TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
ప్రాణత్యాగం
పట్టువదలని విక్రం తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి, బేతాళాన్ని భుజంపైన వేసుకొని, చెట్టుదిగాడు. అంతలో రోబో బేతాళం కదిలి, "చూడు విక్రం, ఒక పోలీసు అధికారిగా నీకు నా మీద ఏం కోపమో అంతుపట్టడం లేదు. ప్రతి ప్రాణికీ ఒక నీతి ఉంటుంది. అయితే నువ్వు చేస్తున్న పని మటుకు నాకు తెలిసి ఏ నీతి ప్రకారమూ సరైనది కాదు. గతంలో చంద్ర ప్రభుడు అనే చిన్నవాడు ఒకడు నీ మాదిరే ఆలోచించి బ్రహ్మరాక్షసుడికి కూడా లోకువైనాడు. అలసట తెలీకుండా ఉండటం కోసం నీకు అతని కథ చెబుతాను- నోరెత్తకుండా విను" అంటూ ఇలా చెప్ప సాగాడు. అవంతీ రాజ్యపు మంత్రి సుశర్మకు ఒక్కగానొక్క కొడుకు చంద్రప్రభుడు, దూర దేశంలో విద్యనభ్యసిస్తున్నాడు. కథ మొదలయ్యేనాటికే అతని చదువు ముగిసింది. అతను గురువుగారి ఆశీస్సులు అందుకొని, తన మిత్రులు ముగ్గురితో కలిసి అవంతికి తిరుగు ప్రయాణం అయ్యాడు.
చంద్రప్రభుడి మిత్రులు కిశోరుడు, పిప్పలుడు, అనూరుడు ముగ్గురూ మూడు సామంత రాజ్యాల యువరాజులు. యువకులు నలుగురూ కూడా సాహసులూ, ధైర్యవంతులూ, ఔత్సాహికులూనూ. వాళ్ళు అలా తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. అనేక శాఖలతో ఒక పెద్ద అరణ్యంలాగా విస్తరించి ఉన్న ఆ చెట్టుని చూడగానే మిత్రులు నలుగురికీ అక్కడ కొంత సేపు విశ్రమించాలనిపించింది. అలా అనిపించటానికి కారణం ఆ మర్రిచెట్టు మీద ఎన్నో ఏళ్లుగా నివసించే ఒక బ్రహ్మరాక్షసుడు. వాడి పేరు ప్రచండుడు. వాడు తన మాయా ప్రభావం చేత అటువైపుగా వెళ్ళే బాటసారులను ఆకర్షించి, ఆనక వాళ్లను తినేస్తూ ఉండేవాడు.
వాడికి ఈ నలుగుర్నీ చూడగానే చాలా సంతోషం వేసింది; దానితోబాటు కొంత విచారం కూడా కలిగింది. ఏమంటే బ్రహ్మ శాపం ప్రకారం వాడు ఒక రోజున ఒక్క ధైర్యశాలిని మించి తినలేడు! అలా ఇప్పుడు వీళ్లను నలుగుర్నీ ఒకేసారి మ్రింగేసే అవకాశం పోయింది వాడికి. తక్షణం వాడు తన మెదడుకు పని పెట్టాడు. 'ఏదైనా ఒక మాయ చేసి, వీళ్లని ఒక్కరొక్కరుగా, నాలుగు రోజులపాటు తినాలి' అని వాడు పథకం సిద్ధం చేసుకొని, భీకరంగా అరుస్తూ వాళ్ల ముందుకు దూకాడు. వాడి అరుపులకు ఆకాశం వణికింది. భూమి కంపించింది. ప్రశాంతంగా నిద్రపోతున్న నలుగురూ గబాలున మేల్కొని, వరల్లో ఉన్న కత్తులు బయటికి లాగారు. ఎదురుగా అంతెత్తున నిలబడి, గదని త్రిప్పుతూ, భీకరమైన కంఠంతో వికటాట్టహాసం చేస్తున్న ప్రచండుణ్ణి చూడగానే నలుగురికీ ఒక ప్రక్కన భయం వేసినా, మరొక ప్రక్కన విపరీతమైన క్రోథం కలిగింది. అయితే వాళ్ళ కత్తులు బ్రహ్మరాక్షసుడిని ఏమీ చేయలేక, వంగిపోయాయి! నలుగురు యోధుల ముఖాలూ తెలవెల పోయాయి.
ప్రచండుడప్పుడు చికాకును, బద్ధకాన్నీ నటిస్తూ "ఇంక చాలు. నేను అనుమతించకుండా మీరెవ్వరూ తప్పించుకోలేరు ఎలాగూ. ప్రస్తుతం నాకు బాగా ఆకలిగా వుంది. అందులోనూ మీలాగా బలమైన మనుషుల్ని తిని చాలా ఏళ్లయ్యింది. చూస్తుంటే కుస్తీ యోధుల్లా నోరూరిస్తూ ఉన్నారు. మీలో ఎవరైనా ఒకరు నాకిప్పుడు ఆహారం కండి. మిగతావాళ్లని వదిలేస్తాను. లేకపోతే నలుగుర్నీ ఒక్కసారిగా తినేస్తాను. వెంటనే ఆలోచించుకుని చెప్పండి. ఇవాళ్ల నాకు ఎవరు ఆహారం అవుతారు?" అని అరిచాడు. అతని మాటలు వినగానే చంద్రప్రభుడు ముందుకొచ్చి "ఓయీ! బ్రహ్మరాక్షసా! ప్రాణత్యాగానికి నేను సిద్ధం. దయచేసి నా మిత్రులు ముగ్గురినీ వదిలెయ్యి. ఆనక నీ సంతోషం కొద్దీ నన్ను భక్షించవచ్చు!" అన్నాడు ధైర్యంగా. బ్రహ్మ రాక్షసుడు నివ్వెరపోయినట్లు అతనికేసి చూస్తూ ఉండిపోయాడు. అయితే మిగిలిన ముగ్గురి ఆలోచనలూ వేరేగా ఉండినై. వాళ్ళు ముగ్గురూ కట్టగట్టుకున్నట్లు ఒక్కసారిగా పరుగు లంకించుకున్నారు.
అయితే వాళ్ళు మర్రి చెట్టును ఇంకా దాటకనే ప్రచండుడు వాళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యాడు! భయంతో తన్నుకులాడుతున్న ముగ్గురినీ చేతుల్తో బంధించి నోటి దగ్గరికి తీసుకెళ్తూ "పిల్ల కుంకల్లారా! నానుండే తప్పించుకోవాలని చూస్తారా?! ఇంక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు!" అని అరచాడు కోపంగా. "నన్ను వదిలెయ్! నేను బంధుర రాజ్యపు యువరాజును. నీకు ఆహారం అయ్యేందుకు చంద్రప్రభుడు ఒప్పుకున్నాడుగా? వాడిని తిని, మమ్మల్ని ముగ్గుర్నీ వదిలెయ్" అని వేడుకోసాగాడు అనూరుడు. మిగిలిన ఇద్దరూ కూడా జాలిగా ఏడుస్తూ "అవునవును. భూతశ్రేష్ఠా! మేమైతే రాజకుమారులం. రాజ్యానికి మా అవసరం చాలా ఉంది. వాడు కేవలం మంత్రి కొడుకు. వాడిని తింటే వేరే ఎవరికీ నష్టం లేదు" అనటం మొదలుపెట్టారు.
ప్రచండుడు వాళ్లు ముగ్గుర్నీ, చంద్ర ప్రభుడినీ కొంత సేపు మార్చి మార్చి చూసాడు. ఆ తర్వాత ముగ్గుర్నీ ఒక్క సారిగా నోట్లోకి వేసుకొని మ్రింగేసి, చంద్రప్రభుడిని మటుకు ఏం చేయకుండా విడిచి పెట్టేసాడు. బేతాళం కథ చెప్పటం ఆపి, "ఇంతకీ బ్రహ్మరాక్షసుడు ముగ్గురినీ ఎలా తినగలిగాడంటావు? ఎవరైనా ఒకరు ప్రాణత్యాగానికి సిద్ధపడితే మిగిలిన ముగ్గుర్నీ వదిలేస్తానన్నవాడు, దానికి వ్యతిరేకంగా చేయటం ధర్మ విరుద్ధం అవ్వదా? చంద్రప్రభుడిని ఎందుకు వదిలేసాడు? అతనిలోని నీతి సంపద వల్ల రాక్షసుడి హృదయంలో పరివర్తన కలిగి ఉంటుందా?" అని అడిగింది. విక్రం చిరునవ్వు నవ్వి, "నేను మాట్లాడగానే నువ్వు తిరిగి చెట్టెక్కుతావని తెలుసు. అయినా నీకు సమాధానం చెబుతాను. బ్రహ్మరాక్షసుడి హృదయపరివర్తన ఒట్టిదే. నిజంగా అట్లాంటిదేదైనా ఉంటే వాడు అందరినీ వదిలిపెట్టేసి ఉండేవాడు.
బ్రహ్మశాపం ప్రకారం వాడు రోజుకు ఒక్క ధైర్యశాలిని మాత్రమే తినగలడు. 'భయంతో కొట్టుమిట్టాడే ముగ్గురిని తినాలా, ధైర్యంగా నిలబడ్డ ఒక్కడిని తిని ఊరుకోవాలా?' అన్న ఆలోచనలో వాడి 'భూత నీతి' ముగ్గురిని ఎంచుకునేట్లు చేసింది. చంద్రప్రభుడి ధైర్యమే వాడిని కాపాడిందనటంలో సందేహం లేదు. మిగిలిన ముగ్గురూ తమలోకి పిరికితనాన్ని రానివ్వటం ద్వారా బ్రహ్మరాక్షసుడికి ఆహారం అయిపోయారనాలి!" అన్నాడు. విక్రంకి అలా మౌనభంగం అవ్వగానే బేతాళం అతన్ని తప్పించుకొని ఎగిరి వెళ్ళి, మళ్ళీ చెట్టెక్కింది.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో