Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మహాశ్వేతా దేవి




మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? మహాశ్వేతా దేవి

 


మహాశ్వేతా దేవి (Jnanapeeth Awardee) గురించి నా పరిచయం వల్ల తెలుసుకోవడం కంటే మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఒక వేళ మీరు ఆమె రచనలు ఏవైనా సరే చదవకపోతే వెంటనే బజారెళ్ళి ఆమె రాసిన ఏ ఒక్క నవలైనా, కధైనా చదవమని. అది వెంటనే కుదరదనుకుంటే, ఆమె రాసిన కధల ఆధారంగా తీసిన "రుఢాలి", కానీ, "హజార్ చౌరసి కీ మా", కానీ "సంఘుర్ష్", కానీ "మాటీ మాయ్", సినిమాలు కానీ చూడమని. ఇవన్నీ కూడా ఎవార్డ్స్ గెలుచుకున్న సినిమాలే. అద్భుతమైన కధాంశాలే. నిజానికి ఒక లైఫ్ టైంలో ఆవిడ రాసిన పుస్తకాలు చదవటం నాలాంటి వాళ్ళ వల్ల అయ్యే పని అయితే కాదు. ఆమె వందకు దగ్గరగా నవల్సు రాసింది. ఇరవైకి పైగా కధా సంకలనాలు రాసింది. ఆమె రచనలన్నిటిలోనూ వ్యక్తమయ్యేది ఒక విప్ల్వాత్మక తిరుగుబాటు, గిరిజనులకు, దళితులకు, స్త్రీలకు జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా చేసే పోరాటం.

ఎంత చెప్పినా ఆమె గురించి, ఎలా చెప్పినా ఆమె ప్రతిభకి గానీ గిరిజన సంక్షేమానికి అంకితం చేసిన ఆమె జీవితం గురించి కానీ, ఆమె అంకిత భావానికి కానీ నేను న్యాయం చెయ్యలేను. ఆమెకొచ్చిన ఎవార్డ్స్ వల్ల ఆమెకు గౌరవం రావడం కాదు ఆమె వల్ల ఆ ఎవార్డ్స్కి గౌరవం వచ్చిందనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం పద్మశ్రీ నుంచి, భారత రత్న బిరుదులు ఏ పద్ధతి ఇస్తున్నారో చూస్తే వాటి మీద గౌరవం శూన్యమైపోయింది. ఇప్పుడు నేనిచ్చే బిరుదుల లిస్ట్ కేవలం తెలుసుకోవడం కొరకు ఇస్తాను. కానీ ఇవి ఆమె గొప్పతనానికి ఏ మాత్రం చిహ్నాలు కావు. ఆమె రాసిన ఒక్క కధ చదివితే చాలు, ఆమె ప్రతిభ ఏంటో తెలియడానికి. ఆమె కలం కదలికల్లో జీవితం కధలా నిలుస్తుందో, కధే జీవితంలా మన ముందుంటుందో తెలుసుకోవటం కష్టం.

    1979: Sahitya Akademi Award (Bengali): – Aranyer Adhikar (novel)
    1986: Padma Shri[2]
    1996: Jnanpith Award – the highest literary award from the Bharatiya Jnanpith
    1997: Ramon Magsaysay Award – Journalism, Literature, and the Creative Communication Arts[2][7]
    1999: Honoris causa – Indira Gandhi National Open University (IGNOU)
    2006: Padma Vibhushan – the second highest civilian award from the Government of India
    2010:Yashwantrao Chavan National Award
    2011: Bangabibhushan – the highest civilian award from the Government of West Bengal
    2012: Hall of Fame Lifetime Achievement Sahityabrahma – the first Lifetime Achievement award in Bengali Literature from 4thScreen-IFJW.

. 2014: 1st Mamoni Raisom Goswami National Award for Literature constituted by Assam Sahitya Sabha and sponsored by Numaligarh Refinery Limited, Assam

ఆమె జీవితమంతా గిరిజనులకి, ఆడవారికి, దళితులకి ధార పోసింది. అందుకే ఆమెకు "Mother of Shabars” అనే పేరు. లోధాస్ ఇంకా శబరులు బెంగాల్లోని గిరిజనులు. ఆమె రచనల్లో ప్రతిబింబించేది వీరి జీవిత చిత్రాలే, కామందుల, దళారుల, ఉన్నత కుల వర్గాల చేతుల్లో నలిగిపోయే వీరి జీవితాలే. వీరి జీవితాలే ఆమె కధాంశాలు. ఇక్కడ “Breast Stories" అనే కధా సంకలనంలోని ఒక కధ గురించి మీకు చెప్పాలి. ఆడవాళ్ళ శరీరం వస్తువుగా మారి, అమ్మకానికి, జరుగుబాటుకి పనికొచ్చే సాధనంగా ఎలా మారుతుందో ఈ కధ చిత్రిస్తుంది. భర్త అవిటివాడై సంపాదించలేని పరిస్తితిలో ఉన్న ఒక స్త్రీ కేవలం నిండుగా ఉన్న తన పాలిండ్లనే వాడుకుని, ఒక ధనిక కుటుంబంలోని పిల్లలకి పాతికేళ్ళపాటు పాలిచ్చి పెంచి తన కుటుంబానికి ఆధారంగా నిలబడుతుంది. కానీ రొమ్ము కేన్సర్ వచ్చి ఇక పాలివ్వలేని పరిస్తితిలో దిక్కు మొక్కు లేక, పట్టించుకునే నాధుడు లేక కృంగి కృశించి చచ్చిపోతుంది. ఎంతో హృదయవిదారకమైన డిపిక్షన్.

అలాగే రుఢాలి అనే కధని సినిమాగా తీసారు. రుఢాలి అంటే, ధనికుల ఇళ్ళలో ఎవరైన చనిపోతే ఏడవటం వాళ్ళ సంస్కారం కాదు, అందుకని ఏడవటానికి మనుషుల్ని పెట్టుకుంటారు. వీరినే రుఢాలీ అంటారు. ఇంటివారి బదులు వీళ్ళే గుండెలు బాదుకుని పెద్దగా ఏడుస్తారు, కొద్దిగా డబ్బు, కొంచం బియ్యం వగైరాల కోసం. ఇదొక వృత్తి. ఇది ఎంత అద్భుతమైన, విలక్షణమైన కధో చదివితే తెలుస్తుంది. రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామంలో జరిగే కధ ఇది. బహుసా చాలా మంది ఈ సినిమా చూసే ఉంటారు.

శనిచరి, శనివారం పుట్టిందని, పుట్టగానే తండ్రిని చంపేసిందని ఆపేరు పెడతారు. తల్లి డబ్బున్న ఒక నాటకాల కంపెనీ ఆసామితో శనిచరి చంటిపిల్లగా ఉన్నపుడే లేచిపోతుంది. ఇక ఊరివాళ్ళు శనిచరి అనే పేరు ఖరారు చేసేస్తారు. బంధువులే పెంచి గంజు అనే అతనికి ఇచ్చి పెళ్ళి చేస్తారు. ఇతనొక తాగుబోతు, ఇతనికొక రోగిష్టి తల్లి. ఒక కొడుకు పుడతాడు బుధ్వా అని. ఖామందు రామవతార్ కొడుకు, లక్ష్మన్ సింగ్ శనిచరిని తన కుటుంబాన్ని వదిలి తన ఉంపుడుకత్తెగా ఉండమని కోరతాడు. తన కుటుంబాన్ని వదలదు, కాని మనసులో ఒక అవ్యక్తమైన ప్రేమ ఉంటుంది లక్ష్మన్ సింగ్ అంటే. మంచంలోంచే ఈమెని పీడించి, పీడించి అత్త చనిపోతుంది. ఆతరవాత మొగుడు కూడా అర్ధాంతరంగా చనిపోతాడు. విషయం ఏంటంటే చిన్నప్పట్నించి కూడా ఏంజరిగినా శనిచరికి ఏడుపు రాదు. తనను తను ఎంతో ఫోర్స్ చేసుకుంటుంది, ఏడవటానికి, ఎంతో ఉద్రేకపడుతూ, కనీసం ఊరివారందరికీ శనిచరి కూడా ఏడవగలదని చూపెట్టటానికి. కానీ ఆమెకు కన్నీళ్ళు రావు, కష్టాలు పడి పడి కన్నీరు ఇంకిపోతుంది. ఊరివారికి ఆశ్చర్యం, ఈమె సమస్య. కొడుకు ఈమె కిష్టం లేకపోయినా ఒక వేశ్యని ప్రేమించి పెళ్ళిచేసుకుంటాడు. ఊరివాళ్ళకి ఇంకొక విషయం దొరుకుతుంది శనిచరిని దుయ్యబట్టడానికి. కాని కామందు ఈమె అంటే ఉండే ఇష్టం వల్ల, ఊరినించి వెలి వేయమని కొందరు ఫిర్యాదులు చేసినా ఊరుకుంటాడు. కోడలితో గొడవ పడినప్పుడు, కడుపుతోటున్న ఆమె కోపంతో గర్భస్రావం చేసుకుంటుంది. అప్పుడు కూడా శనిచరి ఏడవదు. చివరకు కొడుకు చెప్పకుండా ఎటో వెళ్ళిపోతాడు. ఈ సమయంలో భిక్ని అనే రుఢాలి ఈమెను కలుస్తుంది. ఈమె కధoతా వింటుంది. కానీ ఆమె కధని శనిచరికి చెప్పే లోపు ఆమెకు ఒకరిదగ్గరనుంచి కబురొచ్చి రెండ్రోజుల్లో వస్తానని వెళ్తుంది. అప్పుడు శనిచరికి భిక్ని లేని కారణంగా రుఢాలిగా ఏడ్వటానికి రమ్మని, రామవ్తార్ చనిపోతున్నడని, కబురొస్తుంది. కానీ అసలు ఈమెకు ఏడవటమే రాదు. అలాంటప్పుడు రుఢాలిగా ఏంచేస్తుంది? అయినా అస్సలు జరుగుబాటు లేక వెళ్తుంది. అక్కడ ఆమెకు ఒక కబురొస్తుంది. భిక్ని చనిపోయినట్టు. అప్పుడే తెలుస్తుంది, భిక్ని ఎవరో కాదు ఆమె తల్లి అని. చిన్నప్పుడెప్పుడో తల్లి వదిలి వెళ్ళినప్పట్నుంచి ఏడవటం మానేసిన శనిచరికి అప్పుడు ఏడుపు వస్తుంది. గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఈ కధని అద్భుతంగా పిక్చరైస్ చేసారు. జీవితానికి అద్దం పట్టే మహాశ్వేతాదేవి కధలు ఎవరైనా చదవకపోతే వెంటనే కొనుక్కుని చదవాల్సిన కధలు. ఏ సన్నివేశం కూడా కల్పించినట్టుగా ఉండదు, జీవితాన్ని అచ్చం అలాగే వర్ణించినట్టుగా ఉంటాయి ఆమె కధలు. ఈ సినిమాలో నటించిన డింపుల్ కపాడియా కు నేషల్ ఫిల్మ్ ఎవార్డ్, ఉత్తమ నటిగా వచ్చింది, అలాగే హజార్ చౌరాసి కీ మా ( Mother of 1084) లో నటించిన జయా బాధురీకి కూడా ఫిల్మ్ ఫేర్ ఎవార్డ్ వచ్చింది. ఈ కధ కూడా మీకు వివరించాలని చాల ఉత్సుకత ఉంది కానీ చెప్పను. ఇలా చెప్తూ పోతే ఆవిడవి చాలానే కధలు చెప్పాల్సి వస్తుంది, కాబట్టి మీరే వెతికి పట్టుకోండి. చదవండి, చదివి ఆమె సృష్టించే భావోద్వేగ ప్రవాహంలో పడి కొట్టుకుపొండి.

ఈ వ్యాసం ముగించేముందు ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా కొన్ని వివరాలు తెలుసుకుందాము. మహాశ్వేతాదేవి ఢాకా లో పుట్టింది. కానీ పార్టిషన్ తరవాత బెంగాల్లో స్థిరపడింది. ఆమె తల్లితండ్రులిద్దరూ సాహిత్య ప్రియులే. తండ్రి నవలా రచయిత, తల్లి కూడా రచయిత్రి, సంఘ సేవకురాలు. ఆమె అంకుల్ స్థాపకుడూ, Editor of Economic and Politial Weekly of India. భర్త బిజొన్ భట్టాచార్య పేరు మోసిన నాటక రచయిత. ఆమె కొడుకు నాబారున్ భట్టాచార్య బెంగాల్లో పేరుమోసిన రచయితల్లో ఒకరు. అతని నవలల్లోని ఆధ్యాత్మికతకీ, మేధస్సుకి గుర్తింపబడినవాడు. ఈరకమైన కుటుంబంలోంచి వచ్చిన ఆమె రాయటంలో అయితే ఆశ్చర్యం లేదు గాని, గిరిజనుల కోసం ఆమె చేసిన పోరాటాలయితే మాత్రం కేవలం వారి గురించి రాసేసి చేతులు దులుపుకోకుండా వారి పక్షాన నిలబడి వారిని పీడించిన ప్రతి వర్గంతోనూ ప్రభుత్వంతో సహా ఆమె పోరాటం చెయ్యడం, తన జీవితాన్ని వారి హక్కుల పరిరక్షణకై నిరంతరంగా ధారపొయ్యటం మాత్రం అసాధారణ విషయమే. ఈ విషయంలో ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే.

2006 లో ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫైర్ లో ఏ దేశానికైనా అరుదుగా లభించే అవకాశం, రెండవసారి ఆహ్వానం భారత దేశానికి వచ్చిన సందర్భంలో ఆమె మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వారంతా కన్నీటిపర్యంతం అయ్యారట. ఆమె రచనలే కాకుండా ఆమె ఉపన్యాసం కూడా అంతే శక్తిమంతమైనదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఒకసారి ఆమెను గుజరాత్లో ఒక గిరిజన సమావేశం సందర్భంగా ఆహ్వానించినపుడు, ఆమెకు ఒక మంచి హోటల్లో బస ఏర్పాటు చేస్తే ఆమె చాలా ఇబ్బంది పడిపోయిందట. చేసేది లేక, ఆమెను ఆహ్వానించిన జర్నలిస్ట్ ఆమెను తన ఇంటికి పిలిచి, ఇంట్లో భార్య కూడా లేని కారణంగా ఏంపెట్టాలో తెలియక ఇబ్బంది పడుతూ, ఎండిపోయిన బ్రెడ్ ముక్కలూ, పచ్చడీ ఉల్లిపాయలే గతి అనుకుని భయపడుతూ, ఏం మాట్లాడాలో కూడా తెలియక "మీ పళ్ళు గట్టిగా ఉన్నాయా?" అని అడిగాడట (ఎండిన బ్రెడ్ ముక్కలు తినడం కోసం) తనను చూడగానే వేసిన ఈ అసందర్భ ప్రశ్నకు అంతవరకూ చిరాకుగా ఉన్న ఆమె పగలబడి నవ్విందట. మా ఇంట్లో మీకు సౌకర్యంగా ఉండక పోవచ్చు ఇక్కడ సదుపాయాలు సరిగా లేవని అంటే, "మీరు మా ఇంటికి వచ్చి చూడండి" మీ ఇల్లు నాకు లక్జురీ అందట ఆమె. అదీ ఆమె వ్యక్తిత్వం.

ఇక ముందు మీరు మీ జీవితంలో ఏంచెయ్యదల్చుకున్నారన్న ప్రశ్నకు ఆమె ఇలా సమాధానం ఇచ్చింది. "Fight for the tribals, downtrodden, underprivileged and write creatively if and when I find the time".

 

 

....Sivapurapu Sharada