TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః
ప్రారభ్య విఘ్న నిహతా విరమంతి మధ్యాః
విఘ్నైః ముహుర్ముహరపి ప్రతిహన్య మానాః
ప్రారబ్ధం ఉత్తమ జనాః న పరిత్యజంతి
ఈ శ్లోకానికి అర్థం...ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెరువక, తుదికంటా లక్ష్యంకోసం శ్రమించడమే కార్యసాధకుడి నైజం. అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని, ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలుపెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే పనిని వదిలివేసేవారు మధ్యములు అని.
ఏ పనినయినా ఎవరైనా మొదలుపెడుతున్నారంటే...ఈ పద్యాన్ని వారికి అన్వయించి చూడడం నాకో పెద్ద బ్యాడ్ హ్యాబిట్! ఏ మేరకు ఎంచుకున్నపనిలో ఆ వ్యక్తి కృతకృత్యుడయిందీ ఓ కంట గమనిస్తాను. ఆ గమనింపులో అతడు కార్యసాధకుడూ, ఉత్తముడూ అనిపిస్తే, ప్రత్యక్షంలో తెగిడినా, పరోక్షంలో అతనికి జేజేలు పలకడం నాకో సరదా! నీ జేజేలు ఎవడికి కావాలి? అంటే...నేనేం చెయ్యలేను.
విషయానికి వస్తే...1979లో అనుకుంటాను...ఓ సాయంత్రం వేళ, విజయనగరం గంటస్తంభం దగ్గర నేనూ, కొడవంటికాశీపతీరావూ, దాట్లనారాయణమూర్తిరాజూ, పెద్దలు శ్రీ శీలావీర్రాజుగారూ నిల్చున్నాం. మాట్లాడుకుంటున్నాం. సంక్రాంతి ముందు రోజులవి. చలిచలిగా ఉంది వాతావరణం.
తెలుగుకథమీద నేను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాను. నా మాటలకి వీర్రాజుగారు సన్నగా నవ్వుతున్నారు. అంతలో పొట్టిగా, తెల్లగా, ఫారెక్స్ బేబీలా ఉండే ఓ కుర్రాడు వచ్చాడక్కడకి. చూస్తే ‘ఖాళీసీసాల స్మై్ల్’ తమ్ముడిలా అనిపించాడు. కాని కాదట! అతనిపేరు వాసిరెడ్డి నవీన్ ట! కెనరా బ్యాంకులో పనిచేస్తున్నాడన్నారు. హైదరాబాద్ నుంచి వీర్రాజుగారు వచ్చారని తెలిసి, వారిని కలిసేందుకు వచ్చాట్ట!
కథలగురించీ, పత్రికలగురించీ చాలా సీరియస్ గా మాట్లాడాడు నవీన్. పార్వతీపురం చుట్టుపక్కల చెలరేగిన నక్సల్బరీ గురించీ కూడా చాలా వివరాలు తెలియజేశాడు. సరుకుంది ఇతనిలో అనిపించాడు. కాసేపటికి వెళ్లిపోయాడు. తర్వాత బొంకుల్దిబ్బ దగ్గర కలిశాం ఓసారి. చాసోగారూ, ట్వంటీఫస్ట్ సెంచరీ రైటర్స్...ఉన్నారప్పుడు. తమ కథల సంకలనాన్ని ట్వంటీ ఫస్ట్ సెంచరీ రైటర్స్ ఇస్తే...తీసుకుని, డబ్బులు చెల్లించాడు నవీన్. డబ్బులొద్దులెండి అంటే...పుస్తకాన్ని ఎప్పుడూ ఉచితంగా ఇవ్వకండి! ఇస్తే దాని విలువ తెలియదన్నాడు. నవీన్ మాటలకు రైటర్స్ ప్రెసిడెంట్ నిష్ఠల వెంకటరావు పొంగిపోయాడానాడు.
ఎలా తెలిసిందో తెలిసింది, నేను హైదరాబాద్ ఈనాడులో జాయినవుతున్నానని. అందుకు ఆనందించాడు నవీన్. జాగ్రత్త అని హెచ్చరించాడు. త్వరలో తానూ హైదరాబాద్ చేరుకుంటున్న సంగతి చెప్పాడు.
కొన్నాళ్లకు హైదరాబాద్ లోని ద్వారకాహోటల్లో శివారెడ్డి నీడన ఇద్దరం మళ్లీ కలిశాం. కాఫీలు తాగాం. కబుర్లాడుకున్నాం. ఆనాటికి నేను ఈనాడు మానేసి, ఆంధ్రజ్యోతిలో చేరాను. రెండుచేతులా కథలు రాయడం మొదలుపెట్టాను. ‘రంజిని’వారు నిర్వహించిన కథలపోటీకి ‘పేగుకాలినవాసన’ కథ పంపాను. ఆ పోటీకి పోరంకి దక్షిణామూర్తిగారూ, శీలావీర్రాజుగారుసహా నవీన్ కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. ప్రథమబహుమతి వచ్చింది ఆ కథకి. అయితే ప్రథమబహుమతికి అర్హతలేదంటూ, ఆ కథకి తాను తక్కువ మార్కులు వేశానంటూ వేదికమీదే ధైర్యంగా చెప్పాడు నవీన్. అర్హత ఎందుకు లేదో వివరించాడు.
బాధపడ్డావా? అడిగాడు తర్వాత.
సమాధానంగా నవ్వి ఊరుకున్నాను.
ఆ కథతోనే ఆంధ్రజ్యోతివారపత్రిక ‘ఈవారం కథ’ శీర్షిక ప్రారంభమయింది. అలాగే పాపినేని, నవీన్ ల సంపాదకత్వంలో ‘కథ’ ప్రారంభ సంకలనంలో ఆ కథ చోటు చేసుకున్నది. ఈ రెండూ కాకతాళీయం ఎంత మాత్రమూకాదు.
‘కథ’ ప్రారంభానికి ముందు ఒక రోజు ద్వారకలో నవీన్ తో అన్నానిలా.
సంవత్సరానికి ఓ మంచికథను ఎన్నికచెయ్యి. ఓ పదివేలు అవార్డిద్దాం. నేను ఓ అయిదువేలు స్పాన్సర్ చేస్తానన్నాను.
డబ్బులు ఎక్కువయ్యాయా? అని నవ్వాడు నవీన్.
అవార్డు కాదుగాని, ఓ సంవత్సరంలో వచ్చిన కొన్ని మంచికథల్ని సంకలనంగా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంగారుపడకు అన్నాడు.
త్వరలోనే ‘కథ’ రూపుదిద్దుకున్నది. చాలామందికి ప్రేరణ అయిందది. ‘కథ’లో తమ కథ ఉండాలన్న పట్టుదలతో చాలామంది కథకులు కథలు రాయడం నాకు తెలుసు.
‘కథ’లో కథ రావాలంటే...ఆ కథ ఏదేని పత్రికలో ముందు అచ్చయి ఉండాలి. అది ఓ నిబంధన. ఆ నిబంధనతో చాలామంది రచయితలు, సంవత్సరాంతంలో తమ కథ పత్రికల్లో వచ్చేందుకు నానా తంటాలుపడడం నేను కళ్లారాచూశాను.
కొన్నేళ్లపాటు ఒంటరి పోరాటంచేశాడు నవీన్. పదేళ్ల తర్వాత అనుకుంటాను, ఆ పోరాటానికి తానావారి మద్దతు లభించింది. వారి ఆర్థికసహకారంతో ‘కథ’ బలోపేతం అయింది.
ఈటీవీలో జాయినయ్యాను. కథలు రాయడం మానేశాను నేను. ఓసారి మా షూటింగ్ స్పాట్ కి వచ్చాడు నవీన్. నా హడావుడి చూసి సంతోషించాడు. మా స్పాట్ పక్కనే వాళ్ల తమ్ముడు కట్టిన ఇల్లు చూపించాడు.
నువ్వు కూడా ఓ ఇల్లు ప్లాన్ చెయ్యి. అక్షరం అక్షరం రాసిమరీ సంపాదిస్తున్నావు. పొదుపుచెయ్యి అని హెచ్చరించాడు.
కథలు రాయలేకపోతున్నానని బాధపడితే...
బాధపడుతున్నావుకదా! త్వరలోనే రాస్తావు అని నవ్వాడు నవీన్.
మా ఇద్దరిమధ్యా చెప్పుకోదగినంత స్నేహమూలేదు. శత్రుత్వమూలేదు. కాకపోతే చిన్నచిన్న అభిప్రాయభేదాలు ఉన్నాయి. ఆ భేదాలను ఇద్దరం ఎన్నడూ బాహాటంగా చర్చించలేదు. అంటే...ఒకరిపట్ల ఒకరికి కనిపించని అభిమానం ఉన్నట్టేనని నేననుకుంటాను.
నాకు ఒకే ఒక ఉపకారం చేసి పెట్టాడు నవీన్. అది కీర్తిశేషులు డాక్టర్ వి. చంద్రశేఖరరావుని పరిచయం చేయడం. చంద్రశేఖరరావు స్నేహంలో నేను అనేక పుస్తకాలను చదివాను. ఎవరికీ తెలియని విషయం...చంద్రశేఖరరావు నన్ను కలిసినప్పుడల్లా ఏదో ఒక కథలపుస్తకం(ఇంగ్లీషు) తెచ్చి ఇచ్చేవాడు. ఇద్దరం బాగా స్నేహంగా ఉండేవాళ్లం. ఆయన కూడా ఒకానొక సందర్భంలో ‘కథ’ లో కథ రావాలని, తను రాసిన కథని అర్జంట్ గా ప్రచురించమని ఒత్తిడిచేశాడు. చిర్రెత్తుకొచ్చింది నాకు.
ఏంటిసార్ ఇది? ఏభైవేల సర్క్యులేషన్ గల మా వారపత్రిక కంటే రెండుమూడువేలు ప్రచురించే ‘కథ’కే మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నాకిది నచ్చదు అన్నాను.
ప్లీజ్ అన్నాడు. ఆనాడు తెలిసింది, రచయితకి ‘కథ’ అంటే ఎంత క్రేజో!
ఎన్నిసార్లు దుఃఖించామన్నదే గుర్తు ఉంటుందిగాని, ఎన్నిసార్లు ఆనందించామన్నది ఎవరికీ గుర్తుండదు. బాధల్ని ప్రేమించినట్టుగా సంతోషాల్ని ప్రేమించకపోవడమే దానికి కారణం అని ఎక్కడో చదివాను. అది ‘కథ’ సంకలనాల విషయంలో రచయితలకు సరిగా సరిపోతుంది. ఆ సంకలనంలో కథ వస్తే నవీన్ ఇష్టుడు. రాకపోతే అయిష్టుడు. ఆ అయిష్టతతో నవీన్ ని తెగిడేవారెంతమందో! ఎవరెంతగా తెగిడినా, విమర్శించినా నవీన్ పల్లెత్తుమాట అనేవాడు కాదు.
క్షమా దానం క్షమా యజ్ఞః క్షమా సత్యం హి పుత్రికాః
క్షమా యశః క్షమా ధర్మః క్షమయా విష్ఠితం జగత్!
ఓర్పే నిజమైన బలం. ఓర్పే ఉత్తమదానం. ఓర్పే యజ్ఞం. ఓర్పే కీర్తి. ఈ జగత్తంతా క్షమ కారణంగానే నడుస్తున్నది అని దీని అర్థం.
నవీన్ ని చూసినప్పుడల్లా ఈ శ్లోకం నాకు గుర్తొస్తుంది. అలాగే గత ముప్పయిమూడేళ్లుగా ‘కథ’ను వెలువరించడంలో కార్యసాధకుడూ, ఉత్తముడూ నవీన్ ను కలసినప్పుడల్లా పైన పేర్కొన్న భర్తృహరి శ్లోకం కూడా గుర్తుకువస్తుంది. ఇలా రెండు గొప్ప శ్లోకాలను గుర్తుచేసే నవీన్ కి చేతులెత్తి నమస్కరించడం తప్ప, చేసేదేముంది? ఏమీ లేదు!
* * *
అన్నట్టు మరచిపోయాను!
ఇటీవల సినిమాదర్శకుడు వంశీ ఫోన్ చేశాడు. మాటలో మాటగా ఓ మాట నాకు చెప్పాడు.
మంచి కథా రచయితలను ఇంటర్వ్యూచేసి, వారిచేత వారికి నచ్చిన కథను ఒకటి చదివించి, ఆ రెంటినీ తన యూట్యూబ్ చానెల్లో పెడదామనుకుంటున్నట్టుగా నవీన్ కి చెప్పాట్ట వంశీ.
ఇంటర్వ్యూకి ఓకే! రచయిత చేత కథ చదివించడం సక్సస్ కాదేమో అన్నాట్ట నవీన్. ఎందుకు కాదంటే...కథ చదవడం ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ కొందరికే తెలుసు. మీ మిత్రుడు కంఠు(జగన్నాథశర్మ)కి కథ చదవడం తెలిసినట్టుగా చాలామందికి తెలియదు. వేదిక మీద కంఠు కథ చదువుతుంటే...నాటకం నడుస్తున్నట్టుగా ఉంటుంది. కథ కళ్లకు కడుతుంది అన్నాట్ట నవీన్.
నిజమా? ఆశ్చర్యపోయాట్ట వంశీ.
ఏరా కంఠూ! నాకు తెలియని విద్యలు నీ దగ్గర చాలా ఉన్నాయయితే, గొప్పోడివే అన్నాడు.
ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినట్టుగా, ఎక్కడ తెగడాలోకాదు, ఎక్కడ పొగడాలో కూడా నవీన్ కి బాగా తెలుసు.
-జగన్నాథశర్మ