Facebook Twitter
భలే పిల్లలు

శ్రీను, వాణీ ఇద్దరూ ఒకే తరగతి చదువుతున్నారు. ఇద్దరూ తెలివైన విద్యార్థులే. ఎప్పుడు ఎవరు మొదటి ర్యాంకు వస్తారో చెప్పడం కష్టం. చిన్నప్పటి నుంచీ ప్రతి చిన్న విషయానికీ పోట్లాడుకునేవారు. వారి సమస్యను పరిష్కరించడానికి తల ప్రాణం తోకకు వచ్చేది. "శభాష్ వాణీ! నువ్వు పద్యాన్ని రాగ, భావ యుక్తంగా మంచిగా అప్పజెప్పావు." అని తెలుగు ఉపాధ్యాయులు మెచ్చుకుంటే శ్రీనూకి కోపం వచ్చేది. శ్రీనూని పొగిడితే వాణీకి కోపం వచ్చేది. కానీ ఇద్దరూ ఎంత పోట్లాడుకున్నా కాసేపట్లో అంతా మరచిపోయి ఎవరి చదువులో వారు మునిగి పోయేవారు. వీరిద్దరి మధ్య వైరాన్ని పెంచడానికి కొంతమంది స్వార్థపరులు ప్రయత్నించేవారు.

 

        "వాణీ! ఆ శ్రీను నువ్వు బాగా చదువినా, నిన్ను ఎవరు మెచ్చుకున్నా అస్సలు ఓర్వలేడు. వాడితో నువ్వు ఎప్పుడూ మాట్లాడవద్దు." అన్నది మంజుల అనే అమ్మాయి. "శ్రీను నీకు శత్రువా?" అన్నది వాణి.  "కాదు" అన్నది మంజుల. "మరి నువ్వెందుకు అతనిపై చెడుగా నాకు చెబుతున్నావు?" అని నిలదీసింది వాణి. మంజుల తలవంచుకుని అక్కడ నుంచి వెళ్ళింది. మరోసారి సతీశ్  అనే అబ్బాయి‌ శ్రీను వద్దకు వచ్చి, "ఆ వాణీనే మాస్టార్లు ఎఎప్పుడూ మెచ్చుకుంటారం? పాపం! నిన్నెవ్వరూ పట్టించుకోరు. ఆ వాణీతో నువ్వు ఎప్పుడూ మాట్లాడవద్దు. ఎప్పుడూ నీతో ఏదో ఒక గొడవే!" అన్నది. "నీకూ వాణికి శత్రుత్వమా?" అని అడిగాడు శ్రీను. "లేదు." అన్నాడు సతీశ్. "ఇద్దరి మధ్య పోట్లాటలు జరుగుతుంటే వారి మధ్య శత్రుత్వాన్ని పెంచడమేనా నీ పని? అలా పెంచితే నీకు ఏం వస్తుంది? నీవు మనశ్శాంతిని కోల్పోతావు. నీ సమయాన్ని ఇతరులకు మంచి చేయడానికి కేటాయించు. కానీ ఇలాంటి పనిలేని ఆలోచనలు చేయకు." అన్నాడు శ్రీను. సిగ్గుతో తల వంచుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సతీశ్. వాళ్ళిద్దరూ పోట్లాడుకున్నా ఎవరి మధ్యనైనా వైరం వస్తే వాళ్ళిద్దరినీ కలిపేవారు. తరగతి ఐకమత్యంగా ఉండడానికి నిరంతరం పాటుపడేవారు. మరి మీ ఇద్దరూ ఎందుకు ఐకమత్యంగా ఉండరు? అని ఎవరైనా అడిగితే కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయేవారు శ్రీను, వాణీలు.   శ్రీను ఒక గ్రూపును, వాణీ ఒక గ్రూపును నడిపేవారు. వారిలో శత్రుత్వాన్ని పెంచడానికి కాదు. ప్రత్యర్థి గ్రూపుతో తామకు చదువులోనూ, ఆటపాటలలోనూ మరింత పోటీ పెంచడానికి. ఇది తెలిసిన ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. 10వ తరగతి పూర్తి కావస్తున్నది. 

 

       ఒకరోజు శ్రీను తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులను అందరినీ తన ఇంటికి ఆహ్వానించాడు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా అక్కడి సన్నివేశాన్ని చూసి, అందరూ అవాక్కయ్యారు. శ్రీనూకి వాణీ ఆప్యాయంగా కేకు అనిపిస్తుంది. శ్రీను వాణికీ కేకు తినిపించాడు. ఇంతకీ పుట్టినరోజు ఎవరిది అనేది అందరికీ అయోమయం. అప్పుడు వాణీ ఇలా అన్నది. "మీరంతా! ఆశ్చర్యపోయారా! శ్రీను నాకు అన్నయ్య. మేమిద్దరం అక్కాచెల్లెళ్ళ పిల్లలం. చిన్నప్పటి నుంచీ ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం. వేసవి సెలవులలో అక్కాచెల్లెళ్ళ పిల్లలం ఒకచోట కలుసుకుంటే ఆటలే ఆటలు ‌ క్యారమ్ బోర్డు, ఒక్కొక్క అక్షరంతో ఊరు, పేరు, సినిమా, వస్తువులను ఆలోచించి రాసే ఆట, సినిమాలో మొదటి అక్షరం, చివరి అక్షరం రాసి, మధ్యలో తగినన్ని ఖాళీలు పెడితే సినిమా పేరు ఆలోచించి రాసే ఆట, అష్టా చెమ్మా, పచ్చీసు ఇలాంటి బోలెడన్ని ఆటలు ఆడుకునే వాళ్ళం. ఇంటివద్ద చదువులో ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ చిన్నప్పటి నుంచి అలా చదువుకునే వాళ్ళం. తరగతిలో మా పోట్లాటలు సరదాకే! కానీ మా గొడవలతో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. తరగతి ఐక్యత కోసం కృషి చేశాం. గ్రూపులు చేసి, శత్రుత్వాన్ని పెంచలేదు. చదువులో, ఆటపాటల్లో అందరినీ ప్రోత్సహించాం. మా ప్రోత్సాహం వల్లే మీ అందరూ మెరుగయ్యారని అనుకుంటున్నాం. అందుకే ఐక్యత ముఖ్యం. భవిష్యత్తులో మీరు ఎక్కడ చదువుకున్నా అందరూ ఐకమత్యంగా ఉండాలి." అన్నది వాణీ. సంతోషించారు అందరూ. ఆ అన్నాచెల్లెళ్లను అభినందించారు.

- సరికొండ శ్రీనివాసరాజు.