TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
తల్లి కోడి
అనగనగా ఒక అడవిలో ఒక కోడి ఉండేది. అడవి అవతల ఉన్న ఊళ్లోకి వెళ్ళి, ప్రతి రోజూ అక్కడ పడేసిన గింజలు తిని బ్రతికేది అది. కొన్ని రోజులకు అది మూడు గుడ్లు పెట్టింది. అవి మామూలు సైజు కంటే చాలా పెద్దగా ఉండినై. కోడి ఆ గుడ్ల మీద కూర్చొని జాగ్రత్తగా పొదుగుతూ ఉంటే అవి కూడా రోజు రోజుకూ పెద్దవౌతూ పోయినై. అట్లా పది నెలలు గడిచాక, వాటిలోంచి ముగ్గురు ఆడపిల్లలు బయటికి వచ్చారు! కోడి ఎంతో ప్రేమతో వాళ్లని పెంచి పెద్ద చేసింది. రకరకాల పనులు, విద్యలు నేర్పింది. వాళ్లు ఉండేందుకు ఊళ్ళో ఒక పెంకుల ఇల్లు కూడా కట్టింది. కొన్నాళ్లకు వాళ్ళు ముగ్గురూ పెద్దయ్యారు. చాలా అందంగా, దేవకన్యల్లాగా అయినారు. ఒక రోజున ఊళ్లో ఒక పండుగ జరుగుతోంది. కోడి తల్లి ఆ అమ్మాయిలతో అంది "మీరు అడవిలో ఉన్న కొలనులోంచి నీళ్ళు తీసుకు రండి; నేను రాగానే అందరం కలిసి పూజ చేసుకుందాం" అని. అమ్మాయిలు ముగ్గురూ మూడు కడవలు పట్టుకొని పోగానే, తను సామానుల కోసం ఊళ్ళోకి పోయింది.
ఆ రోజున ఊళ్ళో జాతర చూసేందుకు రాజుగారి కొడుకులు ముగ్గురు వచ్చారు. ఇంకా సమయం ఉంది కదా అని ముగ్గురూ గుర్రాలెక్కి అడవిలో వేటకు వెళ్ళారు. అయితే ఎంత తిరిగినా వాళ్లకు అక్కడ ఒక్క జంతువు కూడా కనిపించలేదు. చివరికి వాళ్ళు బాగా అలసిపోయారు; విపరీతంగా దాహమైంది. "కొలను ఎక్కడ?" అని వెతుక్కుంటూ పోయారు వాళ్ళు. వాళ్ళు సరిగ్గా కొలను చేరే సమయానికి ఈ అమ్మాయిలు ముగ్గురూ కడవలు ఎత్తుకొని ఎదురయ్యారు వాళ్లకి. "అమ్మాయిలూ, మేం ఈ ఊరి రాజకుమారులం. బాగా దాహం వేస్తోంది. ఇన్ని నీళ్ళు పోస్తారా?" అన్నారు వాళ్లతో. వాళ్లని చూడగానే ముగ్గురు అమ్మాయిలకూ వాళ్లంటే జాలి పుట్టింది. ఇంటికోసం తీసుకెళ్తున్న నీళ్ళను వాళ్ళకు పోసారు.
ఆ సమయంలో వాళ్లని గమనించిన రాజకుమారులు "అబ్బ! వీళ్లెవరో మామూలు అమ్మాయిలు కాదు! దేవకన్యలే అయిఉంటారు! వీళ్లని పెళ్ళి చేసుకోవాలి" అనుకున్నారు. అమ్మాయిలు కూడా వాళ్లను చూసి ఇష్టపడ్డారు. "మా అమ్మని అడిగి చెబుతాం" అన్నారు. "అయితే సరే, మేం మీరు సరేననటం కోసం ఎదురు చూస్తుంటాం" అన్నారు రాజకుమారులు. అమ్మాయిలు ఇంటికొచ్చి తల్లిని అడిగారు: "అమ్మా! వీళ్ళు మాకు బలే నచ్చారు; పెళ్ళి చేసుకుంటాం" అని. "మంచిదే అమ్మాయిలూ!" అంది తల్లికోడి- "అయితే వాళ్ళేమో రాజకుమారులు! మీరేమో మామూలు కోడి పిల్లలు. వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారో లేదో, చూసుకోండి. నిజంగా ఇష్టం ఉంటే చేసుకోండి. అయితే వాళ్ల వాళ్ళకు నేను కనబడితే మటుకు మీ సంబంధం కలవదు. అందుకని నేను మీ పెళ్ళికి రాను. ఎవరైనా అడిగితే మీ అమ్మ ఎక్కడికో వెళ్ళిందని చెప్పండి" అన్నది.
పెద్ద అమ్మాయిలు ఇద్దరూ రాజకుమారులకు కోడి చెప్పమన్నట్టే చెప్పారు. వాళ్ళిద్దరూ వాళ్లని పెళ్ళి చేసుకునేందుకు ఒప్పుకున్నారు. కానీ మూడో అమ్మాయి మాత్రం 'మా అమ్మ ఒక మామూలు కోడి. అందుకని పెళ్ళికి రాదు" అని నిజం చెప్పేసింది తన కాబోయే మొగునికి. అయినా అతను కూడా "ఏమీ పర్లేదు" అనేసాడు. వెంటనే మూడు జంటల పెళ్ళిళ్ళు కూడా జరిగిపోయాయి. 'ఇక వాళ్లంతా భర్తలతో బాటు బయలుదేరతారు' అనగా తల్లికోడి వాళ్ళు ముగ్గురికీ మూడు సంచుల్లోకి కొన్ని గింజలు వేసి ఇచ్చింది. ఆ సంచులకు క్రింద వాళ్లకు తెలీకుండానే చిన్న రంద్రం పెట్టింది.
రాజకుమారులు వాళ్లని తీసుకొని గుర్రాల మీద బయలుదేరారు. తల్లి ఇచ్చిన గింజల సంచీలు అమ్మాయిల చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళు వేగంగా పోతుంటే, సంచిలోని గింజలు కూడా ఒకొక్కటీ క్రిందికి జారి పడుతూ పోయాయి. అట్లా కలిసి కొంత దూరం పోయి, ఆ తర్వాత ఒక్కొక్క రాజకుమారుడూ ఒక్కో దిక్కుకు వెళ్ళిపోయారు. రోజులు, నెలకు గడిచాయి. తల్లికోడికి పిల్లలు గుర్తుకొస్తున్నారు. వాళ్ళు ఎట్లా ఉన్నారో అని ఆదుర్దా ఎక్కువైంది. వర్షం ఎప్పుడు పడుతుందా, విత్తనాలు ఎప్పుడు మొలకెత్తుతాయా అని చూస్తూ ఉండింది. చూస్తూండగానే వానాకాలం వచ్చింది. రాత్రి పెద్ద వర్షం పడింది. ఆ తల్లి గుండె నిబ్బరం అయింది. ప్రొద్దున్నే బయటకి వచ్చి చూస్తే గింజలన్నీ మొలకెత్తి ఉన్నాయి!
కోడి ఎగిరి గంతేసి, ఆ మొలకల్నే వెంబడించుకుంటూ పోయింది. అట్లా పోయి పోయి, ముందు పెద్ద కూతురు దగ్గరికి చేరుకున్నది. పెద్ద కూతురు ఉండేది చాలా పెద్ద భవంతి. "ఎట్లా చెయ్యాలి?!" అని ఆలోచించి కోడి మెల్లగా పోయి, భయపడుతూనే తలుపు తట్టింది. "ఎవరు, తలుపు కొట్టారు?" అని ఆ పెద్దకూతురు వచ్చి చుట్టూ చూసింది. ఆమె చాలా నగలు, నాణ్యాలు అన్నీ చాలా ఒంటినిండా వేసుకొని ఉండింది. "నేనేనే! బాగున్నారా, మీరు?" అంది తల్లి కోడి సంతోషంగా.
అప్పుడు ఆ పిల్ల క్రిందికి చూసి, "నువ్వా?! నువ్వెందుకు వచ్చావు?!" అని అడిగింది చికాకుగా. అప్పుడు తల్లి కోడి నిర్ఘాంతపోయి "ఏంటమ్మా, ఇలా అంటావు?! నేను మీ అమ్మను గదా?!" అన్నది. "బానే ఉంది! 'మా అమ్మ ఒక పనికిరాని కోడి' అని తెలిస్తే మా ఆయన నన్ను గెంటేస్తాడు. ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో!" అని ప్రక్కనే ఉన్న కట్టె తీసుకొని రెక్కకు విసిరింది బిడ్డ. అంతే తల్లికోడి రెక్క కాస్తా విరిగి పోయింది, ఆమె మనసుతో పాటు. ఇంక అలాగే ఆ రెక్కను ఈడ్చుకుంటూ రెండవ కూతురు దగ్గరికి పోయి, ఆమె ఇంటి తలుపు తట్టింది. ఆ సమయానికి ఆమె చపాతీలు తిక్కుతున్నది. తలుపు కొడితే పని ఆపి వచ్చి తలుపు తీసి, ఆమె కూడా పైపైకే చూసింది- "ఎవరు, తలుపు కొట్టారు?" అనుకుంటూ.
తల్లి కోడికి ప్రేమ పొంగుకొచ్చింది. "బాగున్నావానే? నేనే, తలుపు కొట్టింది!" అన్నది. ఆమె చటుక్కున క్రిందికి చూసి "నువ్వా?! నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేనేదో బాగా కాపురం చేసుకుంటుంటే మధ్యలో నువ్వొచ్చావు నా ప్రాణానికి ముందు ఇక్కడి నుండి పోతావా, లేదా?" అని చపాతీ కర్రను కోడి మీదికి విసిరింది. ఆ దెబ్బకు కోడి రెండవరెక్క కూడా విరిగిపోయింది.
తల్లి మళ్ళీ రోడ్డు మీద పడింది. మూడవ కూతురు దగ్గరికి వెళ్తే 'ఇంక మిగిలి ఉన్న ప్రాణం కూడా పోతుందేమో' అనుకున్నది. మళ్ళీ "పోతే పోయింది పాడు ప్రాణం. బిడ్డ చేతిలోనే పోనీ" అనుకొని, దేకుకుంటూ చిన్న కూతురు ఇల్లు చేరుకొని తలుపు తట్టింది. చిన్న కూతురు వచ్చి క్రిందికి చూస్తే రక్తం ఓడుతూ ఉన్నది వాళ్ల అమ్మ! అట్లా వాళ్ల అమ్మను చూసే సరికి ఆ బిడ్డకు ఏడుపొచ్చింది. వెంటనే తల్లికోడిని చేతిలోకి తీసుకొని "ఏమయిందమ్మా?!" అని అడిగింది.
తల్లికోడి జరిగిందంతా చెప్పింది. వెంటనే ఆమె ఆ గాయాలను శుభ్రం చేసి, రెక్కలకు మందువేసి, గుడ్డతో కట్టి, తినేందుకు గింజలు పెట్టింది. 'అప్పటికే బాగా అలసిపోయిన కోడి అమెను ఆశీర్వదించి, గింజలు తిని, కొంచెంసేపటికి అట్లానే తలవాల్చేసింది ! ఆ కూతురు పాపం బాధతో ఏడ్చి ఏడ్చి వేసింది. అంతలోనే ఇంక భర్త వచ్చే సమయం అవుతున్నది. మూడో కూతురు లేచి వాళ్ల అమ్మను ఓ అట్టపెట్టెలో జాగ్రత్తగా పడుకోబెట్టి, మూత వేసి కట్టేసి, ఏడ్చుకుంటూనే పైన అటక మీద పెట్టింది. ఆ వెంటనే కళ్ళ నీళ్ళు తుడుచుకొని మామూలుగా కూర్చున్నది. కొద్ది సేపటికి భర్త వచ్చాడు. "ఏంటి ఈమె ఇట్లా ఉంది ఈ రోజు?!" అనుకున్నాడు. అయినా ఏమీ అనకుండా అన్నం తిని, మంచం వేసుకొని పడుకొని, అలా పైకి చూశాడు. అటకమీద కొత్త పెట్టె కనబడింది- భార్యను పిల్చి "అందులో ఏముంది?" అని అడిగాడు.
అకస్మాత్తుగా అడిగే సరికి ఆమెకి ఏం చెప్పాలో తెలీక "మా అమ్మ వచ్చిందండి-ఏవో తిండి వంటకాలు చేసిందట, ఇచ్చి వెళ్లింది" అని చెప్పేసింది. "అవునా?! ఎప్పుడు వచ్చారు?! మళ్ళీ అప్పుడే ఎందుకు వెళ్ళిపోయారు? అయ్యో, పెట్టెని పైన పెడితే ఇంక వంటలు మనం తింటామా?! దాన్ని దింపుతాను ఆగు- ఏమైనా తిందాం" అని ఆమె ఎంత వద్దంటున్నా వినకుండా పైకెక్కి, పెట్టెను క్రింది దింపాడు రాజకుమారుడు. అమె భయపడుతూనే పెట్టెను తెరిచింది. చూస్తే అందులో తల్లికోడి లేదు- దాని నిండా వజ్రాలు, రత్నమాణిక్యాలు, వెండి, బంగారం"!
ఇద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. "మీ అమ్మా వాళ్ళు ఇంత ధనవంతులా?" అని అడిగాడు రాజకుమారుడు. "ఏమీ లేదు. మా అమ్మ పాపం చాలా పేద కోడి, చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. ఇప్పుడు ఇంత సంపద మరి ఎట్లా వచ్చిందో తెలీదు!" అన్నది మూడో కూతురు. అప్పుడు రాజకుమారుడు "చూడు, ఈ వయసులో మీ అమ్మ అంత కష్టపడి సంపాదించి మనకు తెచ్చి పెడుతుంటే ఏం బాగుంది? ఇంత వరకూ మనం మీ అమ్మ వాళ్ళింటికి వెళ్ళలేదు కదా; ఇప్పుడు వెళ్దాం, బయల్దేరు" అన్నాడు. ఆమె కళ్ళ నీళ్ళు పెట్టుకొనే "ఎందుకండీ?! చాలా దూరం! మరెప్పుడైనా వెళ్దాం" అన్నది గాని భర్త ఒప్పుకోలేదు. చివరికి ఆమెకు సరేననక తప్పలేదు.
ఇంక ఇద్దరూ తినేందుకు అన్నం కట్టుకొని గుర్రం మీద అట్లా పోసాగారు. అట్లా ఒక రోజంతా ప్రయాణం చేశారు కానీ వాళ్ల ఇల్లు ఇంకా రాలేదు. భర్త ఎంత అడిగినా, భార్య "ఇంకా పోవాలి" అంటూనే ఉంది. చివరికి ఇంక సాయంత్రం అవుతుండగా "ఇంక పోలేను. అలసి పోయాను" అన్నాడు రాజకుమారుడు. సరే అని ఇద్దరూ అక్కడ అడవిలోనే ఓ చెట్టు నీడనే గుర్రం ఆపుకొని విశ్రాంతిగా కూర్చున్నారు. రాజకుమారుడికి కొంచెం నిద్రపట్టింది; కానీ భార్య మాత్రం అట్లాగే కూర్చొని ఉంది. భయంతో ఆమెకు చెమటలు పట్టి, బొట్లు బొట్లు గా క్రిందికి కారుతున్నాయి.
ఆ చెట్టు క్రిందే పాము పుట్ట ఒకటి ఉంది. అందులో ఒక పాము. కొంత కాలంగా దానికి వీపు మీద ఒక గుల్ల లేచి, చాలా మండుతోంది. ఏ పనీ చేయనివ్వట్లేదు. అయితే ఈమె చెమట కారి, ఆ పాము గాయం మీద పడగానే ఆ పాముకి ఎంత చల్లగా అనిపించిందంటే, క్షణంలో అది తన బాధనంతా మర్చిపోయింది. దానికి ఈ మూడోకూతురు మీద చాలా గౌరవం కలిగింది. దాంతో అది పుట్టలోంచి బయటికి వచ్చి, ఆమెకు మ్రొక్కి, తన సంగతంతా చెప్పి, "తల్లీ! నీకు ఏం సాయం కావాలన్నా చేయగలను. చూస్తే నువ్వేదో అవసరం మీద పోతున్నట్లు ఉన్నావు. ఎందుకు, ఈ అడవి దారి పట్టావు?" అని అడిగింది.
అమె చెప్పింది విని, పాము బాధపడి "ఏమీ పర్లేదు తల్లీ! నీ కోరిక తీరుతుంది. నా బలంతో ఒక ఊరు సృష్టిస్తాను. మీరు ఇద్దరూ అక్కడ మీకు ఇష్టమైనన్ని రోజులు ఉండచ్చు. మేం అందరం నీకు అనుకూలంగా ఉంటాం.." అని ధైర్యం చెప్పింది. కొద్ది సేపటికి రాజకుమారుడు నిద్రలేచి, మళ్ళీ ప్రయాణానికి నడుం కట్టాడు. "ఇంకా ఎంత దూరం?" అని అడిగితే, "అదిగో- ఆ కనిపించే ఊరే, మా ఊరు!" అని చెప్పింది భార్య. వాళ్ళు అక్కడికి చేరుకునే సరికి, ఆ నగరం అంతా వెండి బంగారాలతో, ధగధగా మెరిసిపోయే పెద్ద పెద్ద భవనాలతో, చక్కని ఉద్యానవనాలతో బలే ఉన్నది. ఊళ్ళోవాళ్ళు కూడా అందరూ వాళ్లని "అక్కా! బాగున్నారా?! బావా, ఎంత కాలానికి వచ్చారు!" అంటూ ప్రేమగా పలకరించారు.
"మీ ఇంటి తాళాలు ఇవిగో, మీ అమ్మ వీటిని మాకు అప్పగించి పోయింది. ఒక చోట ఉండదు కద!" అంటూ ఓ పెద్ద భవంతి తెరిచి ఇచ్చారు కూడా. భార్యాభర్తలు ఇద్దరూ అక్కడే రకరకాల వంటలు తింటూ కొన్ని రోజులు గడిపారు. "ఇంక వెళ్ళొస్తాం! చాలా రోజులైంది" అని అందరికీ వీడ్కోలు చెప్పి, బయలు దేరారు. వాళ్ళు అట్లా గుర్రం ఎక్కి కొంత దూరం వెళ్ళారో-లేదో, ఆ ఊరు ఊరంతా మాయమైపోయింది! అటుపైన రాజకుమారుడికి సంగతంతా అర్థమైంది: 'ఈమె నిజంగానే ఎవరో దేవకన్య. దేవకన్యలకు అమ్మానాన్నలు ఎందుకుంటారు?' అని అతను మరెన్నడూ ఆమెని తమ ఊరికి తీసుకెళ్ళమని బలవంతపెట్టలేదు. ఇంక వాళ్ళిద్దరూ సిరి సంపదలతో సుఖంగా జీవించారు.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో