Facebook Twitter
మారిన దొంగ

 

మారిన దొంగ

 


రాజీవ్‌ అనే కుర్రవాడు చక్కగా చదివి, చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పట్టణం చేరాడు. అక్కడికి వెళ్లగానే ఉద్యోగం దొరుకుతుం-దనుకున్నాడు. కానీ దొరకలేదు. అట్లా కొద్ది రోజులు గడిచేసరికి అతను పట్టణంలోని జల్సాలకి అలవాటు పడ్డాడు. డబ్బులు సరిపోక మెల్లగా దొంగతనాలకు కూడా అలవాటు పడ్డాడు! త్వరలోనే దొంగతనాల వల్ల వాడి దగ్గర చాలా డబ్బులు పోగయ్యాయి. వాటిని చూసుకొని వాడు మరిన్ని దొంగతనాలు చేయటం మొదలు పెట్టాడు.

 

తల్లి దండ్రులు ఫోను చేసినప్పుడల్లా "నేను బాగున్నాను- పెద్ద ఉద్యోగం దొరికింది. పని చాలా బాగుంది" అని చెప్పేవాడు వాడు. దాంతో వాళ్ళు పాపం తమ కొడుకు ప్రయోజకుడయ్యాడని అందరికీ గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అట్లా కొన్ని నెలలు గడిచాయి. అంతలో ఒకరోజున రాజీవ్‌ ఇంట్లోనే దొంగతనం జరిగింది! దొంగతనాల ద్వారా అతను పోగు పెట్టుకున్న డబ్బులు అన్నీ పోయాయి. తన సొమ్ము పోయేసరికి వాడికి చాలా బాధ వేసింది. కానీ‌ తను ఎవ్వరికీ చెప్పుకోలేడు! పోలీసుల దగ్గరికి కూడా పోలేడు!

 

"నా సొమ్మును దొంగతనం చేసినవాడు నాశనమైపోతాడు. వాడిని నేనే పట్టుకొని శిక్షిస్తాను!" అని వాడు చాలా ఆవేశపడ్డాడు. అయితే ఆ రోజు రాత్రి అలసిపోయి పడుకునే ముందు వాడికో ఆలోచన వచ్చింది: 'దొంగతనం చేసి సంపాదించిన డబ్బులు పోతేనే తను ఇంత బాధపడుతున్నాడు; మరి కష్టపడి ఏదో పని చేసుకొని నాలుగు డబ్బులు వెనకేసుకున్న వాళ్ల డబ్బుల్ని తను దొంగిలించినప్పుడు వాళ్లెంత బాధపడి ఉంటారు? తనని ఎన్ని తిట్లు తిట్టి ఉంటారు?' ఆ ఒక్క ఆలోచన వల్ల వాడిలో‌ పరివర్తన వచ్చింది. దొంగతనాలు, జల్సాలు మానేసి, తనకు ఎదురైన ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరాడు. బాధ్యతగా పనిచేసి నిజంగానే ప్రయోజకుడయ్యాడు.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో