Facebook Twitter
కొన్ని కథలు: మరిన్ని జ్ఞాపకాలు

ప్రార్థన

 చిన్నప్ప లేచిందంటే...తెల్లారినట్టే! తెల్లారినదగ్గరనుంచీ ఒకటే దండకం. శివయ్యతో పేచీ పడుతూనే ఉంటుందామె. తొందరగా నిర్మాల్యాన్ని తొలగించమంటాడు శివయ్య. అభిషేకం చెయ్యమంటాడు. చిన్నప్ప వినదు. ఆగంటుంది. దంతధావనం చెయ్యలేదంటుంది. స్నానంచేసిగాని ముట్టుకో నంటుంది. శివయ్య మారాముచేస్తుంటే...తప్పు! అల్లరిచెయ్యకూడదు అంటుంది. కేకలేస్తుంది. శివయ్య మీద అలా కేకలేస్తూనే కోనేటికి చేరుకుంటుంది చిన్నప్ప. అక్కడ స్నానాదికాలు ముగించి, మడిగామంచినీరు పట్టుకుని తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. ఆ ఆలయం, అక్కడ కొలువుదీరిన శివయ్య సొంతమే కాదు, చిన్నప్ప సొంతం కూడా.    

 అగ్రహారానికి దూరంగా కొండకోనల్లో ఈ శివాలయాన్ని ఎవరు నిర్మించారో నిర్మించారు. నిర్మించిన తొలిరోజుల్లో శివయ్య వైభవోపేతంగా వెలిగాడో లేదో తెలియదుగాని, చిన్నప్ప నాటికి దిక్కూ, దీపంలేకుండా తయారయ్యాడు శివయ్య. నెత్తిన ఇన్ని నీళ్ళుపోసే వారు లేరు. ఇంత ప్రసాదంపెట్టేవారు లేరు. అప్పడు చిన్నప్ప కలుగజేసుకుంది. మొగుడూ మొద్దులూ లేని ఆమె అగ్రహారాన్ని విడచిపెట్టి, ఆలయానికిచేరుకుంది. బూజు దులిపింది. అయ్యకి అభిషేకంచేసి, ఇంత ప్రసాదం పెట్టింది. నీకు నేనూ, నాకునువ్వూ తోడంది. నీడయి నిలిచింది.   

 శివయ్యమీద కేకేలేసే చిన్నప్పను చూసి, చాలామంది భక్తులు చిరాకు పడ్డారు. ఏంటమ్మా! దేవుణ్ణంతలా విసుక్కుంటావన్నారు. అది విసుక్కాదయ్యా! ప్రార్థన. ప్రార్థనెప్పుడూ మనలో మనం మాట్లాడుకున్నట్టుగా ఉండకూడదు. ఇతరులతో మాట్లాడుతున్నట్టుగా ఉండాలి. ముఖాముఖీ మాట్లాడాలి. అయినా శివయ్యకు లేనిబాధ మీకెందుకయ్యా? అన్నది. వారి నోరు మూయించింది.  పుట్టిన దగ్గర నుంచీ దరిద్రమే! పాతికేళ్ళొచ్చినా కడుపు నిండాతిన్నపాపాన పోలేదు. ఉద్యోగం లేదు. సద్యోగం లేదు. కట్టుకునేందుకు సరైన బట్ట కూడా లేవు. చింకిపాతతోనే శివాలయానికి చేరుకునేవాడు శాస్త్రి. చేతులుజోడించి, దేవుణ్ణి ధ్యానిస్తూ కూర్చునేవాడు. ఏడాది తిరిగింది. అయినా అతని మీద శివయ్యకు జాలి  కలగలేదు. ఆ మాటే చిన్నప్పకు చెప్పుకుని బాధపడ్డాడతను. అప్పుడు చిన్నప్ప ఏమన్నదో తెలుసా? ఒరేశాస్త్రీ! సినిమాల్లో చూపిస్తారు చూడు, అవన్నీ నిజాలే! నీ ప్రార్థన కొండలను కరిగిస్తుంది. సముద్రాలను కలిచేస్తుంది. లోకాలను ఊపేస్తుంది. ఆఖరికి శివయ్యను చేరి, అతని పిలకపట్టుకుని నీ దగ్గరకు లాక్కొస్తుంది. ఇదినిజం. నామాట నమ్ము. నీకు త్వరలోనే మంచిరోజులు వస్తాయి అన్నది. 

 వస్తాయా? వస్తే బాగుణ్ణనుకున్నాడు శాస్త్రి. చిన్నప్ప చెప్పిందే నిజమైందాఖరికి. మంచిరోజులు వచ్చాయి. శాస్త్రికి మంచి ఉద్యోగం దొరికింది. పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు. దరిద్రం అన్నదే లేదు. నాలుగు వేళ్ళూ నోటికి వెళ్తున్నాయి. ఇప్పుడు జీవితాన్ని ప్రార్థన ఒక్కటే మార్చగలదంటాడు శాస్త్రి. ఆ నమ్మకంతో ఇల్లూవాకిలీలేనివాడు, బిచ్చమెత్తుకుని తిరిగేవాడు, ఎగుడూ దిగుడూకన్నులవాడు, జంగదేవరడు అని శివయ్యను ఎవరైనా తూలనాడితే ఇంతెత్తున లేస్తాడతను. వారిని కొట్టేందుకుకూడా వెనుకాడడు. అదితప్పంటుంది చిన్నప్ప. వాళ్ళూ నీలాగే శివయ్య భక్తులేరా! ప్రార్థన అంటే ఏమిటి? దేవునితో స్నేహంలాంటిది. దేవునితో వారికి బాగా స్నేహం పెరిగిందేమో! పెరిగి దేవుణ్ణి వాళ్ళు సరదాగా నాలుగు మాటలంటున్నారు. శివయ్యకు అది ఆనందంగానే ఉంది. ఇందులో నీకొచ్చిన కష్టం ఏమిటో నాకు అర్ధంకావట్లేదు. పద్ధతికాదన్నది శాస్త్రిని. 

 పిల్లలను స్కూళ్ళకు పంపించి, భర్తని కచేరీకి పంపించి, స్నానించి, కడుపులో ఇంత కాఫీపోసుకుని, వీలయితే నాలుగు అట్లు తిని, ఆలయానికి చేరుకునేది సుమతి. ఆసరికి మిట్టమధ్యాహ్నం అయ్యేది. అప్పుడు శివయ్యకు తీరిగ్గా అభిషేకం చేస్తానని కూర్చునేది. మహా నైవేద్యంవేళ అభిషేకిస్తానంటావేంటే సుమతీ! అయ్య కంచంలో నీళ్ళుపడేను. పూజలూ, ప్రార్థనలూ ఎలా ఉండాలో తెలుసా? అవి తొలి వెలుగులకి తాళం తీసినట్టుగా ఉండాలి. అలాగే సాయంత్రంవేళ చీకటి చినుకులకి తాళం వేసినట్టుగా ఉండాలి. అంతేగాని అపరాహ్నం వేళ అయ్యకు పూజా, అమ్మకుసేవా అచ్చిరావనేది. నీకు అచ్చివస్తాయా పిన్నీ? అంటే...నేను ఉన్నదే అయ్యకోసం, అయ్య ఉన్నదే నాకోసం! నా ఈ కోరిక తీర్చు, నా ఆ కోరిక తీర్చు అని నేను శివయ్యను ఏనాడూ కోరను. ఎందుకంటే...అయ్య ఉన్నదే నా కోరికలు తీర్చడానికి అని నవ్వేది చిన్నప్ప. 

ఒకరోజు శివలింగానికి పంచామృతాలతో స్నానంచేసి, ఆ తర్వాత మంచినీటితో దానిని అభిషేకించింది చిన్నప్ప. చీరకొంగుతో లింగాన్ని తుడుస్తూ తుడుస్తూ, కళ్ళు తిరిగినట్టనిపిస్తే, ఆ లింగంమీదే తలాన్చి కళ్ళు మూసుకుంది. మరి కళ్ళు తెరవలేదు. చిన్నప్ప శివైక్యం చెందిందన్నారంతా. చిన్నప్ప మనసుపాడేపాట, శివయ్యకు నేరుగా వినిపించిందేమో! తనలో ఐక్యంచేసుకున్నాడు. ఎప్పుడు ఎవరికి ఏదివ్వాలో దేవుడికి బాగా తెలుసు. 

-జగన్నాథశర్మ