TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
కవులు కథలురాస్తే బాగుంటుంది. అందులో కవిత్వం ఉంటుంది. కథల్లో కవిత్వం నాకు బలే ఇష్టం. శ్రీశ్రీ, తిలక్, ఇంద్రగంటి, సోమసుందర్, ఆరుద్ర...కథలను ఎన్నిసార్లు చదివానో! కవి ఆశారాజుకథలను కూడా అలాగే వెదకి వెదకి చదివాను. తొలిరోజుల్లో ఆశారాజు వీనస్, వెన్నెలతో నా కన్నులు కడిగావు, పారేసిన బతుకులు...అని ఓ ఇరవై కథలు వ్రాసినట్టు గుర్తు. అయితే అవి కథలుకావు, కవిత్వమే! ఆ కథల్లో ‘పారేసిన బతుకులు’ నాకు చాలా ఇష్టమైనకథ. ఆ కథతోపాటు ఆశారాజు కూడా నాకిష్టమైనవ్యక్తే!
1970 వ దశకం చివరిరోజుల్లో, ఏజీ ఆఫీసువారి రంజనిసభ్యులు, ఓ కార్తీకఆదివారం ఇందిరాపార్కులో విందుచేశారు. నేను వారి ఆఫీసువాడిని కాకపోయినా ఆ ఆఫీసులోని రచయితలందరికీ ఇష్టుణ్ణి కాబట్టి నన్నక్కడకి ఆహ్వానించారు. కథలపోటీ నిర్వహించారక్కడ. కథలు చదివి వినిపించాలి. బాగుంటే బహుమతి ఇస్తామన్నారు. కెకె మీనన్, వారాల కృష్ణమూర్తి, పాలకోడేటి సత్యనారాయణరావు...ఇలా చాలా మంది, తామురాసిన కథలు చదివి, వినిపించారు. అలాగే నేనూ ఓ కథ వినిపించాను. కథపేరు దండోరా. బాగుందని మెచ్చుకున్నారంతా. నా కథకి ప్రథమబహుమతి ప్రకటించారు. నూటపదహార్లు డబ్బు ముట్టజెప్పారు.
భోజనాలుచేస్తున్నప్పుడు ఆశారాజుని కెకెమీనన్ పరిచయంచేశారు. బూట్లూ, ఇన్ షర్ట్, రాజేష్ ఖన్నా హెయిర్ స్టయిల్ గమ్మత్తుగా కనిపించాడు రాజు. మీ కథలు బాగుంటాయి శర్మాజీ అన్నాడు. థాంక్యూ అని రాజుతో చేయికలిపాను.
తర్వాత ఓ సాయంత్రం ఏడుగంటలవేళ...ద్వారాకాహోటల్ లో గురువుగారు శివారెడ్డిగారి కోసం చూస్తూంటే...రాజువచ్చాడక్కడకి. గురువుగారింకా రాలేదా? అడిగాడు. రాలేదన్నాను. రండి! ఓ సిగరెట్ వేస్కోండి అన్నాడు. నాకు సిగరెట్ కొనిచ్చి, తాను జర్దాపాన్ వేశాడు రాజు. ఇద్దరం కబుర్లలోపడ్డాం. ఎంతసేపూ నేను మాట్లాడడమేగాని, రాజు పెద్దగా మాట్లాడలేదు. మాటలు దాస్తున్నట్టనిపించింది. కవులకు దాపరికాలు పనికిరావన్నాను, దాస్తే గీస్తే పబ్లిక్ లోనే దాచాలి అన్నాను. మాట్లాడరేంటి? అన్నాను. ఆమాటకి వచ్చిన నవ్వును ఆపుకున్నాడు రాజు. వెళ్లి, నోట్లో పాన్ ఉమ్మివేసి వచ్చాడు. పాన్ నోట్లో ఉన్నప్పుడు మాట్లాడడం కష్టం కదా? అన్నాడు. సారీచెప్పాడు. అక్కణ్ణుంచి ఇద్దరం స్నేహితులం అయిపోయాం.
రాజు పాన్ తింటే నాకు సిగరెట్, రాజు ఉస్మానియాబిస్కట్స్ తింటే నాకు ఇడ్లీవడ, రాజు టీ తాగితే, నాకు కాఫీ...అలా రోజులు గడిచిపోయాయి. నేను కథలురాసేవాణ్ణి. రాజు కవిత్వం రాసేవాడు. ఎవరేదిరాసినా అందులో కవిత్వం ఉండాలనేవారు శివారెడ్డి. ద్వారకాహోటల్ లో వినిపించాలనేవారు. వారు కూడా తన కవిత్వాన్ని అందరికీ వినిపించేవారు. బాగోగులగురించి చర్చలు జరిగేవి. ఒక ఊహను కథగానో, కవితగానో మార్చడం ఎంతకష్టం? గనిలో వనిలో కార్ఖానాలో కార్మికుడు పడే కష్టంతో సరిసమానం అనుకునేవాళ్లం. కథకోసంనేనూ, కవితకోసం రాజూ ద్వారాకాహోటల్ లో, పిచుకులువాలిన చెట్టునుచూస్తూ ఆలోచించని రోజంటూ ఉండేదికాదు.
వేసవిసెలవులు. నా భార్యా్బిడ్డలూ, రాజుభార్యాబిడ్డలూ వారివారి తాతగారి ఇళ్లకు వెళ్లారు. పదిరోజులు ఉండి వస్తామన్నారు. వాళ్లు లేకుండా ఆ పదిరోజులు తట్టుకోవడం ఇద్దరికీ కష్టమయ్యింది. అప్పుడే రాజు పద్యం అందుకున్నాడిలా.
తలుపుతీసి లోనికెళితే ఏకాంతభయం
గదిలో మనుషులెవరూ ఉండరు
అడుగులుమాత్రం కనబడుతుంటాయి.
ఎవరిమాటలూ వినిపించవు
పరిమళం మాత్రం వీస్తూ ఉంటుంది.
లైటు వేసి చూసుకుంటే
కళ్లనిండా జ్ఞాపకాలు
గోడలమీదా, సోఫాలమీదా, కుర్చీలమీదా
రంగు పెన్సిళ్ల పిచ్చిగీతల మరకలు
పరదాల అంచునా, టీవీస్టాండుమీదా
పసివేళ్లు ముట్టుకున్న తీపి గుర్తులు....
ఇద్దరికళ్లూ చెమ్మగిల్లాయి. నేను రాజుని పట్టుకుని, కవిత్వం ఎక్కడలేదయ్యా? ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఖాళీ ఇళ్లలో ఉంది. జ్ఞాపకాల్లో ఉంది. నీలో ఉంది. నాలో ఉంది అన్నాను. నువ్వు గొప్పకవివయ్యా అన్నాను. థాంక్యూ శర్మాజీ అన్నాడు రాజు.
సెలవులకు భార్యాబిడ్డలు ఊరికి వెళితే నాకు పట్టపగ్గాలు ఉండేవికావు. నాగా లేకుండా ఆ పదిరోజులూ బీరు తాగేవాణ్ణి. పండగచేసుకునేవాణ్ణి. నాతోసహా రాజూ, గురువుగారూ అంతా తాగాల్సిందే! తాగించాల్సిందే! రాజు గ్యాపిద్దామంటే ఒప్పుకునేవాణ్ణికాను. తాగనీ! ఈ పదిరోజులేగదా శర్మ సరదా అంతా! తర్వాత ఎలాగూ తాగడనేవారు శివారెడ్డిగారు. ‘పా పా’ అంటూ బార్ కి దారితీసేవారు.
ఈనాడులో ఉద్యోగం మానేశాను. ఈవారంలో జాయినయ్యాను. ఈవారం మేనేజ్ మెంట్ తో కూడా పడలేదు. అక్కడా మానేశాను. ఉద్యోగంలేదు. ఇంట్లో ఉద్యోగం లేదనే విషయం తెలియకూడదని, లంచ్ బాక్స్ పట్టుకుని ఆఫీసుకి వెళ్తున్నట్టుగా పబ్లిక్ గార్డెన్ కి పొద్దున పదింటికి వెళ్లిపోయేవాణ్ణి. సాయంత్రందాకా అక్కడే ఉండి, తర్వాత ద్వారకకు చేరుకునేవాణ్ణి. రాజూవాళ్లతో ద్వారకలో రాత్రి తొమ్మిది పదిదాకా కాలక్షేపంచేసి, ఎప్పటిలాగానే ఇంటికి చేరుకునేవాణ్ణి. ఇంటిలోనేకాదు, మిత్రులెవరికీ ఈ సంగతి తెలియకూడదని నా ప్రయత్నం. కాని ఎలా తెలుసుకున్నాడో రాజు తెలుసుకున్నాడు. ఆనాడు ఓ పద్యాన్ని వినిపించాడిలా.
అన్నిటినీ మరచిపోతున్నాం
గాయాలకు అలవాటుపడ్డాం
బాధలు మనలో భాగమైపోయాయి.
ఇంట్లోని వస్తువులు పోయినా తెలియదు
పక్కన నడుస్తున్న మనిషి,
అకస్మాత్తుగా ఆగిపోయిందికూడా స్పృహ ఉండదు.
రాజుని గట్టిగా కౌగలించుకున్నాన్నేను. ఏం రాశావయ్యా అన్నాను. అనుభవాలతో బాగా పండిపోయావు. వాటిని దోసిళ్లతో మాకు దోచిపెడుతున్నావన్నాను. రాజు ఆనందించలేదు సరికదా, అడిగాడిలా.
ఉద్యోగంపోయిందన్న సంగతి ఎందుకు దాచిపెట్టావు శర్మాజీ?
అవునయ్యా! అదేమైనా చెప్పకూడని విషయమా? గదమాయించారు గురువుగారు.
అంటే...అని నేను నీళ్లు నములుతుంటే...పిచ్చా? ఉద్యోగం లేదన్న సంగతి ముందు అమ్మాయి(భార్య రమణి)కి చెప్పు. తిరిగినపార్కులుచాలు! ఇంట్లోనే ఉండు అన్నారు గురువుగారు. ఆ రాత్రి నాతో ఖైరతాబాద్ వరకూ వచ్చి, నా జేబులో కొంత డబ్బుంచాడు రాజు. ఎందుకయ్యా అంటే? సిగరెట్ల ఖర్చుకి ఉంచుశర్మాజీ అన్నాడు. ఉగాది వారపత్రికకు నేను సంపాదకుణ్ణి అయ్యేంతవరకూ అంటే...ఒక ఏడాదిపాటు నా ఖర్చంతా రాజే భరించాడు. అలాగే నేను ఇంటికి వెళ్లననే భయమేమో! రాత్రిపూట ఖైరతాబాద్ వరకూ నాతోపాటుగా వచ్చి, నేను కాలనీలోనికి వెళ్తున్నదీ లేనిదీ చూసి మరీ తాను బస్సెక్కి ఏజీకాలనీకి వెళ్లేవాడు రాజు. ఆనాటికి రాజు జుబ్బా, జులపాలజుత్తులో ఒదిగిపోయాడు. ఆ ఆహార్యంలో సాయంత్రంవేళ ద్వారకలో పిచికలువాలిన చెట్టుదగ్గరగా నిలుచుని, ఓ పెయింటింగ్ లా కనిపించేవాడు రాజు. ఓ నిశ్శబ్దకవిత అనిపించేవాడు.
నేనూ రాజూ గత నాలుగుదశాబ్దాలుగా స్నేహితులం. వారానికి ఓ సారైనా నాకు ఫోన్ చెయ్యకుండా ఉండలేడు రాజు. ఫోన్ చేసిన ప్రతిసారీ ఏం రాస్తున్నావు శర్మాజీ? అనడుగుతాడు. ఏమీ రాయట్లేదంటే...అలా ఎలా? చెరువులో గులాబీరేకునువేసి, దాని ప్రతిధ్వనికోసం చెవులప్పగించేవాడివి. నువ్వేదీ వినడంలేదన్నా, రాయట్లేదన్నా నేను నమ్మనంటాడు. నీడతోనృత్యంచేయిస్తావు. నీకన్నీ సాధ్యమేనంటాడు. కవిత్వమే మాట్లాడతాడు రాజు. ఎప్పుడూ నాలాంటి పామరులతోనే ఉంటాడు. పండితుల ఊసెత్తడు. ఎందుకంటే...పండితులదగ్గర కవిత్వానికి ఊపిరాడదు. చచ్చిపోతుందంటాడు. నవ్వుతాడు రాజు. కన్నీటిని ఎనిమిదవ సముద్రం అంటాడు. ఆ సముద్రతీరం మనకొద్దంటాడు. అందుకే రాజు అంటే నాకిష్టం. కథలాంటి అతని కవిత్వం అంటే ఇంకా ఇంకా ఇష్టం.
-జగన్నాథశర్మ