Facebook Twitter
ద్వారబంధ రహిత ముఖాని - [తలుపుల్లేని నోళ్ళు]

ద్వారబంధ రహిత ముఖాని - [తలుపుల్లేని నోళ్ళు]

 

 

       అప్పటికి ఇరవై మార్లు మోగింది సుశీలమ్మ మొబైల్ ఫోన్. ఇంకో ఇరవై మార్లు ల్యాండ్ ఫోన్ ,మెసేజస్ మరో ఇరవై. ఏంచేయాలో తెలీక హాలంతా అటూ ఇటూ తిరుగుతూ తలపట్టుకుని కూర్చుందామె.ఇంతలో ఇంటిముందుకారాగింది. గబు క్కున తలుపేసి, గదిలో కెళ్ళిపోయింది.

గేట్ తీసిన శబ్దం వినిపించింది. గుండె దడ దడ లాడుతుండగా పక్కమీద కూర్చుని ముణుకుల్లో తల ఉంచుకుని కూర్చుంది.ఆమె వెక్కిళ్ళతో ఎదంతా కదలిపోతున్నది గుంతల రోడ్లో వెళ్తున్న ఒంటెద్దు బండి లా. డోర్ బెల్ మ్రోగుతోంది. నిశ్శబ్దంగా శ్వాస కూడా గట్టిగా పీల్చకుండా కూర్చుందామె. రెండు నిము షాలకు తలుపుమీద గట్టిగా బాదుతున్న శబ్దం.      
                                                                                                            
    " మేడం! తలుపు తీయండి. ప్లీజ్. మేడం!. మీరింట్లో నే ఉన్నారు. మాకుతెల్సు." అంటూ అరుపులు.   ఉన్నట్లుండి సుశీలమ్మకు భయమేసింది. చుట్టు పక్కల వారంతా ఈ శబ్దాలకు, అరుపులకూ వచ్చి ఏమైంద నిగొడవ చేస్తా రని .ఆ దృశ్యం  ఎదుర్కోడం కంటే తలుపుతీసి వీరిని ఎదుర్కోడమే మేలనుకుంది. ఏమైతే కానీ మని లేచి గది లోంచీ హాల్లో కొచ్చి  గడియతీసి ,తలుపు తెరిచింది.  మోహన్, మనోజ నిల్చునున్నారు.చాలా కంగారు పడ్డట్లు, అలసిపోయినట్లూ వారి ముఖం మీద పట్టిన చెమట, వారిముఖం లోని ఆందోళన చెప్పకనే చెప్తున్నాయి.   

 " మేడం! ఏమైంది? బావున్నారుకదా!ఆరోగ్యం బావుందా? ఎన్నిమార్లు ఫోన్ చేసినా తీయక పోడంతో మళ్ళా గుండె నొప్పి వచ్చిందేమోని వచ్చాం మేడం. శ్రీహర్ష మీకోసం ఎదురు చూస్తున్నాడు మేడం!. మీరు  చేస్తే గానీ ‘ గాయత్రీ మంత్రోపదేశం’ చేయించుకోట్ట. ముహూర్తం దాటి పోతుందని పంతులు గారు చెప్తున్నా వినడం లేదు మేడం.మీరు ఫోన్ తీయలేదు.అందు కని  మేమే వచ్చాం. ప్లీజ్ మా కోసం కాకపోయినా మీ ప్రియ శిష్యుని కోసం రండి మేడం!

ఎంతోమందికి గాయత్రి ఉపదేశం చేశారు. మీ శిష్యునికి చేయరా మేడం!" అంటూ ఇద్దరూ చేతులు పట్టుకున్నారు. అప్పుడు చూసింది సుశీలమ్మ వారిని. ఇద్దరూ పట్టు బట్టల్లో ఉన్నారు ,పీటలమీంచీ లేచి అలాగే వచ్చినట్లున్నారు. ఏంచేయాలో పాలుపోక " నేనిలా ఈ సమయంలో నలుగు ర్లోకీ రాను ఇష్టం లేకనే మీ ఫోన్స్ లిఫ్ట్ చేయలేదు మోహన్!. ముహూర్తం దాకా అలాగే ఉంటే శుభకార్యం జరిగిపోతుందని మనస్సు చిక్కబట్టుక్కూర్చున్నాను. మీరిలా రావడం ఏమీ బావోలేదు మనోజా !"అంది. 

  " మీరు రాకపోతే ఈ ఉపనయనం జరుగదు మేడం!. మీశిష్యుడు ఎవరు చెప్పినా వినేట్లు లేడు. ఉదయం నుంచీ మేం ముగ్గురం పచ్చి మచి నీరు ముట్టలేదు. మీరూ అలాగే ఉన్నారని నాకు  తెల్సిపోతున్నది. ప్లీజ్ మేడం! "అంటూ స్వతం త్రంగా చేయి పట్టుకుంది మనోజ .

 మోహన్ గబుక్కున క్రిందకూర్చుని పాదాలు తాకి " మేడం ప్లీజ్ మాకోసం కాకున్నా మీ శిష్యుని కోసం రండి మేడం!." అంటూ తలపైకెత్తి సుశీలమ్మ ముఖంలోకి దీనంగా చూశాడు. ఇహ వెళ్ళకుండా ఉండటం భావ్యం కాదని, తన బాధను పంటి బిగువున నొక్కి పట్టి,"పదండి." అంటూ తలు పేసి బయల్దేరింది.                 

    " చాలా కృతఙ్ఞతలు మేడం." అంటూకారు డోర్ తెరిచి, ఎక్కగానే డోర్ వేసి కారు స్టార్ట్ చేశాడు మోహన్. సుశీలమ్మ మనస్సు బయటి కెళుతుంటే లేత చిగురాకులా రెపరెపలాడుతున్నది. గుమ్మం దాటి అప్పటికే మూణ్ణెల్లు  దాటింది. ఒత్తిడికి తట్టుకోలేక గుండె సన్నగా నొప్పెడుతున్నది.    
          
 - 'దైవలీల ఎంత చిత్రం! ఒక్క సంఘటనతో జీవన గమనమే మారిపోయింది. అందుకే అన్నారు - మ్యాన్ ప్రెపో జస్ గాడ్ డిస్పోజస్  - అని.తానెప్పుడూ ఇలాంటి సంఘటన ఎదురౌతుందని, తన జీవితం ఇలా గాడి తప్పు తుందని భావించనేలేదు.

తనమీద, తన నమ్మకం మీద తనకున్న భ్రమను భగవంతుడు తప్పించి, పిచ్చిదాన్ని చేసినట్లు అనిపించి చేతి గుడ్దతోకళ్ళు వత్తుకుంది ఆమె. ఈమధ్యకాలంలో ఎన్ని చేతి గుడ్డలు ఇలా తడిసి పోయాయో ! ఐనా బయటి కెళ్ళను తనెందుకింత  వేదన పడుతున్నదో , భయపడుతున్నదో  తనకే అర్ధం కావడం లేదు. జీవితం ఎంత చిత్రమైనది !' అని ఆమె అనుకోడం ఈమూడు నెలల్లో  వెయ్యో మారో ఇంకా ఎక్కువో.  కారు ముందుకెళుతుంటే మనస్సు వెనక్కెళ్ల సాగింది.
 
    ‘తనకు తన విద్యార్ధులంటే ఎంత ఇష్టమో!. వారూ తనని అలాగే అమ్మాన్నాన్నల కంటే ఎక్కువగా ప్రేమించే వారు. ఎంత కష్టం వచ్చినా కాస్తంత బాధకలిగినా ముందు తనకే చెప్పడం, తాను వాటిని పరిష్క రించడం , ఒక్కరోజు తాను వారినిచూడ కున్నా, వారు తనను చూడకున్నా ఉండలేని స్థితి. పిల్లల్లేనితమకు వారే పిలల్లు.  గురు శిష్యుల మధ్య ఇంత  ప్రేమాభిమా నా లుండటాన్ని తోటి ఉపాధ్యాయ బృందం, ఇరుగుపొరుగు ఇంకా ఎందరో సహించ లేకపోయే వారు.

తనమీద లేనిపోని వి అందరికీ చెప్పి, ఏదో చేసి, తనమీద దుమ్ముపోసి, బురదచల్లి,వారి  అసూయను చల్ల బర్చు కోవాలని ఈర్యాప రు లంతా తపనతో వారి శాయశక్తులా శ్రమించారు.ఎంతమంది ఎన్ని చేసినా భగవంతుని నమ్ముకుని , తన వృత్తిలో నిరం తరం దృష్టి నిల్పిన తనను, తన శిష్యుల మీద స్వార్ధ రహిత ప్రేమను చూపుతున్న తనను ఏమీ చేయలేక వారు కుళ్ళిపోడం తనకు తెల్సు. 

వీటన్నిటికీ తనకు  మనో ధైర్యాన్నిచ్చిన వ్యక్తి తన జీవిత  భాగస్వామి, మార్గదర్శి, ఆధ్యా త్మిక గురువు, ఐన తన భర్త వాసు! వాసు ఎంత విశాల హృదయుడు!నిరంతరం చిరునవ్వు ముఖం.అందర్నీ అర్ధం చేసుకుని తగు సలహా లిచ్చి వారి బాధలను తొలగించి మనోధైర్యాన్నీ ,ఆధ్యాత్మిక సూచనలను ఇవ్వగల సమర్ధుడు.

ఎంతమంది తన ఇంట్లో పడుకుని పరీక్షల సమయంలో వారి సంశయాలు తీర్చుకుని స్టేట్ ఫస్ట్ వచ్చినవారూ,ఇంకా ఎంతో మంది, ఆర్ధిక సాయం అందుకుని ,ఉన్నత విద్య గడించి ,ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి ,తరచూ వచ్చి తనను చూసి పోయేవారితో ఇల్లు కళ కళ లాడుతుండేది. అలాంటి ఇల్లు , నేడిలా చిన్నబోయిందేం!  నిరంతరం విద్యబోధించే తన స్వరం ,తన విద్యార్ధులను చూడకుండా  ఇంత కాలం ఉండటం తన కెలాసాధ్య మైంది? ఏంటీ చిత్రం! ఏంటీ మార్పు?ఇది ఇలాగే సాగుతుందా! తన స్వరంమూగ బోతుందా! తానిక పాఠాలు చెప్ప లేదా! తన మనస్సుకు స్వాంతన లభించదా!' అనుకుంటున్న సుశీలమ్మ ఆలోచనలకు అడ్డు కట్టవేస్తూ, " మేడం దిగండి వచ్చేశాం."అంటూ డోర్ తెరిచింది మనోజ .                                                                                                                     
  కారుదిగి భయ భయంగానే లోపలికి అడుగు పెట్టింది సుశీలమ్మ ,ఇరువైపులా రక్షక భటుల్లా మోహన్,మనోజ నడు స్తుండ గా. వారినిచూసి పెద్దగా మాట్లాడుకుంటున్న జనం, పెద్దగా నవ్వుతూ కబుర్లా డుతున్న మహిళలు స్థంభాన్నా నుకుని జోగు తున్న పురోహితుడు,అంతా ఒక్క మారు తలలెత్తి చూసి మానుల్లా నిలబడి పోయారు. హాలంతా నిశ్శబ్ద మై పో యింది.

తడ బడే అడుగులతో మోహన్, మనోజ నడిపిస్తుండగా సుశీలమ్మ స్టేజ్ మీదకు  వచ్చింది. మోహన్, మనోజ పీటలమీద కూర్చో గా పురోహితుడు మంత్రాలు వల్లిస్తుండగా శ్రీహర్ష చెవిలో గాయత్రీమంత్రంచెప్పింది సుశీలమ్మ. మొదటి భిక్ష ఆమెవద్ద తీసు కుని ఆమె పాదాలకు నమస్కరించాడు శ్రీహర్ష. ఆమెను స్టేజ్ మీద ఒక పక్క గా కుర్చీలో కూర్చోబె ట్టాడు మోహన్. శ్రీహర్ష అందరి వద్దా భిక్ష  స్వీకరిస్తుండగా , మోహన్ పక్కనే నడవసాగాడు.  

      " ఓ ఈవిడవద్దా ఒక్కగా నొక్క బిడ్దకూ గాయత్రీ మంత్రోపదేశం చేయించి, ప్రధమభిక్ష వేయిస్తావా! నీకుతెలీకపోయినా ఆవిడ కు తెలియొద్ధూ! బుధ్ధుండాలి" అంటున్న దూరపు బంధువును ఉరిమి చూసి ,ముందుకు సాగాడు  మోహన్.  "తగుదునమ్మా అంటూ వచ్చింది. ఇంకా  మూణ్ణెల్లు కాలేదు.ఇంత ఘోరమా?" 

"చేయించుకుంటే పౌరోహిత్యం కూడా చేస్తుంది.ఎవరెలా ఉండాలో చదివినట్లు లేదు.వందల మందికి చదువు చెప్పేది!”    

" ఐనా ఆడది, అదీనీ ఇప్పుడా గాయత్రి చెప్పేది ? ఈ మోహన్ కు బుధ్ధీ సిగ్గూ లేకపోతే ఆవిడ కుండక్కర్లా?"    

" తెగించిన వారికి తెడ్డేలింగం, వెధవముండలకు వీరేశలింగం, ' అని ఊరికే అన్నారా?"   " బరితెగించిన వారికి బదులాడే వారెవరమ్మా! అప్పుడే ఊరిమీదపడింది. ఛీ ఛీ "  

"చదివిందనీ, ఉద్యోగం చేస్తున్నాననీ చెడ్డ గర్వం. దానికితోడూ ఏవేవో అవార్డులూ గట్రాకూడా వచ్చాయిటగా! "  

"ఎందరినో ఇంట్లో పడుకో బెట్టుకునేదిట! సిగ్గులేకుండా! పట్టలేంలే "

 " ఆ--  కట్టుకున్నవాడే ఏమీ చేయలేక వదిలేశాట్ట, ఇప్పుడిహ అడ్డూ ఆపూ ఎవరున్నార్లే! ఎవరినైనా పడుకో బెట్టు కుంటుంది." పుసిక్కిన నవ్వు.  "

అన్నీ వదిలేస్తే సరి ! పక్కనే మీ ఇల్లు మీ ఆయన జాగ్రత్త."   " ఏమన్నా అనుమాన మొస్తే ఇద్దర్నీ నడిబజార్లో చెప్పుచ్చుక్కొట్టనూ ! నాతోనే!"
    
ఇహ వినలేక మనోజ గబగబా వారివద్దకు వచ్చి " నోరుముయ్యండి అంతా. మీరా మేడం గారిని విమర్శించేది?ఆమె కాలి గోటిక్కూడా చెల్లరు.మీ భాగోతాలెవరికి తెలీవు? మీ కూతుళ్ళూ కొడుకులూ క్లబ్బుల్లో పబ్బుల్లో కులుకుతుంటే ఆపగలి గారా! మీకోడళ్ళను సరిగా కాపరాలు చేయనిచ్చారా! మీ ఇంటాయనల్ని కడుపునిండా తిన నిస్తున్నారా? మీ లో ఒక్కరికి గాయత్రి సరిగా పలకను వచ్చా! అర్ధం తెలుసా! ఆమె మా ఇద్దరికీ మేడం. మేం చదివేప్పుడు వారింట్లో పడుకుని చదువుకు నే వారం.

అప్పుడు మావయస్సు15 సం. మేడం, సార్ కలిసి మాడౌట్స్ తీర్చి చదివించి పోటీ పరీక్షలకు పంపి ఇంత మంచి ఉద్యో గా ల్లో స్థిరపడను, మాలాంటి వారికెంత మందికో అండగా నిలిచారు. మా ఇరువు రికీ వివాహం చేశారు. ఇప్పుడు మావాడూ మేడం స్టూడెంట్ .ఆమె మాకు గాయత్రీ మంత్ర జపం ఎలాచేయాలో నేర్పించి,  మాచేత నిత్య గాయత్రి  చేయించి, మామేధ పదును పెంచారు.

 

 మీరంతా మీ మనవళ్ళ వడుగులకూ, మీ అమ్మాయిల పెళ్ళిళ్ళకూ ,గృహప్రవేశాలకు, నోములకు మొదటి తాంబూలం ఇచ్చినవారే!ఆమె ఆశీర్వాదాలు కావా లని తపించిన వారే! లోపల్లోపల ఆమెకు అంతా ఇచ్చేగౌరవానికి కుళ్ళి ,ఈర్ష్య పడ్దవారే! ఇప్పుడు సార్ హార్ట్ ఎటా క్ తో పోయి,ఆమె ఆబాధను తట్టుకోలేక కుమిలి పోతుంటే మీరిలా మాట్లాడు తు న్నా రంటే' స్త్రీకి ప్రధమ శత్రువు స్త్రీనే ' అని ఋజువు చేస్తున్నారు. సిగ్గు లేదా కష్టంలో ఉన్న ఒక వయస్సు మళ్ళిన మహిళ గూర్చీ ఇలా మాట్లాడను? మీ రసలు మనుషులా? రాక్షస స్త్రీలా? మిమ్మల్ని చూడటమే మహాపాపం " అంటుం డగానే, స్టేజ్ మీద ఉన్న సుశీలమ్మ కుర్చీలోంచీ పక్కకు ఒరిగిపోయి దబ్బున క్రిందపడ్ద శబ్దం విని పించి అటుపరుగెత్తింది మనోజ .   


 -రచన -ఆదూరి.హైమవతీ