Facebook Twitter
ఒక వాహన చోదకుడి కథ

 

కొద్ది సేపటి లో ప్రారంభమయ్యే నా ఉపన్యాసానకి రంగం సిద్ధం చేసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత, తెలుగు గడ్డపై తెలుగులో మాట్లాడబోతున్నాను. పైగా ముఖ్య అతిథి ఎవరో కాదు ముఖ్యమంత్రి గారు. 

“నా విజయానికి ముఖ్య కారణం - నా శ్రమ, పట్టుదల ఇంకా వీటికి తోడు.. ధనూక వారి పురుగుల మందు...” చి ఛీ ఇది చిన్నప్పుడు ఆకాశవాణి లో వచ్చిన వాణిజ్య ప్రకటన.  
అలా కాదు “నా విజయానికి ముఖ్య కారణం నా శ్రమ, పట్టుదల, ఇంకా నా బలహీనత. బలహీనత లేకపోతే సమాజానికి ప్రగతి ఉండదు”.. 

అవును నా బలహీనతే నన్ను ముందుకు నడిపించింది, ఈనాడు నన్ను మీ ముందు ఇలా నిలబెట్టింది.
అదేమిటో తెలుసుకోవాలంటే నా ఏడో తరగతికి వెళ్ళాల్సిందే. అప్పుడు నా పుట్టిన రోజుకి నాన్న బహుమతిగా సైకిల్ కొనిచ్చారు. ఆ రోజు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోయాను. 

మేము అప్పుడు ఒక పల్లెటూరిలో డాభా ఇంట్లో ఉండే వాళ్ళం. సైకిల్ కొన్నాక, నాన్న రోజూ మా పల్లెటూళ్ళో చిన్న రోడ్డు మీదకి సైకిల్ నేర్పటానికి తీసుకుని వెళ్ళేవారు. నేను భయంతో గట్టిగా తొక్కి వేగంగా వెళ్లి పోయేవాడిని. ఎవరైనా మనిషి కనిపిస్తే మటుకు చేతులు వణికిపోయి, వెంటనే బ్రేక్ పడిపోయేది. ఆ వెంటనే భళ్ళు మన్న శబ్దం. మోచిప్పలూ, మోకాళ్ళు కొట్టుకు పోయేవి. ఒక వారం తేరుకున్నాక మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అయ్యేది. 

ఇలా అయితే లాభం లేదు అనుకుని, ఒక ఆదివారం నాడు మా నాన్న మనుషులు ఎవరూ కనిపించని ప్రభుత్వ బడికి తీసుకువెళ్లారు. అక్కడ స్కూల్ చుట్టూ రౌండ్లు వేయమని వదిలేశారు. నేనేదో నా తిప్పలు పడుతుంటే, ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక అమ్మాయి పెద్ద సైకిల్ వేసుకుని వచ్చింది. ఆమె వయసు ఒక పదేళ్లు ఉంటాయేమో! నా ముందరే వేగంగా రౌండ్లు వేస్తూ, “నీకు రాదా!” అన్నట్టు నా వైపు చూసి పకపకా నవ్వింది. 

అంతే, నాకు పౌరుషం పొడుచుకు వచ్చింది. మనుషులు కనిపిస్తుండగా నేను డ్రైవింగ్ నేర్చుకోనని మొరాయించాను. 

“నర మానవుడు కనిపించకూడదంటే ఎలాగ రా?” అని నాన్న అడిగితే,  డాభా వైపు చూసాను. 
మర్నాడు సైకిల్ ఇంటి డాభా మీద ప్రత్యక్షం అయ్యింది. 

అప్పటి నుండి మగ మహారాజు సినిమా లో చిరంజీవి లాగా మూడేళ్లు మేడ మీద సైకిల్ తొక్కుతూనే ఉన్నాను. 

ఎట్టకేలకు పదవ తరగతిలో ఒక రోజు ధైర్యం చేసి సైకిల్ తొక్కుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళాను. ఒక అర కిలో మీటర్ బాగానే నడిపాను. అప్పుడే ఒక చిక్కు సమస్య ఎదురయ్యింది. రోడ్డు దాటటం కోసం సిగ్నల్ ఇవ్వాలి అంటే చేయి ఎత్తాలి. చేయి ఎత్తగానే బ్యాలెన్స్ తప్పి పడిపోవటం, వెనుక నుండి వస్తున్న కార్ సడన్ బ్రేక్ వేసి ఆగిపోవటం - అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి.  

చావు తప్పి కన్ను లొట్టబోయి, సైకిల్ ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చిన నన్ను చూసి మా నాన్న “నువ్వు మళ్ళీ సైకిల్ ఎక్కితే ఊరుకోను” అని గట్టిగా కేకలేశాడు. 

అయినా వెధవది, సైకిల్ ఎక్కాలి, తొక్కాలి, బ్యాలెన్స్ చేయాలి – అది నా వల్ల కాదులే అని ఈ సారి పూర్తిగా చేతులెత్తేశాను. 

అప్పటి నుండి బయట తిరుగుళ్ళు లేకపోవడం తో శ్రద్ధగా చదివి మెకానికల్ ఇంజనీరింగ్ లో చేరాను. 
కాలేజీలో చేరాక రోజూ కొంత మంది  కాలేజీ  అబ్బాయిలు సైకిల్ మీద చేతులు ఎత్తేసి తొక్కుతూ, అమ్మాయిల ముందు ఫోజు కొట్టేవారు. ఇంకొంత మంది రయి రయి మంటూ బైక్ తో ఫీట్లు చేసేవారు. నేను ఆ సౌభాగ్యానికి నోచుకోక పోవటం తో నాకు  ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా తగలలేదు.

రోజూ కాలేజీకి బస్ లోనే వెళ్ళి వచ్చేవాడిని. అలా రెండు సంవత్సరాలు బస్సు రాకపోకలతో గడిచిపోయింది. ఒక రోజు నేను ఎక్కాల్సిన బస్ దూరం నుండే కదిలిపోవడం గమనించాను. అయ్యో, ఆలస్యమైపోయిందే అని నెత్తిన చేతులు వేసుకుని నుంచున్నాను. కొద్ది సెకను లలో బస్ ఆగిపోయింది. బస్ లో నుండి ఒక అమ్మాయి వంగి రమ్మన్నట్టు చూసింది. అంతే, ఆ క్షణంలో ఆమె నాకు బాహుబలి లో అవంతిక లాగా కనిపించింది. నా శక్తినంతా కూడదీసుకుని పరుగు అందుకున్నాను. ఆమె నాకు చేయి అందించి బస్ లోపలికి లాగింది. 

నాకు ఖాళీ సీట్ చూపించి, ఆ అమ్మాయి ఫుట్ పాత్ దగ్గరే ఉండిపోయింది. అంత ధైర్యం, దర్జాగా ఉన్న ఆమెని అలా చూస్తూనే ఉండిపోవాలని అనిపించింది. 

ఆమె సరిగ్గా మా కాలేజీ ముందే దిగి లోపలికి వెళ్లిపోతుంటే కొందరు పోకిరి వెధవలు అడ్డుకున్నారు. 
“ఏంటి ఫ్రెషర్ నా? స్వంత డబ్బా చెప్పి లోపలికి వెళ్లాలని తెలీదా?” అని చేయి అడ్డు పెట్టి ఆపేశారు. 
“పేరు రంహిత, కరాటే బ్లాక్ బెల్ట్, కంప్యూటర్ ఇంజనీరింగ్. ఇంకా ఏమైనా కావాలా?” అని గుడ్లురిమి చూస్తూ, చేతుల గాజులు వెనక్కి పెట్టింది.

 అంతే, వెంటనే ఆమెకి అడ్డు తొలగి లోపలికి వెళ్ళిపోయింది. 

“అమ్మాయి బాగా ఫాస్టు రోయ్, “ అని ఒకడు, “రంహిత ట రోయ్, మంచి రమ్ము తాగే దమ్ము ఉన్న పిల్ల” అని ఇంకొకడు ఆ కుర్ర వెధవల కామెంట్లు. అయినా నాకు తెలీక అడుగుతాను - అమ్మాయి ఫాస్టుగా ఉంటే తప్పేమిటి ట? ఆ క్షణంలోనే ఆమె నా హృదయాన్ని తడిమింది. 

మర్నాడు తొందరగా బస్ ఎక్కి ఆమె కోసం ఎదురు చూశాను. బస్ కదిలిపోయినా ఆ అమ్మాయి కనిపించలేదు. ఉసూరు మానుకుంటూ సీట్లో కూర్చున్నాను. కొద్ది సేపటికి కిటికీ లో నుండి ఆమె వేగంగా స్కూటర్ మీద వెళ్ళిపోవటం కనిపించింది. ఆ నిమిషం లోనే ఆ అమ్మాయి వాయువేగంతో నా గుండెల్లొకి దూసుకెళ్లిపోయింది. 

ఇంక తప్పదు అనుకుని ఒకరోజు మా ఫ్రెండ్ స్కూటర్ అడిగి తీసుకున్నాను. “ఇలా కిక్ చేస్తే స్టార్ట్, అలా వెళ్ళిపోవటమే” అన్నాడు. సరే కదా అని స్టార్ట్ చేశాను. స్కూటర్ అలా వేగంగా వెళ్లిపోతోంది. “మేఘాలలో తెలిపోతున్నది” అని పాట పాడుకుంటూ, ఆమెను ఊహించుకుంటూ కొద్ది దూరం వెళ్ళాను. ఇంక ఆపేద్దాం అనుకుంటే ఎలా ఆపాలో తెలీలేదు. భయంతో హ్యాండిల్ తిప్పటం వల్ల స్కూటర్ వేగం ఇంకా ఎక్కువ అయ్యింది.  సైకిల్ అయితే బ్రేక్ వేసే పని, మరి స్కూటర్ కి ఏమి చేయాలబ్బా? 

ఆ గందరగోళం నుండి బయట పడటానికి కాలు క్రిందకు పెట్టి కాలు తో ఈడుస్తూ స్కూటర్ని వదిలేసి దూకేశాను. స్కూటర్  నేల మీద పడి పల్టీలు కొడుతుంటే, మా ఫ్రెండ్ గాడు ఎక్కడి నుండో పరుగున వచ్చి బండి ఆపేశాడు. “ఒరేయ్ చెప్పడం మర్చిపోయాను, ఈ స్విచ్ నొక్కితే బండి ఆగిపోతుంది రా” అన్నాడు. అదేదో వాడు ముందే అఘోరిస్తే బాగుండేది కదా. వాడు అప్పటికే బండి నిండా సొట్టలు పడ్డాయని గుడ్ల నీళ్ళు గుడ్ల కుక్కుకున్నాడు, ఇంకేమనేది పాపం. ఇంక నేను మళ్ళీ ఎవరినీ స్కూటర్ అడిగిన పాపాన పోలేదు.  

అప్పుడే సరిగ్గా రంహిత నవ్వు వినిపించింది. అది ఎక్కడో బాగా తెలిసిన నవ్వులా అనిపించింది. ఈ సారి నవ్వులో వెటకారం లేదు, జాలి ఉంది. ఆ నవ్వు నా గుండెని కుమ్మేసింది. 

 అయినా ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కానీ డ్రైవింగ్ పురుష లక్షణం అన్నారా? అందుకే ఈ డ్రైవింగ్, అమ్మాయిలు గొడవ మానేసి కొన్నాళ్ళు బుద్ధిగా చదువుకుందామనుకున్నాను.

కాలేజీ చివరి సంవత్సరంలో కార్ల గురించి, వాటి డిజైన్ ల గురించి తెలుసుకుని, కార్ల మీద మమకారం పెరిగింది. కార్ అయితే లోపల కూర్చుంటాము కాబట్టి  మనకి దెబ్బలు తగలవు, ప్రమాదం ఉండదు. ఇక బ్యాలెన్స్ గోల అసలే ఉండదు. 

రాత్రి పగలు కష్టపడి, ఒక కార్ల కంపనీలో ఉద్యోగం తెచ్చుకున్నాను. యూనివర్సిటీ లో గోల్డ్ మెడల్ కూడా సంపాదించాను. ఉద్యోగంలో చేరిన మొదటి నెల డ్రైవింగ్ స్కూల్ లో చేరాను. 

డ్రైవరు నన్ను స్టీరింగ్ పట్టుకోమన్నప్పుడు మహారాజా వారి సీట్ ఎక్కినంత సంబర పడ్డాను. కానీ స్టీరింగ్ పట్టుకోగానే నా చేతులు వణకటం మొదలు పెట్టాయి. అయినా పక్కన అతడు ఉన్నాడన్న ధైర్యం తో నడపటం మొదలు పెట్టాను. కార్ ముందు నడుస్తున్న వాళ్ళు దగ్గరగా ఉన్నారో, దూరంగా ఉన్నారో అర్థం కాని అయోమయం లో ఒకరిద్దరిని గుద్దబోయాను. డ్రైవరు బాబు ప్రక్కనే ఉండబట్టి వెంటనే అపాయాన్ని ఆపాడు.  

అయినా అందరూ మొదట్లో ఇంతేగా అనుకున్నాను, కానీ అది ఆ ఒక్క రోజుతో ఆగలేదు సుమా! అలా మూడు గేరులు, ఆరు బ్రేక్లుగా సాగిపోతున్న నా ప్రయాణానికి ఒక రోజు హ్యాండ్ బ్రేక్ పడింది. 
మరునాడే డ్రైవింగ్ టెస్ట్. అదే రోజు డ్రైవర్ కారుతో ఎనిమిది అంకె వేయమని చెప్పాడు. నేను కారుని అష్ట వంకర్లు తిప్పుతూ,  కారుకి ఢక్కా మొక్కీలు తినిపించే సరికి, డ్రైవరు లబోదిబో మన్నాడు. 
“ఎనిమిది వేయడం అంటే ఇలా కాదు” అని వాపోయాడు. 

చివరకు పరీక్ష రోజు రానే వచ్చినది. నేను పరీక్షకు సన్నద్ధమవుతుండగా, డ్రైవరు ఎవరితోనో మాట్లాడుతూ డబ్బులు ఇవ్వటం చూశాను. 

అతడు లోపలికి వచ్చి “ఇక వెళ్దాం పదండి” అన్నాడు. “అదేమిటి? మరి నా లైసెన్సు?” అన్నాను. 
“అది వస్తుంది లెండి” అని స్టీరింగ్ పట్టుకున్నాడు. 

“పరీక్ష ఇవ్వకుండా ఎలా వస్తుంది?” అని నిలదీశాను. 

కారు వెనక్కి తిప్పి “మీరు ఒక రెండు వేలు మీవి కాదు అనుకోండి” అన్నాడు. 

“అదేమిటయ్యా, నేను ఎనిమిది అంకె  వేసి టెస్ట్ పాస్ అయ్యే వాడిని కదా” అని కోపంగా అరిచాను. 
నా వైపు చూసి “అప్పుడు మీకు సున్నా వస్తుంది సారు! ఆ కష్టం మీకు ఎందుకండి, అయినా మీకు లైసెన్సు కదా కావాలి నేను ఇప్పిస్తా” అని నవ్వాడు. 

అవమానంతో నా తల కొట్టేసినట్టు అయ్యింది. పరీక్ష రాయకుండా లైసెన్సు తీసుకోవడానికి నా నిజాయితీ అడ్డు వచ్చింది. ఇంటికి వచ్చాక సోఫాలో విసురుగా కూర్చుని, టివి పెట్టాను. టి వి లో విరాట్ కోహ్లీ వాణిజ్య ప్రకటన చూసి పుండు మీద కారం చల్లినట్టు అయ్యింది. కోహ్లీ కారు తోలుతుంటే, అమ్మాయిలు నోరు తెరిచి చూస్తున్నారు. 

నేను కోపం తో కళ్ళు మూసుకుంటే కారులో రంహిత, ఆమె చుట్టూ నోరు వెళ్లబెట్టుకుని చూస్తున్న మగవాళ్లు కనిపించారు.

నా కోపం నశాలంకి అంటి రిమోట్ విసిరి పుచ్చుకుని పారేశాను. 

కాసేపటికి అమెరికా లో ఉన్న మా ఫ్రెండ్ ఫోను చేశాడు. వాడు కొన్న కొత్త కారు చూపిస్తూ “ఒరేయ్ ఇక్కడ అమెరికాలో డ్రైవింగ్ చాలా సులువు, ట్రాఫిక్ పెద్దగా ఉండదు” అని బడాయిలు పోయాడు. 
రెండు సంవత్సరాల తరువాత నాకు అమెరికా వెళ్లాల్సిన అవకాశం వస్తే వదులుకోలేదు. డాలర్ ల కోసం కాదు, డ్రైవింగ్ కోసం. 

తీరా అమెరికా వెళ్ళాక వాడు చెప్పింది అబద్ధం అని అర్థం అయ్యింది. కుడి ఎడమైతే పొరపాటు లేదు అని దేవదాసు చెప్పాడు కానీ ఇక్కడ డ్రైవరు ఎడమ వైపు, కార్ కుడి వైపు. మన దేశంలో తోలేదానికి పూర్తి వ్యతిరేకం. మళ్ళీ అయోమయం, గందరగోళం షరా మామూలే. ఎలాగో కుస్తీ పడి నేర్చుకుని తోలితే, డ్రైవింగ్ రూల్స్ సరిగ్గా పాటించలేదు అని ట్రాఫిక్ పోలీసులు నా వెంట పడి ఐదు వందల డాలర్లు వసూలు చేశారు. అక్కడితో నా డ్రైవింగ్ జబ్బు వదిలి పోయింది. 

అలా నేను సతమతమవుతున్న సమయంలో బుగుల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఒక్క ఐడియా నా జీవితాన్నే మార్చేసింది. 

“ఇప్పుడు  పెస్లా కంపెనీ అధనేత సుబ్బారావ్ గారు ప్రసంగిస్తారు” అని ఎవరో వేదిక మీదకి పిలిచేసరికి వర్తమానం లోకి వచ్చాను. స్టేజ్ మీదకి వెళ్ళి నా ప్రసంగం మొదలు పెట్టాను. 

“ఒకప్పుడు డ్రైవింగ్ అంటే భయ పడ్డ  నేను, ఇప్పుడు భారత దేశం లో ఏ మూలలో నైనా అవలీలగా డ్రైవింగ్ చేయగలను. నా వంటి రోడ్డు భీతి ఉన్న వాళ్లందరికీ ఉపయోగపడాలనే సంకల్పంతో నేను మన దేశానికి వచ్చి, ఈ పెస్లా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. బుగుల్ లో నేను నేర్చుకున్న పరిజ్ఞానాన్ని అంతా ఉపయోగించి, మన దేశానికి సరిపోయేలాగా ఈ కార్లు తయారు చేశాను.  ఇంక మన దేశం నలుమూలలా దూసుకెళ్లి పోదాం రండి” అన్న నినాదంతో ముగించాను. 

కరతాళ ధ్వనుల మధ్య ముఖ్యమంత్రి గారు వచ్చి మొదటి కారు రిబ్బన్ కత్తిరించారు. నేను కారులో ఎడమ వైపు కూర్చున్నాను. నా శ్రీమతి, అతిధులు  అందరూ నా వెనుకే కూర్చున్నారు. సీటు బెల్ట్ పెట్టుకున్నాక శరవేగంతో సాగిపోతోంది, డ్రైవరు అవసరం లేని, కృత్రిమ మేధస్సుతో చేసిన స్వయం చోదక కారు. 

“వావ్ సుబ్బారావ్, కొత్త భార్య, కొత్త కారు..” వెనుక నుండి ఎవరో అన్నారు. భార్య క్రొత్తదే  కానీ పరిచయం పాతదే. ఒకప్పుడు ఏడో క్లాస్ లో నన్ను వెక్కిరించిన పిల్ల, కాలేజీలో నన్ను కవ్వించిన రంహిత, తరువాత బుగుల్ లో నా సహోద్యోగి - ఈనాడు నా జీవిత భాగస్వామి, ఇంకా నా వ్యాపార భాగస్వామి. మరి మిగిలిన అతిథులు ఎవరంటారా? ఇంకెవరు? మా నాన్న, నాకు బైక్ ఇచ్చిన ఫ్రెండ్, ఇంకా నాకు కార్ డ్రైవింగ్ నేర్పిన డ్రైవరు. 

(మనలో మన మాట – ఇప్పుడు ఈ కారు కి ఏ సమస్య వచ్చినా వీళ్ళు అందరూ నా వెనుక ఉన్నారనే ధైర్యం.)

 -   సౌదామినిశ్రీపాద