Facebook Twitter
ఒక మనిషి మంచితనం

 

ఒక మనిషి మంచితనం

 

 

 

చాలాకాలం క్రితం రామాపురం అనే గ్రామంలో అందరూ బ్రాహ్మణులే ఉండేవారు. వాళ్లంతా చాలా పవిత్రంగా ఉండేవారు. అందరూ అతి సాధారణ జీవితాలు గడుపుతూ, ఉదయమూ,సాయంత్రమూ క్రమం తప్పకుండా సంధ్యావందనం చేసుకుంటూండేవారు. అందరూ వేదాధ్యయయనం చేసేవాళ్లు, తాము చేయవలసిన అన్ని పూజలు, పునస్కారాలు విధివత్ జరుపుతూ, శాస్త్రానుసారంగా జీవించేవాళ్లు. వేదబ్రాహ్మణులందరి మాదిరే వాళ్లందరికీ ఇంటి మధ్యలో అగ్నికుండం ఉండేది. అందులో నిప్పు ఆరకుండా వాళ్లంతా జాగ్రత్త పడేవాళ్లు.

అలాంటి ఒక కుటుంబంలో ఒకరోజు రాత్రి, ఆ ఇంటి చిన్న కోడలికి అర్జంటుగా మూత్రం పోసుకోవాల్సి వచ్చింది. అమావాస్యేమో, బయటంతా చాలా చీకటిగా ఉంది. పోవాలంటే చాలా భయం వేసింది. చివరికి ఆమె తెగించి, ఇంటి మధ్యలో ఉన్న అగ్నిహోత్రంలో మూత్రం పోసుకొని, చప్పుడు చేయకుండా వెళ్లి పడుకున్నది. తెల్లవారాక లేచి చూస్తే, ఆమె ఇంట్లోవాళ్లకు తమ అగ్నిహోత్రంలో మెరుస్తూ స్వచ్ఛమైన బంగారు కణిక ఒకటి కనపడింది!

ఇంటివాళ్లంతా నిర్ఘాంతపోయారు. ఆ ఇంటి పెద్ద-ముసలివాడూ, జ్ఞానీ అయిన బ్రాహ్మణుడు- ఇంట్లో అందర్నీ నిలబెట్టి, "మీలో ఎవరో ఏదో తప్పు పని చేశారు. లేకపోతే బ్రాహ్మణుల అగ్నిహోత్రంలో ఇలా బంగారు కణిక ఎలా వస్తుంది?" అని అడిగాడు. చాలాసార్లు అడిగిన మీదట, చిన్నకోడలు ధైర్యం చేసి, క్రితం రాత్రి తను చేసిన తప్పును ఒప్పుకున్నది. బ్రాహ్మణుడు ఆమెను గట్టిగా హెచ్చరించి, ఇక ఏనాడూ అలాంటి పని చేయనని ప్రమాణం చేయించాడు. ఇతరులెవరూ ఆమెను అనుసరించరాదని, రాత్రిపూట మూత్రం వచ్చినప్పుడు ఒకరికొకరు తోడుగా వెళ్లమని ఆయన కుటుంబ సభ్యులందరినీ ఆదేశించాడు.

అయితే, ఈ సంగతి ఎలా తెలిసిందో ఏమో- ఊరంతా తెలిసింది. మొదట్లో మెల్లమెల్లగానూ. ఆపైన త్వర త్వరగాను అందరు బ్రాహ్మణుల ఇళ్లల్లోనూ అగ్నిహోత్రాల్లో బంగారు ఇటుకలు, ముద్దలు వెలిశాయి. వాళ్లలో చాలామంది గొప్ప ధనికులై, పెద్ద పెద్ద ఇళ్లు కట్టుకున్నారు, పట్టు వస్త్రాలు ధరించసాగారు. తమ కూతుళ్లకు వాళ్లు పెద్ద పెద్ద కట్నాలిచ్చి పెళ్లి చేశారు. గ్రామపు స్వరూపమే మారిపోయింది.

కానీ ఒక్క కుటుంబం మాత్రం ఇంకా పేదగానే ఉండిపోయింది. గ్రామానికి చివర్లో ఓ గుడిశలో నివసిస్తూండేది ఆ కుటుంబం. ఇప్పుడా గ్రామంలో మిగిలిన ఒకే ఒక్క పేదకొంప- వాళ్ల ఇల్లు. ఆ ఇంటామె తన భర్తతో ప్రతిరోజూ పోట్లాడేది: "నువ్వు నన్ను కనీసం ఒక్కసారన్నా అగ్నిహోత్రంలో పొయ్యనివ్వచ్చుగదా" అని ఆమె ప్రాధేయపడింది. "మన యీ దరిద్రం తీరిపోతుంది. మన కడుపులకు ఇంత తిండి దొరుకుతుంది, కట్టుకునేందుకు నాలుగు కొత్త బట్టలు వస్తాయి. ఒక్కసారి చెయ్యనివ్వండి చాలు! ఒక్కసారి మాత్రం! ఒక్క బంగారు దిమ్మ మనకు చాలా కాలం వరకు సరిపోతుంది!" అని పోరేది. అలా ఆమె ఏడ్చింది, సాధించింది, వేధించింది, తనకున్న జిత్తులన్నీ వాడి భర్తను ఒప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నది.

ఒకరోజున, ఆమె సాధింపు ఇంకొంచెం శృతి మించే సరికి భర్త ఇక భరించలేక పోయాడు. "బ్రాహ్మణులున్న ఈ గ్రామం ముక్కలు చెక్కలవ్వకుండా ఇంకా ఒకటిగానే ఎందుకున్నదో తెలుసా?" అని అరిచాడు.

"ఎందుకు? నువ్వు నన్ను అగ్నిహోత్రంలో పోయనివ్వనందుకేనా? అడ్డమైన ప్రతివాడూ ధనికుడై పోతుంటే నువ్వు మాత్రం మమ్మల్ని ఆకలితో మాడిపొమ్మంటున్నందుకేనా? చెప్పు, అందుకే గదా?!" అని ఎగతాళిగా వెటకరించింది, వేసారిపోయిన ఆ భార్య.

"ఖచ్చితంగా అంతే. మనం ఇలా ఉండి, మన సమాజాన్ని మొత్తాన్నీ కలిపి ఉంచుతున్నాం. వాళ్లంతా చేస్తున్నట్లు మనమూ చేసినా, లేక మనం కూడా ఈ ఊరును విడిచి పెట్టి వెళ్లిపోయినా ఈ గ్రామం ముక్కలు చెక్కలై పోతుంది." అన్నాడు బ్రాహ్మణుడు.

"చేతగాని తన భర్త తప్పించుకునేందుకు చెప్తున్న అబద్ధం ఇది" అనుకున్నది భార్య. "మనం పేదరికంలో ఉండి, ఈ ధనికులందర్నీ కాపాడుతున్నామనా, నువ్వనేది? ఎంత పొగరు, నీకు నిజంగా?! నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావో ఏమో?" అన్నదామె.

"సరే, అయితే నా‌మాటల్లో నిజం ఎంతో నీకు నువ్వే చూద్దువు. సామాన్లు సర్దు. మనం వేరే ఊరికి వెళ్లిపోదాం. ఏం జరుగుతుందో చూడు" అన్నాడు భర్త.

వెంటనే వాళ్లు సామాన్లన్నీ సర్దుకొని, సకుటుంబంగా పొరుగూరుకు తరలి వెళ్లారు.

ఒక వారంలోగా బ్రాహ్మణుల మధ్య తగవులు మొదలయ్యాయి. ప్రతివాడూ ఇంకొకడిని తిట్టడం మొదలుపెట్టాడు- తన భూముల్నీ, నేలనీ కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని. వాళ్లలోని దురాశాపరులు తమ భార్యల్నీ, కూతుళ్లనీ, కోడళ్లనీ ప్రేరేపించి అగ్నిహోత్రాలలో ఇంకా ఇంకా ఎక్కువ మూత్రం పోయిస్తుంటే, ఆ ఇళ్లలో అగ్నిహోత్రాలు దాదాపు ఆరిపోసాగాయి.

ఒకనాడు ఒక కుటుంబం ఇంకొకరి ఇంటికి నిప్పంటించింది. దెబ్బతిన్న కుటుంబం ఇంకా ఎక్కువ మంటపెట్టి ప్రతీకారం తీర్చుకున్నారు. ఇక, ఇంటి తర్వాత ఇల్లు కాలిపోయి, చివరికి ఊర్లో బూడిద తప్ప మరేమీ మిగలలేదు.

ప్రక్కఊరికి చేరుకున్న బ్రాహ్మణుడికి ఆ సంగతి తెలిసింది. అతనన్నాడు భార్యతో- "నేను చెప్తే నమ్మలేదు నువ్వు. ఒకరి మంచితనం వాళ్లనే కాదు, వాళ్ల చుట్టుప్రక్కల వాళ్లందర్నీ కాపాడుతుంది!" అని.

Courtesy..
kottapalli.in