Facebook Twitter
కవిత్వాన్ని తెలుగునేలపై జల్లిన కవి గుంటూరు శేషేంద్రశర్మ

 

 

కవిత్వాన్ని తెలుగునేలపై జల్లిన కవి గుంటూరు శేషేంద్రశర్మ

 

 

       
            ఆధునిక కవిత్వంలో అతనిదొక విలక్షణ మార్గం. అటు మార్క్సిజాన్ని, ఇటు వేద సారాన్ని నింపి సమ సమాజ స్థాపనకోసం కవిత్వాన్ని తెలుగునేలపై జల్లిన కవి. వస్తువును కవిత్వంగా మార్చే తీరులో శేషేంద్ర ఓ ముద్ర. ఓ ప్రత్యేకమైన సంతకం. ఒక విశ్వనాథ, ఒక శ్రీశ్రీ లాగా ఒక శేషేంద్ర కూడా జీనియస్. ఛందస్సు రహస్యాలను, వచనకవిత్వంలోని నూతన వరవడులను చిక్కగా పట్టుకొని గాఢంగా ప్రయోగించిన శబ్ద శిల్పి శేషేంద్ర. సిద్ధాంతాల దృష్ట్యా వివాదాస్పదుడైనా, కవిత్వానికి మాత్రం పట్టం కట్టిన కవి శేషేంద్ర.
            శేషేంద్ర శర్మ నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి దగ్గరున్న నాగరాజుపాడులో
అక్టోబరు 20, 1927లో జన్మించారు. తండ్రి సుబ్రహ్మణ్యశర్మ, తల్లి అమ్మాయమ్మ. వీరిది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పుడే శేషేంద్ర రుగ్వేదం, యజుర్వేదం, శబ్దమంజరి, ధాతుపాఠాలను నేర్చుకున్నారు. అలాగే కుమార సంభవంలోని కొన్ని సర్గలు, మేఘసందేశంలోని ప్రథమభాగం, అభిజ్ఞాన శాకుంతలం, అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహ వంటి సంస్కృత గ్రంథాలను చదువుకున్నారు. నెల్లూరు వి.ఆర్. కళాశాలలో ఇంటర్మీడియట్ చదువారు. గుంటూరు ఎ.సి. కాలేజ్ లో బి.ఎ. చేశారు. ఆ రోజుల్లోనే "సొరాబు" అనే కావ్యాన్ని రాశారు. తర్వాత మద్రాసులోని లా కాలేజ్ లో చేరారు. అప్పుడే తాపి ధర్మారావు పనిచేస్తున్న "జనవాణి" పత్రికలో జర్నలిస్టుగా కొంతకాలం పనిచేశారు. పిఠాపురంలో డిప్యూటీ పంచాయితీ అధికారిగా ఉద్యోగంలో చేరారు, తిరుపతి, కందుకూరు, పొదిలిలో కూడా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాదు కార్పొరేషన్ లో అసిస్టెంటు కమీషనరుగా, డిప్యూటి కమీషనరుగా, సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, గ్రీస్, తూర్పు ఆఫ్రికా దేశాలలో కూడా పర్యటించి వచ్చారు. శేషేంద్ర భార్య జానకి, పిల్లలు :  వసుంధర , రేవతి ( కుమార్తెలు ), వనమాలి , సాత్యకి ( కుమారులు )
          శేషేంద్రశర్మ ముప్పైకి పైగా కావ్యాలు రాశారు. చంపూ వినోదిని, ఋతఘోష, శేషజ్యోత్న, మండేసూర్యుడు, నా దేశం నా ప్రజలు, నీరై పారిపోయింది, గొర్రిల్లా, సముద్రం నా పేరు, ప్రేమ లేఖలు, రక్తరేఖ, కవిసేన మేనిఫెస్టో, ఆధునిక మహాభారతం, వంటి ఎన్నో అద్భుతమైన కావ్యాలు రాశారు. షోడశి అనే విమర్శ గ్రంథాన్ని, విహ్వల పేరుతో కథలను, సాహిత్య కౌమిది పేరుతో వ్యాసాలను వెలువరించారు. వీరి కవిత్వం గాఢతతో సామాన్యులకు అర్థం కాకపోయినా కవిత్వ రహస్యాలను అలంకరించుకొని హుందాగా ఉంటుంది. అందుకే వీరిని శిల్ప కవి అని కూడా అంటారు. శేషేంద్ర కవిత్వంలో ప్రతీకలు, పద చిత్రాలు, వాక్య నిర్మాణ రీతులు, అభివ్యక్తిలో కొత్త పోకడలు కనిపిస్తాయి.
        వర్గ చైతన్యాన్ని, నూతన అభివ్యక్తిని నింపుకున్న కావ్యం "మండే సూర్యుడు". "ఆకాశం నుంచి తెగి సూర్యుడు నెత్తుటేరుల్లో పడ్డాడు". అని కవి ఈ కావ్యాన్ని ప్రారంభిస్తారు. "ఈ దేశం నా ప్రతిభ కొక సమాధి, ఎంత వడివడిగా నడిచినా సరే ఎప్పుడూ దూరం అంతే" అని శ్రమ జీవులకు తగిన ఫలితం అందడం లేదంటారు. అలానే "నా దేశం - నా ప్రజలు" లో "లేస్తొంది ఉషఃకాంతుల్లోంచి ఒక హస్తం, ఆ హస్తం కాలం అనే నిరంతరం శ్రామికుడి సమస్తం" అంటారు. అంటే పీడిత ప్రజలపై సాగుతున్న దోపిడీని వర్ణిస్తూ, సందేశాన్ని ఇస్తుంది. గాఢమైన అభివ్యక్తితో కవిత్వాన్ని విస్తరింపజేయడం శేషేంద్ర ప్రత్యేకత. అలానే వీరి "గొర్రిల్లా" కావ్యంలో "నమ్మండి మనిషి బాధని తొడలమీద వేసుకొని పొట్టచీల్చే రోజు వస్తుంది గొరిల్లా" "రైతులారా, రాజకీయ వర్షం పడుతోంది, మోసపోయి మీ విత్తనాలు చల్లకండి" అని శక్తివంతమైన కవిత్వ వాక్యాలతో ప్రకాశిస్తుంది "గొర్రిల్లా" కావ్యం. అలానే 1986లో వచ్చిన "ఆధునిక మహాభారతము" పది పర్వాల మహా కావ్యం. భారతంలోని పర్వాల వలే కాకుండా ప్రజాపర్వం, సూర్యపర్వం... అనే పేర్లు పెట్టారు శేషేంద్ర ఈ కావ్యానికి. అలానే "జనవంశమ్" కావ్యాన్ని ఆరుకాండలతో రచించారు.
            శేషేంద్రశర్మ1975లో వచ్చిన "ముత్యాల ముగ్గు" సినిమాలో "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది" అనే ఒకే ఒక్క పాటను రాశారు. శేషేంద్ర ముప్పైకి పైగా రనచలు చేసినా ఎంత సనాతనుడో అంత ఆధునికుడు. ఎంత ప్రాచీనుడో, అంత అధునికుడు.1993లో సుబ్రహ్మణ్య భారతి రాష్ట్రీయ సాహిత్య పురస్కారం, 1994లో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు, 1999లో వీరికి సాహిత్య అకాడమీ అవార్డు వంటివి ఎన్నో వచ్చాయి. 2004లో వీరి "నా దేశం నా ప్రజలు" కావ్యం నోబుల్ పురస్కారానికి నామినేట్ అయింది. "నేనింతా ఒక పిడికెడు మట్టే కావచ్చు. కాని కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్న పొగరుంది" అని చెప్పిన శేషేంద్ర హైదరాబాదులో మే 30, 2007లో గుండెపోటుతో మరణించారు.
           "నవ్వుల జల్లులు కురిశాయి నా మీద, పుష్పవాణి పలికింది
            బిడ్డా...పువ్వుల్ని తెలియనివారే అందరూ ఈ లోకంలో
             -------------   ----------------   ----------------
             పుష్పవతులైన మానవీయ జాతివారందరూ మాతృదేవతలే
             భార్య కూడా భర్తకు మాతృదేవతయే
            ఇది కీలక రహస్యం - ఇది కీలక సత్యం"
                     ఇది శేషేంద్ర రాసిన చివరి కవిత.
              
                 
                                                         

.......డా. ఎ.రవీంద్రబాబు

 

For More Details