TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
నలుగురు మిత్రుల కథ
అనగా అనగా ఒక ఊళ్లో ఒక మిరపకాయ, ఐస్‌క్రీమ్, ఉల్లిగడ్డ, టమోటా చాలా స్నేహంగా ఉండేవి.
ఒకసారి అవన్నీ కలిసి షికారుకు వెళ్దామని బయలుదేరాయి.
అవన్నీ పోతూ ఉంటే ఒక పెద్ద సముద్రం అడ్డు వచ్చింది.
నాలుగూ ఆ సముద్రంలోకి దూకి, ఈది, అవతలి ఒడ్డుకు చేరుకున్నాయి.
చూస్తే ఏముంది? ఐస్‌క్రీమ్ లేదు! అది సముద్రంలో కలిసిపోయింది!!
"అయ్యో! మన మంచి స్నేహితుడు ఐస్‌క్రీమ్ చనిపోయాడే" అని మిగిలిన మూడూ చాలా బాధ పడ్డాయి.
బాధ పడుతూనే అవి మూడూ మార్కెట్టు దగ్గరికి పోయాయి.
అక్కడ ఒకడు నిలబడి మిరపకాయలతో బజ్జీలు వేస్తున్నాడు.
అకస్మాత్తుగా అతను చేయెత్తి, మన మిరపకాయను తీసుకొని, పిండిలో ముంచి, నూనెలో వేసేశాడు!
"అయ్యో! మన మంచి స్నేహితుడు మిరపకాయ చనిపోయాడే!" అని మిగిలిన రెండూ బాధ పడ్డాయి.
"ఇంకేం చేద్దాం?" అనుకొని, అవి రెండూ సినిమా చూసేందుకని వెళ్లాయి. టమోటా ఒక సీట్లోను, ఉల్లి గడ్డ ఒక సీట్లోను కూర్చున్నాయి.
అంతలో లావుపాటాయన ఒకాయన వచ్చి టమోటా మీదే కూర్చున్నాడు!
"అయ్యో! నాకున్న ఒక్కగానొక్క స్నేహితుడు టమోటా కూడా చచ్చిపోయాడే!" అని చాలా ఏడిచింది ఉల్లిగడ్డ.
"వీళ్ళు చనిపోతే నేనున్నాను గదా, ఏడ్చేందుకు? మరి నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు?" అని దానికి ఇంకా ఏడుపు వచ్చింది.
అది అట్లా ఆపకుండా ఏడుస్తుంటే దేవుడికి దానిమీద జాలి వేసింది.
"నువ్వేమీ బాధ పడకు! నిన్ను కోసి చంపేవాళ్ళే ఏడుస్తారులే, నీకేమీ లోటుండదు" అన్నాడు దేవుడు, దాన్ని ఓదారుస్తూ.
అప్పటినుండీ ఉల్లిగడ్డను ఎవరు కోస్తున్నా, ఆ సమయంలో తప్పకుండా ఏడుస్తున్నారు.
Courtesy..
kottapalli.in