Facebook Twitter
పట్టుదల

పట్టుదల

 


రాయలచెరువు ఊళ్లో‌ సీనుగాడు ఏడో క్లాసు చదువుతున్నాడు. ఈడు ఎట్టుంటాడంటే ఎర్రగా, ఎముకలు బైటక్కనపడి, బక్కోని లెక్కుంటాడు. నెత్తెంటికలు చెదిరింటాయి. రెన్నెల్లకో మూన్నెల్లకోసారి గానీ స్నానం జేపిచ్చుకోడు. గాని ముఖం చూస్తే అందగాని లెక్కనే వుంటడు. సూపులు జూత్తే ములుకుల్లెక్కుంటయి. ఈడికి సదువుకోల్లని ఆసె. ఏస్కునే బట్టలు లేవు గానీ‌ ఈన్కి సదువు అంటే ప్రానం. బళ్ళో ఇచ్చిండే గుడ్డలేస్కొని తిరిగేటోడు. బడికి పోయినప్పట్నుంచి సదువు మీదనే ద్యాస. అట్టాంటే ఎప్పుడూ అట్టాగని గాదు- అయ్యవారు పాటాలు సెప్పేటప్పుడొక్కటే- మళ్ళా బైట ఆడ్కొనేటప్పుడు ఆడ్కుంటాడు; అల్లరి జేత్తాడు.

సీనుగాని అల్లరి సూసి సారు తిట్టేటోడు. మళ్ళా వాని సదువు సూసి ఊర్కుండేటోడు. సారు పాటాలు సెప్తాన్నాడంటే పక్కన పామొచ్చి పండుకున్నా తల్కాయ తిప్పేటోడు కాదు- అట్టాంటోడు వీడు. సాన మంది అనేటోళ్ళు- "నీకి తినేకే లేదు; యాదన్న పని జేస్కొని బతక్కోండా నీకీ సదువు సంద్యా ఏంట్కిరా?" అని. ఐనా వాడు సదువు మీద పట్టు ఇడిసిపెట్లేదు. సీనుగాన్ సదువు ఐపోతుందనేకి, సీనుగానమ్మోళ్ళు ఊరు మార్నారు, పనుల్లేవని. అట్లా ఊళ్ళు తిరుగుతాంటే ఒకూర్లో రోడ్డేసే పని దొరికింది. యాదో‌ పని- తినేకి తిండి గాల్లంటే జోబీలోకి డబ్బులు గాల్ల. కాబట్టి ఆ పనికి ఒప్పుకున్న్యారు.

 

ఓరోజు సీనుగానమ్మోల్లని ఆఫీసరు పట్నానికి రమ్మన్యాడు. ఈళ్ళంతా పోయినారు నడుసుకుంటా. పట్నం పోయే దావలో ఓ బడి గనపడింటే సీనుగాడు అందర్నీ బండెక్కించి, తను మాత్రం‌ నడుస్తా "మీరు పాండి. నేను మల్లా‌ వత్తాను" అన్న్యాడు. 'సరేలే' అని వీళ్ళూ పోయినారు. సీనుగాడు అక్కడ్నే బడి సందిన నిలవడి ఐవారు పాటాలి సెప్తాంటే బయట్నించే సూస్తన్నాడు. పాటం అవంగనే 'వాల్లందర్లెక్క నేనెప్పుడు కుసుంటానే'నని ఏడ్సుకుంటా ఇంటికి బేనాడు. 

 

అమ్మోల్లు వచ్చాక 'సదువుకుంటా'నని ఒక్కటే పట్టు పట్టిన్యాడు. సీనుగానమ్మోళ్ళు వాడ్ని తిట్టి, "నువ్వు సదువుకునేకి పోతే ఈడ సిన్నోన్ని ఎవడాడిచ్చుకుంటాడు?" అని తిట్నారు. కాన్లే అని ఇంటికాణ్ణే ఉన్యాడు వాడు. అయినా‌ మనసులోనేమో సదువుకోల్లని ఉందాయె. మళ్ళా పొయ్యి అదే బడి బైట నిల్బడి సూత్తాన్యాడు. అది సూసి ఐవారు "ఎవరు నువ్వు" అన్యాడు. సీనుగాడు అంతా సెప్పినాడు. అప్పుడు ఐవారు 'మరి నేను సదివిత్తాను. సదువుకుంటావా?' అనంటే సదువ్కుంటానన్యాడు. సరేనని ఐవారు అదే బళ్ళో సేరిపించినాడి.

అంతలో‌ సీనుగానమ్మొళ్ళు వచ్చి సంగతేందని అడిగితే, సీనుగాడు సదువుకుంటానన్యాడు. గానీ సీనుగాన్నాయన మాత్రం ఒప్పుకోల్యే. ఈడేడుస్తా 'ఏంటికి' అనడిగితే అప్పుడాయప్ప "సదువుకునేకి మాత్రం బడుంది; మళ్లా అన్నమెవరు వెడ్తార్రా" అంటానే వీడు ఏడ్చినాడు. వాళ్ళ మాటలిని ఐవారు "దానికేం బయం ల్యా. ఏంటికంటే గోర్నమెంటోల్లు బాలల వసతి గృహాలు కట్టించిన్యారు. దాంట్లో‌ అన్నీ ఉంటాయి" అన్యాడు ఐవారు. 

 

"మళ్ళా వానికేమన్నైతే ఎవ్వరు బాధ్యులు?" అంటానే "దానికి నేనే బాద్యున్ని" అన్యాడు ఐవారు. ఇంగ సీనుగాడు బళ్ళో‌బాగా సదువుకుని పదోక్లాస్ పాస్ ఐనాడు. మల్లీ ఇంటరూ ఇవన్నీ అనంతపురం "బాలల వసతిగృహం"లోనే వుండి సదువుకున్యాడు. ఇంగీమద్దలో వాడు యాడుండాడో ఈ వూరికి రాల్యా. దాదాపు పదేల్లయితాంది. సీనుగాడు పట్టుదలమీద సదువుతానే ఉన్యాడు.

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో