Facebook Twitter
అనుకున్నదొకటి

అనుకున్నదొకటి!

 

 

అనగనగా ఒక కుక్క ఉండేది. అది చాలా తుంటరిది. ఒకనాడు ఆ కుక్క ఒక తోకను చూసింది. అది ఆ తోకను ’ఎలుక తోక’ అనుకుంది. అనుకోవటం ఆలస్యం, వెళ్ళి ఆ తోకను పట్టుకోబోయింది; కానీ దాని అడుగుల శబ్దం విని ఎలుక తొర్ర లోపలికి పారిపోయింది.

 

కొన్నిరోజులకు ఆ కుక్కకు ఇంకో తోక కనబడింది. అది ఒక ఉడతది. కుక్కకు నోరూరింది. ఉడత తోక కోసం పైకెగిరింది. అమ్మా! ఉడత అంత సులువుగా దొరికేదేనా? -అది కూడా తప్పించుకుంది. చేసేదిలేక కుక్క ఊరుకున్నది.

 

ఒకసారి కుక్క ఊరి బయటికి పోయింది. అక్కడున్న పొదలలో దానికి ఇంకొక తోక కనిపించింది! కుక్క మెల్లగా నక్కి నక్కి వెళ్ళి ఆ తోకను పట్టుకోబోయింది. కొంచెంగా పట్టుకున్నది కూడాను. కానీ పొదలో ఉన్న నక్క శక్తి కొద్దీ తోకను వెనక్కి లాక్కుని పారిపోయింది. నోటచిక్కిన తోకను కోల్పోయినట్లయింది కుక్కకు. కానీ పాపం, ఏం చేయగలదు? అక్కడినుండి మెల్లగా వెనుదిరిగింది.

 

మరొకనాడు కుక్క ఒక అడవికి పోయింది. అక్కడకూడా, కుక్కకు ఒక తోక కనబడింది-రెండు రాళ్ల సందున. ఆసరికి తోకల వేట అలవాటయింది కుక్కకు. ఈసారైనా తోకను వదలకూడదనుకున్నది. ఒక్క ఉదుటున ఎగిరి తోకను నోట చిక్కించుకున్నది. తన తోక ఎక్కడుందో, ఏమైపోతోందో అర్థం కాలేదు, గాఢ నిద్రనుండి అకస్మాత్తుగా మేలుకున్న పులికి. అది వెంటనే అడవంతా దద్దరిల్లేలా గర్జించింది.

 

ఊహించని పరిణామానికి ఉలిక్కిపడిన కుక్క, తోకను వదిలి, వెనక్కుచూడకుండా,...... ఏం చేసిందంటారు?......ఆ ..కరెక్టే... సరిగ్గా అదే చేసింది- తోక ముడుచుకొని పరుగెత్తింది! 

 

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో