TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
నందుడు అస్థిమితంగా పచార్లు చేస్తున్నాడు, పంచలో.. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. మాధవుడు ఒక స్థంభాన్ని ఆనుకుని కూర్చుని చూస్తున్నాడు. సమస్య ఏమిటో తెలియడం లేదు..
తనేమైనా సహాయం చెయ్యగలడేమో..
మధ్యాహ్న భోజనాలయి, బాటసారులందరూ నిష్క్రమించారు, వారి వారి దిశలలో. అంతా సవ్యంగానే ఉంది కదా! మరి..
మనసులో తలపోస్తున్నాడు.. జన్మ కారకుడు కాకపోయిననూ, తనని ఆదరించి అక్కున చేర్చుకున్న తండ్రికి ఏవిధంగా ఉపశమనం కలిగించ గలనా యని..
కం. వ్యాకులిత మనము నటుయిటు
ఏకాగ్రతతో నడచుచు భృకుటి ముడిచెనే
నే కారణమో తెలిపిన
నీ కలతను మాన్పగలను నిక్కముగానున్.
“ఏమయినది తండ్రీ?” ఆగలేక దగ్గరగా వెళ్లి అడిగేశాడు.
మాధవుడిని పరికించి చూశాడు నందుడు.
ఈ పసివాడు తన సమస్యని పరిష్కరించగలడా?
కానీ గౌతమికి నమ్మకం కలిగింది బుడుతని మీద. అతడి వయసు చిన్నదైనా మానసిక వయసులో పెద్దే.
“నీకు ఉపనయనం, జగన్నాధ పాత్రునికి పెళ్లీ చెయ్యాలని సంకల్పించాము. జగన్నాధునికి పదునెనిమిది వత్సరాలు వచ్చాయి. అలాగే నీక్కూడా..”
“అవ్వ వస్తుందా?” ఉత్సాహంగా అడిగాడు బాలుడు.
నందుడు నిస్సహాయంగా చూశాడు గౌతమిని. ఆవిడ అదేమీ పట్టించుకోలేదు. అంతే ఉత్సాహంతో సమాధానం చెప్పింది.
“వస్తుంది మాధవా. ఇంకా బంధువులు కూడా వస్తారు. ఇంక పదిహేను దినములలోనే ముహూర్తం. అమ్మాయి వాళ్లు ఇక్కడి వారే. శుభకార్యాలు ఇక్కడే జరుగుతాయి.”
అప్పుడు అర్ధమయింది మాధవుడికి, నందుడి చింతకి హేతువు.
“దిగులెందుకు తండ్రీ? మన వద్ద నాణెములున్నవి కదా! సరిపోవా?”
నిజమే ఉన్నవి.. కానీ అవి వాడుట సముచితమేనా? తటపటాయించాడు నందుడు. ఉపనయనం చెయ్యడం తన బాధ్యత. దానికి పిల్లవాని వద్ద ధనం తీసుకొనడమా! తల విదిలించాడు.
ఎవరైనా ఉన్నారేమోనని ఒకపరి అంతా పరికించి అన్నాడు మాధవుడు..
“నేనే మీ పుత్రుడనే! నా ధనము మీది కాదా? సంకోచము వద్దు. మనం త్వరలో అంతకు అంతా సంపాదించుకోవచ్చు. ఇప్పటికి ఆ నాణెములను ఉపయోగించెదము.”
సంతోషంగా కుమారుని కౌగిలించుకుని నుదుటి మీద ఆదరంగా చుంబించాడు నందుడు.
“వెంటనే దిష్టి తీయ వలసిందే..” అప్పుడే లోనికి అడుగు పెడుతున్న సీతమ్మ అంది, ఆనందంగా.
…………………
మహా పాత్రుల గృహము కళకల్లాడిపోతోంది.
మాధవుని సహాయంతో నందుడే ఇంటికి వెల్లలు వేశాడు.
గోడల మధ్య అక్కడక్కడ ఎర్ర మట్టి రాసి కొన్న భాగాలని వదిలేశారు, గౌతమి సూచనమేరకు. ఆ భాగాల మీద, చక్కని రంగవల్లులు దిద్దారు, సీతమ్మా తనూ కలిసి.
ఆ.వె. ఇరుగు పొరుగు వారు నిష్టులందరు కూడి
పసుపు నంత దంపి బాగ చెరగి
మామిడాకులన్ని మలచి తీరుగ కట్టి
తోరణములు చేసె తొణగు నంత.
పసుపు రాసిన గడపలకి బొట్లు పెట్టే వారు, అరిశలకి పిండి దంచే వారు, పొయ్యిల మీద బాణలి పెట్టి చక్కిలాలు చేసే వారు, పువ్వుల మాలలు కట్టే వారు.. కన్నుల విందేను చూచువారందరికీ.
“ఈ అరటి చెట్టు ఎక్కడ పెట్టించాలి అమ్మమ్మా?” మాధవుడు, నుదుట నామముతో, బుగ్గను దిష్టి చుక్కతో, కొత్త పంచెను గోచీ పోసి కట్టి, ఉత్తరీయాన్ని నడుముకి బిగించి వచ్చాడు. పక్కనే గెలతో నున్నపెద్ద అరటి చెట్టు పట్టుకుని శ్రేష్ఠి గారి కొడుకు నాగయ్య నవ్వుతూ..
“అయ్యయ్యో.. ఎంత పని చేశావురా?” గట్టిగా అంది సీతమ్మ. ఒక్క సారిగా అందరూ పనులు ఆపేసి అటు చూశారు.
ఏం తప్పుచేశానా అని మాధవుడు అయోమయంగా చూస్తున్నాడు.
ఇంటిలోనుండి గౌతమి పరుగెత్తుకుంటూ వచ్చింది.
“ఏమయిందేమయింది?”
“పెళ్ళికొడుకుని చేసి పారాణి పెట్టాక ఇల్లు కదల వచ్చునా? వీడేమో.. పనులన్నీ చేసేస్తున్నాడు. అసలే ముహుర్తం లేదని, ఇన్నాళ్లూ వీడిని పెంచిన బామ్మ లేకుండానే చెయ్య వలసి వచ్చింది. ఆవిడేమనునో అని హడలుతుంటే వీడెక్కడ దొరికాడమ్మా!” సీతమ్మ మాటలకి అందరూ నవ్వేశారు.
అమ్మయ్య అనుకున్నాడు మాధవుడు.
“అమ్మమ్మా! నేనెక్కడికీ వెళ్లేదు. మన పెరటి లోనివే. నువ్వు ఆయాస పడవద్దు. నెమ్మదిగా నుండు.” మాధవుడు పరుగెత్తుకుని వచ్చి సీతమ్మ నడుం పట్టేసుకున్నాడు.
సరిగ్గా అదే సమయానికి, ఎడ్ల బళ్లు వచ్చి ఆగాయి వాకిలి ముందు.
ముందుగా, జగన్నాధుడు దిగి, తల్లికి చెయ్యందించాడు.
బాలవ్వ దిగుతూనే కళ్లప్పగించి అంతా పరికించింది. సంతోషంతో మొహం విప్పారింది.
పదంగల్లో మాధవుడు గెంతుకుంటూ వచ్చి, గుమ్మం దాట బోయి ఆగిపోయాడు.. సీతమ్మ మాటలు గుర్తుకొచ్చి.
బాలవ్వ, కళ్లారా బాలుడిని చూస్తూ, లోపలికి వచ్చి, హత్తుకుంది గాఢంగా.
కన్నుల నుండా నీళ్లు.. బుగ్గల మీదుగా కారి పోతున్నాయి.
మాధవుని స్థితి కూడా అంతే. అయితే..ఇద్దరివీ వేర్వేరు కారణాలు!
…………………
మామ్మా, మనవలని చూస్తున్న వారికి ఆ దృశ్యం ఎంతో అపురూపంగా అనిపించింది. ఎప్పటి అనుబంధమో అని కూడ అనుకున్నారు.
తాను చొరవ తీసుకుని పంపిన పసివాడు ఆనందంగా ఉన్నాడని బాలవ్వ, తనకి మాతా పితరులను, రక్షణను ఏర్పరచినందుకు మాధవుడు.. ఒకరి కొకరు అన్యోన్య ఆత్మీయతా భావనలో తాదాత్మ్యం చెంది పోయారు.
“అవ్వా! కులాసానా? చిన్నాన్న బాగా చూసుకుంటున్నాడా? లేదంటే చెప్పు, నేను వచ్చేస్తాను.” మాధవుడి మాటలకి ఫక్కున నవ్వి, నెత్తి మీద ఆప్యాయంగా తట్టాడు జగన్నాధుడు.
“చిన్నమ్మ ఎంతో బాగుంది అవ్వా! అచ్చంగా అమ్మలాగనే నవ్వుతూ ఉంటుంది. నేనే ముందు చూశాగా! చిన్నాన్న గురించిన విశేషాలన్నీ చెప్పేశా.” మాధవుడు చిన్నాన్నని ఆట పట్టించాడు.
“అమ్మయ్య. నీకు నచ్చింది కదా? ఐతే నాకునూ..” జగన్నాధుడు బండిలో నుండి అన్ని వస్తువులనూ దింపి లోపలికి తీసుకుని వచ్చాడు.
“త్వరగా స్నానం, భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి. సాయంత్రమే పెళ్లికొడుకుని చేస్తాము.” గౌతమి, బాలవ్వ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తూ జగన్నాధునికి చెప్పింది.
బాలవ్వ ముంగిలి లోనే కాళ్లు చేతులూ కడుగుకొని ఇల్లంతా తిరిగి, తృప్తిగా తల పంకించింది. ప్రతీ ముగ్గునీ పరికించి చూసింది.
స్నాన, భోజనాది కార్యక్రమాలయ్యాక, విశ్రాంతిగా పంచలో కాళ్లు చాచుకుని, స్థంభానికానుకుని కూర్చుంది బాలవ్వ.
మాధవుడు నెమ్మదిగా ఆవిడ పక్కనే చేరాడు.
కాళ్లు రాస్తూ, ఒళ్లో తల పెట్టి పడుక్కున్నాడు.. మొహం లోకి చూస్తూ.
“ఏమిటి చూస్తున్నావు కన్నయ్యా?”
“నీ నుదుట కుంకుమ సంధ్యా సమయంలో సూర్యుడిలా మెరుస్తోందవ్వా. తాతగారు..”
అటూ ఇటూ చూసింది బాలవ్వ కలవరంతో.. ఎవరైనా ఉన్నారేమోనని.
అందరూ పనులు ఆపేసి వెళ్లిపోయారు ఇళ్లకి. మధ్యాహ్న కార్యక్రమాలకి. గౌతమి లోపల ఏదో పనిలో ఉంది. మగవాళ్లిద్దరూ బైటికి వెళ్లారు.
మాధవునికి బాలవ్వ వద్ద నున్నప్పుడు ఆ విషయం అడగాలని తోచ లేదు.. అప్పుడు ఎక్కడ నీడ దొరుకుతుందా అనే వ్యాకులముతోనే సరి పోయింది. ఇప్పుడు అంతా సవ్యంగా స్థిరమయింది కదా.. కుతూహలం వచ్చింది.
“తాతగారు, ఇప్పటి రాజు గారి తండ్రిగారితో యుద్ధానికి వెళ్లిపోయాడు.. వారిని వదిలి ఆ తండ్రిగారు వచ్చేశారు. అప్పటి నుంచీ జాడ లేదు. చాలా ఇళ్ళలో గాధలంతే.. యుద్ధాలకో, యాత్రలకో వెళ్లి పోతారు ఇంటి మగవారు. ఆడవారు నిత్య ముత్తైదువులుగా ఉంటారు.. వారి వర్తమానం తెలియక. అలాగే జీవితాలు గడిచి పోతుంటాయి.” బాలవ్వ నిట్టూర్చింది.
“మరేమీ భెంగ పడకవ్వా! మాధవుడున్నాడుగా చూసుకుంటాడు.” గోముగా అన్నాడు.
బాలవ్వ చటుక్కున ముందుకు వంగి బాలుడి నుదుట ముద్దు పెట్టింది.
అలాగే స్తంభానికి ఆనుకున్న బాలవ్వ కిందికి జారి కళ్లు మూసుకుంది తృప్తిగా. ఆమె ఒడిలో మాధవుడు..
కం. అనుబంధం ముడివడుటకు,
కనికరమును జూపుటకును కావలె మరియా
జనమానువేధ మింకను
మనసు మనసు కలిసినంత మనును నిబంధం.
జీవన యానంలో ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎదురు, పడతారో.. ఏ బంధాలు ఏర్పడతాయో, అవి ఏ విధమైనవో ఆ విధాతకే తెలియాలి.
…………..
గాఢ నిద్రలో నున్న బాలవ్వ ఉలిక్కిపడి లేచింది. అంతా హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆడవారు చీనాంబరాలు ధరించి ఒద్దికగా ఒక దగ్గర కూర్చుని పూల మాలలు కడుతున్నారు.
వసారాలో ఆ పక్కన ముగ్గులతో అలంకరించిన పీట.. దాని ముందు పసుపురాసి, బొట్లుపెట్టిన రోలు, రోకలి. స్తంభాలకి అల్లుకున్న పువ్వుల తీగలు సహజ తోరణాలు. పైనుంచి మామిడి తోరణాలు కూడా కట్టారు.
బాలవ్వ ఒడిలో తల పెట్టి అడ్డంగా కాళ్లు జాపి పడుకున్న మాధవుడు కూడా లేచాడు, కళ్లు నులుముకుంటూ.
“లేచారా? రండి, అలా వెళ్లి ముఖము, కళ్లు చల్లని నీళ్లతో కడుక్కుని రండి. వేడి పాలు తాగుతే అలసట తగ్గుతుంది. కన్నయ్యకి నాయనమ్మ ఒడి, వెచ్చగా, హాయిగా ఉన్నట్లుంది. ఒడలెరుగక నిద్రించాడు.” గౌతమి, బాలవ్వకి చెయ్యందించి లేపింది.
అంతలో జగన్నాధుడు, నామం, బుగ్గన చుక్కతో వెళ్లి పీట మీద కూర్చున్నాడు. అతడి పక్కన బంధువుల అబ్బాయిని తోడు పెళ్లి కొడుకుగా కూర్చో పెట్టారు.
బాలవ్వ, మాధవుడు క్షణాలలో పెరటి వాకిట్లో పనులు ముగించుకుని, పరుగున వచ్చేశారు.
ముత్తయిదువలు, పెళ్లి కొడుకుకి, తోడుకీ నెత్తి మీద నూనె పెట్టడం, అక్షింతలు వెయ్యడం ఆశీర్వదించడం జరిగాక, ఇద్దరికీ అభ్యంగన స్నానం చేయించి.. కొత్త వస్త్రములు కట్టారు.
కొడుకుని నిండుగా చూసుకుంటూ కోడలు చేతనే మొదటగా పసుపు కొమ్ములు దంపించింది బాలవ్వ. నంద, గౌతమిలు ఆశీర్వదించాక.. మిగిలిన ఆడ వారందరూ పసుపు కొమ్ముల మీద మూడూ పోట్లు వేసి అక్షింతలు వేశారు.
చివరిగా బాలవ్వ వెళ్లి, జగన్నాధుని ఆశీర్వదించింది.
ఆ తరువాత, పందిరికి రాట పాతడం, అందరూ పాటలు పాడడం..
ఒకరి నొకరు పరిహాసాలు..
“వదినా! ఇంక మేము ఎంతసేపు కూర్చోవాలి?” జగన్నాధుని పిలుపుకి అటు తిరిగిన గౌతమి.. హారతి పళ్లెం తీసుకు వచ్చి, హారతిచ్చి లేపింది పెళ్లి కొడుకునీ తోడు పెళ్లికొడుకునీ.
…………….
మాధవుని ఉపనయన మహోత్సవం జరుగుతోంది.
గౌతమీ, నందులు పీటల మీద కూర్చుని శ్రద్ధగా చేస్తున్నారు.
“బ్రహ్మ దేవునకు సహజంగా లభించిందీ మొదట పుట్టినదీ అయిన ఈ పవిత్ర యజ్ఞ ఉపవీతాన్ని నేను ధరిస్తున్నాను ఈ యజ్ఞ ఉపవీతం నాకు తేజస్సు, బలం, దీర్ఘాయువు, నిర్మలత్వం మరియు పుష్టిని ఇచ్చుగాక”
మంత్ర యుక్తంగా మాధవుని చేత పలికించి యజ్ఞోపవీతాన్ని ధరింప జేశారు ఆచార్యుల వారు.
“వటువు వయసెంతన్నారూ?”
“పది సంవత్సరాలు నిండాయండీ గురువు గారూ!” మాధవుడు అనేశాడు. అసంకల్పితంగా.
చిన్నపిల్లవాడి చలాకీతనం.. అందరూ నవ్వుకున్నారు.
“మరి ఇంతకాలం ఆగారెందుకూ? బ్రాహ్మణ బాలురకు ఉపనయనం ఎనిమిది సంవత్సరాలకి చెయ్యాలి. పదకొండు వత్సరాలంటే క్షత్రియ బాలురకు చేసే వయసు.” నిష్ఠూరంగా అన్నారు ఆచార్యులవారు.
మాధవుని మొహం విప్పారింది ఆ మాట వినగానే..
“నేను క్షత్రియ బాలుడినే కదా. ఔచిత్యంగానే ఉంది..” నోటి వరకూ వచ్చిన మాటని వెనక్కి తోసేశాడు, అమ్మ చెప్పిన జాగ్రత్తలు గుర్తుకొచ్చి.
“నీ కుల గోత్రాలు ఎట్టి పరిస్థితుల లోనూ బయట పెట్టద్దు. అజ్ఞాతంగానే ఉండనీయాలి.” గుర్రం పరుగు తీయబోయే ముందు అమ్మ చెప్పిన మాట.. మాధవుని కన్నులలో నీరు తిరిగింది అప్రయత్నంగా.
“ఇన్ని సంవత్సరాలు, అమ్మ వద్ద పెరిగాడు. అందుకే మాకు అవకాశం రాలేదు స్వామీ. ఏదైనా ప్రాయశ్చిత్తం..” నందుడు వినయంగా అన్నాడు.
“అయ్యో.. నేనేం అనలేదు. విచారం వలదు నాయనా. అప్పుడైతే మంచిదని అన్నాను. ఇప్పుడైనా గాయత్రీ మంత్రం నిష్ఠగా త్రికాలములందూ పఠిస్తే దోషం పోతుంది.”మాధవుని పెద్ద పెద్ద కన్నుల నిండా నీరు చూసిన ఆచార్యులు గాభరాగా అన్నారు.
గౌతమి, మాధవుని దగ్గరగా తీసుకుని తల నిమిరింది. పంచ శిఖలూ.. మధ్య మధ్యలో నున్నని గుండూ మెత్తగా తగిలాయి.
అమ్మ నడుం గట్టిగా పట్టుకుని కన్నీళ్లని లోనికి తరిమేశాడు మాధవుడు.
దండం ధరించి, పచ్చని పంచ కట్టుకుని, ముందుగా మాతృమూర్తిని, పితృదేవుడిని భిక్ష అడిగి, అందరినీ వరుసగా యాచించాడు మాధవుడు.
“అచ్చంగా ఆ వామన మూర్తి లాగనే ఉన్నాడు నా చిట్టి తండ్రి..” నాన్నమ్మ మెటికలు విరిచింది.
“పోలిక బావుంది. మూడడుగులూ అడిగి చక్రవర్తిని ముంచకుండా చూసుకో బాలవ్వా!” నవ్వుతూ అన్నారు ఆచార్యులవారు.
“నా కన్నయ్య ఆ విధంగా ఎందుకు చేస్తాడు.. సార్వభౌముని రక్షిస్తాడు కానీ.” గౌతమి రోషపడింది.
“కోపం వద్దు తల్లీ. పరిహాసానికన్నాను. ఆ వామనుడు లోక రక్షణకే కదా ఆవిధంగా చేసింది. ఈ బాలునిలో ఆ కళే ఉంది. మంచి పనులు చేస్తూ తప్పక వృద్ధిలోకొస్తాడు.”
వచ్చిన ఆహూతులందరూ మాధవుని ఆశీర్వదిస్తూ అదే అనుకున్నారు.. బాలునిలో ఏదో శక్తి నిక్షిప్తమై ఉందని.
…………………..
“అమ్మా! ఈ తల ఇంతేనా?” తడుముకుంటా అడిగాడు మాధవుడు. పంచ శిఖలూ తీసేసి, నున్నగా గుండు చేసి, వెనుక మాత్రం చిన్న శిఖ ఉంచారు.
ఉపనయనం అయి, వచ్చినవారందరూ వెళ్లి పోయారు.
రోజూ గాయత్రి జపిస్తున్నాడు మాధవుడు.
“అంతే కద మాధవా! ఒడుగయ్యాక బ్రాహ్మణ బాలురు ఈ విధంగానే ఉంటారు. వచ్చే వారం నుంచీ గురువుగారి వద్దకు వెళ్లి, భాష, వేదం, స్మార్తం నేర్చుకోవాలి. అసలు గురుకులం లో పెట్టేద్దామనుకున్నాం కానీ, ఇన్నేళ్లకి మా వద్దకొచ్చావని దగ్గరే ఉంచుకుందామనుకున్నాం.” గౌతమి వివరించింది.
“మరి వేదం, భాష అంటున్నారు కదా.. మనం వంటలు ఎందుకు చేస్తున్నాం? రాజుగారి కొలువులోనో, విద్వత్ సభల్లోనో తండ్రిగారు వేదాలు చదవచ్చు కదా? వారు చదువుకొన లేదా?” మాధవుని సందేహం సరైనదే. కానీ జవాబు చెప్ప వచ్చులో లేదో.. నందుని వంక చూసింది గౌతమి.
“ఫరవాలేదు. బాలుడు విషయాలు గ్రహించాలి. చెప్తాను.. అలా వ్యాహ్యాళి కెళ్లినప్పుడు.” నందుడు నెమ్మదిగా అన్నాడు.
“అయ్యో నా ఉంగరాల జుత్తు..” తల మళ్లీ తడుముకుంటూ కినుకగా అన్నాడు మాధవుడు. అప్పుడప్పుడు అతడి లోని పసి బాలుడు పైకొస్తుంటాడు.. అనుభవాలు ఎంత పెద్దరికాన్ని తెచ్చినా.
“అంతే.. అంతే. నేను కూడా చాలా ఏడ్చాను. ఎనిమిదో ఏడు వరకూ ఆగారు మా తల్లిదండ్రులు. శరీరంలోంచి ఒక భాగం కోల్పోయినంత బాధ కలిగింది. సాంప్రదాయం మరి.. తప్పదు.” ఓదార్చాడు నందుడు.
“చాలా రోజులయింది. కళ్యాణినొక పరి తిప్పి రానా నాన్నగారూ?”
నిజమే.. వారం పైనయింది. ఎవరూ బాడుగకి కూడా తీసుకోలేదు. వెనుక భాగాన కాసేపు వదులుతున్నారంతే. గుర్రాలకి స్వారీ చాలా ముఖ్యం.. లేకున్న శరీరం బరువు పెరిగి పోయి కదల లేవు.
మాధవుడు నాలుగంగల్లో పెరటిలోనికి వెళ్లి, కళ్యాణిని మాలీషు చెయ్య సాగాడు. పావుగంట పైగా చేసి, కాసిన్ని గుగ్గిళ్లు తినిపించి, బంధనం విప్పి, జీనునమర్చి, స్తంభం పట్టుకుని పైకెక్కి.. నాలుగు క్షణాల్లో ఇల్లు వదలి వెళ్లి పోయాడు.
గౌతమీ నందులు, మాధవుడు కనిపించే వరకూ చూస్తూ నిలిచి ఇంట్లోకి వెళ్లి పోయారు.
......మంథా భానుమతి