Facebook Twitter
జింక చాతుర్యం

జింక చాతుర్యం

 


అనగా అనగా ఒక అడవిలో జింక ఒకటి ఉండేది. అది చాలా మంచిది, బాగా తెలివైనది కూడా. ఎవరితోటైనా చక్కగా, మర్యాదగా మాట్లాడి వాళ్లని మెప్పించేది. దాని మాట తీరు బాగుండటం వల్ల, అడవిలో ఉండే చాలా జంతువులు దానికి స్నేహితులైనాయి. అయితే కష్టాలు ఎవరికైనా రావచ్చు కదా, ఒక రోజున ఆ జింక ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకున్నది. వేటగాడు వచ్చి, దాన్ని చూసి చాలా సంతోష పడ్డాడు. "ఆహా! ఎంత మంచి జింక పట్టుబడింది! దీన్ని అమ్మితే నాకు చాలా డబ్బులు వస్తాయి" అనుకొని, అతను దాన్ని వలతో‌ సహా తన ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పటికి బాగా సాయంత్రం అయింది. చీకటి పడబోతున్నది. దాంతో అతను దాన్ని వలలోనుండి తీయకనే తన ఇంటి బయట ఉన్న పూరిపాకలో‌ పడేసి, పాకకు గట్టి తాళం వేసి తను వంట పనిలో మునిగాడు. జింక దు:ఖం‌ రెట్టింపు అయ్యింది. అది తన కష్టాల్ని తలచుకుంటూ.


కాపాడండి కాపాడండి - కాపాడండి ఎవరైనా వలలోనుండి తప్పించండి.. మీ మేలు ఇక మరువనండి.. అని పాడటం మొదలెట్టింది బాధగా. అంతలో అటుగా వెళ్తున్న ఎలుక ఒకటి జింక పాటను విని, దాని దగ్గరికి వచ్చింది. సంగతి తెలుసుకొని, రాత్రంతా శ్రమపడి వలను కొరికి ముక్కలు చేసి, జింకను బయటికి లాగింది. జింకకు ప్రాణం లేచి వచ్చింది. దానికి ధన్యవాదాలు చెప్పుకున్నది. అయితే మూసి ఉన్న తలుపులోంచి బయటికి పోలేదు కదా, అందుకని అది తలుపుకు ఒక ప్రక్కగా నిలబడి, వేటగాడు తలుపు తీయటం కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది. అది వలలోంచి తప్పించుకొని ఉంటుందని ఊహించని వేటగాడు ఉషారుగా ఈల వేసుకుంటూ గడియ తీసాడు. అంతలోనే జింక గబుక్కున ముందుకు దూకి, అతన్ని పక్కకు నెట్టి తప్పించుకొని, చకచకా అడవిలోకి పరుగు తీసింది!

 


వేటగాడు కొంతసేపు దాని వెంట పరుగెత్తాడు- అయినా దాన్ని అందుకోలేక నిరాశగా వెనుతిరిగాడు. 
ఎంత వేటగాడినుండి తప్పించుకున్నా, ఈ క్రమంలో జింక మనసు బాగా గాయపడింది. అదిప్పుడు చాలా పిరికిగానూ, అన్నిటికీ ఇతరుల మీద ఆధార పడేదిగాను తయారైంది. అట్లా భయం భయంగా తింటుంటే గడ్డి ఎందుకు ఒంట పడుతుంది? అందుకని అది రాను రాను సన్నగా, బలహీనంగా తయారవ్వసాగింది. అంతే కాదు, దాని మాట తీరు కూడా మారింది. ఇంతకుముందు లాగా అది అందరినీ ఉత్సాహంగా పలకరించటం లేదు.


ఎవరిని చూసినా, "నీకు ఇవాళ్ళ వేటగాడు ఏమైనా కనిపించాడా?" అని అడగటం మొదలు పెట్టిందది. దాంతో అడవిలోని మిగతా జంతువులు కూడా దానిని తప్పించుకు తిరగటం మొదలు పెట్టాయి. అంతలోనే దానికి ఇంకోసారి వేటగాడు ఎదురయ్యాడు! అయితే ఆ రోజున వాడు వెనక్కి తిరిగి ఉన్నాడు- జింకని గమనించలేదు. జింక మెల్లగా వెనక్కి తిరిగి, నాలుగైదు అడుగులు వేసి, తర్వాత తోచిన దిక్కుకు పరుగు పెట్టింది. అల్లంత దూరాన దానికి ఒక ఏనుగు కనబడింది- జింక దాని దగ్గరికి పోయి "వేటగాడు!‌ వేటగాడు! వస్తున్నాడు! నన్ను కాపాడు!" అని మొరపెట్టుకున్నది. ఏనుగు దానికేసి చూసి, "అయ్యో! జింకా!‌ నాకు ఇప్పుడు చాలా పని ఉంది. నువ్వు కోతి దగ్గరకు వెళ్ళరాదూ?!" అన్నది.


జింక గబగబా కోతి దగ్గరకు వెళ్ళి, "వేటగాడు తిరుగుతున్నాడు అడవిలో! నన్ను కాపాడు, ప్లీజ్" అంది. కోతి ముఖం చిట్లించుకొని- 'ఎక్కడు-న్నాడు?' అన్నది. 'అదిగో ఆ వంక అవతల ఉన్నాడు. అటుతిరిగి ఉన్నాడు. నన్ను చూడలేదు వాడు" అంది జింక. "మరింకేమి భయం?" అంది కోతి "నాకు చాలా ఆకలిగా ఉంది. ఆహారం వెతుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు ఏమీ భయపడకు. అంతగా ఐతే కుందేలు దగ్గరకు వెళ్లు!" అంటూ. వెంటనే జింక కుందేలు దగ్గరకు పరుగెత్తింది. "నన్ను కాపాడు! వేటగాడు వచ్చేస్తున్నాడు" అన్నది.

 


"ఎక్కడ? ఎక్కడ?" అని హడావిడి పడిన కుందేలు, "వంక అవతల" అని తెలియగానే నవ్వేసి, ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నది. జింకకు ఇక ఏం చేయాలో తోచలేదు. అంతలో దానికి వేటగాడి అడుగుల శబ్దం వినబడింది. దూరంనుండి వాడు తనవైపుకే వస్తున్నాడు! దానికి చాలా భయం వేసి, చుట్టూ వెతుక్కున్నది. ఒక వైపున పెద్ద పొదలు కనిపించాయి దానికి. అది చటుక్కున వెళ్ళి ఆ పొదల్లో‌ నక్కింది. చెవులు నిక్కించి శబ్దాలను వినసాగింది. ఏ మాత్రం అలికిడైనా వెనక్కి తిరిగి పారిపోయేందుకు సిద్ధంగా ఉంది...


కొంచెంసేపట్లో వేటగాడు వచ్చాడు అటువైపు. అయితే అతనికి అక్కడ ఏ జంతువులూ కనబడలేదు. దాంతో అతను అట్లాగే ముందుకు వెళ్ళిపోయాడు! అతను వెళ్ళిపోయాక పది నిముషాలవరకూ ఊపిరి బిగబట్టుకొని కూర్చున్న జింక, ఆ తర్వాత బయటికి వచ్చి తన ఇంటి వైపుకు పరుగు పెట్టింది. అయితే ఆ అనుభవంతో దానికి పట్టుకున్న భయం వదిలింది. దాంతోబాటు ఇంకో సంగతి కూడా అర్థమైంది: "అవసరార్థం ఇంకోళ్లను నమ్ముకోకూడదు. వీలైనంత వరకూ తెలివితేటలను ఉపయోగించి మన పనిని మనమే చేసుకోవాలి. ఎప్పుడూ ఇంకోళ్ళమీద ఆధారపడితే కష్టం" అని. 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో