Facebook Twitter
నీతి చంద్రిక

నీతి చంద్రిక

 


 

గంగా నది ఒడ్డున పాటలీ పుత్రం అనే పట్టణం ఒకటి ఉండేది. అది సర్వ సంపదలతో తులతూగుతుండేది. ఆ పట్టణాన్ని సుదర్శనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు ఒకనాడు వినోదంకోసం పండితులతో శాస్త్ర చర్చలు చేస్తూ ఉండగా, సందర్భవశాత్తు ఎవరో రెండు పద్యాలు చెప్పారు:

"యౌవనము, సంపద, అధికారము, తెలియనితనము అన్న ఈ నాలుగింటిలో ఏ ఒక్కటైనా చాలు, కష్టాలు కొనితెచ్చేందుకు. మరి, ఈ నాలుగూ ఒక్కచోట చేరాయంటే, ఇక ఏం చెప్పాలి?" అనీ,

"అనేక సందేహాలను పోగొట్టేదీ, తెలియని వస్తువుల స్వభావాలనూ తెలియపరచేదీ, మనుష్యులకు చూపువంటిదీ చదువే. అది ఎవ్వరికి అలవడదో, అట్లాంటి వాడు గుడ్డివాడితో సమానం" అనీ వాటి భావం.

ఆ పద్యాలు వినగానే, రాజుకు తన కొడుకులు గుర్తుకు వచ్చారు. వాళ్ళు నలుగురూ చదువులేక, మూర్ఖులై, కేవలం ఆటల పట్ల ఆసక్తితో, ఊరికే తిరుగుతున్నారు. రాజుగారు వాళ్ళను తలచుకొని, "అయ్యో! తల్లిదండ్రులు చెప్పినట్లు విని, చదువుకొని, అందరిచేతా మంచివాడు అనిపించుకున్నవాడే కొడుకు అవుతాడు గానీ, అలాకానివాడు కొడుకు అనిపించుకుంటాడా అసలు? మూర్ఖుడు తల్లిదండ్రులకు బరువై వాళ్ళకు ఎల్లకాలమూ దు:ఖం కల్గిస్తుంటాడు. అట్లాంటివాడు చచ్చిపోతే, తల్లిదండ్రులకు ఆనాటినుండీ బరువు తగ్గి, దు:ఖం తీరుతున్నది. వంశానికి మంచిపేరు తెచ్చినవాడే కొడుకు- తల్లి కడుపున చెడబుట్టిన వాడు అసలు కొడుకే కాడు. మంచివాడు కాని కొడుకును కన్న తల్లిని అసలు తల్లి అనచ్చా? మంచి గుణాలు కల కొడుకు ఒక్కడు చాలు- మూర్ఖులైన కుమారులు వందమంది ఉండీ ఏమి ప్రయోజనం? ఒక్క రత్నంతో గంపెడు గులకరాళ్ళైనా సరిపోలవు. 'విద్యావంతులు, సద్గుణవంతులు అయిన కొడుకులను చూసి సంతోషించటం' అనే భాగ్యం అందరికీ లభించదు- దానికోసం చాలా పుణ్యం చేసుకోవాలి కాబోలు!" అనుకున్నాడు.

ఇలా ఆయన ఇంకొంత ఆలోచించి, విచారంగా తల ఊపుతూ "నేను ఊరికే ఇలా ఎందుకు బాధపడుతున్నాను? నా కొడుకులేమైనా 'చదవము' అని మొండికేశారా? ఏంచేస్తున్నారోనన్న సరైన ఆలోచనలేక, నేనే కదా, వాళ్లను సరిగ్గా చదివించనిది? పిల్లల్ని చదివించకపోవటం తల్లిదండ్రుల తప్పు. తల్లిదండ్రులు సరిగా శిక్షణనివ్వటం వల్ల పిల్లలు పండితులౌతారు తప్ప, పుట్టగానే ఎవ్వరూ పండితులు అవ్వరు. మానవప్రయత్నం వల్లనే పనులు సమకూరతాయి- ఒట్టి కోరికలవల్ల ఏమీ ఒరగదు. నిద్రపోయే సింహం నోట్లోకి జంతువులు తమంత తాము వచ్చి చేరవు. కాబట్టి, కనీసంఇప్పుడైనా నా కొడుకుల విద్యాభ్యాసానికి తగిన ఏర్పాట్లు చేయాలి" అనుకొని, అక్కడ సమావేశమైన పండితులను- " నా కొడుకులు చదువుకోక, ఆటపాటల్లో వృధాగా కాలం వెళ్లబుచ్చుతున్నారు. మీలో ఎవరైనా వాళ్లకు నీతిశాస్త్రం బోధించి, వాళ్లను మంచిదారికి మరల్చగలరా?" అని అడిగాడు.

ఆ సమయంలో విష్ణుశర్మ అనే పండితుడు అక్కడే ఉన్నాడు. ఆయన ముందుకు వచ్చి, "మహారాజా! ఇది ఎంతపాటి పని? మీవంటి గొప్ప మహారాజుల వంశంలో పుట్టిన పిల్లలను నీతివేత్తలుగా చేయటం అసలు కష్టం కానేకాదు. కొంగను మాట్లాడించటం కష్టం - కానీ, చిలుకను మాట్లాడించటం ఏమంత కష్టం? మంచి వంశంలో సుగుణాలు లేనివాడు పుట్టడు. విలువైన మాణిక్యాలు పుట్టే గనిలో గాజు పుడుతుందా? ఎంతటి రత్నమైనా సాన పట్టనిదే ప్రకాశించదు. అదే విధంగా పిల్లవాడు ఎంతటి ఘనుడైనా సరే, గురువుల శిక్షణ లేనిదే వెలుగొందలేడు. కాబట్టి నేను ఆరు నెలల్లో రాజకుమారులను నీతికోవిదులుగా చేసి తమకు సమర్పిస్తాను" అన్నాడు.

రాజుగారు చాలా సంతోషించి "పువ్వులతో కలిసి ఉన్న నారకు సువాసన అబ్బినట్లు, సజ్జనులతో సహవాసం చేయటంవల్ల మూర్ఖుడికి కూడా సహజంగానే మంచి గుణాలు సంక్రమిస్తాయి. అంతేకాదు, మంచివాళ్ల సాంగత్యం వల్ల అంతా శుభమే కల్గుతుంది." అని గౌరవంగా పలికి, ఆయనకు బస, ధనం ఇప్పించారు. ఆపైన తన కుమారులను పిలిపించి విష్ణుశర్మకు పరిచయం చేస్తూ, "చదువు అనే సువాసన అంటక, వీళ్ళు నలుగురూ పుట్టు గుడ్డివాళ్ళ లాగా ఉన్నారు. వీళ్ళకు చూపు తెప్పించి కాపాడే భారం మీదే" అని, వారిని ఆయనకు అప్పగించారు.

 

 

ఆ తరువాత ఆ పండితుడు వాళ్లను అందమైన ఒక భవనానికి తీసుకొనిపోయి, తన చుట్టూ కూర్చోబెట్టుకొని, "మీకు సంతోషం కలిగేటట్లు, ఒక కథ చెబుతాను. ఆ కథలో మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం అనే నాలుగు భాగాలుంటాయి, వినండి." అన్నాడు.


మిత్రలాభం:-
"సంపదను సాధించుకునే శక్తి తమకు లేకపోయినాకూడా, తెలివైనవాళ్ళు 'కాకి, తాబేలు, జింక, ఎలుక' మాదిరి, పరస్పర స్నేహం ద్వారా తమ పనులను చక్కబెట్టుకుంటారు-" అని విష్ణుశర్మ అనగానే, రాజకుమారులు "కాకి, తాబేలు, జింక, ఎలుక ఏ ఏ పనులను చక్కబెట్టుకున్నాయి? మాకు వివరంగా చెప్పండి" అన్నారు ఉత్సాహంగా. సంతోషించిన విష్ణుశర్మ ఇలా చెప్పటం మొదలు పెట్టాడు...

 


"గోదావరి ఒడ్డున గొప్ప బూరుగు చెట్టు ఒకటి ఉండేది. అనేక దిక్కులనుండి వచ్చిన రకరకాల పక్షులు రాత్రివేళల్లో ఆ చెట్టుని ఆశ్రయించుకొని ఉండేవి. ఒకరోజున, అప్పుడే తెల్లవారుతుందనగా,'లఘుపతనకం'అనే కాకి ఒకటి మేలుకుని, చెట్టునుండి క్రిందికి చూసింది. అక్కడ వేటగాడొకడు కనిపించాడు దానికి. పరమ భయంకరంగానూ, 'మరో యముడేమో' అనిపించేటట్లుగానూ ఉన్నాడు వాడు. అప్పుడది "అయ్యో! ప్రొద్దున్నే లేచి వీడి ముఖం చూశాను. ఇవాళ్ల ఏమి కీడు రాబోతున్నదో, తెలీదు. వీడు వచ్చినచోటున ఇక ఉండ కూడదు. ఆలస్యం చేయకుండా ఈ చోటును వదిలి పోవాలి"అ ని పారిపోయేందుకు ప్రయత్నం మొదలుపెట్టింది. ఆలోగా వేటగాడు ఆ చెట్టు సమీపంలో నేలమీద నూకలు చల్లి, వల పన్నాడు. తను పోయి, దగ్గరలోనే ఒక పొదలో దాక్కొని, పొంచి చూడసాగాడు.

ఆ సమయానికి, పావురాల గుంపొకటి ఆకాశంలో సంచరిస్తున్నది. వాటి రాజు చిత్రగ్రీవుడు నేలమీద చల్లిఉన్న నూకల్ని చూసి, తనతోటి పావురాళ్లతో ఇలా అన్నాడు- "జనాలెవ్వరూ సంచరించని ఈ అడవిలోకి నూకలు ఎలావచ్చాయి? మనం ఈ నూకలకు ఆశపడకూడదు. గతంలో బాటసారి ఒకడు ఒక బంగారు కంకణానికి ఆశపడి, పులిచేత చిక్కి మరణించాడు. మీకు ఆ కథ చెబుతాను, వినండి-

"ముసలి పులి ఒకటి, ఒకనాడు స్నానంచేసి, దర్భ గడ్డి పోచలు చేతబట్టుకొని, ఒక కొలను గట్టున కూర్చొని, దారిన పోయే వాడినొకడిని "ఓ! బాటసారీ! ఇదిగో, నాదగ్గర బంగారు కంకణం ఉన్నది, ఒకటి. రా! వచ్చి తీసుకో!" అని పిలిచింది.

 

 

ఆమాటలు విని, "నా అదృష్టం పండింది- కనుకనే ఇలాంటి గొప్ప అవకాశం నాకు ఎదురైంది. ఇందులో అనుమానించాల్సినదేమున్నది?" అనుకుని, బిగ్గరగా "ఏదీ, కంకణం చూపించు?" అన్నాడు బాటసారి. 
"ఇదిగో, బంగారు కంకణం, చూడు కావలిస్తే!" అని చేయి చాచింది పులి. "నువ్వు కౄరజంతువువు కదా, నిన్నెట్లా నమ్మేది?" అన్నాడు బాటసారి.

"ఒరేయ్, బాటసారీ! విను. ఇదివరకు, నా యౌవనంలో- నేను చాలా చెడ్డగా ఉండేదాన్ని. ఎన్నో ఆవులను, మనుషులను చంపి, లెక్కలేనంత పాపాన్ని మూట కట్టుకున్నాను. ఫలితంగా నా భార్యాపుత్రులను అందరినీ పోగొట్టుకొని ఏకాకిగా బ్రతకవలసి వచ్చింది. అప్పుడొక మహాత్ముడు నాపై దయ తలచి, "ఇకమీదట ఆవులనుగాని, మనుషులను గానీ చంపకు! మంచి పనులు చేయి!" అని చెప్పాడు. ఆనాటినుండి నేను చెడుపనులను మానివేసి, మంచి పనులే చేస్తున్నాను. అంతేకాక నేను ముసలిదాన్ని, బోసినోటిదాన్ని, గోళ్ళు పోయినై, శక్తిలేదు. నన్ను నువ్వెందుకు నమ్మవు? నువ్వు పేదవాడివిలా తోస్తున్నావు. అందుకనే నీకు దీన్ని దానం చేయబుద్ధయింది, నాకు. అందుకని, ఇక సందేహించకు. ఈ కొలనులో స్నానం చేసి రా, వచ్చి బంగారు కంకణాన్ని తీసుకో" అన్నది పులి.

ఆ బాటసారి దురాశకు లోనయ్యాడు. స్నానం చేసేందుకని గబగబా కొలనులోకి దిగబోయి, అక్కడ నడుములోతు వరకూ ఉన్న బురదలో కూరుకుపోయాడు. అప్పుడు పులి అతన్ని చూసి, "అయ్యయ్యో! పెద్ద ఊబిలోనే దిగబడ్డావు కదా!? నేను వచ్చి, నిన్ను లేవనెత్తి,రక్షిస్తానులే, భయపడకు!" అని మెల్లగా వాడి దగ్గరకు వచ్చి, వాడిని పట్టుకున్నది. వాడట్లా పులి చేత చిక్కి, "అయ్యో! కౄరజంతువును నమ్మకూడదు. నమ్మి, ఈ పరిస్థితిని కొనితెచ్చుకున్నాను. గడచిపోయినదానికి ఇప్పుడు బాధపడి మాత్రం ఏం లాభం? ఎవరికైనాగానీ తలరాతను తప్పించుకోవటం సాధ్యం కాదు" అని బాధపడుతూ పులికి ఆహారమయ్యాడు-

కాబట్టి, అన్ని విధాలుగానూ ఆలోచించిగానీ ఏ పనీ చేయకూడదు. చక్కగా ఆలోచించి చేసిన పనివల్ల ఎన్నటికీ కీడు కలుగదు." అని ముగించాడు పావురాల రాజు చిత్రగ్రీవుడు.