TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
ఉషాకిరణ్ మూవీస్ మంచికథకోసం వెదుకులాడింది. సినిమాకు అనుగుణంగా చతుర మాస పత్రికలో ఏదేని నవల వచ్చి ఉంటే...సూచించమన్నది. అయ్యవారు అడిగితే సంపాదకవర్గం ఊరుకుంటుందా? కిందా మీదా పడింది. నవలలన్నీ ఒకటికి రెండుసార్లు చదివింది. ఆఖరికి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మిగారి నవల ‘ప్రేమలేఖ’ను సూచించింది.
ప్రేమలేఖను చదివారంతా. బాగుంది అంటే బాగుంది అన్నారు. సినిమాకు సరిపోతుందన్నారు. సినిమా తీశారు. సూపర్ హిట్టయిందది. విజయోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఆ సందర్భంగా రచయిత్రిని ఆహ్వానించారు. ఈనాడు కార్యాలయానికి అప్పుడొచ్చారు పొత్తూరి విజయలక్ష్మి. ఆమెను నేను అదే మొదటిసారి చూడడం. తెల్లగా అంతెత్తున ఉన్నారామె. మఫ్టీలో ఉన్న లేడీ పోలీస్ ఆఫీసర్ లా ఉన్నారు. ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ అట్లూరి రామారావుగారితో మాట్లాడి, వారితో సహా ఛైర్మన్ గారిని కలిశారు.
వెను తిరిగి వెళ్లిపోతూ విపుల, చతుర సెక్షన్ లోకి వచ్చారు. అందరినీ పలకరించారు. నన్ను పరిచయం చేశారామెకు.
‘‘మీ పేరు జగన్నాథశర్మా? మీరు కథలు రాస్తారు కదూ?’’ అడిగారామె. అవునన్నాను.
‘‘మీ కథలు చాలా సీరియస్ గా ఉంటాయి. మనకంత సీరియస్‌నెస్ పడదు.’’ అని నవ్వారు.
ఈ సంఘటన 1983 లో జరిగింది. తర్వాత 1995 వరకూ విజయలక్ష్మిగారిని కలిసే భాగ్యం నాకు లభించలేదు. పుష్కరకాలం అయింది. చూపులు తప్పిపోయాయి అనుకున్నాను. కాని తప్పిపోలేదు. ఈ టీవీలో చీఫ్ స్క్రిప్ట్ రైటర్ గా నేను జాయినయ్యాను. అప్పుడు మళ్లీ విజయలక్ష్మిగారిని చూశాను.
కామెడీ సీరియల్ కోసం మంచి కథ కావాలంటే...చెప్పేందుకు వచ్చారామె. సోమాజీగూడ ఈటీవీ కార్యాలయానికి ఎదురుగా సెంట్రల్ కోర్ట్ లో నాకు కథ వినిపించారు. కథ బాగుంది.
‘‘తీస్తారా?’’ అడిగారామె.
‘‘తియ్యం’’ అన్నాను. ఆశ్యర్యంగా చూశారామె.
‘‘ఇక్కడ కామెడీ యాజమాన్యమే రాసుకుంటుంది. ఇతరులు రాస్తే ఒప్పుకోదు. ఒకవేళ ఒప్పుకున్నదనుకుంటే... మాదే అంటుంది తర్వాత.’’ అన్నాను. పగలబడి నవ్వారామె.
‘‘నీ కడుపు చల్లగుండ! ముందే చెప్పావు.’’ అని వెళ్లిపోయారు. ఆ వెళ్లిపోవడం వెళ్లిపోవడం మళ్లీ మేము కలుసుకోలేదు. ఓసారి కలిసే అవకాశం వచ్చింది. వారి స్థలాన్ని డెవలప్ మెంట్ కి తీసుకుని అపార్ట్ మెంట్స్ కడుతున్నారంటే...ఓ అపార్ట్ మెంట్ కొనుగోలుచేసేందుకు వెళ్లాను. విద్యానగరో ఎక్కడో...అది! పెద్దగా గుర్తులేదు. బిల్డర్స్ తో బేరం కుదర్లేదు, మానుకున్నాను. నేను కారెక్కి వెళ్లిపోతుంటే...విజయలక్ష్మిగారు అక్కడికి వచ్చారు. పలకరిద్దామనుకున్నానుగాని, ఆఫీసునుంచి ఫోన్ వస్తే పరిగెత్తాను.
చాలా ఏళ్ల తర్వాత, నవ్య వీక్లీకి సంపాదకుణ్ణి అయిన తర్వాత వారిని మళ్లీ నేను కలుసుకునే అవకాశం లభించింది.
నవలల పోటీకి పోరు పెడితే నవల రాశారామె. మంచి నవల. ఒకరకంగా ఆత్మకథ. బహుమతి ఇచ్చాం. బహుమతి చాలా చిన్నమొత్తమేగాని, ఆ నవలతో నవ్య సర్క్యులేషన్ పెద్దమొత్తంలో పెరిగింది. ఆ సంగతి చెప్పి, థాంక్స్ అంటే...
‘‘థాంక్స్ అని చెప్పి తప్పించుకోకు శర్మా! రాయడం మానుకుందామనుకునే వేళ మళ్లీ రాయించావు. తెగ రాయాలనిపిస్తున్నదిప్పుడు. రాసిందంతా నువ్వే వేసుకోవాలి.’’ అన్నారు.
‘‘అంతకంటే భాగ్యం ఉందా?’’ అన్నాను.
రెండేళ్లయినా నవల ఊసే లేదు. అడిగితే ఇదిగో రాస్తున్నా! అదిగో రాస్తున్నానంటూ తప్పించుకునేవారు విజయలక్ష్మి.
‘‘ఏమైంది మేడం! ఎందుకు రాయట్లేదు??’’ అనడిగితే...
‘‘ఆలోచిస్తే అంతటా హాస్యమేగాని, అనుభూతిస్తే అంతటా విషాదమేనయ్యా.’’ అన్నారు.
‘‘డ్రామా రాయడం ఈజీనయ్యా! కామెడీ రాయడమే కష్టం.’’ అన్నారు.
ఒకప్పుడు ఇవే మాటలు నేను ప్రముఖ రచయిత డి.వి. నరసరాజుగారిదగ్గర విన్నాను. బాగా చదువుకున్నవారూ, జీవితాన్ని బాగా వడబోసినవారు మాత్రమే అలా మాట్లాడగలరు.
మునిమాణిక్యం కథలు, రంగనాయకమ్మగారి స్వీట్ హోం తర్వాత సంసారపక్షమైన హాస్యం, పొత్తూరి విజయలక్ష్మిగారి రచనల్లోనే నేను మళ్లీ చూశాను. లేడీ మునిమాణిక్యం మా విజయలక్ష్మిగారు. కీర్తిశేషులు శ్రీరమణగారూ, నేనూ ఈ విషయమై చాలాసార్లు చర్చించుకున్నాం.
నేను అధ్యక్షుణ్ణయితే విజయలక్ష్మిగారు ముఖ్య అతిథిగానూ, ఆమె అధ్యక్షురాలయితే, నేను ముఖ్య అతిథిగానూ చాలా వేదికలు ఇద్దరం పంచుకున్నాం.
‘‘చేతిగోళ్లు తీసుకుంటున్నప్పుడు, వేలికి గాయం అవ్వడం పెద్ద ట్రాజెడీ. అదే మార్నింగ్ వాక్ కి వెళ్ళి, మ్యాన్ హోల్ లో పడి మనిషి చనిపోవడం పెద్ద కామెడీ.’’ అన్నారోసారి విజయలక్ష్మిగారు. ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.
‘‘కామెడీ జనాన్ని ఏడిపించాలి. నవ్వించిందంటే...అది ధర్డ్ క్లాస్ కామెడీ.’’ అన్నారు. వాటిని సమీక్షించలేకపోయాను. అధ్యక్షునిగా నాకప్పుడు మాటలు కరువయ్యాయి. నవ్వుతూ మాట్లాడతారుగానీ, అమ్మో! విజయలక్ష్మిగారిలో చాలా విషయం ఉందనుకున్నాను.
నా శ్రీమతి రమణితో చాలా చనువుగా ఉంటారామె. పెళ్లిభోజనాల్లో రమణి సరిగా వడ్డించుకోలేనప్పుడు...కల్పించుకుని, రమణి విస్తరినిండా వడ్డించడం విజయలక్ష్మిగారికి సరదా!
‘‘ఎంత బాగా తింటే అంత మంచిది రమణీ! బాగా తినడం బ్యాంక్ అకౌంట్ లాంటిది. ఎంత బాగా తింటే...అంతగా ఇన్ వెస్ట్ చేసినట్టనుకో!’’ అన్నారు.
‘‘అన్నాన్ని ప్రేమించగలవారే అందరినీ ప్రేమించగలరు.’’ అని నవ్వారు.
విజయలక్ష్మిగారి భర్తపోయినప్పుడు, నేను వెళ్లి ఆమెను పరామర్శించలేదు. ఎందుకో నాకు అలా పరామర్శించడం ఇష్టం ఉండదు. చాలా రోజులపాటు నేనూ, ఆమే ఫోన్లో కూడా మాట్లాడుకోలేదు. ఒకరోజు రమణి చెబితే ఫోన్ చేశాను. విజయలక్ష్మిగారు మాట్లాడారు.
‘‘అది కాదుశర్మా! అన్నిటికీ ఎక్స్ పెయిరీ డేట్ ఉంటుంది. స్పష్టంగా పేర్కొని హెచ్చరిస్తారు కూడా. మనిషి విషయంలో ఎందుకు ఆ సౌలభ్యంలేకుండా పోయింది? తెలిస్తే జాగ్రత్తపడతాం కదా!’’ అన్నారు. తర్వాత మరి మాటలు లేవు. ఏడుస్తున్న ధ్వని వినవచ్చింది.
‘‘మేడం’’ అన్నాను, ఓదార్పుగా.
‘‘హాస్యం అనేది నవ్వించి పేలిపోయే డైనమైటయ్యా! నా హాస్యం నన్నే పేల్చేసింది.’’ అన్నారు.
‘‘ఊరుకోండి మేడం.’’ అన్నాను.
‘‘ఒకటి నిజం శర్మా! ఎంతటి దుర్దినానికైనా ఇరవై నాలుగుగంటలే టైం. ఆ రోజు గడిచిపోయిందీ...చీకటిపోయి వెలుగొస్తుంది. మళ్లీ అంతా మామూలే!’’ అన్నారు.
మామూలయ్యారు కొద్దిరోజులకి. నాకు కావాల్సింది అదే! మెదడుతో ఆలోచించేవారే భయస్తులు. హృదయంతో ఆలోచించేవారికి ఏ భయాలూ ఉండవు. విజయాలు వారివే! అందుకే విజయలక్ష్మిగారంటే నాకు చాలా చాలా ఇష్టం. వారి రచనలంటే ఇంకా ఇంకా ఇష్టం.
-జగన్నాథశర్మ