TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
వారసుడు
అనగనగా ఒక రాజ్యంలో ఒక జమీందారు ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు- రామరాజు, భీమరాజు. ఇద్దరూ అందంగా, బలంగా ఉండేవాళ్ళు; ఇద్దరూ తెలివైనవాళ్ళే. జమీందారు గారికి ఒక్కోసారి 'తన తర్వాత దివాణం ఎవరికి అప్పజెప్పాలి' అని దిగులు వేసేది. ఏమంటే ఏ ఒక్కరికి దివాణం బాధ్యత అప్పజెప్పినా రెండోవాడు నొచ్చుకునే ప్రమాదం ఉన్నది మరి! అందుకని జమీందారుగారు చాలా రోజులు ఆలోచించి, కొడుకులు ఇద్దర్నీ పిలిచి, "ఒరే! మీరిద్దరూ ఇప్పుడు పెద్దయ్యారు. ఇద్దరికీ మీవంటూ శక్తి సామర్ధ్యాలు తయార-య్యాయి. త్వరలో మీరు దివాణం బాధ్యతలు చేపట్టాలి- నా బరువూ తగ్గించాలి. అయితే దానికి సమాజం గురించిన అవగాహన చాలా అవసరం. అందుకని మీరిద్దరూ ఇప్పుడు దేశాటన చేయాలి. దేశాటన అంటే ఊరికే గుర్రాలెక్కి దేశం అంతా తిరగటం కాదు- మీదంటూ ఏదో ఒక పల్లెను ఎంచుకొని, అక్కడ సామాన్యుల-లాగా ఒక సంవత్సరంపాటు జీవించాలి. ఆ సమయంలో మీరు నా కొడుకులనిగానీ, సంపన్నులని గానీ ఎవ్వరికీ తెలియకూడదు. వీలైనంత తక్కువ ఖర్చుతో బ్రతకాలి ఈ ఏడాది అంతా.
సంవత్సరం పూర్తిగా గడిచాక, మీలో ఎవరు ఎలా గడుపుతున్నారు అన్నదాన్నిబట్టి, నా బాధ్యతల్ని మీకు పంచుతాను - మరి వెళ్ళి రండి" అని ఇద్దరికీ చెరొక బండెడు శనక్కాయలు ఇప్పించి పంపాడు. రామరాజు తూర్పు దిక్కుగా ప్రయాణించి, చీకటి పడే సమయానికి ఒక పల్లె చేరుకున్నాడు. అక్కడ ఒక పూటకూళ్ళమ్మ దగ్గరకు వెళ్ళి భోజనం పెట్టమన్నాడు. ఆ తర్వాత, డబ్బులు ఇవ్వాల్సి వచ్చేసరికి, దర్పంగా 'నేను ఎవరనుకున్నావు? జమీందారు గారి కొడుకును!' అని బుకాయించాడు. పూటకూళ్ళమ్మ ఎందుకు ఊరుకుంటుంది? 'ఎవరైనా కావచ్చు- నా డబ్బులు నాకు ఇచ్చెయ్యాల్సిందే' అని పట్టుపట్టి, అందరినీ పిలిచి రగడ చేసింది.
ఊళ్ళోవాళ్ళు కూడా అతను జమీందారు కొడుకంటే నమ్మలేదు. అతని దగ్గరున్న శనక్కాయలు అమ్మి అయినా సరే, ముసలమ్మ అప్పు తీర్చాలని తీర్మానించారు. మరాజు తన దగ్గరున్న బండెడు విత్తనాలనూ అమ్మి, ఆ డబ్బుతో డాబుగా కొన్నాళ్ళు బ్రతికాడు అదే ఊళ్ళో. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోవా? ఆ డబ్బు త్వరలోనే అయిపోవచ్చింది- ఇక అతను కొన్నాళ్లపాటు ఊళ్ళో అప్పులు చేస్తూ బ్రతికాడు. ఇంకా ఆరు నెలలు కూడా కాకుండానే, అప్పులవాళ్ళు అతన్ని కొట్టే పరిస్థితి వచ్చేసింది. దాంతో అతను ఎవరికీ చెప్పాపెట్టకుండా తండ్రి దగ్గరికి చేరుకున్నాడు!
ఇక భీమరాజు పడమటి దిక్కుగా ప్రయాణించి, ఒక పచ్చని ఊరు చేరుకు-న్నాడు. అక్కడ పదిమందినీ విచారించి, చిన్న భూమి ఒకదాన్ని కౌలుకు తీసుకున్నాడు. తను తీసుకెళ్ళిన శనగ విత్తనాల్ని ఆ భూమిలో నాటి, అందరిలాగే కష్టపడ్డాడు. ఊళ్ళో- వాళ్ళంతా 'అబ్బ! భీముడు మంచి పనిమం-తుడబ్బా' అనుకునేట్టు పనిచేశాడు. ఐదు నెలలు గడిచేటప్పటికి అతని విత్తనాలు అతనికి తిరిగి రావటమే కాదు; చాలా లాభం కూడా వచ్చింది. ఆ డబ్బుతో అతనొక చిన్నపాటి చేనును కొనుక్కున్నాడు కూడా. అలా సంవత్సరం తిరిగేటప్పటికి, తను ఒక్కడే తినటం కాదు; పదిమందికి అన్నం పెట్టే స్థితికి చేరుకున్నాడు.
ఇక సంవత్సరం గడిచినా భీముడు దివాణానికి తిరిగి రాలేదు. అతన్ని వెతుక్కుంటూ జమీందారు గారే ఆ పల్లెకు చేరుకున్నారు! అప్పుడుగానీ భీముడు జమీందారు బిడ్డడని ఊళ్ళోవాళ్ళకి తెలీలేదు! 'అయ్యో! తెలీక ఇన్నాళ్ళూ మేం నిన్ను ఏదేదో అని ఉంటాం నాయనా! మనసులో పెట్టుకోబాక' అన్నారు ఊళ్ళో వాళ్లంతా. భీమరాజు నవ్వుతూ 'మీరు ఇట్లా అంటారనే గద, నేను మా నాన్న పేరు చెప్పనిది! మీరు నన్ను నన్నుగా చూడటమే నాకు ఇష్టం. ఇంతకాలం నన్ను మీవాడుగా ఆదరించారు. ఇప్పటికిప్పుడు నన్ను పరాయివాడిని చేయకండి' అన్నాడు. అతను తండ్రివెంట దివాణానికి వెళ్తుంటే సగం ఊరు వెంట వచ్చి వీడ్కోలు పలికింది.
దివాణాన్ని ఎవరికి అప్పజెప్పాలో తెలిసి- పోయింది. జమీందారు గారు మెల్లమెల్లగా తన బాధ్యతలన్నీ భీమరాజుకు అప్పజెప్పటం మొదలు పెట్టారు. అటుపైన రామరాజుకు రాజధానిలో తగిన ఉద్యోగం దొరకటంతో, వారసుడి సమస్య సులభంగానే పరిష్కారమైంది. ప్రజల కష్ట-సుఖాలు తెలిసిన భీమరాజు తర్వాత్తర్వాత మంచి జమీందారుగా పేరు తెచ్చుకున్నాడు.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో