Facebook Twitter
కాకతీయుల కాలంలో మహిళల పోరాట ఆనవాళ్ళు

 

కాకతీయుల కాలం నాటి మహిళల పోరాటానికి సంబంధించిన సాక్షాలు వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని తిప్పడంపల్లి గ్రామంలో నేటికీ దర్శనమిస్తున్నాయి. వీరగల్లుల శిల్పాలుగా పిలువబడే ఈ శిల్పాలు నాటి మహిళా సైనికుల అనవాళ్ళను గుర్తుచేస్తున్నాయి. తిపుడంపల్లి కి సమీపంలో అడవి ఆంజనేయుడు ఉన్న ప్రాంతాన్ని బింగిరాసిపల్లిగా పిలిచేవారని స్థానికులు తెలిపారు.

ఇక్కడ ఓ మహిళ రంకెలేస్తున్న గుర్రంపై కత్తి చేతబట్టి కూర్చుండగా మరికొందరు మహిళలు రక్షణగా ఉన్న శిల్పం స్పష్టంగా ఉంది. చారిత్రక శిల్పాలైనప్పటికి పొలం యజమానులు మాత్రం వీటిని దైవ సంబంధమైనవిగా భావించి పూజలు చేస్తుంటారు.తిపుడంపల్లి సమీపంలోని శ్రీరాంనగర్ రైల్వే స్టేషన్ కు వెళ్ళే దారిలో మరో ప్రాంతాన్ని ఎద్ధులోనిపల్లిగా స్థానికులు పిలుస్తారు. ఇక్కడ కూడా ఆయుధాలు చేబట్టిన మహిళలల శిల్పం ఉంది.

తిపుడంపల్లి కాకతీయుల రాజధానిగా కొంతకాలముండడం రుద్రమదేవి కుడిభుజమైన గోనగన్నారెడ్డి ఎలుబడిలో ఈ ప్రాంతముండడం చారిత్రక ఆధారాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. బింగిరాసిపల్లి, ఎద్దులోనిపల్లి నాడు యుద్ధ శిక్షణా క్షేత్రాలుగా ఉండేవని  అనంతరం కాలగర్భంలో కలిసిపోయాయని తెలుస్తోంది. 1995 నుండి 2001 వరకు,(తొలినియామకం) 2009 నుండి 2015 (పదోన్నతి)వరకు తిపుడంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేస్తున్న కాలంలో పూర్వవిద్యార్థులిచ్చిన సమాచారంతో చారిత్రక ప్రాంతాలను సందర్శించి ఆధారాలను వెలుగులోకి తేవడం జరిగింది లోతుగా పరిశోధన జరిపితే మరిన్ని చారిత్రక ఆనవాళ్ళు వెలుగుచూసే అవకాశముంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సందర్భోచితమని భావిస్తున్నాను.

 

 


 వ్యాసకర్త: 

గుముడాల చక్రవర్తి గౌడ్
తెలుగు భాషోపాధ్యాయులు 
జడ్పీ హెచ్ యస్