Facebook Twitter
కష్టం విలువ

రామవరం అనే గ్రామంలో సోము అనే బాలుడు ఉండేవాడు. అతడు సోమరిపోతు. చదువులో వెనుకబడేవాడు. ఆటపాటల్లో పాల్గొనడు. తరచూ ఉపాధ్యాయులతో తిట్లు తినేవాడు. ఇంట్లోనూ ఏ పనీ చేయడు. సోము చెల్లెలు అపర్ణే అన్ని పనులూ చేసేది.  

      ఒకరోజు సోము తల్లికి విపరీతమైన జ్వరం వచ్చింది. సోము తండ్రి పొరుగూరు వెళ్ళాడు. సోము తల్లి సోమూను జ్వరానికి మందులు తెమ్మని ఎంతో బతిమాలింది. నాకు చేతకావడం లేదని సోము మొండికేశాడు. అపర్ణ తాను తెస్తానని వెళ్ళింది. జడివాన మొదలై ఎంతకూ తగ్గడం లేదు. బయటకు వెళ్ళిన అపర్ణ జాడలేదు. తల్లి కంగారుతో "చెల్లి బయటకు వెళ్ళి, చాలా సేపయింది. ఇంకా ఇంటికి రాలేదు. నాకు భయంగా ఉంది. చెల్లి ఎక్కడ ఉందో చూసి రారా సోమూ!" అని అన్నది.సోము కదలకుండా మొద్దులా కూర్చున్నాడు. వర్షం తగ్గిన తర్వాత అపర్ణ ఒణుకుతూ మందులతో ఇంటికి వచ్చింది. తల్లి పట్టరాని ఆవేశంతో "ఒరేయ్ పనికిరానోడా! నీ వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. నీవు నా ఇంట్లో ఉండనవసరం లేదు. తక్షణమే వెళ్ళిపో!" అంటూ ఓ దుడ్డుకర్ర తీసుకుని సోమూని బయటకు తరిమింది. 

       అలా ఇంటినుంచి వెళ్ళిపోయిన సోము ఓ చెట్టు క్రింద నిద్రపోయాడు. ఎంతో ఆకలి వేయగా మేల్కొన్నాడు. అక్కడ ఓ చీమలబారు కనిపించింది. తానూ చీమనైతే ఎంత బాగుండు. కష్టపడకుండానే కొంచెం ఆహారంతో కడుపు నింపుకోవచ్చు అనుకున్నాడు. ఆశ్చర్యం! చీమగా మారాడు. ఓ చీమ దగ్గరకు వెళ్ళి, అది మోస్తున్న ఆహారాన్ని యాచించాడు. "కష్టానికి మారుపేరైన చీమ జాతిలో పుట్టి, అడుక్కోవడానికి సిగ్గు లేదూ! కష్టపడి ఆహారాన్ని కూడబెట్టుకో!" అన్నది చీమ.

     

       అవమానంతో దూరంగా వెళ్ళిన సోమూకి తుమ్మచెట్టు పైన గిజిగాడు కనిపించింది. ఎంతో అందంగా కనిపించింది. తానూ ఆ అందమైన పక్షినైతే బాగుండు. ఎవరూ తనను అసహ్యించుకోరు అనుకున్నాడు. నిజంగానే గిజిగాడు అయ్యాడు సోము. చెట్టుపై ఉన్న మరో గిజిగాని వద్దకు వచ్చి, "నేను నీ అతిథిని, నీ గూటిలో వారం రోజులు ఉంటాను. నాకు మంచి ఆహారంతో విందు చెయ్యాలి నువ్వు." అని అడిగాడు. "వీల్లేదు. ఇలా పక్షి జాతి పరువు తీయకు. రెక్కల కష్టం చేసుకొని నీ గూటిని నువ్వే నిర్మించుకోవాలి. ఆహారాన్ని ఎంతో కష్టపడి సేకరించుకోవాలి." అంది గిజిగాడు. 

      సిగ్గుతో అక్కడ నుంచి వెళ్ళిపోతున్న సోమూకు ఓ పువ్వుపైన వాలిన సీతాకోకచిలుక కనిపించింది. తానూ ఆ అందమైన సీతాకోకచిలుక అయితే బాగుండు అనుకున్నాడు. నిజంగానే సీతాకోకచిలుకగా మారాడు. ఇంతలో రాము, వాసు అనే స్నేహితులు అటుగా వచ్చారు. రాము సీతాకోకచిలుక (సోము)ని పట్టుకున్నాడు. "పాపం! ఎందుకురా ఆ అల్పప్రాణిని హింసిస్తావు?" అన్నాడు వాసు. "ఈ ఆట నాకు సోము నేర్పాడురా!" అన్నాడు రాము. "వాడో పనికిరాని వెధవ. ఒక్క మంచిపనీ చేతకాదు వానికి. ఇలాంటి చెడ్డ పనులను నేర్పి అందరినీ చెడగొడుతున్నాడు. వాణ్ణి ఎవరైనా మంచివాడు అని అంటారా? నువ్వూ సోమువే అయితే ఇలాంటి పనులు చేయి." అన్నాడు వాసు. "ఛీ! నేను సోమూనా? కాదు రామూని" అంటూ సీతాకోకచిలుకను వదిలిపెట్టాడు. వారి మాటలకు ఎంతో సిగ్గుపడ్డాడు సోము. బతుకు జీవుడా అనుకుంటూ సోము ఓ చెట్టు కిందకు వచ్చి, తాను మనిషిగా మారాలనుకున్నాడు. మారాడు. సోము ఆలోచనలో పడ్డాడు. చిన్న జీవులు సైతం ఆహారం కోసం ఎంతో శ్రమ పడుతున్నాయి. కష్టపడని వారిని ఈ భూమిపై అందరూ హీనంగా చూస్తారు. తానూ సోమరితనాన్ని వదలిపెట్టాలని అనుకున్నాడు. తల్లిని క్షమాపణ అడగడానికి ఇంటివైపు నడిచాడు.

-సరికొండ శ్రీనివాసరాజు.