TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
బాలల దినోత్సవం
బడిలో బాలల దినోత్సవం జరుపుకుంటున్నారు. వేదిక మీద వెనకగా ఉన్న ఫొటోలో చాచా నెహ్రూ నవ్వుతున్నాడు. ఫొటోకి ముందు పది కుర్చీలున్నై. గ్రామంలోని ముఖ్యులు వచ్చి ఆ కుర్చీల్లో కూర్చుంటారు. ఆ కుర్చీలముందు ఒక పెద్ద టేబుల్ ఉంది. దానిమీద మంచి రోజాపూల ప్లాస్టిక్ షీటు కప్పిఉంది. ఒక గాజు గ్లాసులోకొన్ని పూలు అందంగా అమర్చి ఉన్నై.
బడి అంతా పండుగ వాతావరణం నెలకొని ఉన్నది. క్రితం రోజున పట్నంలో కొనుక్కొచ్చి కట్టిన ప్లాస్టిక్ జెండాలు గాలికి ఊగుతూ వింతగా శబ్దం చేస్తున్నై. చెప్పినట్లుగా ఎనిమిది గంటలకల్లా వచ్చేసి, తరగతుల వారీగా వరసల్లో కూర్చున్నారు పిల్లలందరూ- వేదికకు ఎదురుగా.
కార్యక్రమాలు నడిపే పెద్దలంతా అటూ ఇటూ తిరుగుతూ హడావిడి చేస్తున్నారు. మైకులోదేశభక్తి గీతాలు- అవే తిప్పి తిప్పి వినిపిస్తున్నారు. సమయం పదిగంటలైంది. తొమ్మిదికే రావలసిన జిల్లా స్థాయి అధికారి గారు ఇంకా రాలేదు. ప్రధానోపాధ్యాయులవారు హడావిడిగా అందరికీ ఫోన్లు చేస్తున్నారు.
పిల్లలు కొంచెం అసహనంగానే ఉన్నారు. డ్రిల్ సారుకు క్రమశిక్షణ ఎక్కువ. ఒక్క పురుగును కూడా బయటికి పోనివ్వటం లేదు. ఎండ ఎక్కువైంది. పిల్లలకు దాహార్తీ ఎక్కువైంది. కార్యక్రమం ఇంకా మొదలే కాలేదు. అధికారి గారు రావాలి, ఊరి పెద్దలు రావాలి, అందరూ పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడాలి, ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, అప్పుడు గానీ తినేందుకు ఏమీ ఇవ్వరు. ఆ తర్వాతే, ఇంటికెళ్లటం...
నీళ్ళ పంపు దగ్గర రద్దీ పెరిగింది. తొక్కిసలాట మొదలైంది. డ్రిల్ సారు వచ్చి అందర్నీ తరిమేశారు అక్కడినుండి. కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రంగులు వేసుకున్న పిల్లల ముఖాలు వాడిపోయి ఉన్నై. ముఖాలమీద వాలే ఈగల్నీ, దోమల్నీ తోలుకోకుండా అలాగే భరిస్తున్నారు వాళ్ళు- మేకప్పులు పోతాయని. వరసల్లో పిల్లలు చాలామంది కడుపులు బిగబట్టుకొని కూర్చున్నారు. లేచి వెళ్దామంటే డ్రిల్ సారు ఏమంటారో అని భయం. బడిలో ఎలాగూ టాయిలెట్లు లేవు. ఇప్పుడు దూరం వెళ్లి రావాలంటే కుదిరేట్లు లేదు.. పదకొండైంది. కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు. అధికారి గారు రాలేదు. ఆకలౌతున్నట్లుంది పిల్లలకు. ఏమీ కాకనే నీరసించి పోయారు.
ఆదే సమయంలో- బడి బయట నలుగురు పిల్లలు- ఒక బర్రె చుట్టూ చేరి సందడి చేస్తున్నారు. నలుగురికీ చొక్కాలు లేవు. వాటిని విప్పి తలకు చుట్టుకొని ఉన్నారు. ఒకడు బర్రెమీద ఎక్కి అటూ ఇటూ కాళ్ళు వేసుకొని, దాన్ని పట్టుకొని, గుర్రం తోలినట్లు 'చల్! చల్!' అంటున్నాడు. మరొకడు దాని కొమ్ములకు రంగు కాయితాలు అంటిస్తున్నాడు. మిగిలినవాళ్లు ఇద్దరూ బర్రెకు నీళ్లు పోస్తున్నారు సంతోషంగా. వీళ్ల సేవలందుకుంటూ అది కదలకుండా నిలబడి, తృప్తిగా చూస్తున్నది.
"ఒరేయ్! మనం ఇయాల్ల బడికి బోలేదని డ్రిల్ సారు కొడితే యలాగా?" అన్నాడు వాళ్ళలోఒకడు. "లేయ్! ఇయాల్ల బాలల దినోస్తవం. మన్నల్నెవ్వరూ యేమీ అనరు!" అంటున్నాడు మరొకడు, ధీమాగా.