Facebook Twitter
చేత అన్నం ముద్ద

అమ్మానాన్న, అయిదుగురం అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ళు వెరసి తొమ్మిదిమంది కుటుంబసభ్యులం. నాన్నొక్కరే సంపాదనాపరుడు. వారికి నలభైరూపాయలే జీతం. ఆ జీతం నెల మొదటివారానికే మాకు సరిపోయేది. తర్వాత? అమ్మ అప్పు చేసేది. రెండురూపాయలూ, మూడురూపాయలు అప్పుచేసి, నూకలు కొని, వండి వార్చేది. అందరికీ జావపోసేది. ఆ జావకూడా ఒకొక్కసారి కరువయ్యేది. అప్పుడు ఆకలికి తట్టుకోలేక ఏడ్చేవాణ్ణి. నన్ను ఓదార్చేందుకు, నా ఆకలి తీర్చేందుకు మా చిన్నక్క, ఆచార్లగారింటికి వెళ్ళి ఓ చందమామ తెచ్చింది. కథలపుస్తకం అది. రంగురంగులబొమ్మలుకూడా ఉన్నాయందులో.

 ‘‘ఈ కథలు చదువుతూ ఆ బొమ్మలు చూసుకో! ఆకలే అనిపించదు.’’ అన్నది అక్క. 
నిజమా! అని ఆశ్చర్యపోయి కథలు చదవడం ప్రారంభించాను. అక్క చెప్పింది నిజమే! నాకు ఆకలివెయ్యలేదు. ఏడుపుకూడా రాలేదు. అప్పుడు అనిపించింది. పుస్తకాలు ఆకలి తీరుస్తాయని. తర్వాత ఇంకో విషయం కూడా తెలిసింది, పుస్తకాలు చదవడం అలవాటుచేసుకుంటే బోరనేది ఉండదు. ఒంటరితనంకూడా ఉండదు.  

 అక్క అలవాటుచేసిన పుస్తక పఠనం నిరాఘాటంగా సాగుతూవచ్చింది. మా మున్సిపల్ లైబ్రరీలో పుస్తకాలు చదివేశాను. జిల్లా గ్రంథాలయంలోని పుస్తకాలు చదివేశాను. ఆఖరికి కన్యకాపరమేశ్వరి ఆలయంవారు ఏర్పరుచుకున్న లైబ్రరీలోని పుస్తకాలన్నీ కూడా చదివేశాను. ఇక నేను పుట్టి పెరిగిన పార్వతీపురంలో పుస్తకాలులేవు. నాకు పుస్తకాలు కావాలి. ఎలా? శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, బుద్ధికీ, మనసుకీ పుస్తకం అంత అవసరం. పిచ్చెక్కిపోయేవాణ్ణి.  

 విజయనగరం సంస్కృత కలాశాలలో జాయిన్ చేశారు నన్ను. విజయనగరం పెద్ద ఊరు. పెద్దపెద్ద లైబ్రరీలు ఉండేవి అక్కడ. వాటితోపాటు చాసో, దాట్ల నారాయణమూర్తిరాజు, కొడవంటి కాశీపతిరావుల పరిచయం అయింది. ఇంకేం ఉంది? పుస్తకాలే పుస్తకాలు. అడగడం, తెచ్చుకోవడం, చదువుకోవడం, ఇచ్చేయడం జరిగేది. చాసో దగ్గర సరికొత్త పుస్తకాలు చాలా ఉండేవి. అడిగిన వెంటనే ఇచ్చేవారు కాదాయన. ఊరించి ఊరించి ఇచ్చేవారు. జాగ్రత్తలు చెప్పేవారు. అలాగే  పుస్తకాన్ని ఎలా చదవాలో చెప్పారు. అంతవరకూ నేను చదివిన పద్ధతి వేరు. నా ఆలోచనా తీరు వేరు. చాసో చెప్పిన తర్వాత నేను చదివిన పద్ధతివేరు. నా ఆలోచనా తీరు వేరు. అప్పుడు పుస్తకం నాకు రోడ్డయింది. సైకిలయింది. బస్సయ్యింది. నా ప్రయాణాన్నీ, నా గమ్యాన్నీ మార్చేసింది. 

 భాషా ప్రవీణ ముగించి, పార్వతీపురంలో డిగ్రీ కాలేజీలో జాయినయ్యాను. పుస్తకపఠనం కొంచెం దూరం అయింది. అంతే! అనేక రకాల గొడవల్లో ఇరుక్కున్నాను. అప్పుడు ఏ రకంగా చూసుకున్నా మనుషులకంటే పుస్తకాలే గొప్పవనుకున్నాను. సేఫ్ కూడా అనిపించింది. మళ్ళీ పుస్తకాలు చదవడంలో పడ్డాను. 

 కొన్నాళ్ళకు హైదరాబాద్ చేరుకున్నాను. ఈనాడులో జాయినయ్యాను. పుస్తకాలే పుస్తకాలక్కడ. నాలుగు కూరలూ, నాలుగు పచ్చళ్ళతో విస్తరి నిండిపోయినట్టుండేది.  శివారెడ్డిగారు పరిచయ భాగ్యం కలిగింది. పుస్తక సముద్ర తీరంలో నిల్చున్నట్టనిపించింది. హెమింగ్వే, ఇటాలో కెల్వినో, మార్క్వజ్, బెన్ ఓక్రీ, మిలన్ కుందేరా...రకరకాల రచయితలను పరిచయం చేశారాయన. నేను రోల్డ్ డాల్ నీ, రస్కిన్ బాండ్ నీ, జెఫ్రీ ఆర్చర్ నీ పరిచయం చేసుకున్నాను. వారి పుస్తకాలు చదివి పొంగిపోయేవాణ్ణి. ఆదివారం అబిడ్స్ లో ‘రారారా! నన్ను తీసుకో! నన్ను పొదువుకో’ అంటూ ప్రపంచ ప్రఖ్యాత రచయితలంతా చేతులు సాచేవారు. అడిగిన మేరకు అందరినీ కొన్నాను. ఇల్లంతా నిండిపోయారు. అయినా చాలన్నది లేదు. కొత్త వారి కోసం వాల్డన్, బుక్ పాయింట్, జూబ్లీహిల్స్ ఆంధ్రజ్యోతి రోడ్డులో ఉన్న బుక్ షాపులను చుట్టేసేవాణ్ణి. స్వర్గం ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. నాకు తెలిసిన స్వర్గం ఒకటే! అది నా పుస్తకాలగది. ఆ గదిలో ఫ్యాను గాలికి పుస్తకం పేజీలు రెపరెపలాడుతుంటే...నాకు హార్మోనియం విన్నట్టు ఉంటుంది. 

 అసలు విషయం చెప్పడం మరచిపోయాను. గత పాతికేళ్ళుగా నాకు బెస్ట్ బుక్ పాపుతో పరిచయం ఉంది. ఈ బుక్ షాప్ లకడీకాపుల్ లోని అశోకా హోటల్ పక్కన మేడ మీద ఉంటుంది. అందులో ఎన్ని పుస్తకాలు కొన్నానో, కొనలేక ఎన్ని పుస్తకాలు అక్కడే చదివానో నాకు గుర్తులేదు. రేడియో స్టేషన్ వారు నన్ను పిలిచినప్పుడల్లా రేడియో పనిచూసుకుని, తర్వాత తప్పకుండా అక్కడకు వెళ్ళేవాణ్ణి. నాతోపాటుగా మిత్రుడు రాంబాబుని కూడా లాక్కేళ్ళేవాణ్ణి. అలా పాతపుస్తకలు కొనడం, వాటి పఠనాన్నీ వారికీ అలవాటుచేశాను. ఒకవేళ ఆ అలవాటు వారికి అంతకు ముందే ఉంటే...దానిని నేను పెంపుచేశాను. పుస్తకం అద్దంలాంటిది. అది నిన్నేకాదు, నీ గుండెల్లో ఏఁవుందో అది కూడా చూపిస్తుంది. అందుకని పుస్తకాన్ని పవిత్రంగా, భయం భయంగా చూడడం  అలవాటయింది. ఎన్నిపుస్తకాలు చదివితే అన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. తెలిసిన విషయాల్తో బతకడం చాలా ఈజీ. అందుకే నాకు పుస్తకాలంటే ఇష్టం. 

-జగన్నాథశర్మ