సారాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, పంచలో కూర్చుని కూరగాయల తీగెలకి పందిరి కోసం, తాళ్లు పేనుతూ ఆలోచిస్తున్నాడు నందుడు.
తాము ఇక్కడ, తల్లీ, తమ్ముడూ బాలేశ్వర్ లో, ఉండవలసిన పరిస్థితుల గురించి.. తన తాతగారు చెప్పిన విషయాలు, తను చూస్తున్న సంఘటనలు తలుచుకుంటే విరక్తి కలుగుతుంది.. జీవితం మీద.
పోరు.. పోరు.. పోరు.
కళింగ సామ్రాజ్యం తూర్పు గాంగేయుల అధీనంలోకి వచ్చి నాలుగు శతాబ్దాలు గడుస్తోంది. కళింగపురం రాజధానిగా (ఇప్పటి శ్రీకాకుళం దగ్గరున్న శ్రీముఖలింగం) అనంతవర్మ చోడగంగుడు స్థాపించాడు. దక్షిణ భారత దేశం నుంచి వచ్చిన వారు కనుక అక్కడి సంస్కృతి, భాషలు కళింగంలో బాగా ప్రాచుర్యం పొందాయి.
పండితులకి కనీసం నాలుగు భాషలు వచ్చి ఉండేవి. అష్టభాషా కోవిదులు అడుగడుగునా కానవచ్చే వారు.
సామ్రాజ్యాన్ని స్థాపించిన అనంతవర్మ చోడగంగుడు, ఉత్తరాన గంగా నది నుంచీ దక్షిణాన గోదావరి వరకూ పాలించాడు. ఉత్కళ, కోసల, కళింగ రాజ్యాలన్నీ కలిపి, త్రికళింగాధిపతిగా రాజ్యాన్నేలాడు. ఆహార ఆహార్య వ్యవహారాలన్నింటిలో సామీప్యము సామాన్యమే. వివాహాది శుభకార్యాలకీ రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి, సంపన్నుల గృహాలలో.
అనంతవర్మ రాజ్యాన్ని విస్తరించడం ఒక పక్క, కళింగలో ఆలయాల నిర్మాణం ఒక పక్క చేపట్టాడు. జగత్ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాధుని ఆలయం అతడి కాలం లోనే నిర్మించారు.
తరువాతి రాజులు, ముసల్మానుల దండయాత్రలని ఎదిరించ లేక లొంగిపోయి, సామంతులైనా, ఒకటవ నరసింహ దేవుడు పుంజుకుని, దక్షిణ వంగ రాజధానిని చేజిక్కించుకుని అక్కడి సుల్తానుని ఓడించాడు.
ఇతడి తండ్రి, మూడవ అనంగ భీమదేవుడు, తన కాలంలో రాజధానిని కటకం పట్టణానికి మార్చాడు. ఆ మార్పుకి, దక్షిణ వంగదేశం దగ్గరగా ఉండటం, కటకం నైసర్గికంగా రాజధానిగా ఉండటానికి, కోట నిర్మాణానికి అనుకూలమవడం కారణమై ఉండవచ్చు. వెనువెంటనే కోట నిర్మాణం కూడా మొదలు పెట్టారు. అదే.. ప్రపంచ ప్రసిద్ధమైన “బారాబతీ కోట.”
ఒకటవ నరసింహ దేవుడే కోణార్క్ లో సూర్య దేవాలయాన్ని కట్టించాడు.
కానీ.. ఆ నరసింహదేవుడి తరువాత గాంగేయుల పతనం ఆరంభమయింది. ఉత్తరాన ఢిల్లీ సుల్తాను, ఆ తరువాత దక్షిణమున విజయనగర రాజులతో పోరులు జరుగుతూనే ఉండేవి.. వంగదేశంలోని అంతర్గత కలహాల వల్ల ప్రస్తుతానికి కటకం ప్రశాంతంగా ఉన్నట్లే ఉంది.
మాధవుడు కటకం చేరిన సమయంలో నాల్గవ నరసింహదేవుడి కొడుకు భానుదేవుడు కళింగనేలుతున్నాడు.
గాంగేయ రాజులందరిలోనూ అసమర్ధుడుగా పేరు తెచ్చుకున్నవాడు ఈ నాల్గవ భానుదేవుడు. తండ్రి పాలనలోనే అస్తవ్యస్తంగా తయారైన రాజ్య పరిస్థితి మరింత అధ్వాన్నంగా దిగజారింది. ఇతడు చంచల మనస్కుడిగా పేరు పొందాడు. అంతే కాదు.. ప్రజల చేత పిచ్చి రాజుగా పిలవ బడేవాడు.
నందుడి తండ్రి, నాల్గవ నరసింహదేవుని వంటశాలలో ప్రధాన పాక నిపుణుడుగా ఉండే వాడు. అతడిని యుద్ధ భూమిలో వంటలు చేయించడానికి తీసుకెళ్లాడు రాజు. అది అతని చివరి యుద్ధం.. అదీ వంగ దేశంతో.
ఆ సమయంలో పోరు మాని, సంధి చేసుకుని వచ్చే టప్పుడు.. కొందరు ప్రతిభ ఉన్న పని వారిని వదిలేయ వలసి వచ్చింది. అప్పుడే మహా పాత్రుడిని వంగ రాజుకి ఇచ్చేశాడు నరసింహ దేవుడు.
పనివారు కూడా మనుషులే.. వారికీ భార్యా పిల్లలుంటారు, అనే మానవత్వం మృగ్యం రాజులకి.. అదీ, యుద్ధనీతికొచ్చే సరికి. అశ్వాలనీ, గజాలనీ మార్చుకున్నట్లే మనుషుల్ని కూడా!
బాలవ్వ కటకం నుండి, సరిహద్దు ప్రాంతమైన బాలేశ్వర్ చేరుకుని, అక్కడ పూటకూళ్ల ఇల్లు నడప సాగింది. ఎప్పటికైనా భర్త రాకపోతాడా అని. అది అత్యాశే అని తెలిసినా కూడా..
నంద మహాపాత్రుడి వంశంలో భాష, వేదం మొదలైనవి మొదట్లో.. మూడు తరాల ముందు వరకూ ఉండేవి.. కానీ, కాలక్రమేణా, ఉదర పోషణార్ధం వంటవారి కింద మారక తప్పలేదు. కాలగమనంలో మార్పు సహజమే కదా!
గాంగేయ రాజులు ఆలయ నిర్మాణాల మీద, రాజ్య విస్తరణ మీద పెట్టిన శ్రద్ధ సాహిత్యం మీద పెట్టినట్లు లేదు.
ఎంతటి వారికైననూ సమయమునకు పొట్ట నింపుకొనవలసినదే.. రాజ్యంలో ఎన్నెన్ని యుద్ధాలైనా, ఎంత అల్ల కల్లోలం వచ్చినా కడుపు నింపే వారి జోలికి పోరు.
“క్షుద్బాధ.. సృష్టి కర్త జీవుల కొసగిన వరమూ శాపమూ కూడా!” అనుకున్నాడు నందుడు.
……………….
“అదే విధముగా నాన్నగారూ?” మాధవుడు మరునాడు అడిగాడు నందుడిని.
తమ వంశం గురించి చెప్తూ.. నందుడు ఆకలి ప్రాణికోటికి కొంత చెడూ, కొంత మంచీ కలిగించిందని చెప్పగానే.
“ఉ. ఆకలి గొన్నయా మెకము నల్పుల నేమరచిన్ వధించునే
ఆకడ వేటగాడెపుడు నామెకమున్ కని చంపుగా నదే
తేకువ యున్నవారి కడ తేర్చుకదా బలిమిన్ బుభుక్షకై
పోకడ నేకదా సతము భూమము నుండెడి దీ కతమ్మునన్.”
జన్మత: మాంసాహారి.. వేట ఒక క్రీడ ఆయిన రాజవంశంలో పుట్టిన మాధవుడు అర్ధం కానట్లు చూశాడు.
“అవును మాధవా! ఆకలి లేకున్న ఒకరినొకరు చంపుకోవడం ఉండదు కదా ఈ భూమ్మీద.”
“ఏమో నాన్నగారూ! అది కూడా ప్రాణుల సమ తుల్యానికి కావలసిందే అనే వారు మా గురువుగారు. అలా పెంచుకుంటూ పోతే, నిలబడ్డానికి కూడా చోటు సరిపోదేమో!” మాధవుడు సంకోచంగా అన్నాడు.
పుత్రుని మాటల్లో కొంత నిజం కూడా కనిపించింది నందుడికి.
“నిజమే.. కానీ ప్రాణం ఉన్న జీవిని చంపడం అమానుషం కాదా?”
విరక్తిగా నవ్వాడు మాధవుడు.
“ఆకలి వేస్తే కడుపు నింపుకుందుకు, ప్రాణాలు నిలుపుకోవడానికి చంపడం పాపం కాదు తండ్రీ. రాజ్యాల కోసం, మతం మార్చుకోమనీ, భోగాల కోసం చంపడం అమానుషం. ఏ జంతువైనా కడుపు నిండితే ఇంకొక జంతువు జోలికి వెళ్లదు. కానీ.. మనిషి? అన్నీ ఉండి కూడా మారణహోమం చేస్తాడు. ఎందుకు?” మాధవుని ప్రశ్నకు తక్షణం జవాబివ్వలేకపోయాడు నందుడు. కొంచెం ఆలోచించి చెప్పాడు.
“పాలకుడనే వాడు ఏ ప్రాంతానికైనా అవసరమే. ఒక క్రమశిక్షణలో జీవనం నడపాలంటే అతడికి అధికారం.. తప్పుచేస్తే దండన ఉంటుందన్న భయం ప్రజలకి ఉండాలి. లేదంటే ఆటవిక న్యాయం అయిపోతుంది. అది మానవులకి క్షేమం కాదు. కానీ.. సుభిక్షంగా ఉన్న దేశాలని ఆక్రమించుకోవడం, యుధ్ధాలు... వేల ప్రాణాలు తియ్యడం.. అదంతా అన్యాయమే. మనం అంత పెద్ద విషయాలు చర్చించడం అనవసరమేమో..” నవ్వుతూ వాతావరణం తేలిక చేశాడు నందుడు.
“మరి.. భగవంతుడు ఆకలి వల్ల మంచి కూడా చేశాడన్నారు కదా? అదే విధంగా?” మాధవుడు అడిగాడు.
“ఏ జీవికైనా జీవించడానికి ఒక ధ్యేయం ఉండాలి. ఆ ధ్యేయం.. ప్రప్రథమంగా ఆకలి. అది తీర్చుకోవడానికి ఏం దొరుకుతుందా అని వెతుకులాట మొదలు పెట్టడం, ఆ తరువాత అది పంచుకోవడానికి ఎవరైనా దొరుకుతారా అని చూడ్డం.. సమూహం ఏర్పడడానికి దోహదం అయింది. అదే.. ఆకలి లేదనుకో! ఏం పనుంటుంది? ఏమీ తినకుండా జీవులు పెరిగి పెద్దయి సమయం వచ్చినప్పుడు రాలిపోయి.. యాంత్రికం అయిపోదా?”
మాధవుడు నిజమే అన్నట్లు తలూపాడు.
“అదే విధంగా.. కాల్చో, ఉడికించో తినడం.. రకరకాల రుచులు, వానికోసం ఇంకా శ్రమించడం. ధ్యేయం వరకూ బాగనే ఉంది .. అలాగే సమూహాలు ఏర్పడ్డం, ఒకరి కోసం ఇంకొకరు తాపత్రయపడ్డం, బంధాలు, అనుబంధాలు.. అక్కడితో ఆగిపోతే బాగుండేది. ఆడంబరమైన ఆహార్యం, అలంకరణ.. సుఖాలు, అత్యాశ.. ఇవన్నీ జీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మీ తాతగారు ఆ విధంగానే మాకు దూరమైపోయారు.”
కుతూహలంగా చూస్తున్న మాధవునికి తన తండ్రిగారి గురించి చెప్పాడు నందుడు.
“ఒక విధంగా మనం వంటల వాళ్లుగా ఉండడం వల్లే ప్రాణాలు నిలుపుకో గలుగుతున్నాము. నువ్వు మాత్రం వేరే విద్యలు కూడా నేర్చుకోవాలని నా అభిలాష. మీ పూర్వీకుల వృత్తి ఏమిటో నాకు తెలియదు.. నీకు బలవంతంగా ఏ విద్యనీ అభ్యసింప చెయ్యటం నా అభిలాష కాదు. నీకు ఎందులో అభిరుచి ఉందో చెప్పు.”
“నాకు పాక శాస్త్రం మీద కూడా ఆసక్తి ఉంది నాన్నగారూ. మా జనకులు కోటలో సలహాదారుగా ఉండేవారు. రాజుగారికి ఆప్తులు. నాకు రాజకుమారులతో కత్తియుద్దం, గుర్రపు స్వారీ, ధనుర్విద్య ఆ విధంగానే పట్టుబడ్డాయి. వాటిమీద ఆసక్తి కూడా మెండు. అది కాక.. భాష కూడా. ఆంధ్ర, వంగ, సంస్కృతాలు చిన్న చిన్న గ్రంథాలు చదవడం వరకూ వచ్చింది.”
బాలుని బహుముఖ ప్రజ్ఞాపాటవాలకి ఒకరకంగా ఆనందం, మరొక విధంగా విచారం కలిగాయి నందుడికి.
ఇటువంటి పుత్రుడు తమకి లభించినందుకు ఆనందం.. ప్రజ్ఞాశీలుడే కాదు, మాధవుడు వినయ సంపన్నుడు కూడా.
అతడి కత్తి, గుర్రపు స్వారీల ప్రతిభ చూస్తే కోటలోని వారు ఊరుకుంటారా? నిస్సందేహంగా ఊరుకోరు.
తప్పని సరిగా సైన్యంలోకి తీసుకుంటారు. పుత్రోత్సాహం మూడునాళ్ల ముచ్చటే అవుతుందా? గురువుల వద్దకు పంపి విద్యలు నేర్పించడం ఎంత వరకూ సబబు? మాధవుని తల్లి ఏం కోరుకుంది?
ఆలోచనలో పడ్డాడు నందుడు.
తండ్రి తటపటాయించడం చూసి అన్నాడు మాధవుడు..
“ఆ. వె. బుడుతడి నని నీకు పుయిలోటము వలదు
వడివడిగ పరుగిడి వాటముగను
డంబరమున నేను డంకతనముతోను
సాయ పడెద తండ్రి శౌర్యమునను.”
ఆనందంతో దగ్గరకు తీసుకుని మనసారా హత్తుకున్నాడు, స్వయందత్తుడైన పుత్రుడిని నందుడు.
ఏది ఏవిధంగా జరగాలో.. ఎవరి చేత నుంది? విధి వ్రాత ననుసరించే కదా సాగేది జీవన యానం.
……………..
*బుభుక్ష = ఆకలి; *సతము = శాశ్వతము; *భూమము= భూమి; *పుయిలోటము = సంకోచము; *డంబరము = విజృంభణము; *డంకతనము = దార్ఢ్యము.
......మంథా భానుమతి