Facebook Twitter
వీడుకోలు

జీవితం అర్థం కావాలంటే...చదవాలి. చూడాలి. పాడాలి. ఆడాలి. కిందపడాలి. పడితేనే లేస్తారు. 
 ఆ ప్రయత్నంలోనే...ఒకరినొకరం ప్రేమించుకున్న నేనూ, ప్రమీలా లేచిపోవాలనుకున్నాం.  
 రాత్రి ఒంటిగంటయింది. 
 పావుగంటలో రైలుంది. అదెక్కితే నేరుగా హైదరాబాద్ చేరుకుంటాం. ఆశ్రయం కల్పించేందుకు స్నేహితులు ఉన్నారక్కడ.    
 గంట ముందుగానే స్టేషన్ కి చేరుకున్నాన్నేను. ప్రమీలే రాలేదింకా. వెయిట్ చేస్తున్నాను.  
 అదిగో రైలు! 
 ఇదిగో ప్రమీల! 
 నన్ను చూసింది. చేయి ఊపింది. పరుగన చేరుకుంది. ఇద్దరం రైలెక్కేశాం. ఒకరిచేయి ఒకరుపట్టుకుని కూర్చున్నాం. మాటల్లేవు. ఇద్దరమూ మూగబోయాం. దగ్గరగా ఉన్నా ఒకరికొకరు డిస్ కనెక్టయి, ఎవరికివారుగా కనెక్టయ్యాం. భయపడుతూ, కలలుకంటూ కూర్చునే నిద్రపోయాం.
 హైదరాబాద్ చేరుకున్నాం. పెళ్లిచేసుకున్నాం.
 నలభై ఏళ్లు గడచిపోయాయి.  
 ఆనాడు ఎక్కిన రైలును, ఈనాడు చూడాలనిపించింది ప్రమీలకు. 
 ఊరికి వెళ్దాం, పద అంది. 
 బయల్దేరి ఊరికి చేరుకున్నాం. ఊరిలో నా వంకవారుగానీ, ఆమె వంకవారుగానీ ఎవరూ లేరు. పోయారంతా. కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. ఒకరేమో కిరాణా వ్యాపారం చేస్తున్నాడు. మరొకరు స్కూలు టీచర్ గా చేసి, రిటైరయ్యారు.  
 ఊరికి మేము వచ్చిన సంగతి వారికి తెలియదు. కలసి అబ్బురపరచాలనుకున్నాం. 
 పాత పుస్తకాలూ, పాత స్నేహితులూ ఎప్పుడూ గొప్పవే! ముందుగా టీచర్ ని కలిశాం. వంట చేసుకుంటోందామె. పిలవగానే ‘ఎవరూ’ అంటూ వచ్చింది. 
 నన్నూ ప్రమీలనూ ముందు గుర్తుపట్టలేదు. తర్వాత గుర్తుపట్టింది. ప్రమీలను కౌగలించుకుంది. కన్నీరుపెట్టింది. 
 పిల్లలేం చేస్తున్నారు? అడిగింది. 
 లేరన్నాం. 
 లేకపోవడమే మంచిది! ఉండి మేము నానా ఇబ్బందులూ పడుతున్నాం. గవర్నమెంట్ రిటైర్ చేసినా, వీళ్లు రిటైర్ చెయ్యట్లేదని నవ్వింది. 
 మా ఇంటికి వెళ్తున్నానని చెప్పి, ఈయనతో ఆనాడు నువ్వు పారిపోయావు. నన్ను ఇరికించావు. మీ వాళ్లకి శత్రువుని అయిపోయాను అంది.   
 సారీ చెప్పింది ప్రమీల. 
 నీకు నెమలికంఠం రంగు పట్టుచీరంటే ఇష్టంకదా, తీసుకో అని కొత్తపట్టుచీర బ్యాగులోంచి తీసి టీచర్ కి అందించింది. 
 ఇద్దరూ లంచ్ చేసి వెళ్లాలి పట్టుబట్టింది టీచర్. 
 ఆయన చేస్తారు, నేను చెయ్యను. శనివారం కదా! ఉపవాసం అంది ప్రమీల. 
 నీకింకా, శనివారాలూ, ఉపవాసాలూ పోలేదయితే అంది.
 లేదని నవ్వింది ప్రమీల.
 పాయసం, పెరుగువడతో లంచ్ అదిరిపోయింది. 
 సాయంత్రం కిరాణా దుకాణానికి చేరుకున్నాం. 
 కిలో జీడిపప్పు ఎంతండీ? అడిగాం. 
 తొమ్మిదివందల యాభై అంటూ...నన్ను గుర్తించి, ‘ఒరేయ్’ అంటూ నన్ను గట్టిగా వాటేసుకున్నాడు దుకాణం యజమాని. 
 ఎన్నాళ్లయిందిరా మిమ్మల్నిచూసి అన్నాడు. పొంగిపోయాడు. 
 ఏంటిలా వచ్చారు? అడిగాడు. 
 ప్రమీలకు ఈ ఊరి వేంకటేశ్వరస్వామి ఆలయం, నవరత్న సినిమాహాలూ, రాత్రి హైదరాబాద్ వెళ్లే రైలూ చూడాలనిపిస్తే వచ్చాం అన్నాను. 
 ఆ రైలు అక్కడే హైదరాబాద్ లోనే చూడొచ్చుగదా? అని నవ్వాడు మిత్రుడు. 
 చూడొచ్చుగానీ...ఇక్కడ ఈ ఊరి ప్లాట్ ఫారంలో...చలిలో...రాత్రి ఒంటిగంటకు వచ్చే రైలుని చూడడంలో ఓ ఫీల్, ఒక థ్రిల్ ఉంది. దాన్ని అనుభవించాలనుకుంటున్నాం అంది ప్రమీల.
 ఓకేకానీ, నవరత్న సినిమాహాలు లేదు. తీసేశారు. ఇప్పుడది పెద్ద పంక్షన్ హాలయిపోయింది అన్నాడు మిత్రుడు.  
 అయ్యో అంది ప్రమీల. బాధపడింది.  
 వేంకటేశ్వరస్వామి ఆలయం ఎలా ఉంది? అడిగింది. 
 బ్రహ్మాండంగా పుంజుకుంది. చిన్న తిరుపతి అంటున్నారు. భక్తులకి కొదవలేదు అన్నాడు మిత్రుడు. 
 ఈ రోజు శనివారం కదా! జనం తొడతొక్కిడిగా ఉంటారు అన్నాడు. 
 టీ తెప్పించాడు. తాగాం. 
 ఎన్ని కిలోల జీడిపప్పు కావాలో చెప్పు, పైసా ఇవ్వక్కర్లేదు. పార్శిల్ చేసి పెడతాను అన్నాడు మిత్రుడు. 
 మీ మాటలే జీడిపప్పు. మాకది చాలు అంది ప్రమీల. 
 కలుస్తాం అని బయల్దేరాం అక్కణ్ణుంచి. రూపాంతరం చెందిన నవరత్న సినిమాహాలుకి చేరుకున్నాం. ఎవరిదో పెళ్లి జరుగుతోందందులో. వెళ్లి లోపలంతా చూశాం. 
 ఇప్పుడు మేము నిల్చున్న చోటు, ఒకప్పడు ఛైర్ క్లాస్. ఆ క్లాసులో కూర్చుని నేనూ, ప్రమీలా ఎన్ని సినిమాలుచూశామో!ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో! ఒకరిచేతుల్ని ఒకరు ఎన్నిసార్లు ముద్దుపెట్టుకుని, ఒళ్లో దాచుకున్నామో! సీనియర్ ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ నాలుగైదుసార్లు చూశాం. ‘కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి’ పాటకి ఎంతగా పరవశించి, పులకించిపోయామో!
 పెళ్లివారు కూల్ డ్రింక్ ఇస్తే వద్దని, బయటపడ్డాం. నడుస్తూ నడుస్తూ ప్రమీల తూలిందక్కడ. కిందపడబోయింది. కంగారుపడ్డాను. గట్టిగా పట్టుకున్నాను.  
 డోంట్ వర్రీ అంది ప్రమీల.  
 వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నాం. మొదటిసారిగా మా చూపులు కలిసిందిక్కడే! వాళ్ల పిన్ని కూతురితో వచ్చింది ప్రమీల. మా ఫ్రెండ్ తో వెళ్లాన్నేను.  
 శనివారం సాయంత్రం స్వామివారి ఆలయం దగ్గరే కుర్రకారంతా ఉండేది. నచ్చిన అమ్మాయికి మనసివ్వడంలో పోటీలుపడేది. 
 ఆరుగురితో పోటీపడి ప్రమీలను దక్కించుకున్నాను నేను. 
 అమ్మవారి ఆలయం వెనుక ప్రమీలను ఎన్నిసార్లు కౌగలించుకున్నానో! మరెన్నిసార్లు ముద్దుపెట్టుకున్నానో! ప్రేమిస్తున్నానని చెప్పడానికి పెద్దపెద్ద ప్రేమలేఖలు రాయనక్కరలేదు. ఒక్క ముద్దుచాలు! ఆ ముద్దులో వందలు వేలు ప్రబంధాలు ఘోషిస్తాయి. 
 ఆలయానికి ఇరువైపులా పెద్దపెద్ద అశోకచెట్లుండేవి. ప్రతిచెట్టుకిందా సిమెంట్ బెంచీ ఉండేది. ఆ బెంచీకోసం తెగ ఆరాటపడేవారు ప్రేమికులు. స్వీట్ నథింగ్స్ చెప్పుకునేందుకు అంతకుమించిన స్థలంలేదు.  
 ఇప్పుడు ఆ చెట్లూ, బెంచీలూ లేవు. అంతా తిరువీథి అయిపోయింది. చాలా మార్పు కనిపించింది. కదలికలన్నీ ముందుకు సాగవన్నట్టే...మార్పంతా అభివృద్ధికాదనిపించింది ఎందుకో!
 వందలాదిమంది భక్తులు బారులుతీరి ఉన్నారు. స్వామివారిదర్శనం కష్టం అనిపించింది. క్యూలో నిల్చునే ఓపిక లేదు. ఏం చెయ్యాలి? అనుకుంటుండగా...ఆలయపూజారి గుర్తుపట్టి పలకరించారు.   
 మీరు ప్రమీలగారు కదూ? వీరితో మిమ్మల్ని మీ అన్నగారు చూస్తే ప్రమాదం అని, మీరానాడు భయపడుతుంటే...మిమ్మల్నిద్దరినీ ఆంజనేయస్వామి ఆలయంలో దాచింది నేనే! గుర్తుందా? అడిగారు. 
 ఉందన్నది ప్రమీల.  
 స్వామివారి దర్శనానికేనా? రండి! నేను తీసుకెళ్తాను అని ఆయనతోపాటుగా మమ్మల్ని ఆలయంలోనికి తీసుకెళ్లారు. 
 కంటినిండుగా స్వామిని దర్శింపజేశారు. 
 హారతి పళ్లెంలో పదివేలరూపాయలను దక్షిణగా వేసింది ప్రమీల. చూసి ఆశ్చర్యపోయారు పూజారి.  
 ఆనాడు మీరు చేసిన సాయం మరచిపోలేనిది అంది ప్రమీల. నమస్కరించింది ఆయనకి.  
 రాత్రి ఒంటిగంటయింది. 
 ప్లాట్ ఫారమ్మీదికి చేరుకున్నాం. 
 ఇంకాసేపట్లో రైలొస్తుంది. 
 ఈ చలిలో...ఈ రాత్రి...నువ్వు కోరుకున్నట్టుగానే రైలును చూస్తున్నావు అన్నాను.  
 అవునన్నట్టుగా తలూపుతూ, నా చేయి అందుకుంది ప్రమీల. తన గుండెల్లో దాచుకుంది. 
 చెప్పడం ప్రేమకాదు, చేసి చూపించడం ప్రేమ. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు అంది. 
 ప్రేమించడం, ప్రేమించబడటాన్ని మించిన ఆనందం జీవితంలో ఇంకొకటి లేదు. ప్రేమని కంటితోకాదు, గుండెతో చూడాలి అని నవ్వింది.  
 రైలొచ్చింది. 
 ఆగింది. 
 రైలాగిందో లేదో...పరిగెత్తింది ప్రమీల. ఒకొక్క కంపార్ట్ మెంట్ నీ చేత్తో నిమురుతూ ఇంజిన్ వైపుగా నడవసాగింది. 
 ఒకటి...రెండు...మూడు...నాలుగు...అయిదు నిమిషాలయింది.
 గార్డ్ విజిల్ వేశాడు. రైలు కదిలింది. కదులుతున్న రైలు ఎక్కింది ప్రమీల. నన్నుచూస్తూ...చేయి ఊపుతూ...నవ్వుతూ వెళ్లిపోయింది. అదృశ్యమయిపోయింది. 
 ప్లాట్ ఫారం ఖాళీ అయిపోయింది. చలిగాలి వీస్తోంది. మంచు కురుస్తోంది. బెంచీమీద నేనూ...నా ఒళ్లో ప్రమీలా ఉన్నాం. ప్రమీల ఉందికాని, ప్రాణంతో లేదు. చనిపోయి ఉంది.
 క్యాన్సర్! 
 చివరిరోజులు!
 ఏ క్షణం ప్రమీల మరణిస్తుందో తెలీదు. కాని బతికి ఉన్న ప్రతి క్షణాన్నీ అనుభవించాలనుకుంది. అనుభవించింది.  
 కథ అయినా, జీవితం అయినా ఏది ఎన్నాళ్లు నిలిచిందన్నదికాదు, ఎవరిని ఏ మేరకు ప్రేరేపించిందన్నదీ, కూడా ఎంతకాలం స్నేహంగా మనగలిగిందన్నదే చెప్పుకోవాలి. ఆ సంగతే  చెప్పానిక్కడ. 

జగన్నాథశర్మ