Facebook Twitter
కోడి అందం

కోడి అందం

 

 

ఒక ఊళ్ళో కోడిపుంజు ఒకటి ఉండేది. అది చాలా అందంగా ఉండేది. రంగురంగుల రెక్కలు, పెద్ద పెద్ద కాళ్ళు, బలమైన గోళ్ళు, చక్కగా వంపు తిరిగిన ముక్కు, ఎర్రని తురాయి- తన అందం‌ చూసుకొని అది మురిసిపోతుండేది. ఎప్పుడూ "ఇంకా ఎన్ని సోకులు చేసుకోవాలా?" అని ఆలోచిస్తూ ఉండేది. మిగతా కోళ్లు తనంత అందంగా లేవని చిన్నచూపు చూసేది. 

 

రైతు ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక గ్రద్ద నివసిస్తూ ఉండేది. ఎలాగైనా ఈ కోడిని తినాలని దానికి చాలా ఆశగా ఉండేది. 'అదను చూసి ఎగవేసుకు పోదాం' అని చాలా కాలం పాటు వేచి చూసిందది. 

 

ఒకసారి కోడి చెట్టు క్రింద పురుగులను ఏరుకుంటుంటే 'ఇదే అదను' అని గబుక్కున మీదికి దూకింది గ్రద్ద. ఏమరుపాటు లేని కోడి మెరుపులాగా పోయి, ఆ చెట్టుకున్న తొర్రలో దూరింది. గ్రద్దకు తెలుసు- తను ఎంత ప్రయత్నించినా తొర్రలో దాక్కున్న కోడి తనకు చిక్కదని. అందుకని అది అన్నది-"కోడి మరదలూ,కోడి మరదలూ! 

 

నీ అంత అందమైన కోడి ఎక్కడా లేదని ప్రపంచంలో అన్ని పక్షులూ చెప్పుకుంటున్నాయి. అందుకే నేను నిన్ను చూడటానికి వచ్చాను. నువ్వు నా ఇంటి ప్రక్కన ఉండటం నిజంగా నాకు గర్వకారణం!"అని. వెర్రి కోడి ఆ మాటలకు పొంగిపోయింది. "ఇన్నాళ్లకు నా అందాన్ని గుర్తించే పక్షి ఒకటి ఎదురైంది" అని కులుక్కుంటూ బయటికి వచ్చింది. వేచి చూస్తున్న గ్రద్ద ఒక్క ఉదుటున దానిమీదికి దూకి పట్టుకుపోయి, చంపి తినేసింది.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో